సాక్షి, న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విధానసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న సంగతి విదితమే. లడ్డూల తయారీకి ఆర్డర్లివ్వడం, టపాసులు కొనడం, డోలు బుక్ చేసుకోవడం వంటి పనులలో పలువురు అభ్యర్థులు, కార్యకర్తలు బిజీగా ఉన్నారు. ఆప్ నేతల ఇళ్ల వద్ద ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న నేతల నివాసాల వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. పోలింగ్ తరువాత అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే భారీ విజయమని వెల్లడించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.
పార్టీ గెలుపు ఢిల్లీ ప్రజల గెలుపు అని, దానిని తన అత్యంత సహజశైలిలో జరుపుకుంటామని పార్టీ సీనియర్ నేతలు అంటున్నప్పటికీ కొందరు అభ్యర్థులు, కార్యకర్తలు ఫలితాలు వెలువడేరోజున వేడుకలు చేసుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న అభ్యర్థులు లడ్డూల తయారీకి కూడా ఆర్డరు ఇచ్చారు. పాత ఢిల్లీలోని ఓ వ్యాపారికి 100 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరు లభించింది. డోలు కూడా బుక్ చేసుకున్నారు. కొందరు కార్యకర్తలు టపాసులు కొనుగోలు చేశారు. ఎన్నికలలో తమ పార్టీదే విజయమని తెలియడంతో ఆప్ నేతల ఇళ్ల వద్ద జనాలు గుమిగూడడం ప్రారంభించారు.
ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న అభ్యర్థుల ఇళ్ల వద్ద కార్యకర్తల సందడి ఎక్కువగా ఉంది. గత ఆప్ సర్కారులో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సోమ్‌నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భర ద్వాజ్, గిరీష్ సోనీ మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటైతే గోపాల్‌రాయ్‌తో పాటు ద్వారకా నుంచి పోటీచేసిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు అనిల్ శాస్త్రికి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశముందని అంటున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 15న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు.
ఫలితాల తర్వాత ముఖచిత్రంపై చర్చ
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తమ పార్టీకి విజయం ఖాయమని తేలడంతో... ఎన్నికల్లో పార్టీ పనితీరును, ఫలితాల తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విశ్లేషించుకుంటున్నారు.కౌశాంబి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆప్ అధినేత కేజ్రీవాల్...ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రశంసించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రంపై ఆప్ ప్రచార కమిటీ అంచ నా వేసిందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. సమావేశంలో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ సింగ్, కుమార్ విశ్వాస్, అశిశ్ ఖేతాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆప్ విజయోత్సవ ఏర్పాట్లు
Published Tue, Feb 10 2015 12:30 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM
Advertisement
Advertisement