స్వాతి మలివాల్‌ను ప్రశ్నించిన ఏసీబీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్(డీసీడబ్ల్యూ) స్వాతి మలివాల్‌ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశించారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకుని స్వాతిని ప్రశ్నించిందని ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. గతవారం ఆమెకు ఏసీబీ నోటీసు జారీ చేసింది.
డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చారు. నిబంధనల మేరకే సిబ్బందిని నియమించినట్టు చెప్పారు.