బెళగావి దోవ చూపుతుందా? | Spending time blaming AAP indicates Congress weakness | Sakshi
Sakshi News home page

బెళగావి దోవ చూపుతుందా?

Published Fri, Dec 27 2024 4:14 AM | Last Updated on Tue, Jan 7 2025 4:09 PM

Spending time blaming AAP indicates Congress weakness

ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్‌ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్‌ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్‌ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. 

ఢిల్లీ వరకూ ఆప్‌ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్‌ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్‌ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్‌ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్‌ ప్రధానంగా తప్పుబడుతోంది. 

ఆప్‌ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్‌ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్‌ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్‌ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. 

బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్‌ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్‌ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. 

ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్‌ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్‌ హెచ్‌కేఎల్‌ భగత్, జగదీష్‌ టైట్లర్‌ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్‌ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్‌ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. 

ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్‌–కాంగ్రెస్‌ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్‌లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్‌ సింగ్‌ ఇప్పుడు బీజేపీలో చేరారు. 

పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పక్షాలు కాంగ్రెస్‌ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్‌ సైతం గొంతు కలపటం కాంగ్రెస్‌ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. 

ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. 

హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్‌ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement