ప్రతీకారం తీర్చుకున్నారు! | BJP takes sweet revenge on AAP in mcd polls | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకున్నారు!

Published Wed, Apr 26 2017 11:04 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

ప్రతీకారం తీర్చుకున్నారు! - Sakshi

ప్రతీకారం తీర్చుకున్నారు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉంది. ఈలోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసుకెళ్తోంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా, 185 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా కార్పొరేషన్లను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి.

2013 అసెంబ్లీ ఎన్నికలు..
2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు రాగా ఆప్‌కు 28 వచ్చాయి. అయితే కాంగ్రెస్ (8) మద్దతుతో ఆప్ అధికారాన్ని చేపట్టింది. అప్పట్లో బీజేపీకి 33%, ఆప్‌కు 29.5%, కాంగ్రెస్‌కు 24.5% చొప్పున ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో కలిసేది లేదన్న కేజ్రీవాల్.. ఆ పార్టీతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. కేవలం 49 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. జన లోక్‌పాల్ బిల్లు విషయంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది.

2014 సార్వత్రిక ఎన్నికలు..
49 రోజుల పాటు రాజధానిని పాలించిన తానే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థినని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. దాంతో వారణాసిలో నేరుగా మోదీతో ఢీకొన్నారు. ఆ ఎన్నికల్లో కేవలం మోదీ చేతుల్లో ఓడిపోవడమే కాదు.. వారణాసిలో ఆయన ఐదో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. మొత్తం 543 స్థానాలకు పోటీ చేసిన ఆప్.. కేవలం 4 చోట్లే గెలిచింది. ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. దాంతో తాను ఢిల్లీకే పరిమితం అయితే మంచిదని కేజ్రీవాల్‌కు తెలిసింది.

2015 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ తన బలమేంటో నిరూపించుకున్నారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 67 స్థానాలు గెలుచుకున్నారు. ఆయనకు 54% ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 33% ఓట్లతో మూడు స్థానాలే గెలిచింది. 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఓట్లే తగ్గినా, 28 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ కనీసం ఒక్కచోట కూడా గెలవలేదు.

2017 ఎంసీడీ ఎన్నికలు
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తినడానికి ముందే కేజ్రీవాల్‌కు పంజాబ్, గోవా ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ను జాతీయ పార్టీ చేయాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఎంసీడీ ఎన్నికల ఫలితాలతో ఇక ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రెండో స్థానం వచ్చినా కూడా మొత్తం 272 స్థానాలున్న ఎంసీడీలో కేవలం 40కి కాస్త అటూ ఇటూగానే ఆప్ పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో కార్పొరేషన్‌లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలే సాధించినట్లవుతుంది. దాదాపు 40కి అటూ ఇటూగానే కాంగ్రెస్ కూడా ఉంది.

2019 లోక్‌సభ.. 2020 ఢిల్లీ అసెంబ్లీ
ఇప్పుడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. ఇక 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, 2020లో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - ఆప్ తలపడాల్సి ఉంటుంది. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో, ఎవరు ఏ స్థానంలో ఉంటారో చూడాల్సి ఉంటుంది. అయితే తాము ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎంల మీదకు నెపం నెట్టేయడాన్ని మాత్రం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు మానుకుంటే మంచిది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement