స్వాతీ.. ఇదేం పని?
స్వయంగా ఏసీబీ కేసులో చిక్కుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్.. పాత చైర్‌పర్సన్లపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన పదవీ కాలం ముగిసిన ఇన్నాళ్ల తర్వాత తనపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం ఏంటని మాజీ చైర్‌పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ ప్రశ్నించారు. ఏసీబీ విచారణ అంటే తాను భయపడేది లేదని ఆమె చెప్పారు. మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఇబ్బడి ముబ్బడిగా నియమించడం, అందులోనూ అక్రమాలకు పాల్పడటంతో స్వాతి మలివాల్‌పై ఇటీవలే ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
మహిళా కమిషన్‌లో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని బర్ఖా శుక్లా సింగ్ అన్నారు. అక్రమాలు జరిగితే.. తనపై ఆమె అప్పుడే కేసు పెట్టాల్సిందని చెప్పారు. బర్ఖాతో పాటు అంతకుముందు పనిచేసిన కిరణ్ వాలియా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఏసీబీ అధికారులు వాళ్లందరినీ అరెస్టుచేసి జైలుకు పంపాలని స్వాతి మలివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని కిరణ్ వాలియా అన్నారు. ముగ్గురు మహిళలు చేసిన అక్రమాలకు ఆధారాలు కూడా చూపిస్తానంటూ 128 పేజీల పత్రాన్ని స్వాతి మలివాల్ ఏసీబీకి సమర్పించారు.