'ఎఫ్ఐఆర్లో నన్నెందుకు చేర్చారో తెలియడం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరును ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను ఏం చేశాననే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చెప్పారు. 'ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు ఎందుకు చేర్చారో తెలియదు. ఇందులో నా పాత్ర ఏముంది? అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఎఫ్ఐఆర్ వెనుక కుట్ర ఏమిటో తేల్చుకునేందుకు త్వరలోనే ప్రత్యేక విధాన సభ సమావేశం ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ పై కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పటికే ఆమెను ప్రశ్నించారు. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.