ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సంబరాలు
న్యూఢిల్లీ: హస్తినలో మరోసారి ‘ఆప్’సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దశాబద్దన్నరగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు షాక్ ఇచ్చింది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు.
మహిళా మేయర్!
ఢిల్లీ మహా నగర మేయర్ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు. మహిళను మేయర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
‘ఆప్’లో ఆనందం
ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆప్’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్)
బీజేపీకి తగిన గుణపాఠం
ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి హస్తిన ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా మారుస్తామని హామీయిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment