మా ప్రచారం సరిగా లేదు: మాజీ సీఎం
దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోడానికి కావల్సినంత ఉధృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం లేదని మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ అన్నారు. ఓటర్ల తీర్పును ఆమె స్వాగతించారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అనుకున్నామని, అయితే ప్రజలకు మాత్రం వాళ్ల సొంత మూడ్ ఉందని ఆమె చెప్పారు. ఈసారి పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేయలేదని అడగ్గా.. తనను ప్రచారం చేయమని ఎవరూ అడగలేదని, అడిగితే తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేదాన్నని ఆమె అన్నారు. ఓటమికి కారణాలేంటో తెలుసుకోడానికి ఫలితాలను పార్టీ అధిష్ఠానం సమీక్షించుకుంటుందని తెలిపారు.
ఓటమికి ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్‌దే బాధ్యత అంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే సమీక్ష తప్పనిసరిగా జరగాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను గురించి అడిగిగే.. ఓడిన వాళ్లు ఎప్పుడూ ఈవీఎంలను తప్పుపడతారని, విజేతలు అలా చేయరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చవిచూస్తున్నా.. మళ్లీ తిరిగి గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కూడా చాలా దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.