సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుపై పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని మురికిలాగా ఊడ్చేసిందని శివసేన బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. బీజేపీ ఘోర వైఫల్నాకి ప్రధాని మోదీయే కారణమని పేర్కొంది. కేవలం ఎన్నికల వాగ్దానాలు, ప్రసంగాలతోనే విజయం సాధించలేమని, బీజేపీకి ఢిల్లీ గుణపాఠం నేర్పిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన బీజేపీని ఆప్ మురికిగా మార్చేసిందని తెలిపింది.
తాము గెలిచిన సీట్లను లెక్కించేందుకు బీజేపీ నేతలకు చేతి వేళ్లు కూడా అవసరం లేదని ఎద్దేవా చేసింది. కిరణ్‌బేదీని ఓటమికి బాధ్యురాలిని చేయడం సరి కాదని సూచించింది. అమిత్‌షా తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోయారని, చివరి అస్త్రంగా మోదీని ప్రయోగించినా విఫలమయ్యారని ఎత్తిపొడిచింది. ఇది మోదీ పరాజయమని అన్నా హజారే వ్యాఖ్యానించారని, తాము కూడా అలాగే భావిస్తున్నామని శివసేన తెలిపింది.
ఓ కార్పొరేషన్‌లో శివసేన ఓడితే...
ఉద్దవ్ ఠాక్రే ఓడినట్టు భావించాలా..? : సిఎం
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొనడం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. నాసిక్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏదైనా కార్పొరేషన్‌లో శివసేన ఓడిపోతే అది ఉద్ధవ్ ఠాక్రే పరాజయంగా భావించాలా..? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని నరేంద్ర మోడీ పరాజయంగా పేర్కొనరాదన్నారు. ముఖ్యంగా పక్కింట్లో పిల్లాడు పుట్టాడన్న సంతోషాన్ని ఎక్కువ రోజులు వ్యక్తపరచరాదని కూడా ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో పరాజయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకుంటుందన్నారు.
బీజేపీని మురికిగా మార్చి ఊడ్చేసిన ఆప్
Published Thu, Feb 12 2015 5:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement