‘ఢిల్లీ’ కొత్త గాలికి సంకేతమా? | close Fight between BJP and AAP in Delhi assembly elections | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీ’ కొత్త గాలికి సంకేతమా?

Published Fri, Feb 6 2015 12:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘ఢిల్లీ’ కొత్త గాలికి సంకేతమా? - Sakshi

‘ఢిల్లీ’ కొత్త గాలికి సంకేతమా?

వరుస విజయాలతో అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి, ఏడాదిన్నర క్రితం ఆవిర్భవించిన ఆప్‌కు మధ్య సాగుతున్న ఎన్నికల సమరమిది. ఢిల్లీలో స్థిరంగా ప్రభుత్వం నడిపిన ఏ పార్టీ అయినా, దేశ రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదుగుతుందనేది చరిత్ర చెప్పే సత్యం. ఆప్‌లాంటి సంప్రదాయేతర పార్టీ ఢిల్లీలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచి, మనగలిగే పరిస్థితిని ఢిల్లీ ఓటరు కల్పిస్తే, పార్టీలతో నిమిత్తం లేకుండా భారత భవిష్యత్తు రాజకీయాల్లో రాగల పరిణామాల్ని మనం అంచనా వేయొచ్చు! ఓటర్ల నుంచి ‘ఢిల్లీ బహుత్ దూర్ నహీ’ అనగల తీర్పు వస్తుందా?
 
 చేరాల్సిన గమ్యం, మరోమాటలో... సాధించాల్సిన లక్ష్యం ఇంకా దూరంగా ఉన్నపుడు ‘‘ఢిల్లీ బహుత్ దూర్ హై’’ (ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది) అనడం రివాజు. ఢిల్లీ ఎన్నికల సమరంలో ఇప్పుడీ మాట వర్తించేది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనేమో! దాని పరిస్థితి పోలింగ్‌కు ముందే పోటీ నుంచి వైదొలగినట్టుంది. కాగా, నువ్వా? నేనా? అన్నట్టు పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు లక్ష్యానికి సమీపంగా ఉన్నాయి. ఎవరు లక్ష్యాన్ని ఛేదిస్తారన్నదే వేచి చూడాల్సింది. మొన్నీ మధ్య దాకా బీజేపీదే పైచేయి అని ప్రచారం జరగ్గా, పోలింగ్‌కు సరిగ్గా వారం ముందు అనూహ్యంగా ఆప్ గ్రాఫ్ పైకొచ్చేసింది. అది కడదాకా కొనసాగేనా? అన్నది కోటి రూకల ప్రశ్న! అయితే, బీజేపీ కన్నా, ‘ఆప్’ కన్నా రేపు, శనివారం నాటి అసలు పరీక్ష ఢిల్లీ ఓటర్లకు. వారు ఎవర్ని గెలిపించి, గద్దెనెక్కించి దేశ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారుతారన్నదే సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ ఎన్నికలు ఇంతగా ప్రాధాన్యతను సంతరించుకోడానికి కారణం, అవి సంప్రదాయ రాజకీయాల స్థానే, ఆధునిక రాజకీయ వ్యవస్థను ప్రతిష్ఠించే ఊపులో ఉండటమేనని నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ తమ వైఖరికి భిన్నంగా కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితు ల్లోకి ఆప్ దానిని నెట్టేయగలగడం వంటి ఇటీవలి పరిణామాలు అందుకు నిదర్శనం. కేంద్రంలో అధికారంలో ఉండి, వరుస విజయాలతో అప్రతిహ తంగా సాగుతున్న బీజేపీకి, ఏడాదిన్నర క్రితం ఆవిర్భవించిన ఆప్‌కు మధ్య సాగుతున్న ఎన్నికల సమరమిది. మరుగుజ్జు లాంటి ఢిల్లీ రాష్ట్రంలో స్థిరంగా ప్రభుత్వం నడిపిన ఏ పార్టీ అయినా, దేశ రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదుగుతుందనేది చరిత్ర చెప్పే సత్యం. ఆప్‌లాంటి సంప్రదాయేతర రాజ కీయ పార్టీ ఢిల్లీలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచి, మనగలిగే పరిస్థితిని ఢిల్లీ ఓటరు కల్పిస్తే, పార్టీలతో నిమిత్తం లేకుండా భారత భవిష్యత్తు రాజకీయాల్లో రాగల పరిణామాల్ని మనం అంచనా వేయొచ్చు!
 
 విధానాల చుట్టూ అనేక మలుపులు
 
 అవినీతి గురించి అన్ని పార్టీలూ గట్టిగానే మాట్లాడతాయి. అవినీతి అంతం చేస్తామంటూ బహిరంగ సభల్లో బడా నేతలూ ఘనంగా ప్రకటిస్తారు. కానీ ఆయా పార్టీల గత చరిత్రను ఎరిగిన ప్రజలు ఆ మాటలను పెద్దగా పట్టించుకోరు. జన్ లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు సాగుతున్న సమయంలో.. ‘‘దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలంటూ’’ రాజకీయ పార్టీలన్నీ విసిరిన సవాళ్లను ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్వీకరించారు. ఫలితంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పేరిట కొత్త పార్టీ వచ్చింది. తక్కువ సమయంలోనే ఎన్నికల్లో పోరాడింది. మెజారిటీ సాధించ లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధా రణంగా ప్రతి చిన్న విషయానికీ ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండు చేస్తుంటాయి. కానీ అధికార పక్షం స్పందించే సందర్భాలు ప్రస్తుత రాజకీయాల్లో అరుదే. కానీ జన్ లోక్‌పాల్ బిల్లుకు కేంద్రం మద్దతు కోరుతూ పార్లమెంట్ ముందు ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ధర్నాకు దిగడమే సంచలనమైతే, కేంద్రం సహకరించనందుకు, మద్దతిచ్చిన కాంగ్రెస్ తోడు నిలువనందుకు రాజీనామా చేయడం కూడా అంతే సంచలనమైంది. అయితే ఆయన ఆశించిన దానికి భిన్నంగా ప్రజలు స్పందించారు. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి కేజ్రీవాల్ పారి పోయారని విమర్శలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆప్ పని అయిపోయినట్లే నని అం దరూ అనుకున్నారు. ఆ తర్వాత నరేంద్రమోదీ ఇమేజ్ ముందు కేజ్రీవాల్ వెల వెలపోయారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెప్పాయి. ఢిల్లీ ప్రస్తుత ఎన్ని కల్లో కూడా కేజ్రీవాల్ ప్రభావం పెద్దగా ఉండదని, బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ, వేగంగా పరిస్థితులు మారాయి. సంప్రదాయ రాజ కీయాలతో కేజ్రీవాల్‌ను ఢీకొట్టడం సాధ్యం కాదని ఎన్నికల వేడి మొదలైన వెంటనే బీజేపీ పెద్దలకు అర్థమైంది. అందుకే రాజకీయాలతో సంబంధమే లేని... ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర పైకి తీసుకొచ్చారు. స్వచ్ఛమైన రాజకీయాలతోనే ఢిల్లీ ఎన్నికల్లో నెట్టుకురాగల మని భావించడం వల్లే ఆమెను రంగంలోకి దించారు. కానీ, ఇక్కడో మెలిక ఉంది. రాజీనామా చేయడం తప్పేనని అంగీకరించడంతో కేజ్రీవాల్‌కు ‘పరివర్తన’ (ఇదివరకు ఆయన నడిపిన స్వచ్ఛంద సంస్థ) చెందిన నేతగా మార్కులు పెరిగాయి. తన సహజ వైఖరికి భిన్నంగా కిరణ్‌బేడీని తెచ్చి, ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి బీజేపీ మార్కులు తగ్గాయి. ఆశించిన ‘అచ్ఛాదిన్’ కనిపించకపోవడంతో, ఈ ఆరేడు మాసాల మోదీ ప్రభుత్వాన్ని, జనహిత నిర్ణయాలతో పనిచేసిన 49 రోజుల కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ సగటు పౌరులు పోల్చుకుంటున్నారు. ఆప్ విధా నాల్ని కాక కేజ్రీవాల్‌ను లక్ష్యం చేసుకొని బీజేపీ సాగిస్తున్న విమర్శలు దానికే నష్టాన్ని కలిగించి, ఆయనకు లాభాన్ని చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది.
 
 కొత్తగాలితో మారిన ముఖచిత్రం
 
 రెండు దశాబ్దాల క్రితం వరకు ఢిల్లీ ఎన్నికలు స్థానిక రాజకీయాలకు సంబం ధించినవే. జుగ్గీజోపిడీలు(మురికివాడలు), స్థానికులు ఎక్కువగా నివసించే కాలనీల్లోనే ఎన్నికల హంగామా కనిపించేది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మదన్‌లాల్ ఖురానా తొలి ముఖ్య మంత్రి అయ్యారు. రెండేళ్ల తర్వాత.. ఖురానా స్థానంలో సాహిబ్‌సింగ్‌వర్మను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికలు సమీపిస్తుండగా ఉల్లి ధర మండి సామాన్యుడి చేత కంటతడి పెట్టించినప్పుడు.. గెలుపుపై విశ్వాసం కోల్పో యిన ఆ పార్టీ వర్మ స్థానంలో సుష్మాస్వరాజ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. నాటి ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలు షీలాదీక్షిత్‌కు దీటైన అభ్యర్థి సుష్మా అని అప్ప ట్లో బీజేపీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని లేదా బీజేపీ ఓట మిని సుష్మా నిలువరించలేకపోయారు. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్ని కల్లో బీజేపీ పరాభవం పాలైంది. 15 ఏళ్ల షీలాదీక్షిత్ పాలన పట్ల ప్రజలకు ముఖం మొత్తడం, కామన్‌వెల్త్ క్రీడల్లో అంతులేని అవినీతి, విద్యుత్ సరఫరా వ్యవస్థ మీద ప్రైవేటు కంపెనీల పెత్తనం, నల్లా ఛార్జీల పెంపు తదితర కారణా లతో ఆమె పాలన మీద ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. దేశాన్ని కుదిపే సిన ‘నిర్భయ’ ఉదంతం.. ఇంగ్లిష్‌లో అనేట్టు శవపేటికపై ఆఖరి మేకయింది. షీలాదీక్షిత్ అధికారంలో ఉన్న ఆ 15 ఏళ్లలో ఢిల్లీ ముఖచిత్రం మారిపోయింది. మెరుగైన రోడ్లు, మెట్రోరైలు, మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను ఏర్పాటు చేసి, పాల నలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడానికి షీలా ప్రభుత్వం చేప ట్టిన ‘భాగిదారి’ కార్యక్రమం.. ఢిల్లీలోని అన్ని వర్గాలను స్థానిక రాజకీయాల్లో మమేకం చేసింది. విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు పార్లమెంట్ ఎన్నికల పట్ల మాత్రమే ఆసక్తిని చూపే తీరు మారి.. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లోనూ పాల్గొనడం ప్రారంభించారు. కేజ్రీవాల్ వచ్చి దాన్ని శీర్షస్థితికి తీసు కువెళ్లారు. సెంట్రల్ ఢిల్లీతో పాటు మొత్తం దాదాపు 50 నియోజకవ ర్గాల్లో విద్యావంతుల ప్రభావం అధికం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి మొదలు అత్యున్నత స్థానాల్లో ఉన్న పలువురు ఢిల్లీ ఓటర్లు కావడం గమనార్హం. ఉన్నత, మధ్యతరగతి ఓటర్లలో కూడా శాసనసభ ఎన్నికల పట్ల ఆసక్తి పెరగడంతో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. 1998లో 48.99 శాతం, 2003లో 53.42 శాతం, 2008లో 57.58 శాతం, 2013లో 65.63 ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ 65-68 మధ్య ఓటింగ్ శాతం నమోదు కావచ్చని అంచనా. నిజానికి ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుగుదల సంకేతాలే! సంప్రదాయ రాజకీయ శక్తుల బండారం బయటపడటం, ఆధునిక రాజకీయ వ్యవస్థ బాలారిష్టాల్ని అధిగమించడం నిన్నా, ఇవాల్టి ఢిల్లీ ఎన్నికల కొత్తగాలి.
 
 మినీ ఇండియా తేల్చేదేమిటి?
 
 ఢిల్లీ విచిత్రమైన నగరం. దేశంలోని మరే మెట్రో నగరంలో లేనంతగా, ‘నాకేంటి?’ అనే వ్యక్తిగత చింతన ఢిల్లీ ప్రజలది. అంతర్జాతీయ దౌత్యవిధా నాలో, దేశానికి ఊతమిచ్చే ఆర్థిక-పారిశ్రామిక విధానాలో, ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లజేసే పాలనా సంస్కరణలో వారిని పెద్దగా ప్రభావితం చేయవు. ఉద్యోగ, వ్యాపార వర్గాలే అత్యధిక జనాభాగా ఉండే ఢిల్లీ పౌరుల్ని స్థానిక పాలన, భద్రత, పౌర సదుపాయాలు, ఆర్థికావకాశాల కల్పన, నిత్యావసరాల ధరల్ని నియంత్రించడం వంటివే ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. ఢిల్లీలో దక్షి ణాది ఓటర్లు 10 శాతానికిపైగా ఉంటారని అంచనా. తమిళ, మలయాళీల తర్వాత స్థానం తెలుగువాళ్లదే. కన్నడిగులూ ఉంటారు. దక్షిణాది ప్రజల తర్వాత బెంగాలీయుల సంఖ్య ఎక్కువ. దేశ రాజధానిని బ్రిటిష్ ప్రభుత్వం కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు.. ఉద్యోగులంతా అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. ఢిల్లీ గతంలో పంజాబ్ ప్రావిన్స్‌లో భాగం కాబట్టి పంజా బీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ప్రభావం ఢిల్లీ రాజకీయాల మీద అధి కం. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఎన్నికల అంశం కావడానికి కారణం పంజాబీల ప్రభావమే. పూర్వాంచలీయ (బిహారీల) ఓటర్ల సంఖ్య తక్కువేమీ కాదు. జుగ్గీ జోపిడీలు (మురికివాడలు), అనధికారిక కాలనీల్లో బిహారీల సంఖ్య గణనీయంగా ఉంటుంది. పొరుగున ఉన్న హర్యానా ప్రభావం ఔటర్ ఢిల్లీలో పెద్దగా నగరీకరణ చెందని 20 నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆయా నియో జకవర్గాల్లో కుల రాజకీయాలు, కాప్ పంచాయతీల ప్రభావం అధికం. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు గాను ఈ 20 స్థానాల్లో అన్ని వ్యవహారాలూ కుల రాజకీయాల చుట్టూనే తిరుగుతాయి. మిగతా 50 నియోజకవర్గాలు మినీ ఇండియాను తలపిస్తాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం శివార్లలోని ఈ 20-30 నియోజకవర్గాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇన్ని సమీకర ణాల మధ్య... భారతదేశ భవిష్యత్ రాజకీయాల్లోకి కొత్త గాలిని నింపడంలో ‘ఢిల్లీ బహుత్ దూర్ నహీ’ అనగల తీర్పు వస్తుందా? వేచి చూద్దాం.
 
 సమకాలీనం: దిలీప్ రెడ్డి
 
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement