
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని ఎన్నికల కమిషన్ ఎవరి ఆదేశాలకు లోబడి పనిచేయని స్వతంత్య్ర సంస్థ. రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి పనిచేసే స్వయం ప్రతిపత్తిగల సంస్థ. పారదర్శకంగా పనిచేయాల్సిన ఈ సంస్థ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఒక్కటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి నివేదించడం. అలా నివేదించిందే తడువుగా ఎన్నికల కమిషన్ సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. సాధారణంగా పాలకపక్షం అండదండలతో రాష్ట్రపతి ఎన్నికవుతారుగనుక పాలకపక్షానికి సానుకూలమైన నిర్ణయం ఆయన తీసుకుంటారని అందరూ భావించేదే.
స్వతంత్య్రంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్ అలా వ్యహరిస్తుందని ఎవరు అనుకోరు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌కున్న అధికారాలేమిటో టీఎన్ శేషన్ నిరూపించాక.. ఎవరూ అలా భావించడం లేదు. పార్టీలో అసమ్మతి అణచివేయడం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కొంత మంది పార్టీ ఎమ్మెల్యేలను మంత్రుల కార్యాలయాల్లో పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. అది తప్పేకావచ్చు! వారికి ఎలాంటి ద్రవ్యపరమైన ప్రయోజనాలను కల్పించలేనందున ఆ పదవులు ‘జోడు పదవుల’ పరిధిలోకి రావని కేజ్రివాల్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాదిస్తూ వస్తున్నారు. ఆయన ఎందుకైన మంచిదని ‘పార్లమెంటరీ కార్యదర్శుల’ పదవులను అనర్హత చట్టం నుంచి మినహాయిస్తు బిల్లును తీసుకొస్తే ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి కొట్టివేశారు. ఇలాంటి బిల్లులను తీసుకొచ్చే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అలా కొట్టివేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది ఆప్ శాసనసభ్యులు తమ కొత్త బాధ్యతలు, అంటే పార్లమెంట్ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించలేదు.
ఇదే కేసులో ‘బాధ్యతలు తీసుకోకముందే వారి పదవులు పోయాయి’ అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. వారికి పదవులే లేనప్పుడు వారికి ‘జోడు పదవుల్లో’ ఉన్నారన్న ఆరోపణ ఎలా వర్తిస్తుంది? నిర్ణయం తీసుకోవడానికి తమ వాదన కూడా వినాలంటూ బాధిత ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు పిటిషన్లు పెట్టుకున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు ఖాతరు చేయలేదు ? వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఏ అంశంలోనైనా సరే న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలన్నా సుప్రీం కోర్టు మౌలిక సూత్రాన్నే ఇక్కడ పట్టించుకోకపోతే ఎలా? బాధిత ఎమ్మెల్యేల వాదన వినకుండానే వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి ఎందుకు సిపారసు చేసింది? పైగా ప్రధాన ఎన్నికల కమిషన్ జోతి రెండు రోజుల్లో పదవి విరమణ చేస్తున్న సమయంలోనే తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన నాడే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించక పోవడం పట్ల కూడా నాడు ఎన్నికల కమిషన్ వ్యవహారం పట్ల అనుమానాలు తలెత్తాయి. ఒకనాడు ప్రభుత్వాన్నే ధిక్కరించి స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకున్న రాజ్యాంగ సంస్థ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంవైపు మొగ్గుచూపుతోంది? రాజ్యాంగ సంస్థలన్నీ బలంగా ఉన్నప్పుడు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండగలదుగదా!