డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్‌ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు
దీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్‌ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు.
ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్‌కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.
‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అంతకుముందు ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.
దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment