![BJP Eyes Delhi MCD Control After Assembly Win](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/MCD.jpg.webp?itok=oVc8XQdv)
ఢిల్లీ మేయర్ పదవిపై బీజేపీ గురి ∙త్వరలో అవిశ్వాసం?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందంటూ వారు చేసిన ప్రచారం ప్రజలపై బాగానే ప్రభావం చూపింది.
దాంతో ఇప్పుడిక ఢిల్లీలో ఏకంగా ట్రిపుల్ ఇంజన్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక రెండు నెలల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే దేశ రాజధానిలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరినట్లే. కేంద్రంలో, రాష్ట్రంలో, కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిపత్యం సుస్థిరమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇక ఎంసీడీ మేయర్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది.
పుంజుకున్న కమలం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 250 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీరిని ప్రజలు నేరుగా ఓట్లేసి ఎన్నుకుంటారు. ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఎంసీడీ పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కుంది. ఎంసీడీలో బీజేపీకి ప్రస్తుతం 120 మంది, ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు, ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. బీజేపీ కౌన్సిలర్ కమల్జీత్ షెరావత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. అలా ఎంసీడీలో 12 కౌన్సిలర్ స్థానాలు ఖాళీ అయ్యాయి.
వాటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంసీడీలో తాజాగా బీజేపీ బలం 112, ఆప్ బలం 119గా ఉన్నాయి. 2024 నవంబర్‌లో మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్ అభ్యర్థి మహేశ్ కిచీ మేయర్‌గా ఎన్నికయ్యారు. పోలైన 263 ఓట్లలో కిచీకి 133, బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్‌కు 130 ఓట్లు లభించాయి. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది. మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కున్న 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. మేయర్ పదవిని సులభంగా దక్కించుకోగలదు. కనుక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. తర్వాత మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment