సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి నివేదికను పంపింది.
అసలు విషయం.. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ సర్కార్‌లో ఏడుగురే మంత్రులుండాలి. కానీ, కేజ్రీవాల్ మాత్రం 2015లో 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి..వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించాడు. తద్వారా వారందరికీ కేబినెట్ హోదా ఇచ్చినట్లయింది. పరిపాలనా సౌలభ్యానికే వీరిని పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించినట్లు అప్పట్లో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. పైగా వీరికి ఎటువంటి అదనంగా చెల్లింపులు చేయబోమని చెప్పారు.
దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కావటంతో బిల్లుపై తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపారు. లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా 21 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనికి వారు వివరణ కూడా ఇచ్చారు.
తరువాతి పరిణామాల నేపథ్యంలో జర్నైల్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.వేటు పడిన వారిలో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి తదితరులున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ ప్రతికూలత ఏర్పడి కేజ్రీవాల్ సర్కార్ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment