హస్తిన కోటలో బీజేపీ హ్యాట్రిక్
దేశ రాజధాని ఢిల్లీపై తన పట్టును బీజేపీ మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే రెండు కార్పొరేషన్లలో విజయానికి కావల్సిన మేజిక్ ఫిగర్ సాధించిన బీజేపీ.. మరింత ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఉత్తర ఢిల్లీలో కూడా ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. మొత్తం 272 స్థానాలకు గాను 270 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, ఇప్పటికే బీజేపీ 134 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 51 చోట్ల ముందంజలో ఉంది. ముందునుంచి 180 వార్డులలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. దాంతో ఆ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం.... ఉత్తర ఢిల్లీలో మొత్తం 103 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ 44 చోట్ల గెలిచి, మరో 23 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 12 చోట్ల గెలిచి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 8 చోట్ల గెలిచి మరో 5 స్థానాల్లో ముందంజలో నిలిచింది. ఇతరులు ఒకచోట గెలిచి రెండు చోట్ల ముందున్నారు. దక్షిణ ఢిల్లీలో మొత్తం 104 స్థానాలకు గాను బీజేపీ 53 చోట్ల గెలిచి 17 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 13 చోట్ల గెలిచి 4 స్థానాల్లో ముందుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించి, 2 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచి 2 చోట్ల ముందున్నారు. తూర్పు ఢిల్లీలో 64 స్థానాలకు గాను 63 చోట్ల ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ 37 చోట్ల గెలిచి 12 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 8 చోట్ల గెలిచి ఒకచోట ముందుంది. కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకుని మరో రెండు చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు ఒకచోట గెలిచారు.