MCD elections
-
ఎంసీడీ భేటీకి ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్‌ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు. ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే. -
ఆప్ చేతిలో ఓటమి.. ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీ పరాజయంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది పార్టీ. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తెలిపింది. బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్‌గా 2020 జూన్‌లో నియామకమయ్యారు అదేశ్ గుప్తా. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ ఘన విజయం.. హస్తినలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో ఆగిపోయింది. మెజారిటీ సాధించకపోయినప్పటికీ మేయర్ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను గత శుక్రవారం కొట్టి పారేశారు అదేశ్ గుప్తా. మేయర్ పదవి ఆప్ చేపడుతుందని, బీజేపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్! పదిహేనేళ్ల బీజేపీ అధికారాన్ని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీపురుతో ఊడ్చేసింది. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు, ఓ చిన్న రాష్ట్రం కూడా. అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన పార్టీ నేత సీఎం అవుతాడు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలకున్న అధికారాల్లో కొన్ని ఢిల్లీ సీఎంకు ఉండవు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విశేషాధికారాలు అనివార్యంగా దఖలు పడతాయి. దేశ పాలనకు, విదేశాంగ కార్యకలాపాలకు రాజధాని కీలకం గనుక ఇలా కొన్ని విషయాల్లో కేంద్రం మాట, లేదా అధికారం చెల్లుబాటవడం అనివార్యం, ఆమోదనీయం కూడా. కేంద్రంలో, ఢిల్లీలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ పనితీరుకు ఆస్కారముంటుంది. ఏ విషయంలోనూ సమస్యకు చాన్సుండదు. చిక్కల్లా అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలో ఉంటేనే! ఇది ఒక్కోసారి రాజ్యాంగ సంక్షోభానికీ దారి తీస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఆప్కూ కేంద్రంలో అధికారం చలాయిస్తున్న మోదీ బీజేపీకీ మధ్య ప్రస్తుతం జరుగుతున్నదదే! ఎంసీడీపై పట్టు బిగించడంతో కేజ్రీవాల్ ఇక మరిన్ని అధికారాల కోసం కేంద్రంపై మరింత దూకుడుగా పోరాడే అవకాశముంటుంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ కేంద్రం ఏజెంటైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వంపైకి మరింతగా ఉసిగొల్పే అవకాశం లేకపోలేదు. ఎల్జీ, సీఎం ఆధిపత్య పోరు ప్రక్షాళన నినాదంతో చీపురు చేతపట్టి రాజకీయ కదనరంగంలోకి దిగిన కేజ్రీవాల్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తర్వాత 2020లోనూ జయభేరి మోగించాడు. ఏడేళ్లుగా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నాడు. సీఎం అయిన మరుక్షణం నుంచే లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆయన పోరాటానికి తెర తీశాడు. నజీబ్‌జంగ్ నుంచి ప్రస్తుత వినయ్‌కుమార్ సక్సేనా దాకా ఎల్జీగా ఎవరున్నా ఆప్‌ను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పలు ఆప్ సంక్షేమ పథకాలను వారు అనుమతించకపోవడం చాలాసార్లు వివాదానికి దారితీసింది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాల అభివృద్ధి వంటి వినూత్న పథకాలను ఎల్జీ అనుమానపు చూపులు వెంటాడాయి. కొన్నింటిపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది! ఆప్ అగ్రనేతలే లక్ష్యంగా ఎల్జీ పావులు కదిపాడు కూడా. ఆప్ నేతలు కూడా ఎల్జీ అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ధర్నాలకూ దిగారు. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండొద్దని, మంత్రులను లెక్కచేయాల్సిన అవసరం లేదని అధికారులను ప్రోత్సహిస్తున్నాడంటూ ఆరోపించారు. ఎల్జీతో తప్పనిసరి భేటీలకు కూడా కేజ్రీవాల్ దూరంగా ఉన్న సందర్భాలెన్నో! ఎందుకింత వివాదమంటే... ఢిల్లీపై పెత్తనం సీఎందా, ఎల్జీదా అన్నదానిపై స్పష్టత లేకపోవడమే!! ఎల్జీదే పెత్తనమని ఢిల్లీ హైకోర్టు తీరి్పస్తే సుప్రీంకోర్టు దానితో విభేదించింది. ఎన్నికైన ప్రభుత్వం సూచనల మేరకే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. చివరికి కేంద్రం పార్లమెంటులో బిల్లు ద్వారా ఢిల్లీపై ఎల్జీ పెత్తనాన్ని ఖరారు చేసింది. ఈ పెత్తనాల వివాదం నేపథ్యమే ఎంసీడీ తాజా ఫలితాలను కీలకంగా మార్చేసింది! ఎంసీడీ... గేమ్ చేంజర్! రాష్ట్రాలకు సాధారణంగా ఉండే అధికారాలు ఢిల్లీకి పూర్తిగా దఖలు పడలేదు. కీలకమైన పోలీసు, భూ వ్యవహారాల వ్యవస్థ పూర్తిగా ఎల్జీ అ«దీనంలోనే ఉంటాయి. దేశ రాజధాని గనుక ఎయిమ్స్ వంటి పెద్దాసుపత్రులు, పెద్ద పార్కులు, ఢిల్లీ గుండా వెళ్లే హైవేలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ వంటివేమో కేంద్రం అ«దీనంలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కీలకమైనవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే ఉంటాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ చేసుకోలేదు. విద్యుత్, జలవనరులు, రవాణా వ్యవస్థతో పాటు ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలు, పార్కరులు, రోడ్ల వంటివి దాని చేతుల్లో ఉంటాయి. ఈ నామమాత్రపు అధికారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసీడీకి మాత్రం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉండే సాధారణ అధికారాలన్నీ ఉంటాయి. అదిప్పడు ఆప్ వశమవడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని అంశాలపైనా అధికారాలు కేజ్రీవాల్ సర్కారుకు దఖలు పడతాయి. ఆ లెక్కన కొన్ని అధికారాలు చేతులు మారతాయి. కీలకమైన బిజినెస్ లైసెన్సింగ్ కూడా ఎంసీడీ పరిధిలోనే ఉండటం ఆప్‌కు మరింత పై చేయినిస్తుంది. ఎంసీడీ ద్వారా వీలైనన్ని సంక్షేమ పథకాలను జనాలకు మరింత చేరువ చేసి ఇంకా ప్రజాదరణ పొందే అవకాశం ఆప్‌కు చిక్కుతుంది. ఎల్జీతో పోరాటం కొనసాగిస్తూనే ఢిల్లీపై పట్టు మరింత బిగించడానికి తాజా ఫలితాలు ఆప్‌కు ఉపయోగపడతాయి. కొసమెరుపు: ఎంసీడీ మేయర్ ఎన్నిక ఆప్, బీజేపీ బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా 12 మంది కౌన్సిలర్లను నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉంది. వారంతా బీజేపీకి చెందినవారే అయ్యే పక్షంలో ఆ పార్టీ బలం ఆ మేరకు పెరుగుతుంది. పైగా ఎమ్మెల్యేల మాదిరిగా కౌన్సిలర్లకు పార్టీ విప్ గానీ అనర్హత నిబంధన గానీ వర్తించవు. కనుక ఆప్‌తో పాటు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో బీజేపీ బేరసారాలాడటం ఖాయం. అదే జరిగితే మేయర్ ఎవరవుతారన్నది చివరిదాకా సస్పెన్సే. ఆ పరిస్థితుల్లో మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే! చేజిక్కించుకోలేకపోతే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది!! ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!
న్యూఢిల్లీ: హస్తినలో మరోసారి ‘ఆప్’సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దశాబద్దన్నరగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు షాక్ ఇచ్చింది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు. మహిళా మేయర్! ఢిల్లీ మహా నగర మేయర్ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు. మహిళను మేయర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘ఆప్’లో ఆనందం ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆప్’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్) బీజేపీకి తగిన గుణపాఠం ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి హస్తిన ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా మారుస్తామని హామీయిచ్చారు. -
బీజేపీ 15ఏళ్ల పాలనకు ‘ఆప్’ బ్రేకులు.. ఢిల్లీలో ఘన విజయం
దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ 15 ఏళ్ల జైత్రయాత్రకు బ్రేకులు వేసింది ఆప్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ విజయధుందుబి మోగించింది. మొత్తం 250 స్థానాలకు గానూ అవసరమైన మెజారిటీ 126 కాగా.. 134 సీట్లు సాధించింది. మరోవైపు.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 09 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 3 స్థానాలు గెలుపొందారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. ‘ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను కేజ్రీవాల్ కూకటివెళ్లతో పెకిలించారు. ఇప్పుడు ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించారు. విధ్వేషపూరిత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవటం లేదని ఈ ఎన్నికలు చెబుతున్నాయి. వారు పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశారు’ అని పేర్కొన్నారు పంజాబ్ సీఎం. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ మాదిరిగా మఫ్లర్, టోపీ ధరించిన చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. 1349 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. తర్వాత తిరిగి 2022లో వాటిని విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలుపొందగా.. ఆప్ 48, కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకున్నాయి. అప్డేట్ 12:55PM విజయం దిశగా ఆప్.. 106 స్థానాలు కైవసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం దిశగా ఆప్ దూసుకెళ్తోంది. ఇప్పటికే 106 స్థానాలు కైవసం చేసుకుంది. మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 126కు మంచి సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తు చేస్తున్నారు. అప్డేట్ 11:55AM ఢిల్లీ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. 250 వార్డులకు కౌంటింగ్ జరుగుతుండగా ఇప్పటి వరకు 75 స్థానాల్లో విజయం సాధించింది. మొదటి నుంచి హోరాహోరీ పోటీ కొనసాగినప్పటికీ బీజేపీ కాస్త వెనకబడింది. ప్రస్తుతం 55 స్థానాలను కైవసం చేసుకుంది కాషాయ పార్టీ. ఇంకా ఆప్ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 48 వార్డుల్లో ముందంజలో ఉంది. తొలి ట్రాన్స్‌జెండర్ ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శస్తోంది. మరోవైపు.. ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. #DelhiMCDPolls | AAP wins 75 seats and leads on 60, BJP wins 55 seats and leads on 48 seats as counting continues. Congress wins 4, leads on 5 and Independent candidates win 1 and lead on 2. Counting is underway for 250 wards. pic.twitter.com/XPLrBCq2Fz — ANI (@ANI) December 7, 2022 అప్డేట్ 10:25AM ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ, ఆప్ పార్టీలు తలో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు.. ఇరు పార్టీలు 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 12, స్వతంత్రులు 4, బీఎస్పీ, ఎన్సీపీలు ఒక్కోస్థానంలో ముందంజలో ఉన్నాయి. అప్డేట్ 10:00AM హోరాహోరీ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. నిమిష నిమిషానికి ఆధిక్యం తారుమారవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆప్ 109, బీజేపీ 105, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #DelhiMCDPolls | Latest official trends show AAP now leading on 109, BJP on 105 and Congress on 9 seats. Counting is underway for 250 wards. pic.twitter.com/OYguGITT03 — ANI (@ANI) December 7, 2022 న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 250 వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ప్రస్తుతం బీజేపీ 110, ఆప్ 100, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు.. తమ పార్టీ 180 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్. తమ పార్టీ నుంచే మేయర్ ఎన్నికవుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయని పేర్కొన్నారు. #DelhiMCDPolls | Latest official trends show BJP leading on 110 seats, AAP on 100, Congress on 9, Independent 3 & NCP on 1. Counting is underway for 250 wards. pic.twitter.com/UhoqKCjAS3 — ANI (@ANI) December 7, 2022 ఇదీ చదవండి: Delhi MCD Exit Poll 2022: టాప్‌లో ఆప్.. బీజేపీ మెరుగైన ప్రదర్శన.. మరి కాంగ్రెస్? -
కేజ్రీవాల్‌కు దిమ్మతిరిగే షాకులిస్తున్న బీజేపీ.. ఎన్నికలపై ఎఫెక్ట్ ఎంత?
ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయాలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పలు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వినూత్న ప్లాన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గుజరాతీలకు కీలక హామీలు సైతం ఇస్తున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై కూడా ఆప్ సర్కార్ ఫోకస్ పెంచింది. కానీ.. కేజ్రీవాల్‌కు అనుకోని రీతిలో కొన్ని షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్.. ఆప్ నేతలను టార్గెట్ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ డిఫెన్స్‌లో పడినట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేయడం, తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అధికారులు సపర్యలు చేయడం వంటి వీడియోలు బయటకు రావడంతో అనుకోని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆప్‌పై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. #WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail. Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM — ANI (@ANI) November 23, 2022 కాగా, ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆప్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రజల దృష్టికి ఇటీవల జరిగిన ఘటనలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇక, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. రోడ్ షోలు, ఢిల్లీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తాము ఢిల్లీలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్ గెలుపే టార్గెట్‌గా పౌర సమస్యలపై దృష్టిపెట్టింది. Delhi minister & AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. Tihar Jail is run by the Department of Delhi Prisons under the Government of Delhi. pic.twitter.com/xKjTay434L — Anshul Saxena (@AskAnshul) November 19, 2022 ఇదిలా ఉండగా.. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఇక, గుజరాత్లో ఎన్నికలపై పలు సర్వేలు సైతం ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆప్‌కు గుజరాత్లో మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్పుకొచ్చాయి. మరోవైపు.. గుజరాత్లో బీజేపీలో చేరిన పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పటేల్.. 2015లో పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానే కొనసాగింది. కానీ, ఇటీవల హార్దిక్.. కాషాయతీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై పాటిదార్లు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక, గుజరాత్‌లోని విర్మగం అసెంబ్లీ స్థానం నుంచి హార్దిక్ పటేల్ పోటీలో నిలిచారు. Good Days ahead for @HardikPatel_ 'Will slap him': Patidars upset with Hardik Patel for fighting on BJP tickethttps://t.co/EE4r2nuXdS — Sanjay Karan (@SanjayK53544321) November 23, 2022 -
ఆప్ జోరు : బీజేపీ బేజారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఈఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో విజయ సాధించింది. ఆదివారం జరిగిన ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆప్ నాలుగు, కాంగ్రెస్ ఒకస్థానంలో విజయం సాధించింది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక స్థానంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోగా, బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. తాజా ఫలితం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు వార్డుల ఓట్ల లెక్కంపు ఆరంభంనుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా విజయాన్ని తమఖాతాలో వేసుకున్నారు. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్‌పురి, త్రిలోక్‌పురి, రోహిణి-సీ వార్డులలో గెలుపొందారు. దీంతో ఆప్ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. చౌహాన్ బాంగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ ప్రజలు మరోసారి సుపరిపాలన కోసం ఓటు వేశారంటూ ట్వీట్ చేశారు. 15 ఏళ్ల నుంచి ఢిల్లీ కార్పోరేషన్లలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలు విసిగిపోయారని ఎంసిడిలలో ఆప్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారనివ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఓటు వేసి గెలిపించిన ఢిల్లీ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓటు శాతం ఇలా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ: 46.10శాతం భారతీయ జనతా పార్టీ: 27.29శాతం కాంగ్రెస్: 21.84శాతం బహుజన్ సమాజ్ పార్టీ: 2.50శాతం స్వతంత్రులు: 1.64శాతం నోటా: 0.63 శాతం గెలుపొందిన అభ్యర్థులు షాలీమార్ బాగ్ నార్త్ -సునీతా మిశ్రా కల్యాణ్‌పురి - ధిరేందర్ కుమార్ త్రిలోక్‌పురి ఈస్ట్ -విజయ్ కుమార్ రోహిణి-సీ - రామ్ చందర్ చౌహాన్ బాంగర్ - జుబేర్ అహ్మద్ చౌదరి కాంగ్రెస్ -
పార్టీ మారనని ప్రమాణం చేయండి!
న్యూఢిల్లీ: తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించిన 48మంది పార్టీ కౌన్సిలర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టి హితబోధ చేశారు. పార్టీ నుంచి కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించారు. నిజాయితీగా, ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ మారాలని బీజేపీ ఆఫర్ ఇవ్వొచ్చునని, రూ. 10 కోట్ల వరకు కూడా ఇచ్చేందుకు ముందుకురావొచ్చునని, ఒకవేళ బీజేపీ ఇలా లంచం ఇవ్వజూపితే.. దానిని రహస్యంగా చిత్రీకరించాలని ఆయన కౌన్సిలర్లకు తెలిపారు. తన హితబోధ ముగిసిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని కొత్త కౌన్సిలర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో గెలిచిన పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారకుండా కాపాడుకునే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. ఈ మేరకు పదినిమిషాల వీడియోను ఆయన యూట్యూబ్‌లో పోస్టు చేశారు. -
‘నా రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చేశా’
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సంజయ్ సింగ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో నేత, పంజాబ్ పార్టీ పరిశీలకుడిగా పనిచేస్తున్న దుర్గేశ్ పాఠక్ కూడా తన రాజీనామా లేక సమర్పించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. ‘నేను నా రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇచ్చేశాను. నాతో పాటు మరో నేత కూడా చేశారు’ అని ఆయన చెప్పారు. గురువారం ఉదయమే తాను రాజీనామా లేఖ కేజ్రీవాల్‌కు అందజేసినట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పార్టీకి విజయాన్ని కట్టబెట్టడంలో కూడా సంజయ్ సింగ్ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. -
మా ప్రచారం సరిగా లేదు: మాజీ సీఎం
దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోడానికి కావల్సినంత ఉధృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం లేదని మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ అన్నారు. ఓటర్ల తీర్పును ఆమె స్వాగతించారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అనుకున్నామని, అయితే ప్రజలకు మాత్రం వాళ్ల సొంత మూడ్ ఉందని ఆమె చెప్పారు. ఈసారి పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేయలేదని అడగ్గా.. తనను ప్రచారం చేయమని ఎవరూ అడగలేదని, అడిగితే తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేదాన్నని ఆమె అన్నారు. ఓటమికి కారణాలేంటో తెలుసుకోడానికి ఫలితాలను పార్టీ అధిష్ఠానం సమీక్షించుకుంటుందని తెలిపారు. ఓటమికి ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్దే బాధ్యత అంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే సమీక్ష తప్పనిసరిగా జరగాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను గురించి అడిగిగే.. ఓడిన వాళ్లు ఎప్పుడూ ఈవీఎంలను తప్పుపడతారని, విజేతలు అలా చేయరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చవిచూస్తున్నా.. మళ్లీ తిరిగి గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కూడా చాలా దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. -
హస్తిన కోటలో బీజేపీ హ్యాట్రిక్
-
హస్తిన కోటలో బీజేపీ హ్యాట్రిక్
దేశ రాజధాని ఢిల్లీపై తన పట్టును బీజేపీ మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే రెండు కార్పొరేషన్లలో విజయానికి కావల్సిన మేజిక్ ఫిగర్ సాధించిన బీజేపీ.. మరింత ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఉత్తర ఢిల్లీలో కూడా ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. మొత్తం 272 స్థానాలకు గాను 270 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, ఇప్పటికే బీజేపీ 134 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 51 చోట్ల ముందంజలో ఉంది. ముందునుంచి 180 వార్డులలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. దాంతో ఆ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం.... ఉత్తర ఢిల్లీలో మొత్తం 103 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ 44 చోట్ల గెలిచి, మరో 23 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 12 చోట్ల గెలిచి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 8 చోట్ల గెలిచి మరో 5 స్థానాల్లో ముందంజలో నిలిచింది. ఇతరులు ఒకచోట గెలిచి రెండు చోట్ల ముందున్నారు. దక్షిణ ఢిల్లీలో మొత్తం 104 స్థానాలకు గాను బీజేపీ 53 చోట్ల గెలిచి 17 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 13 చోట్ల గెలిచి 4 స్థానాల్లో ముందుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించి, 2 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచి 2 చోట్ల ముందున్నారు. తూర్పు ఢిల్లీలో 64 స్థానాలకు గాను 63 చోట్ల ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ 37 చోట్ల గెలిచి 12 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 8 చోట్ల గెలిచి ఒకచోట ముందుంది. కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకుని మరో రెండు చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు ఒకచోట గెలిచారు. -
ప్రతీకారం తీర్చుకున్నారు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉంది. ఈలోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసుకెళ్తోంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా, 185 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా కార్పొరేషన్లను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికలు.. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు రాగా ఆప్‌కు 28 వచ్చాయి. అయితే కాంగ్రెస్ (8) మద్దతుతో ఆప్ అధికారాన్ని చేపట్టింది. అప్పట్లో బీజేపీకి 33%, ఆప్‌కు 29.5%, కాంగ్రెస్‌కు 24.5% చొప్పున ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో కలిసేది లేదన్న కేజ్రీవాల్.. ఆ పార్టీతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. కేవలం 49 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. జన లోక్‌పాల్ బిల్లు విషయంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు.. 49 రోజుల పాటు రాజధానిని పాలించిన తానే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థినని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. దాంతో వారణాసిలో నేరుగా మోదీతో ఢీకొన్నారు. ఆ ఎన్నికల్లో కేవలం మోదీ చేతుల్లో ఓడిపోవడమే కాదు.. వారణాసిలో ఆయన ఐదో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. మొత్తం 543 స్థానాలకు పోటీ చేసిన ఆప్.. కేవలం 4 చోట్లే గెలిచింది. ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. దాంతో తాను ఢిల్లీకే పరిమితం అయితే మంచిదని కేజ్రీవాల్‌కు తెలిసింది. 2015 అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ తన బలమేంటో నిరూపించుకున్నారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 67 స్థానాలు గెలుచుకున్నారు. ఆయనకు 54% ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 33% ఓట్లతో మూడు స్థానాలే గెలిచింది. 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఓట్లే తగ్గినా, 28 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ కనీసం ఒక్కచోట కూడా గెలవలేదు. 2017 ఎంసీడీ ఎన్నికలు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తినడానికి ముందే కేజ్రీవాల్‌కు పంజాబ్, గోవా ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ను జాతీయ పార్టీ చేయాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఎంసీడీ ఎన్నికల ఫలితాలతో ఇక ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రెండో స్థానం వచ్చినా కూడా మొత్తం 272 స్థానాలున్న ఎంసీడీలో కేవలం 40కి కాస్త అటూ ఇటూగానే ఆప్ పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో కార్పొరేషన్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలే సాధించినట్లవుతుంది. దాదాపు 40కి అటూ ఇటూగానే కాంగ్రెస్ కూడా ఉంది. 2019 లోక్‌సభ.. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఇప్పుడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. ఇక 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, 2020లో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - ఆప్ తలపడాల్సి ఉంటుంది. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో, ఎవరు ఏ స్థానంలో ఉంటారో చూడాల్సి ఉంటుంది. అయితే తాము ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎంల మీదకు నెపం నెట్టేయడాన్ని మాత్రం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు మానుకుంటే మంచిది. -
ఎంసీడీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 272 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలైంది. 2012లో ఎంసీడీని ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. ఎంసీడీ ఎన్నికల్లో కోటి 30 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2500 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. ఎంసీడీ ఎన్నికల్లో తొలిసారి ఓటర్లకు నోటా అవకాశాన్ని కల్పించారు. గత పదేళ్లుగా ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఈ రోజు ఉదయమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఢిల్లీవాసుల తీర్పును ఊహించలేం...
న్యూఢిల్లీ: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడుతున్నారు. ఢిల్లీవాసుల ఓటు ఎవరికి పడుతుందో ఊహించడం కష్టమని, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయనే విషయాన్ని 1993,2013, 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని వారు అంటున్నారు. ఈ మూడు ఎన్నికలలోనూ ఢిల్లీవాసులు ట్రెండ్‌కు భిన్నంగా ఓటేసినట్లు వారు చెబుతున్నారు. 16 నెలలకోసారి ఓటు... 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పాటైనప్పటి నుంచి ఢిల్లీలో ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఆరు ఎన్నికలు, ఆరు లోక్షబ ఎన్నికలు, నాలుగు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రతి 16 నెలలకోసారి నగరవాసులు ఓటేశారు. బాబీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో ఢిల్లీవాసులు బీజేపీకి పట్టం కట్టారు. మదన్‌లాల్ ఖురానా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆకాశాన్నింటిన ఉల్లిధరల నేపథ్యంలో కాంగ్రెస్‌కు అనూహ్య విజయం లభించింది. 2003, 2008 ఎన్నికల్లో రెండుసార్లు షీలా దీక్షిత్‌కి పట్టం కట్టారు.అలాగే 2013 అసెంబ్లీ ఎన్నికలకలో ఏడాది కింద ఏర్పాటు అయిన ఆప్ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాల్లో 28 సీట్లు ఇచ్చారు. వరుసగా మూడసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 8 సీట్లు మాత్రమే లభించాయి. 2015 ఎన్నికలలో ఢిల్లీవాసులు కాంగ్రెస్ కు మొండిచేయి చూపించారు. బీజేపీకి మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఆప్ కు 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు అప్పగించారు. 1996, 1998,1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసిన స్థానికులు ఆ తర్వాత రెండు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఏడింటిలో ఆరు ఎంపీ సీట్లు దక్కగా, 2009 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూర్తి విరుద్ధమైన తీర్పు ఇస్తూ ఏడు సీట్లు బీజేపీకి కట్టబెట్టారు. కాంగ్రెస 1... బీజేపీ...3... 1997 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీవాసులు అనంతరం మూడు ఎమ్సీడీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. 2012లో ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీవాసులు ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీకే అధికారం ఇచ్చారు. -
‘పార్టీకోసం ఏళ్ల తరబడి పనిచేశా.. విలువలేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎంతో కాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్‌కు షాకిచ్చినట్లయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని, సీట్లను డబ్బులకు అమ్ముకున్నారని వాలియా ఆరోపణలు చేశారు. పార్టీలోని వారికి కాకుండా బయటి వారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. ‘నేను చాలా బాధతో ఉన్నాను. నేను పార్టీకోసం ఏళ్ల తరబడి అలుపులేకుండా చేశాను. ఇప్పుడు నా మాట ఎవరూ వినలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన పలు శాఖలకు బాధ్యతలు వహించారు. వృత్తిపరంగా వైద్యుడైన ఆయన తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ నియోజకవర్గం నుంచి బాధ్యతలు వహించారు.