'సీఎంగారూ ఈ డబ్బులతో బూట్లు కొనుక్కోండి'
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందు కార్యక్రమానికి చెప్పులతో హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యాపార వేత్త రూ.364 పంపించారు. మున్ముందు రాష్ట్రపతితో జరిగే కార్యక్రమాల్లోనైనా ఆయన ఆ డబ్బులతో చక్కగా ఫార్మల్ బూట్లు కొనుక్కోని హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించి ఒక డీడీ కూడా పంపించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్ హాజరైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ శాండిల్స్, సాక్సు వేసుకొని వచ్చారు. దీనికి ఆశ్చర్యపోయిన విశాఖపట్నానికి చెందిన వ్యాపారావేత్త సుమిత్ అగర్వాల్ కేజ్రీవాల్ను ఫార్మల్ షూ కొనుక్కోవాల్సిందిగా కోరుతూ రూ.364 డీడీ తీసి పంపించారు. 'అది రాష్ట్రపతి భవన్లో ఒక గౌరవ విందు కార్యక్రమం.. ఆమ్ ఆద్మీ పార్టీ రామ్ లీలా మైదాన్లోనో, జంతర్ మంతర్లోనో నిర్వహించే ర్యాలీ కాదు, ధర్నా కాదు' అని ఆయన అన్నారు.
పబ్లిక్ స్టంట్ కోసమే కేజ్రీవాల్ శాండిల్స్ వేసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు కేజ్రీవాల్కు ఒక బహిరంగ లేఖ రాశారు. 'కేజ్రీవాల్ గారు మీరు రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన గౌరవ విందులో ఉన్నారు. అదేదో ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీనో, రెస్టారెంటో కాదు. ఎవరు ఏం ధరించాలనే విషయం వ్యక్తిగత స్వేచ్ఛ అయి ఉండొచ్చు. కాని కొన్ని స్థలాలు వ్యక్తిగత స్వేచ్ఛకంటే గొప్పవి. మీరు చాలా ఎదిగిన వ్యక్తి. దయచేసి పరిస్థితికి, ఓ ప్రత్యేక కార్యక్రమానికి తగిన విధంగా నడుచుకోండి. మంచి దుస్తులు వగైరా ధరించండి' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.