రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్ | Congress files complaint against Union minister controversial remarks on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్

Published Wed, Sep 18 2024 12:38 PM | Last Updated on Wed, Sep 18 2024 5:05 PM

Congress files complaint against Union minister controversial remarks on Rahul Gandhi

ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ నేత అజయ్ మాకెన్‌ అన్నారు. ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బుధవారం అజయ్‌ మాకెన్‌ తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాహుల్ భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రాహుల్‌ గాంధీ తండ్రి (రాజీవ్‌ గాంధీ), నానమ్మ( ఇందిరా గాంధీ) ఈ దేశానికి వారి ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని.. ‘జాగ్రత్తగా ఉండండి.. మాట్లాడకండి.. లేకపోతే మీ నానమ్మకు పట్టిన అదే గతి పడుతుంది’ అని నీచమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎప్పుడూ దిగజారలేదు. తమ నేత చేసిన ఇటువంటి నీచమైన వ్యాఖ్యలపై బీజేపీ నోరుమెదపలేదు.. ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. 

రాహుల్‌ గాంధీ.. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అందుకే మీకు (బీజేప) ఆయన వ్యాఖ్యలు నచ్చడం లేదు. చంపేస్తామనే బెదిరింపులకు మేము భయపడబోము. వివాదాస్పద వ్యాఖ్యల చేసివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే (సంజయ్ గైక్వాడ్), కేంద్ర మంత్రి, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ (రవనీత్ సింగ్ బిట్టు), భారతదేశంలోని నంబర్ వన్ టెర్రరిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం’ అని అన్నారు.

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీని ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.యూత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో భారీ ధర్నా చేపట్టారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘రాహుల్ గాంధీ బాటలోనే రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. బీజేపీకి భయపడేది లేదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నారు’ అని కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు.

 

చదవండి: రాహుల్‌ గాంధీ భారతీయుడు కాదు: కేంద్ర మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement