న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మొదలైంది. ఓటమిపై ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అజయ్ మాకెన్ నాయకత్వంపై మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గురువారం విమర్శల వర్షం కురిపించగా, ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి పీసీ చాకో ఎదురుదాడి చేశారు. కాగా, షీలా మాట్లాడుతూ, మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతా తానే చేయగలననే భావనలో మాకెన్ ఉండిపోయి నాయకులను విస్మరించారని, అలాగే కార్యకర్తలను ఉత్తేజితులను చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు పేర్కొన్నారు.
అతని ప్రవర్తన కాంగ్రెస్‌కు కొంచెం కూడా తోడ్పడలేదని విమర్శించారు. చివరి నిమిషంలో మాకెన్‌ను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి తప్పుచేశారని చెప్పారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో అతను ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవి తన విజయాలు కాదని, కాంగ్రెస్ విజయాలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తన పేరును ఉపయోగించినట్లయితే పార్టీకి మంచి తోడ్పాటునందించి ఉండేదని చెప్పారు. ఢిల్లీలో పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దుర్భర పరిస్థితిలో ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించడంపై త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి మాట్లాడతానని తెలిపారు. అధినాయకత్వం ఆదేశిస్తే పార్టీ పునరుత్తేజ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా షీలా వ్యాఖ్యలపై పీసీ చాకో ఎదురుదాడి చేశారు. షీలా అభిప్రాయాలను పార్టీ ఆమోదించబోదని, ఆమె నోరు మూసుకుని ఉండటం ఉత్తమమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాకెన్ మద్దతుదారుడైన డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ కూడా షీలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు.
దీక్షిత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు-చాకో
షీలా దీక్షిత్ ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి పీసీ చాకో అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆయన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీక్షిత్ ఆ విధంగా వ్యాఖ్యానించడం బాగోలేదు. పార్టీ విజ్ఞిప్తి మేరకు మాకెన్ ప్రచార నాయకత్వం స్వీకరించారు. అలాగే పార్టీ కోరితేనే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి పార్టీ గెలుపు కోసం మాకెన్ శ్రమించారన్నారు. మాకెన్, లవ్లీతో కలిసి బుధవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై రాహుల్‌తో చర్చించామన్నారు. అలాగే లవ్లీ మాట్లాడుతూ, ‘ఆమె సలహాలు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందే ఇచ్చి ఉండాల్సింది. ఆమె మాకంటే సీనియర్ నాయకురాలు. మేము ఆమెను చాలా గౌరవిస్తాం.
ఆమె మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు, లేకుంటే పార్టీ అధినాయకత్వానికి అయినా తెలియజేయవచ్చు’ అని లవ్లీ వ్యాఖ్యానించారు. కాగా, బ్లాక్ స్థాయి నుంచి జిల్లా కమిటీలను ఎన్నికల ముందు నియమించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై లవ్లీ స్పందించారు. ‘మేము ఆ కమిటీలను తిరగి నియమిస్తాం. వాటిని తప్పనిసరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మాకు కింది స్థాయి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా, దీక్షిత్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించామని, కానీ ఈసారి తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ మద్దతును ఉపయోగించుకుని కింది స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఓటమిపై కాంగ్రెస్‌లో ‘వార్’ షురూ
Published Thu, Feb 12 2015 10:13 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement