బీజేపీ ప్రశ్నలపై స్పందించబోం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంధించిన ఐదు ప్రశ్నలపై తాము స్పందించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. తాము ఇప్పటికే కాషాయ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని బహిరంగ చర్చకు ఆహ్వానించామని, కానీ ఆమె ముందుకు రాకుండా పారిపోయారని ఆప్ నేత అశుతోష్ విమర్శించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘మనమెందుకు చర్చలో పాల్గొనకూడదు? అందుకే కిరణ్ బేడీని బహిరంగ చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరాం. కానీ, ఆమె అందుకు అంగీకరించకుండా పారిపోయింది.
ఎందుకంటే ఆమెకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ఇష్టం లేదు. అసలు ఆమెకు ఢిల్లీ గురించి అవగాహనే లేదు’ అని ఆయన అన్నారు. తమపై సంధించే ప్రశ్నలను బహిరంగంగా లక్షలాది ప్రజలను మధ్యవర్తులుగా ఉంచి అడగొచ్చు కదా... అని ప్రశ్నించారు. దీనికి అంగీకరించకుండా తమపై ప్రశ్నాస్త్రాలను ఎందుకు సంధిస్తున్నారని అశుతోష్ వ్యాఖ్యానించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రోజువారీ పద్ధతిలో ప్రశ్నలు విసరడం మాని కాలం చెల్లిన సంప్రదాయ మేనిఫెస్టోతో కాకుండా ఢిల్లీకి ఏం చేస్తారనే దానిని ‘విజన్ డాక్యుమెంట్’గా రూపొందించాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు.