న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్‌లో తేలిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలు మోదీ పాలనపై రిఫరెండం కాబోవని చెబుతూ బీజేపీ నాయకులు మోదీ ప్రాభవాన్ని మరికొంత కాలం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విధానసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయఢంకా మోగిస్తుందని తేల్చాయి. కాగా, బీజేపీ మాత్రం ఆప్‌పై స్వల్ప మెజారిటీతో అయినా గెలిచి ఒడ్డున పడతామని ఇప్పటికీ కొంత నమ్మకంతో ఉంది. బీజేపీ ఒకవేళ ఈ పోరులో ఓడిపోతే ఆ ప్రభావం కచ్చితంగా నరేంద్ర మోదీ పాలనపై పడుతుందని రాజకీయ విశ్లేషకుడు అశ్విని కె.రాయ్ చెప్పారు.
‘ఓడితే మోదీ చరిష్మా నిలవదు’
‘ఇప్పటివరకు బీజేపీకి మోదీ ఓ ప్రజాకర్షణ కలిగిన బలమైన నాయకుడు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే అతని చరిష్మా ఎక్కువ కాలం కొనసాగదు. ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తమ్మీద ఈ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సిద్ధహస్తుడైన జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ లాంటిది’ అని ఆయన తెలిపారు.
‘మోదీ పాలనపై రిఫరెండమే’
దాదాపు ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కూడా వెలిబుచ్చారు. ‘ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఫొటోలను వాడుకుని ప్రజలను బీజేపీ ఓట్లు అభ్యర్థించింది. అందువల్ల కచ్చితంగా ఇది మోదీ ప్రభుత్వంపై రిఫరెండం లాంటిదే’ అని నయ్యర్ అన్నారు. ఆప్ చేతిలో బీజేపీ ఓడిపోతే మోదీ గాలికి అడ్డుకట్ట పడినట్లే అని వ్యాఖ్యానించారు.
వికటించిన కమలం ఎత్తుగడ
అంతేకాకుండా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేతో కలిసి నడిచిన దేశ ప్రథమ ఐపీఎస్ మహిళాధికారి కిరణ్ బేడీని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సీఎం అభ్యర్థిగా రంగంలోకి దించడంతో స్థానిక బీజేపీ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు డీలా పడిపోవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై కూడా పడింది. సీఎం అభ్యర్థిగా ఆమె ఎంపిక పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి వేసిన ఈ ఎత్తుగడ వికటించింది. ‘ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ నినదిస్తున్న ‘కాంగ్రెస్ రహిత భారత్’ నినాదాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవాలి. ఢిల్లీని గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా ఇప్పటికే కాంగ్రెస్‌ను ఆప్ లేకుండా చేసింది. అందువల్ల ఆ నినాదం ఫలించలేదు. తక్కువ ధరకే నీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఎన్నికల గెలుపు ముంగిటకి చేర్చడానికి ఇవి కూడా ఒక కారణం కావచ్చేమో’ అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్రతో ముఖర్జీ వ్యాఖ్యానించారు.
నిర్ణయాలను పునరాలోచించుకోవాలి
‘బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. క్షీణించిపోతున్న శాంతి భద్రతలను కొన్ని నెలల్లోనే అదుపులోకి తీసుకురావచ్చు. కానీ, ఎనిమిది నెలలుగా మోదీ చేతులు కట్టుకుకూర్చోవడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఒకవేళ బీజేపీ ఓడిపోయినట్లయితే మోదీ తనను తాను మళ్లీ నూతనంగా ఆవిష్కరించుకోవాలి. పార్టీ బాధ్యతలను పూర్తిగా అమిత్ షాకు అప్పగించి, మంచి నాయకత్వ లక్షణాలతో ప్రభుత్వాన్ని నడిపించాలి. ఒకవేళ ఢిల్లీలో బీజేపీనే గెలిస్తే మోదీ ప్రభంజనానికి తిరుగుండదు’ అని ముఖర్జీ చెప్పారు. ‘ఒకవేళ బీజేపీ ఓటమిపాలైతే అది ఆ పార్టీకి గట్టి గుణపాఠం లాంటిది. తమ నిర్ణయాలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది’ అని ఇందిరా గాంధీ జాతీయ దూరవిద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎ.ఎస్.నారంగ్ పేర్కొన్నారు.
మోదీ ప్రభంజనానికి బ్రేకు పడనుందా?
Published Tue, Feb 10 2015 12:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement