ఢిల్లీవాసుల తీర్పును ఊహించలేం...
న్యూఢిల్లీ: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడుతున్నారు. ఢిల్లీవాసుల ఓటు ఎవరికి పడుతుందో ఊహించడం కష్టమని, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయనే విషయాన్ని 1993,2013, 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని వారు అంటున్నారు. ఈ మూడు ఎన్నికలలోనూ ఢిల్లీవాసులు ట్రెండ్‌కు భిన్నంగా ఓటేసినట్లు వారు చెబుతున్నారు.
16 నెలలకోసారి ఓటు...
1993లో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పాటైనప్పటి నుంచి ఢిల్లీలో ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఆరు ఎన్నికలు, ఆరు లోక్‌షబ ఎన్నికలు, నాలుగు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రతి 16 నెలలకోసారి నగరవాసులు ఓటేశారు. బాబీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో ఢిల్లీవాసులు బీజేపీకి పట్టం కట్టారు.
మదన్‌లాల్ ఖురానా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆకాశాన్నింటిన ఉల్లిధరల నేపథ్యంలో కాంగ్రెస్‌కు అనూహ్య విజయం లభించింది. 2003, 2008 ఎన్నికల్లో రెండుసార్లు షీలా దీక్షిత్‌కి పట్టం కట్టారు.అలాగే 2013 అసెంబ్లీ ఎన్నికలకలో ఏడాది కింద ఏర్పాటు అయిన ఆప్ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాల్లో 28 సీట్లు ఇచ్చారు.
వరుసగా మూడసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 8 సీట్లు మాత్రమే లభించాయి. 2015 ఎన్నికలలో ఢిల్లీవాసులు కాంగ్రెస్ కు మొండిచేయి చూపించారు. బీజేపీకి మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఆప్ కు 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు అప్పగించారు. 1996, 1998,1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసిన స్థానికులు ఆ తర్వాత రెండు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఏడింటిలో ఆరు ఎంపీ సీట్లు దక్కగా, 2009 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూర్తి విరుద్ధమైన తీర్పు ఇస్తూ ఏడు సీట్లు బీజేపీకి కట్టబెట్టారు.
కాంగ్రెస 1... బీజేపీ...3...
1997 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీవాసులు అనంతరం మూడు ఎమ్సీడీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. 2012లో ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీవాసులు ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీకే అధికారం ఇచ్చారు.