ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్! పదిహేనేళ్ల బీజేపీ అధికారాన్ని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీపురుతో ఊడ్చేసింది. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు, ఓ చిన్న రాష్ట్రం కూడా. అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన పార్టీ నేత సీఎం అవుతాడు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలకున్న అధికారాల్లో కొన్ని ఢిల్లీ సీఎంకు ఉండవు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విశేషాధికారాలు అనివార్యంగా దఖలు పడతాయి. దేశ పాలనకు, విదేశాంగ కార్యకలాపాలకు రాజధాని కీలకం గనుక ఇలా కొన్ని విషయాల్లో కేంద్రం మాట, లేదా అధికారం చెల్లుబాటవడం అనివార్యం, ఆమోదనీయం కూడా. కేంద్రంలో, ఢిల్లీలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ పనితీరుకు ఆస్కారముంటుంది. ఏ విషయంలోనూ సమస్యకు చాన్సుండదు. చిక్కల్లా అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలో ఉంటేనే! ఇది ఒక్కోసారి రాజ్యాంగ సంక్షోభానికీ దారి తీస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఆప్‌కూ కేంద్రంలో అధికారం చలాయిస్తున్న మోదీ బీజేపీకీ మధ్య ప్రస్తుతం జరుగుతున్నదదే! ఎంసీడీపై పట్టు బిగించడంతో కేజ్రీవాల్ ఇక మరిన్ని అధికారాల కోసం కేంద్రంపై మరింత దూకుడుగా పోరాడే అవకాశముంటుంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ కేంద్రం ఏజెంటైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వంపైకి మరింతగా ఉసిగొల్పే అవకాశం లేకపోలేదు.
ఎల్జీ, సీఎం ఆధిపత్య పోరు
ప్రక్షాళన నినాదంతో చీపురు చేతపట్టి రాజకీయ కదనరంగంలోకి దిగిన కేజ్రీవాల్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తర్వాత 2020లోనూ జయభేరి మోగించాడు. ఏడేళ్లుగా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నాడు. సీఎం అయిన మరుక్షణం నుంచే లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆయన పోరాటానికి తెర తీశాడు. నజీబ్‌జంగ్ నుంచి ప్రస్తుత వినయ్‌కుమార్ సక్సేనా దాకా ఎల్జీగా ఎవరున్నా ఆప్‌ను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పలు ఆప్ సంక్షేమ పథకాలను వారు అనుమతించకపోవడం చాలాసార్లు వివాదానికి దారితీసింది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాల అభివృద్ధి వంటి వినూత్న పథకాలను ఎల్జీ అనుమానపు చూపులు వెంటాడాయి. కొన్నింటిపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది! ఆప్ అగ్రనేతలే లక్ష్యంగా ఎల్జీ పావులు కదిపాడు కూడా. ఆప్ నేతలు కూడా ఎల్జీ అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ధర్నాలకూ దిగారు. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండొద్దని, మంత్రులను లెక్కచేయాల్సిన అవసరం లేదని అధికారులను ప్రోత్సహిస్తున్నాడంటూ ఆరోపించారు. ఎల్జీతో తప్పనిసరి భేటీలకు కూడా కేజ్రీవాల్ దూరంగా ఉన్న సందర్భాలెన్నో! ఎందుకింత వివాదమంటే... ఢిల్లీపై పెత్తనం సీఎందా, ఎల్జీదా అన్నదానిపై స్పష్టత లేకపోవడమే!! ఎల్జీదే పెత్తనమని ఢిల్లీ హైకోర్టు తీరి్పస్తే సుప్రీంకోర్టు దానితో విభేదించింది. ఎన్నికైన ప్రభుత్వం సూచనల మేరకే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. చివరికి కేంద్రం పార్లమెంటులో బిల్లు ద్వారా ఢిల్లీపై ఎల్జీ పెత్తనాన్ని ఖరారు చేసింది. ఈ పెత్తనాల వివాదం నేపథ్యమే ఎంసీడీ తాజా ఫలితాలను కీలకంగా మార్చేసింది!
ఎంసీడీ... గేమ్ చేంజర్!
రాష్ట్రాలకు సాధారణంగా ఉండే అధికారాలు ఢిల్లీకి పూర్తిగా దఖలు పడలేదు. కీలకమైన పోలీసు, భూ వ్యవహారాల వ్యవస్థ పూర్తిగా ఎల్జీ అ«దీనంలోనే ఉంటాయి. దేశ రాజధాని గనుక ఎయిమ్స్ వంటి పెద్దాసుపత్రులు, పెద్ద పార్కులు, ఢిల్లీ గుండా వెళ్లే హైవేలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ వంటివేమో కేంద్రం అ«దీనంలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కీలకమైనవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే ఉంటాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ చేసుకోలేదు. విద్యుత్, జలవనరులు, రవాణా వ్యవస్థతో పాటు ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలు, పార్కరులు, రోడ్ల వంటివి దాని చేతుల్లో ఉంటాయి. ఈ నామమాత్రపు అధికారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసీడీకి మాత్రం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉండే సాధారణ అధికారాలన్నీ ఉంటాయి. అదిప్పడు ఆప్ వశమవడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని అంశాలపైనా అధికారాలు కేజ్రీవాల్ సర్కారుకు దఖలు పడతాయి. ఆ లెక్కన కొన్ని అధికారాలు చేతులు మారతాయి. కీలకమైన బిజినెస్ లైసెన్సింగ్ కూడా ఎంసీడీ పరిధిలోనే ఉండటం ఆప్‌కు మరింత పై చేయినిస్తుంది. ఎంసీడీ ద్వారా వీలైనన్ని సంక్షేమ పథకాలను జనాలకు మరింత చేరువ చేసి ఇంకా ప్రజాదరణ పొందే అవకాశం ఆప్‌కు చిక్కుతుంది. ఎల్జీతో పోరాటం కొనసాగిస్తూనే ఢిల్లీపై పట్టు మరింత బిగించడానికి తాజా ఫలితాలు ఆప్‌కు ఉపయోగపడతాయి.
కొసమెరుపు: ఎంసీడీ మేయర్ ఎన్నిక ఆప్, బీజేపీ బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా 12 మంది కౌన్సిలర్లను నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉంది. వారంతా బీజేపీకి చెందినవారే అయ్యే పక్షంలో ఆ పార్టీ బలం ఆ మేరకు పెరుగుతుంది. పైగా ఎమ్మెల్యేల మాదిరిగా కౌన్సిలర్లకు పార్టీ విప్ గానీ అనర్హత నిబంధన గానీ వర్తించవు. కనుక ఆప్‌తో పాటు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో బీజేపీ బేరసారాలాడటం ఖాయం. అదే జరిగితే మేయర్ ఎవరవుతారన్నది చివరిదాకా సస్పెన్సే. ఆ పరిస్థితుల్లో మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే! చేజిక్కించుకోలేకపోతే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది!!
ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా
Comments
Please login to add a commentAdd a comment