- కర్ణాటకలో మిన్నంటిన సంబరాలు
- జైన్ భవన్ నుంచి ఎంజీ రోడ్ వరకు ‘ఆప్’ నేతల ర్యాలీ
బెంగళూరు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాధించిన ఘన విజయంతో ఆప్ కర్ణాటక శాఖలో సంబరాలు మిన్నంటాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి ఒక్కో మెట్టు దగ్గరవుతున్న కొద్దీ ఆప్ రాష్ట్ర శాఖ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. నగరంలోని అశోక్ నగర్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచే ఆప్ కార్యకర్తల సందడి కనిపిస్తూ వచ్చింది. ఆప్‌కు విజయం ఖాయమని పోలింగ్ రోజునే ఎగ్జిట్ పోల్స్ సైతం తేల్చి చెప్పడంతో ఆప్ రాష్ట్ర శాఖ నేతల ముఖాల్లో విజయంపై ఆత్మవిశ్వాసం కనిపించింది. అయితే ఇంతటి ఘన విజయాన్ని తాము సైతం ఊహించలేదని ఆప్ రాష్ట్రశాఖ నేతలు పేర్కొన్నారు. ఈ విజయం ఢిల్లీలోని ప్రతి సామాన్యుడి విజయమని ఆప్ నేత రవికృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
సామాన్యుడి శక్తిని తక్కువ అంచనా వేసిన జాతీయ పార్టీల నేతలకు ఢిల్లీలోని ఓటర్లు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. ఇక రానున్న రోజుల్లో ఇదే ఫలితాలు కర్ణాటకలో సైతం పునరావృతమవుతాయని ఆప్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ విజయం అందించిన స్పూర్తితో కర్ణాటకలో సైతం తమ పార్టీని బలపరిచే దిశగా ప్రణాళికలు రచించే పనిలో ఆప్ రాష్ట్ర శాఖ నేతలు నిమగ్నమయ్యారు. ఇక ఆప్ సంబరాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆప్ కార్యకర్తలు నగరంలోని జైన్ భవన్ నుంచి ఎంజీ రోడ్ వరకు ర్యాలీని నిర్వహించారు. చాలాకాలంగా ఆప్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి ఈ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి దొరెస్వామి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడు ఆప్ పై పెట్టుకున్న ఆశలన్నింటిని నెరవేర్చేదిశగా ముందుకు ఢిల్లీలో ఆప్ పాలన సాగుతుందనే ఆశాభావాన్ని దొరెస్వామి వ్యక్తం చేశారు.
14న పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుల స్వీకరణ
హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో ప్రతినెలా రెండవ శనివారం తాలూకా స్థాయిలో పౌరసరఫారాల శాఖ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రేషన్‌కార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల వద్ద ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల రెండవ శనివారం 14వ తేదీ ఐదు తాలూకాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు ఆ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్రిష్ణగిరి తాలూకాలో పాత క్రిష్ణాపురం గ్రామంలో, హొసూరు తాలూకాలో ముగళపల్లి గ్రామంలో, డెంకణీకోట తాలూకాలో బేళాళం గ్రామంలో, పోచ్చంపల్లి తాలూకాలో రంగంబట్టి గ్రామంలో, ఊత్తంగేరి తాలూకాలో కుళ్లంపట్టి గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ‘ఆప్’కు
బెంగళూరు : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకు చెందిన సంప్రదాయ ఓట్లన్నీ ఆప్‌కు పడ్డాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందువల్లే తాము ఓడిపోయామని విశ్లేషించారు. కెంగల్ హనుమంతయ్య జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలోని కెంగల్ హనుమంతయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా పనిచేయలేదన్నారు. ఇప్పటికైనా ఆయన ఆలోచన తీరును మార్చుకుని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని సిద్ధరామయ్య సూచించారు.