‘పార్టీకోసం ఏళ్ల తరబడి పనిచేశా.. విలువలేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎంతో కాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్‌కు షాకిచ్చినట్లయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని, సీట్లను డబ్బులకు అమ్ముకున్నారని వాలియా ఆరోపణలు చేశారు.
పార్టీలోని వారికి కాకుండా బయటి వారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. ‘నేను చాలా బాధతో ఉన్నాను. నేను పార్టీకోసం ఏళ్ల తరబడి అలుపులేకుండా చేశాను. ఇప్పుడు నా మాట ఎవరూ వినలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన పలు శాఖలకు బాధ్యతలు వహించారు. వృత్తిపరంగా వైద్యుడైన ఆయన తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ నియోజకవర్గం నుంచి బాధ్యతలు వహించారు.