ఇకనైనా ‘స్వచ్ఛ్' ఢిల్లీ అవుతుందా?
న్యూఢిల్లీ: ‘బాజ్‌పాకి ప్రచండ్ జీత్ పర్ ఢిల్లీ కో నమాన్’ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఫొటోలతో కూడిన పోస్టర్లు పండిట్ మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు వెలిశాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ బుధవారం ఫలితాలు వెలువడవక ముందే ఈ పోస్టర్లను తయారు చేయడంలో తలమున్కలైంది. అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీకి శిరస్సు వంచి ప్రణిమిల్లుతున్నామన్నది పోస్టర్లలో హిందీలో ఉన్న నినాదానికి తెలుగులో సమానార్థం.
శిరస్సు వంచి ప్రణమిల్లాల్సిన అవసరం లేదని, శిరస్సు ఎత్తి నగరంలో గుట్టలుగా పేరుకుపోతున్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు. ఢిల్లీలోని మూడు కార్పొరేషన్లను కలుపుకొని బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లతో పోలిస్తే తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలోనే అతి తక్కువగా, అంటే 49 సీట్లు వచ్చాయి. ఈ కార్పొరేషన్‌ను పట్టి పీడిస్తున్న పరిశుద్ధ్య సమస్యయే ఇందుకు ప్రధాన కారణం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, ఉద్యోగులు తరచూ సమ్మె చేయడమే అందుకు కారణం. పదేళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్‌ను బీజీపీ పాలిస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేక పోతోంది.
ఈ తూర్పు కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ టీచర్లు, డాక్టర్లు కలపుకొని 23 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు. వారు గత రెండేళ్లలోనే ఇప్పటికీ ఐదుసార్లు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. మున్సిపల్ కార్మికుల జీతభత్యాలకు సంబంధించి ఢిల్లీ ఫైనాన్స్ కార్పొరేషన్ సమర్పించిన నివేదికను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నేటికి అమలు చేయలేకపోతోంది. నిధులలేమీయే అందుకు కారణం. వెనకబడిన తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌కు పన్నుల రూపంలో ప్రజల నుంచే నిధులుగానీ, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంగానీ చాలా తక్కువ.
అందుకని తామేమి చేయలేకపోతున్నామన్నది బీజేపీ నాయకత్వంలోని మున్సిపల్ పాలక మండలి వాదన. ఢిల్లీ స్థానిక ప్రభుత్వమే అదనపు నిధులు విడుదల చేయాలన్నది మండలి డిమాండ్. కేంద్రానికి తాము చెల్లిస్తున్న పన్నుల్లో తమ వాటాను పెంచితేనే తామివ్వగలమన్నది ఆప్ ప్రభుత్వం వాదన. ఈ వాదోపవాదాల నేపథ్యంలో కార్మికులు సమ్మె కట్టడం సాధారణమైంది. పారిశుద్ధ్యం పనులు నిలిచిపోవడం నిత్యకృత్యమైంది.
ఇప్పుడూ కూడా తూర్పు మున్సిపల్ కార్యాలయానికి 13 కిలోమీటర్ల దూరంలో 12 మంది కార్మికులు బైఠాయింపు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారు ఆందోళన చేపట్టి నేటికి 113వ రోజు. వారికి గతం నుంచి రావాల్సిన బకాయిలే కాకుండా, గత రెండు నెలలుగా జీతాలు కూడా రావడం లేదు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు పెద్దగా కలగకుండా సమన్వయం పాటిస్తూ వచ్చామని, ఎన్నికల్లో విజయం సాధించిన వారెవరూ తమను పలకరించిన పాపాన పోలేదని ఎసీడీ స్వచ్ఛ్ కర్మచారి యూనియన్ అధ్యక్షుడు సంజయ్ గెహ్లాట్ తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు తమ ఆందోళన ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ నినాదానికిచ్చే గౌరవాన్ని అందుకు కష్టపడే తమ డిమాండ్లను ఎందుకు గౌరవించరన్నది సమ్మెకారుల ప్రశ్న.