న్యూఢిల్లీ: నగరంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం(ఫిబ్రవరి 7)నాడు స్థానిక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభిమానులతో పాటు సామాన్య ఓటర్లు సైతం ఉత్సుకతతో ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా ఎంతో వ్యయప్రయాసలతో తాము ప్రచారం చేసినా ఓటర్ల మదిలో ఏముందో తెలియడంలేదని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈసారి పోరు బీజేపీ, ఆప్‌ల మధ్యేనని స్థానికులు అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అధికారం కోసం హోరాహోరీ తప్పదనే సర్వేల నివేదికలో నగర రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తిస్తున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం గత ఏడాది రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ఇన్నాళ్లు రాష్ట్రపతి పాలన సాగింది. దాంతో ప్రజా ప్రభుత్వం కోసం స్థానికులు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పూర్తి ప్రచార బాధ్యతలు స్వీకరించగా ఆప్ తరఫున ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే ప్రచార భారాన్ని మోశారు. కాంగ్రెస్ పార్టీ కూడా యువనేత అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజలను ఆకర్షించేందుకు యత్నించింది. ఈ సందర్భంగా పహాడ్‌గంజ్‌కు చెందిన సందీప్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. తన ఆటోపై బీజేపీ కవర్‌ను పెట్టుకుని తిరిగినప్పటికీ ఓటు మాత్రం ఆప్‌కే వేస్తానన్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినా ఈసారి మాత్రం ఆ పార్టీకి వెయ్యనని స్పష్టం చేశాడు. మరి ఆటోకు బీజేపీ బ్యానర్ కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నావు కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఒక బీజేపీ కార్యకర్త దాన్ని ఏర్పాటుచేశాడని తెలిపాడు.
అదే దాన్ని తాను సొంతంగా ఏర్పాటుచేసుకోవాలంటే కనీసం రూ.500 ఖర్చవుతుందని.. అందుకే కాదనలేదని చెప్పాడు. అయినా ఎవరేమిచ్చినా తీసుకోండి.. ఓటుమాత్రం ఆప్‌కే వేయండి అని కేజ్రీవాల్ కూడా చెప్పాడని గుర్తుచేశాడు. అలాగే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని కొందరు పోర్టర్లను కదిలిస్తే వారు కూడా కేజ్రీవాల్‌కు అనుకూలంగానే మాట్లాడారు. తాము ఆప్‌కే ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నామని.. ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఇదిలా ఉండగా, చాందినీచౌక్‌లోని ఒక దుకాణదారు మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం వస్తే రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు సాధారణమైపోతాయేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఒకవేళ ఆప్ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు పోలీసులను పట్టించుకోవడం మానేస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే తాను బీజేపీకి ఓటేస్తానని స్పష్టం చేశాడు. షంషేర్‌సింగ్ అనే మరో ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. గతంలో తాను ఆప్‌కే ఓటేశానని చెప్పాడు.
అయితే ఈసారి మాత్రం అదే పనిచేస్తానని చెప్పలేనన్నాడు. బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది కాని పోలింగ్ రోజుమాత్రమే తాను తుది నిర్ణయానికి వస్తానని స్పష్టం చేశాడు. రోహన్ వర్మ అనే బ్యాంక్‌ఉద్యోగి మాట్లాడుతూ.. తాను నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తాను కాని కిరణ్‌బేడీకి మాత్రం మద్దతు ఇవ్వబోనని చెప్పాడు. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల పుణ్యమా అని చాలామంది మిత్రుల మధ్య కొంతమేర పొరపొచ్చాలు కూడా చోటుచేసుకున్నాయనే చెప్పవచ్చు. కాలేజీ స్నేహితులైన నిధి శర్మ, ఆయుష్ సక్సేనాలు ఈ ఎన్నికల వేళ ఒకరు ఆప్‌కు ప్రచారం చేస్తుంటే, మరొకరు బీజేపీకి మద్దతు పలికారు. కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో నిధి శర్మ ఆప్ టోపీ పెట్టుకుని కనిపిస్తే, ఆయుష్ సక్సేనా బీజేపీ స్కార్ఫ్‌తో ఉంది. శర్మ అనే మరో విద్యార్థి మాట్లాడుతూ.. ‘మేమందరం కాలేజీ స్నేహితుమే అయినా రాజకీయంగా ఎవరి ఆలోచనలు వారికున్నాయ్..’ అని చెప్పాడు. ‘కాంగ్రెస్ చాలా ఏళ్లు ఢిల్లీని ఏలింది.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ సర్కారుంది.. అయితే సామాన్యుల ఇబ్బందులను గుర్తెరిగిన ‘జాదూవాలా’ కే మేం ఓటేయబోతున్నాం..’ అంటూ ఆప్ జెండాను చూపించాడు.
సరితా విహార్ ప్రాంతానికి చెందిన సరళ అనే గృహిణి మాట్లాడుతూ.. గతంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను చూసి అతడికే మా కుటుంబమంతా ఓటేశాం.. ఇప్పుడు మాత్రం అదే పరిస్థితి పునరావృతమవుతుందని చెప్పలేను.. ’ అని అంది. తాగునీరు, కరెంటుకు సంబంధించి కేజ్రీవాల్ ఇస్తున్న హామీలను నెరవేర్చేందుకు నిధులు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటాడు.. ఒకవేళ అది ఏ మాత్రం బెడిసికొట్టినా అతడు తిరిగి మధ్యలోనే రాజీనామా చేసేయడని నమ్మకమేంటని.. ఆమె ప్రశ్నించింది. బాదర్‌పూర్‌కు చెందిన ఐటీ నిపుణుడు స్వరూప్ ముఖర్జీ మాట్లాడుతూ.. కరెంట్ చార్జీలపై ఆప్ హామీ అమలుచేయడం కష్టమేనని విశ్లేషించాడు. నగరం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటేయడమే బెటరని అభిప్రాయపడ్డాడు. అయితే చాందినీచౌక్‌కు చెందిన జావేద్ రాజా మాత్రం కాంగ్రెస్‌కే తన ఓటు అన్నాడు. ప్రజలు బీజేపీ, ఆప్‌ల పనితీరుపై అసహనంగా ఉన్నారని, వారు కాంగ్రెస్‌వైపు మొగ్గుతున్నారని చెప్పాడు. కాంగ్రెస్ గత 15 యేళ్ల పాలనలో ఢిల్లీ అభివృద్ధి కోసం చాలా చేసిందని వ్యాఖ్యానించాడు.
ఏ మదిలో ఏముందో..
Published Thu, Feb 5 2015 10:49 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement