'అవన్నీ రాజకీయ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జిమ్మిక్కు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం) జరపడమనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్యమాత్రమే కాకుండా జాతి వ్యతిరేక చర్య అని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని డిమాండ్ చేస్తూ దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
ప్రతిసారి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రంతో తగువులు పెట్టుకుంటున్నారని శర్మిష్ఠ ఆరోపించారు. ఇది కేవలం రాష్ట్రం అనే సమస్య కాదని, ఢిల్లీ అంటే దేశ రాజధాని అయినందున దీని విషయంలో అందరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరంగా అది సాధ్యమా కాదా అనే విషయం తెలుసుకోకుండా నలుగురుని అడగకుండా ప్రతిసారి రాష్ట్రహోదా అంటూ ఆప్ ముందుకు రావడం రాజకీయంగా జిమ్మిక్కులకు పాల్పడటం తప్ప మరొకటి కాదని ఆరోపించారు.