Delhi elections 2015
-
కేజ్రీవాల్ టీంలో మహిళలకు దక్కని చోటు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షుడు కొత్త కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువు దీరబోతోంది. అయితే కేజ్రీవాల్ టీమ్‌లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. ఊహించినట్టుగానే మనీష్ సిసోడియాకు ఉప ముఖ్యమంత్రి బెర్తు దాదాపు ఖరారు అయింది. ఇక ఏడుగురిలో నలుగురు కొత్త వాళ్లే. ఈ జాబితాను శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు నివేదించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సత్యేంద్ర జైన్, అసిఫ్ అహ్మద్, సందీప్ కుమార్‌లకు కేజ్రీవాల్ టీంలో చోటు లభించింది. కాగా గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న సోమ్‌నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోనీలకు ఈసారి చోటు దక్కలేదు. రామ్ నివాస్ గోయల్, బందన కుమారి ఇద్దరూ.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఆశిస్తున్నట్టు సమాచారం. కాగా ఆప్ నుంచి ఆరుగురు మహిళలు విజయం సాధించిన విషయం తెలిసిందే. గత వారంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలిచి రికార్డు విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. -
ఓటమిపై కాంగ్రెస్‌లో ‘వార్’ షురూ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మొదలైంది. ఓటమిపై ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అజయ్ మాకెన్ నాయకత్వంపై మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గురువారం విమర్శల వర్షం కురిపించగా, ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో ఎదురుదాడి చేశారు. కాగా, షీలా మాట్లాడుతూ, మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతా తానే చేయగలననే భావనలో మాకెన్ ఉండిపోయి నాయకులను విస్మరించారని, అలాగే కార్యకర్తలను ఉత్తేజితులను చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తన కాంగ్రెస్‌కు కొంచెం కూడా తోడ్పడలేదని విమర్శించారు. చివరి నిమిషంలో మాకెన్‌ను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి తప్పుచేశారని చెప్పారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో అతను ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవి తన విజయాలు కాదని, కాంగ్రెస్ విజయాలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తన పేరును ఉపయోగించినట్లయితే పార్టీకి మంచి తోడ్పాటునందించి ఉండేదని చెప్పారు. ఢిల్లీలో పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దుర్భర పరిస్థితిలో ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించడంపై త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి మాట్లాడతానని తెలిపారు. అధినాయకత్వం ఆదేశిస్తే పార్టీ పునరుత్తేజ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా షీలా వ్యాఖ్యలపై పీసీ చాకో ఎదురుదాడి చేశారు. షీలా అభిప్రాయాలను పార్టీ ఆమోదించబోదని, ఆమె నోరు మూసుకుని ఉండటం ఉత్తమమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాకెన్ మద్దతుదారుడైన డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ కూడా షీలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. దీక్షిత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు-చాకో షీలా దీక్షిత్ ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆయన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీక్షిత్ ఆ విధంగా వ్యాఖ్యానించడం బాగోలేదు. పార్టీ విజ్ఞిప్తి మేరకు మాకెన్ ప్రచార నాయకత్వం స్వీకరించారు. అలాగే పార్టీ కోరితేనే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి పార్టీ గెలుపు కోసం మాకెన్ శ్రమించారన్నారు. మాకెన్, లవ్లీతో కలిసి బుధవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై రాహుల్‌తో చర్చించామన్నారు. అలాగే లవ్లీ మాట్లాడుతూ, ‘ఆమె సలహాలు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందే ఇచ్చి ఉండాల్సింది. ఆమె మాకంటే సీనియర్ నాయకురాలు. మేము ఆమెను చాలా గౌరవిస్తాం. ఆమె మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు, లేకుంటే పార్టీ అధినాయకత్వానికి అయినా తెలియజేయవచ్చు’ అని లవ్లీ వ్యాఖ్యానించారు. కాగా, బ్లాక్ స్థాయి నుంచి జిల్లా కమిటీలను ఎన్నికల ముందు నియమించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై లవ్లీ స్పందించారు. ‘మేము ఆ కమిటీలను తిరగి నియమిస్తాం. వాటిని తప్పనిసరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మాకు కింది స్థాయి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా, దీక్షిత్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించామని, కానీ ఈసారి తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ మద్దతును ఉపయోగించుకుని కింది స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. -
పార్టీ కార్యాలయానికి చేరుకున్నకేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ గెలుపుపై కొండంత విశ్వాసంతో ఉన్న కేజ్రీవాల్ మరోసారి హస్తిన పీఠం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు కూడా పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. తమ గెలుపు ఖాయమని భావిస్తున్న ఆప్ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను చేసుకునే ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. హస్తినలో అధికారంపై కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మోదీ ప్రభంజనానికి బ్రేకు పడనుందా?
-
తాజా పరిస్థితిపై కమలం సమీక్ష
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో కమలం ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించేందుకుగాను బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సోమవారం సమావేశమయ్యారు. పార్టీ కార్యక ర్తల్లో ఉత్తేజితులను చేసేందుకు యత్నించారు.అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ ‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సవాలు చేయదలుచుకోలేదు. వాటిని నేను ఎందుకు సవాలు చేయాలి. మా పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా ఉంది. అయితే మేము ఇంతకుముందు చెప్పినంత మెజారిటీ రాకపోవచ్చు.’ అని అన్నారు. -
మోదీ ప్రభంజనానికి బ్రేకు పడనుందా?
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్‌లో తేలిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలు మోదీ పాలనపై రిఫరెండం కాబోవని చెబుతూ బీజేపీ నాయకులు మోదీ ప్రాభవాన్ని మరికొంత కాలం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విధానసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయఢంకా మోగిస్తుందని తేల్చాయి. కాగా, బీజేపీ మాత్రం ఆప్‌పై స్వల్ప మెజారిటీతో అయినా గెలిచి ఒడ్డున పడతామని ఇప్పటికీ కొంత నమ్మకంతో ఉంది. బీజేపీ ఒకవేళ ఈ పోరులో ఓడిపోతే ఆ ప్రభావం కచ్చితంగా నరేంద్ర మోదీ పాలనపై పడుతుందని రాజకీయ విశ్లేషకుడు అశ్విని కె.రాయ్ చెప్పారు. ‘ఓడితే మోదీ చరిష్మా నిలవదు’ ‘ఇప్పటివరకు బీజేపీకి మోదీ ఓ ప్రజాకర్షణ కలిగిన బలమైన నాయకుడు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే అతని చరిష్మా ఎక్కువ కాలం కొనసాగదు. ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తమ్మీద ఈ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సిద్ధహస్తుడైన జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ లాంటిది’ అని ఆయన తెలిపారు. ‘మోదీ పాలనపై రిఫరెండమే’ దాదాపు ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కూడా వెలిబుచ్చారు. ‘ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఫొటోలను వాడుకుని ప్రజలను బీజేపీ ఓట్లు అభ్యర్థించింది. అందువల్ల కచ్చితంగా ఇది మోదీ ప్రభుత్వంపై రిఫరెండం లాంటిదే’ అని నయ్యర్ అన్నారు. ఆప్ చేతిలో బీజేపీ ఓడిపోతే మోదీ గాలికి అడ్డుకట్ట పడినట్లే అని వ్యాఖ్యానించారు. వికటించిన కమలం ఎత్తుగడ అంతేకాకుండా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేతో కలిసి నడిచిన దేశ ప్రథమ ఐపీఎస్ మహిళాధికారి కిరణ్ బేడీని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సీఎం అభ్యర్థిగా రంగంలోకి దించడంతో స్థానిక బీజేపీ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు డీలా పడిపోవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై కూడా పడింది. సీఎం అభ్యర్థిగా ఆమె ఎంపిక పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి వేసిన ఈ ఎత్తుగడ వికటించింది. ‘ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ నినదిస్తున్న ‘కాంగ్రెస్ రహిత భారత్’ నినాదాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవాలి. ఢిల్లీని గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా ఇప్పటికే కాంగ్రెస్‌ను ఆప్ లేకుండా చేసింది. అందువల్ల ఆ నినాదం ఫలించలేదు. తక్కువ ధరకే నీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఎన్నికల గెలుపు ముంగిటకి చేర్చడానికి ఇవి కూడా ఒక కారణం కావచ్చేమో’ అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్రతో ముఖర్జీ వ్యాఖ్యానించారు. నిర్ణయాలను పునరాలోచించుకోవాలి ‘బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. క్షీణించిపోతున్న శాంతి భద్రతలను కొన్ని నెలల్లోనే అదుపులోకి తీసుకురావచ్చు. కానీ, ఎనిమిది నెలలుగా మోదీ చేతులు కట్టుకుకూర్చోవడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఒకవేళ బీజేపీ ఓడిపోయినట్లయితే మోదీ తనను తాను మళ్లీ నూతనంగా ఆవిష్కరించుకోవాలి. పార్టీ బాధ్యతలను పూర్తిగా అమిత్ షాకు అప్పగించి, మంచి నాయకత్వ లక్షణాలతో ప్రభుత్వాన్ని నడిపించాలి. ఒకవేళ ఢిల్లీలో బీజేపీనే గెలిస్తే మోదీ ప్రభంజనానికి తిరుగుండదు’ అని ముఖర్జీ చెప్పారు. ‘ఒకవేళ బీజేపీ ఓటమిపాలైతే అది ఆ పార్టీకి గట్టి గుణపాఠం లాంటిది. తమ నిర్ణయాలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది’ అని ఇందిరా గాంధీ జాతీయ దూరవిద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎ.ఎస్.నారంగ్ పేర్కొన్నారు. -
ఆప్ విజయోత్సవ ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విధానసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న సంగతి విదితమే. లడ్డూల తయారీకి ఆర్డర్లివ్వడం, టపాసులు కొనడం, డోలు బుక్ చేసుకోవడం వంటి పనులలో పలువురు అభ్యర్థులు, కార్యకర్తలు బిజీగా ఉన్నారు. ఆప్ నేతల ఇళ్ల వద్ద ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న నేతల నివాసాల వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. పోలింగ్ తరువాత అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే భారీ విజయమని వెల్లడించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పార్టీ గెలుపు ఢిల్లీ ప్రజల గెలుపు అని, దానిని తన అత్యంత సహజశైలిలో జరుపుకుంటామని పార్టీ సీనియర్ నేతలు అంటున్నప్పటికీ కొందరు అభ్యర్థులు, కార్యకర్తలు ఫలితాలు వెలువడేరోజున వేడుకలు చేసుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న అభ్యర్థులు లడ్డూల తయారీకి కూడా ఆర్డరు ఇచ్చారు. పాత ఢిల్లీలోని ఓ వ్యాపారికి 100 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరు లభించింది. డోలు కూడా బుక్ చేసుకున్నారు. కొందరు కార్యకర్తలు టపాసులు కొనుగోలు చేశారు. ఎన్నికలలో తమ పార్టీదే విజయమని తెలియడంతో ఆప్ నేతల ఇళ్ల వద్ద జనాలు గుమిగూడడం ప్రారంభించారు. ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న అభ్యర్థుల ఇళ్ల వద్ద కార్యకర్తల సందడి ఎక్కువగా ఉంది. గత ఆప్ సర్కారులో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సోమ్‌నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భర ద్వాజ్, గిరీష్ సోనీ మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటైతే గోపాల్‌రాయ్‌తో పాటు ద్వారకా నుంచి పోటీచేసిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు అనిల్ శాస్త్రికి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశముందని అంటున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 15న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు. ఫలితాల తర్వాత ముఖచిత్రంపై చర్చ న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తమ పార్టీకి విజయం ఖాయమని తేలడంతో... ఎన్నికల్లో పార్టీ పనితీరును, ఫలితాల తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విశ్లేషించుకుంటున్నారు.కౌశాంబి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆప్ అధినేత కేజ్రీవాల్...ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రశంసించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రంపై ఆప్ ప్రచార కమిటీ అంచ నా వేసిందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. సమావేశంలో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ సింగ్, కుమార్ విశ్వాస్, అశిశ్ ఖేతాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటుహక్కు వినియోగించుకోండి
ముంబై: ఎన్నికలపై బాలీవుడ్ నటీనటులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మార్పు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ అభిమానులకు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని, అది మన ప్రాథమిక హక్కు అని మనోజ్ బాజ్‌పాయ్, ప్రీతీ జింతా, నిఖిల్ చిన్నప్ప తదితర నటులు సామాజిక వెబ్సైట్ ట్వీటర్లో ట్వీట్ చేశారు. మార్పు ప్రక్రియను ముందుగా ఆప్ ప్రారంభిస్తుందనే ఆశాభావాన్ని హన్సల్ మెహతా వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ప్రజలందరూ ఈ రోజు ఓటు వేస్తారని ఆశిస్తున్నా. మీరు ఓటు వేసిన తర్వాత వేలిపై ఇంకు గుర్తు చూపిస్తూ సెల్ఫీ తీసుకుని ట్వీటర్లో పోస్టు చేయండి’ అని నిఖిల్ చిన్నప్ప అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. ‘ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నా. ఇది జాతీయ రాజధాని నగరంలో నివసించే వారందరికీ ముఖ్యమైన రోజు’ అని ప్రీతి జింతా చెప్పారు. ‘అందరూ ఈ రోజు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఇప్పుడు ఓటు వేయకుండా తర్వాత రాష్ట్ర పాలన మీద ఫిర్యాదు చేయకండి’ అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. -
విజయం మాదే : బీజేపీ నేత హర్షవర్ధన్
న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ గె లిచితీరుతుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. తన తల్లిని వెంటబెట్టుకొచ్చిన వర్ధన్ ...కృష్ణనగర్ నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తమ విజయం చారిత్రాత్మకమవుతుందన్నారు. సర్వేల్లో మీ పార్టీ కంటే ఆప్ ముందుంది కదా అని మీడియా అడగ్గా అందుకు స్పందిస్తూ...‘అది మాకు వాస్తవంగా ఎక్కడా కనిపించలేదు. మా పార్టీ విజయం సాధిస్తుందనే విషయంలో నాకు నూటికి నూరు శాతం ధీమా వఉంది. ఫలితాలొచ్చేంతవరకూ పోల్ సర్వేలపై మాట్లాడదలుచుకోలేదు’అని అన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌కు ప్రత్యర్థిగా పోటీచేసిన నూపుర్‌శర్మ మాట్లాడుతూ విధానసభ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు. -
ఏ ఓటరు మదిలో ఏముందో?
గత ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ సహకారంతో పగ్గాలు చేపట్టిన ఆప్ అధినేత అరవింద్ 49 రోజుల తర్వాత దిగిపోవడంతో విధానసభ ఎన్నికలు జరిగాయి. దీంతో 14 నెలల వ్యవధిలోపలే మరోమారు జాతీయ రాజధానివాసులు శనివారం పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే వారిలో అత్యధికులు ఏ పార్టీకి మొగ్గుచూపారనేదే ప్రస్తుతం అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. న్యూఢిల్లీ: జాతీయ రాజధాని వాసి మరోసారి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. 2013 నాటి విధానసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి విదితమే. దీంతో కొద్దిరోజుల తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ పార్టీ సహకారంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే 49 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ఎల్జీ ఆధ్వర్యంలో నిన్నటిదాకా పరిపాలన సాగించడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించడం, అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ప్రచారం ఇలా అన్ని పర్వాలు ముగియడంతో శనివారం నగరవాసి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. ఈసారి తమకంటే తమకు మెజారిటీ ఇవ్వాలంటూ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, ఆప్ పార్టీలు... ఓటర్లకు విన్నవించాయి. మొత్తం 70 నియోజకవర్గాలున్న విధానసభ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యాయి. దీంతో పెద్దసంఖ్యలో ఓటర్లు బారులుతీరి తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయమై తూర్పుఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ అనే ఓటరు మాట్లాడుతూ ‘ఓటు వేయడమనేది మా కర్తవ్యం. అందుకే ఇక్కడికి వచ్చాం’ అని అన్నారు. దక్షిణ ఢిల్లీలోని గుల్మెహర్ పార్కు పరిసరాల్లో నివసించే లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ తాను పోలింగ్ కేంద్రానికి వచ్చినపుడు ఓటర్లు అంతగా రాలేదన్నారు. తూర్పుఢిల్లీలోని పాండవ్‌నగర్ పోలింగ్ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకే పెద్దసంఖ్యలో ఓటర్లు బారులుతీరారు. ఇదిలాఉండగా జాతీయ రాజధానివాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్లో స్థానికులను శనివారం కోరారు. ముఖ్యంగా యువకులు భారీగా తరలిరావాలని విన్నవించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. సర్కారును ఏర్పాటుచేస్తా : బేడీ పోలింగ్ విషయమై బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ మాట్లాడుతూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననే ఆకాంక్ష వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలను గెలుచుకున్న సంగతి విదితమే. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పెద్దసంఖ్యలో తరలిరావాలంటూ ఓటర్లకు విన్నవించారు. ఇక ఈ ఎన్నికల రేసులో నిలిచిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది స్థానాలైనా దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. కాగా నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13.3 మిలియన్లు. ఈ ఎన్నికల్లో మొత్తం 673 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఎన్నికల నేపథ్యంలో సంబంధిత అధికారులు నగరవ్యాప్తంగా మొత్తం 11,763 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసిన సంగతి విదితమే. -
ఎన్నికల తర్వాత ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వ్యక్తం చేశారు. ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సంగతి తెలిసిందే. మోడల్ టౌన్ నియోజకవర్గంలోని సెయింట్ జేవియర్ స్కూలులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఓట్ల శాతం నమోదు కావడం ద్వారా ఢిల్లీ రికార్డు సృష్టించాలని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటానని చెప్పారు. 2013 ఎన్నికల్లో 65.13 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. -
ఏ మదిలో ఏముందో..
న్యూఢిల్లీ: నగరంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం(ఫిబ్రవరి 7)నాడు స్థానిక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభిమానులతో పాటు సామాన్య ఓటర్లు సైతం ఉత్సుకతతో ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా ఎంతో వ్యయప్రయాసలతో తాము ప్రచారం చేసినా ఓటర్ల మదిలో ఏముందో తెలియడంలేదని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈసారి పోరు బీజేపీ, ఆప్‌ల మధ్యేనని స్థానికులు అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అధికారం కోసం హోరాహోరీ తప్పదనే సర్వేల నివేదికలో నగర రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తిస్తున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం గత ఏడాది రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ఇన్నాళ్లు రాష్ట్రపతి పాలన సాగింది. దాంతో ప్రజా ప్రభుత్వం కోసం స్థానికులు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పూర్తి ప్రచార బాధ్యతలు స్వీకరించగా ఆప్ తరఫున ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే ప్రచార భారాన్ని మోశారు. కాంగ్రెస్ పార్టీ కూడా యువనేత అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజలను ఆకర్షించేందుకు యత్నించింది. ఈ సందర్భంగా పహాడ్గంజ్కు చెందిన సందీప్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. తన ఆటోపై బీజేపీ కవర్‌ను పెట్టుకుని తిరిగినప్పటికీ ఓటు మాత్రం ఆప్కే వేస్తానన్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినా ఈసారి మాత్రం ఆ పార్టీకి వెయ్యనని స్పష్టం చేశాడు. మరి ఆటోకు బీజేపీ బ్యానర్ కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నావు కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఒక బీజేపీ కార్యకర్త దాన్ని ఏర్పాటుచేశాడని తెలిపాడు. అదే దాన్ని తాను సొంతంగా ఏర్పాటుచేసుకోవాలంటే కనీసం రూ.500 ఖర్చవుతుందని.. అందుకే కాదనలేదని చెప్పాడు. అయినా ఎవరేమిచ్చినా తీసుకోండి.. ఓటుమాత్రం ఆప్కే వేయండి అని కేజ్రీవాల్ కూడా చెప్పాడని గుర్తుచేశాడు. అలాగే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని కొందరు పోర్టర్లను కదిలిస్తే వారు కూడా కేజ్రీవాల్‌కు అనుకూలంగానే మాట్లాడారు. తాము ఆప్కే ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నామని.. ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఇదిలా ఉండగా, చాందినీచౌక్‌లోని ఒక దుకాణదారు మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం వస్తే రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు సాధారణమైపోతాయేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఒకవేళ ఆప్ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు పోలీసులను పట్టించుకోవడం మానేస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే తాను బీజేపీకి ఓటేస్తానని స్పష్టం చేశాడు. షంషేర్‌సింగ్ అనే మరో ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. గతంలో తాను ఆప్కే ఓటేశానని చెప్పాడు. అయితే ఈసారి మాత్రం అదే పనిచేస్తానని చెప్పలేనన్నాడు. బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది కాని పోలింగ్ రోజుమాత్రమే తాను తుది నిర్ణయానికి వస్తానని స్పష్టం చేశాడు. రోహన్ వర్మ అనే బ్యాంక్ఉద్యోగి మాట్లాడుతూ.. తాను నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తాను కాని కిరణ్‌బేడీకి మాత్రం మద్దతు ఇవ్వబోనని చెప్పాడు. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల పుణ్యమా అని చాలామంది మిత్రుల మధ్య కొంతమేర పొరపొచ్చాలు కూడా చోటుచేసుకున్నాయనే చెప్పవచ్చు. కాలేజీ స్నేహితులైన నిధి శర్మ, ఆయుష్ సక్సేనాలు ఈ ఎన్నికల వేళ ఒకరు ఆప్‌కు ప్రచారం చేస్తుంటే, మరొకరు బీజేపీకి మద్దతు పలికారు. కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో నిధి శర్మ ఆప్ టోపీ పెట్టుకుని కనిపిస్తే, ఆయుష్ సక్సేనా బీజేపీ స్కార్ఫ్‌తో ఉంది. శర్మ అనే మరో విద్యార్థి మాట్లాడుతూ.. ‘మేమందరం కాలేజీ స్నేహితుమే అయినా రాజకీయంగా ఎవరి ఆలోచనలు వారికున్నాయ్..’ అని చెప్పాడు. ‘కాంగ్రెస్ చాలా ఏళ్లు ఢిల్లీని ఏలింది.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ సర్కారుంది.. అయితే సామాన్యుల ఇబ్బందులను గుర్తెరిగిన ‘జాదూవాలా’ కే మేం ఓటేయబోతున్నాం..’ అంటూ ఆప్ జెండాను చూపించాడు. సరితా విహార్ ప్రాంతానికి చెందిన సరళ అనే గృహిణి మాట్లాడుతూ.. గతంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను చూసి అతడికే మా కుటుంబమంతా ఓటేశాం.. ఇప్పుడు మాత్రం అదే పరిస్థితి పునరావృతమవుతుందని చెప్పలేను.. ’ అని అంది. తాగునీరు, కరెంటుకు సంబంధించి కేజ్రీవాల్ ఇస్తున్న హామీలను నెరవేర్చేందుకు నిధులు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటాడు.. ఒకవేళ అది ఏ మాత్రం బెడిసికొట్టినా అతడు తిరిగి మధ్యలోనే రాజీనామా చేసేయడని నమ్మకమేంటని.. ఆమె ప్రశ్నించింది. బాదర్పూర్కు చెందిన ఐటీ నిపుణుడు స్వరూప్ ముఖర్జీ మాట్లాడుతూ.. కరెంట్ చార్జీలపై ఆప్ హామీ అమలుచేయడం కష్టమేనని విశ్లేషించాడు. నగరం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటేయడమే బెటరని అభిప్రాయపడ్డాడు. అయితే చాందినీచౌక్‌కు చెందిన జావేద్ రాజా మాత్రం కాంగ్రెస్‌కే తన ఓటు అన్నాడు. ప్రజలు బీజేపీ, ఆప్‌ల పనితీరుపై అసహనంగా ఉన్నారని, వారు కాంగ్రెస్‌వైపు మొగ్గుతున్నారని చెప్పాడు. కాంగ్రెస్ గత 15 యేళ్ల పాలనలో ఢిల్లీ అభివృద్ధి కోసం చాలా చేసిందని వ్యాఖ్యానించాడు. -
బీజేపీ ప్రశ్నలపై స్పందించబోం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంధించిన ఐదు ప్రశ్నలపై తాము స్పందించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. తాము ఇప్పటికే కాషాయ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని బహిరంగ చర్చకు ఆహ్వానించామని, కానీ ఆమె ముందుకు రాకుండా పారిపోయారని ఆప్ నేత అశుతోష్ విమర్శించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘మనమెందుకు చర్చలో పాల్గొనకూడదు? అందుకే కిరణ్ బేడీని బహిరంగ చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరాం. కానీ, ఆమె అందుకు అంగీకరించకుండా పారిపోయింది. ఎందుకంటే ఆమెకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ఇష్టం లేదు. అసలు ఆమెకు ఢిల్లీ గురించి అవగాహనే లేదు’ అని ఆయన అన్నారు. తమపై సంధించే ప్రశ్నలను బహిరంగంగా లక్షలాది ప్రజలను మధ్యవర్తులుగా ఉంచి అడగొచ్చు కదా... అని ప్రశ్నించారు. దీనికి అంగీకరించకుండా తమపై ప్రశ్నాస్త్రాలను ఎందుకు సంధిస్తున్నారని అశుతోష్ వ్యాఖ్యానించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రోజువారీ పద్ధతిలో ప్రశ్నలు విసరడం మాని కాలం చెల్లిన సంప్రదాయ మేనిఫెస్టోతో కాకుండా ఢిల్లీకి ఏం చేస్తారనే దానిని ‘విజన్ డాక్యుమెంట్’గా రూపొందించాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు. -
ఉత్తమ్‌నగర్‌లో మద్యం సీసాలు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక ఉత్తమ్‌నగర్‌లోని ఓ గోదాములో ఎనిమిది వేలకుపైగా మద్యం సీసాలు లభించాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. శుక్రవారం రాత్రి పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ చేసిన మెరుపుదాడిలో ఇవి లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇవి హరియాణాలో తయారైనట్టుగా వాటిపై ఉన్న ముద్రలు చెబుతుననాయి. ఇవి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి నరేష్ బలియాన్వేనని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ మద్యానికి తనకు ఏ సంబంధం లేదని నరేష్ బలియాన్ చెప్పారు. మద్యం సీసాలు లభించిన గోదాము బీజేపీ కార్యకర్తదని ఆయన ఆరోపించారు. మరోవైపు పోలీసులు ఇదే విషయమై మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక నిందితుల పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామన్నారు. -
కమల వికాసాన్ని ‘ఆప్’ ఆపేనా..?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అధికార పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతోంది?!..దేశవ్యాప్తంగా ఇటీవల ఎన్నికల్లో కమల వికాసానికి కారణమైన మోదీ మంత్రం ఇక్కడకూడా పనిచేస్తుందా? 16 ఏళ్ల కమలనాథుల ‘ఢిల్లీ’ ఎన్ని‘కల’ ఫలిస్తుందా? అనూహ్యంగా సీఎం పీఠాన్ని అధిష్టించి..ఆ తర్వాత నాటకీయంగా తప్పుకున్న కేజ్రీవాల్ మరోమారు తన క్రేజ్‌ను నిలుపుకోగ లుగుతారా...కమల వికాసాన్ని అడ్డుకునే సత్తా ‘ఆప్’కు ఉందా...? వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్‌కు హస్తినలోనైనా కాస్త ఊరట లభిస్తుందా..? ఇలా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ చర్చోపర్చలు కొనసాగుతున్నాయి. అసలు సగటు ఓటరు ఏమనుకుంటున్నాడు. ఎవరిని గెలిపించబోతున్నాడు అనే అంశాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలువురు ఢిల్లీవాసులు తమ మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు. బీజేపీ, ఆమ్ఆద్మీకి 50-50 అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీకి, ఆమ్ఆద్మీకి ఇద్దరికి 50-50 చాన్స్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఆమ్ ఆద్మీ మళ్లీ రావొచ్చు. కేజ్రీవాల్ 49 రోజులే సీఎంగా పనిచేసినప్పటికీఎంతో కొంత మార్పు కనిపించింది. చాలా పనులు జరిగాయి. మా నియోజకవర్గంలో బీజేపీ 15 ఏళ్లుగా గెలుస్తున్నా ఒక్క పనీ జరగలేదు. ఎక్కువ మంది మళ్లీ ఆప్ రావాలని కోరుకుంటున్నారు. - ఆరిఫ్ ఆలం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కరావల్ నగర్ మేమంతా ఆప్ వైపే... నేను ట్యాక్సీ నడుపుకుంటూ జీవిస్తా. ఆమ్ఆద్మీ కేజ్రీవాల్ సర్కార్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు అన్నీ మొదటికి వ చ్చాయి. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న 49 రోజులు పోలీసులు లంచం అడగడానికి భయపడేవాళ్లు. ఆప్ సర్కార్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మా ట్యాక్సీలు, అందువల్లనే ఆటోవాలాలంతా ఆమ్ఆద్మీనే గెలిపించాలనుకుంటున్నాం. -షేర్సింగ్, ట్యాక్సీ డ్రైవర్, మాలవీయనగర్ ఆప్కే మళ్లీ అవకాశం మళ్లీ ఆమ్ఆద్మీ పార్టీకే అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ వచ్చింది. గొప్పగొప్ప మాటలు చెప్పడం తప్ప జరిగిందేమీ లేదు. సీఎం అభ్యర్థిగా బీజేపీ కిరణ్‌బేడీని తెచ్చినా ఏం లాభం లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్లు ఎక్కువ, అన్ని విషయాలు ఆలోచిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం జుగ్గీజోపిడీల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ ఉంది. నా అంచనా ప్రకారం ఆప్‌కి 40 సీట్లు వస్తాయి. - జయేందర్, సీఏ, సాకేత్ ఆప్ వస్తేనే వస్తేనే మేలు... ఢిల్లీలో ఆమ్ఆద్మీపార్టీ వస్తేనే మేలు జరుగుతుంది. అనేకమంది విద్యార్థులు కేజ్రీవాల్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కేజ్రీవాల్ సీఎం అయ్యాక చాలా మార్పు కనిపించింది. లంచం అడిగేవాళ్లు తగ్గారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకం ఉంది. కిరణ్‌బేడీ కేవలం అవకాశం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిధంగా చూస్తే కేజ్రీవాల్‌కి చాలా తేడా ఉంది. - ఆరిబా, స్టూడెంట్, డీయూ, శాస్త్రినగర్ అంతా అవకాశవాదులే... అన్ని పార్టీల నాయకులు అవకాశ వాదులే. ప్రజలు నమ్మకంగా ఓటు వేసి గెలిపిస్తే..పీఎం కావాలనే ఆశతో కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ధర్నాలతో చివరికి ఆమ్ఆద్మీనే ఇబ్బంది పెట్టారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌బేడీ తన అవకాశం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. నన్నడిగితే నోటా (నన్ఆఫ్ది ఎబవ్)కి ఓటు వేయడం మేలు. - జి.కరుణాదేవి, మహిళా ఉద్యోగి, న్యూఢిల్లీ కిరణ్ బేడీ వస్తేనే మహిళలకు భద్రత కిరణ్‌బేడీ సీఎం అయితేనే మహిళలకు భద్రత మెరుగవుతుంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ఇప్పటికి కిరణ్‌బేడీ సీఎం కావడమే కరెక్టు. ఆమె గతంలో ఐపీఎస్‌గా పనిచేశారు. అన్ని విషయాలు తెలుసు. ఇక్కడి పరిస్థితులు మారాలంటే ఆమెలాంటి నాయకురాలే అవసరం. మిగతా వారికంటే బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. - ఎం రేఖారాణి, గృహిణి, న్యూఢిల్లీ సుస్థిర ప్రభుత్వం రావాలంటే బీజేపీ గెలవాలి సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం బీజేపీ వల్లే అది సాధ్యమవుతుంది. అనుభవం లేకపోయినా మార్పు వస్తుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఆమ్ఆద్మీకి ఓటు వేశా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీలోనే అంతా కలసికట్టుగా లేరు. కేంద్రంలో మోదీ సర్కారు చేస్తున్న పనులు చాలా బాగున్నాయి. - అశోక్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, పాలం -
కిరణ్‌బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : తమతో చర్చకు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జంకుతున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శనివారం న్యూఢిల్లీలో ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం కేజ్రీవాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రమంత్రులంతా తమ పనులు మానేసి ఢిల్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేప్పారు. ఈ సారి సీఎం అయితే గతంలోని 49 రోజుల పాలన కంటే మరింత మెరుగైన పాలన అందిస్తానని ఆయన న్యూఢిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు సగానికి సగం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆడిత్ తర్వాత నిర్థిష్ట ఛార్జీ ఫిక్స్ చేస్తామన్నారు. ఆప్‌ను చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆప్ తన మేనిఫెస్టోలో 70 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్‌తో విడుదల చేసింది. -
‘న్యూఢిల్లీ’లో తేలనున్న అరవింద్ భవిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు మరోమారు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. గత ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో ఓడించిన కేజ్రీవాల్...ఇక్కడినుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మాజీ మంత్రి కిరణ్‌వాలియాను నిలబెట్టగా, బీజేపీ తరఫున డూసూ మాజీ అధ్యక్షురాలు నుపుర్‌శర్మ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో పదవీ విరణమ వయసు అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఇక నుపుర్ శర్మ... అభివృద్ధి, మహిళాభద్రత, నీటి కొరత, విద్యుత్ తదితర సమస్యలను ప్రధానాంశాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించడమే కాకుండా కేజ్రీవాల్ వైఫల్యాలను వేలెత్తి చూపుతున్నారు. వీఐపీలు, ప్రభుత్వోద్యోగులకు నెలవైన న్యూఢిల్లీలో... మిగతా నియోజకవర్గాల మాదిరిగా విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాల కొరత సమస్యలు కనిపించవు. అవినీతి, ధరల పెరుగుదల, మహిళాభద్రత వంటి అంశాలే ఇక్కడ కీలకంగా మారాయి. 2.65 లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజక వర్గంలో దాదాపు సగం మందికి ఓటు హక్కు లేదు. 1.36 లక్షల మంది ఓటర్లున్న న్యూఢిల్లీలో 37 శాతం మంది ప్రభుత్వోద్యోగులు, 20 శాతం పంజాబీలు, 18 శాతం షెడ్యూల్డ్కులాలు, 10 శాతం వైశ్యులు, 10 శాతం మంది బ్రాహ్మణులతోపాటు ఒక శాతం మంది శాతం మురికివాడవాసులుకూడా ఉన్నారు.