న్యూఢిల్లీ: జోడు పదువుల్లో కొనసాగుతున్న 29 మంది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల చుట్టూ ఎన్నికల కమిషన్ ఉచ్చు బిగుస్తుండడంతో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 21 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంక్షేమ కమిటీ చైర్మపర్సన్లుగా నియమితులైన ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కనీసం పది మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రమాదం ఉంది.
అప్పుడు ఆప్ పార్టీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ వారిని చేర్చుకోవడమే ఇక తరువాయి. బవానా నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ ఇటీవలనే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే బీజేపీ తరఫున పోటీ చేస్తారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లున్న విషయం తెల్సిందే.
ముందస్తు ఎన్నికలు జరిగేందుకు పూర్తి అవకాశాలు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ముందుస్తు ఎన్నికల్లో విజయం సాధించాలనే కతనిశ్చయంతో బీజేపీ అప్పుడే రంగంలోకి దిగింది. ‘విస్తారక్’ కార్యక్రమం కింద పార్టీని నగరంలో నలుమూలల విస్తరించుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం స్ఫూర్తితో ముందుకు దూసుకుపోతోంది. పార్టీకి చెందిన విస్తారక్‌లు జూన్ 23వ తేదీ నుంచే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని, లక్షన్నర మంది సభ్యులను కొత్తగా పార్టీలో చేర్చుకోవాల్సిందిగా వారికి లక్ష్యాన్ని నిర్దేశించామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి తెలిపారు. ఢిల్లీలో తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉండడంతో ముందుస్తు ఎన్నికలు జరిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, అందుకని తాము ముందస్తు ఏర్పాట్లలో ఉన్నామని మరో బీజేపీ నాయకుడు తెలిపారు.
న గరంలో 9,227 మంది పార్టీ విస్తారక్‌లను నియమించామని, వారు 13,200 పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని, కనీసం ఒక్కో విస్తారక్ యాభ మైంది కొత్త సభ్యులను ముఖాముఖి కలసుకుంటారని నగర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేష్ భాటియా తెలిపారు. ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నియామకం ప్రక్రియను చేపట్టినందున పార్టీ కూడా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదుకు కషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జూలై 30వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఢిల్లీలో చోటుచోసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. విరివిగా తమ నియోజక వర్గాల్లో పర్యటించాల్సిందిగా ఆప్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేజ్రివాల్ కూడా తన నియోజకవర్గం న్యూఢిల్లీలో నెల రోజుల్లో నాలుగు సార్లు పర్యటించారు. ఆయన ఆదివారం సాయంత్రం ఫేస్‌బుక్ ద్వారా పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు.
ఇలా ఇరు పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతుండడంతో 29 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసన సభ్యుల అధికారాల స్వతంత్య్రను కాపాడేందుకు, వివిధ అధికార హోదాల వేర్వేరు అధికారాలను పరిరక్షించేందుకు చాల దేశాలు జోడు పదవుల విధానాన్ని రద్దు చేయగా, అదే బాటలో భారత్ కూడా ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ చట్టాన్ని 2006లో తీసుకొచ్చింది. ఎన్నికైన అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు ఆర్థికంగా లేదా మరో విధంగా తనకు లబ్ధి చేకూర్చే ఇతర హోదాలో ఉండ కూడదు.
ఈ కారణంగానే నాడు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు లోక్‌సభ సభ్యురాలైన సోనియా గాంధీ ‘జాతీయ సలహా మండలి’ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయల్సి వచ్చింది. ‘ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అభివద్ధి సంస్థ’ చైరపర్సన్‌గా ఉన్నందున నాడు జయాబచ్చన్ రాజ్యసభ బహిష్కరణను ఎదుర్కోవాల్సి వచ్చింది.