సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అధికార పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతోంది?!..దేశవ్యాప్తంగా ఇటీవల ఎన్నికల్లో కమల వికాసానికి కారణమైన మోదీ మంత్రం ఇక్కడకూడా పనిచేస్తుందా? 16 ఏళ్ల కమలనాథుల ‘ఢిల్లీ’ ఎన్ని‘కల’ ఫలిస్తుందా? అనూహ్యంగా సీఎం పీఠాన్ని అధిష్టించి..ఆ తర్వాత నాటకీయంగా తప్పుకున్న కేజ్రీవాల్ మరోమారు తన క్రేజ్‌ను నిలుపుకోగ లుగుతారా...కమల వికాసాన్ని అడ్డుకునే సత్తా ‘ఆప్’కు ఉందా...? వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్‌కు హస్తినలోనైనా కాస్త ఊరట లభిస్తుందా..? ఇలా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ చర్చోపర్చలు కొనసాగుతున్నాయి. అసలు సగటు ఓటరు ఏమనుకుంటున్నాడు. ఎవరిని గెలిపించబోతున్నాడు అనే అంశాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలువురు ఢిల్లీవాసులు తమ మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు.
బీజేపీ, ఆమ్‌ఆద్మీకి 50-50 అవకాశం
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీకి, ఆమ్‌ఆద్మీకి ఇద్దరికి 50-50 చాన్స్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఆమ్ ఆద్మీ మళ్లీ రావొచ్చు. కేజ్రీవాల్ 49 రోజులే సీఎంగా పనిచేసినప్పటికీఎంతో కొంత మార్పు కనిపించింది. చాలా పనులు జరిగాయి. మా నియోజకవర్గంలో బీజేపీ 15 ఏళ్లుగా గెలుస్తున్నా ఒక్క పనీ జరగలేదు. ఎక్కువ మంది మళ్లీ ఆప్ రావాలని కోరుకుంటున్నారు. - ఆరిఫ్ ఆలం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కరావల్ నగర్
మేమంతా ఆప్ వైపే...
నేను ట్యాక్సీ నడుపుకుంటూ జీవిస్తా. ఆమ్‌ఆద్మీ కేజ్రీవాల్ సర్కార్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు అన్నీ మొదటికి వ చ్చాయి. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న 49 రోజులు పోలీసులు లంచం అడగడానికి భయపడేవాళ్లు. ఆప్ సర్కార్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మా ట్యాక్సీలు, అందువల్లనే ఆటోవాలాలంతా ఆమ్‌ఆద్మీనే గెలిపించాలనుకుంటున్నాం.
-షేర్‌సింగ్, ట్యాక్సీ డ్రైవర్, మాలవీయనగర్
ఆప్‌కే మళ్లీ అవకాశం
మళ్లీ ఆమ్‌ఆద్మీ పార్టీకే అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ వచ్చింది. గొప్పగొప్ప మాటలు చెప్పడం తప్ప జరిగిందేమీ లేదు. సీఎం అభ్యర్థిగా బీజేపీ కిరణ్‌బేడీని తెచ్చినా ఏం లాభం లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్లు ఎక్కువ, అన్ని విషయాలు ఆలోచిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం జుగ్గీజోపిడీల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ ఉంది. నా అంచనా ప్రకారం ఆప్‌కి 40 సీట్లు వస్తాయి.
- జయేందర్, సీఏ, సాకేత్
ఆప్ వస్తేనే వస్తేనే మేలు...
ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ వస్తేనే మేలు జరుగుతుంది. అనేకమంది విద్యార్థులు కేజ్రీవాల్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కేజ్రీవాల్ సీఎం అయ్యాక చాలా మార్పు కనిపించింది. లంచం అడిగేవాళ్లు తగ్గారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకం ఉంది. కిరణ్‌బేడీ కేవలం అవకాశం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిధంగా చూస్తే కేజ్రీవాల్‌కి చాలా తేడా ఉంది.
- ఆరిబా, స్టూడెంట్, డీయూ, శాస్త్రినగర్
అంతా అవకాశవాదులే...
అన్ని పార్టీల నాయకులు అవకాశ వాదులే. ప్రజలు నమ్మకంగా ఓటు వేసి గెలిపిస్తే..పీఎం కావాలనే ఆశతో కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ధర్నాలతో చివరికి ఆమ్‌ఆద్మీనే ఇబ్బంది పెట్టారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌బేడీ తన అవకాశం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. నన్నడిగితే నోటా (నన్‌ఆఫ్‌ది ఎబవ్)కి ఓటు వేయడం మేలు.
- జి.కరుణాదేవి, మహిళా ఉద్యోగి, న్యూఢిల్లీ
కిరణ్ బేడీ వస్తేనే మహిళలకు భద్రత
కిరణ్‌బేడీ సీఎం అయితేనే మహిళలకు భద్రత మెరుగవుతుంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ఇప్పటికి కిరణ్‌బేడీ సీఎం కావడమే కరెక్టు. ఆమె గతంలో ఐపీఎస్‌గా పనిచేశారు. అన్ని విషయాలు తెలుసు. ఇక్కడి పరిస్థితులు మారాలంటే ఆమెలాంటి నాయకురాలే అవసరం. మిగతా వారికంటే బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది.
- ఎం రేఖారాణి, గృహిణి, న్యూఢిల్లీ
సుస్థిర ప్రభుత్వం రావాలంటే
బీజేపీ గెలవాలి
సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం బీజేపీ వల్లే అది సాధ్యమవుతుంది. అనుభవం లేకపోయినా మార్పు వస్తుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీకి ఓటు వేశా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీలోనే అంతా కలసికట్టుగా లేరు. కేంద్రంలో మోదీ సర్కారు చేస్తున్న పనులు చాలా బాగున్నాయి.
- అశోక్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, పాలం
కమల వికాసాన్ని ‘ఆప్’ ఆపేనా..?!
Published Sat, Jan 31 2015 10:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement