గత ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ సహకారంతో పగ్గాలు చేపట్టిన ఆప్ అధినేత అరవింద్ 49 రోజుల తర్వాత దిగిపోవడంతో విధానసభ ఎన్నికలు జరిగాయి. దీంతో 14 నెలల వ్యవధిలోపలే మరోమారు జాతీయ రాజధానివాసులు శనివారం పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే వారిలో అత్యధికులు ఏ పార్టీకి మొగ్గుచూపారనేదే ప్రస్తుతం అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని వాసి మరోసారి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. 2013 నాటి విధానసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి విదితమే. దీంతో కొద్దిరోజుల తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ పార్టీ సహకారంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే 49 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ఎల్జీ ఆధ్వర్యంలో నిన్నటిదాకా పరిపాలన సాగించడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించడం, అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ప్రచారం ఇలా అన్ని పర్వాలు ముగియడంతో శనివారం నగరవాసి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. ఈసారి తమకంటే తమకు మెజారిటీ ఇవ్వాలంటూ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, ఆప్ పార్టీలు... ఓటర్లకు విన్నవించాయి. మొత్తం 70 నియోజకవర్గాలున్న విధానసభ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యాయి.
దీంతో పెద్దసంఖ్యలో ఓటర్లు బారులుతీరి తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయమై తూర్పుఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ అనే ఓటరు మాట్లాడుతూ ‘ఓటు వేయడమనేది మా కర్తవ్యం. అందుకే ఇక్కడికి వచ్చాం’ అని అన్నారు. దక్షిణ ఢిల్లీలోని గుల్‌మెహర్ పార్కు పరిసరాల్లో నివసించే లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ తాను పోలింగ్ కేంద్రానికి వచ్చినపుడు ఓటర్లు అంతగా రాలేదన్నారు. తూర్పుఢిల్లీలోని పాండవ్‌నగర్ పోలింగ్ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకే పెద్దసంఖ్యలో ఓటర్లు బారులుతీరారు. ఇదిలాఉండగా జాతీయ రాజధానివాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్‌లో స్థానికులను శనివారం కోరారు. ముఖ్యంగా యువకులు భారీగా తరలిరావాలని విన్నవించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి.
సర్కారును ఏర్పాటుచేస్తా : బేడీ
పోలింగ్ విషయమై బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ మాట్లాడుతూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననే ఆకాంక్ష వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలను గెలుచుకున్న సంగతి విదితమే. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పెద్దసంఖ్యలో తరలిరావాలంటూ ఓటర్లకు విన్నవించారు. ఇక ఈ ఎన్నికల రేసులో నిలిచిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది స్థానాలైనా దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. కాగా నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13.3 మిలియన్లు. ఈ ఎన్నికల్లో మొత్తం 673 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఎన్నికల నేపథ్యంలో సంబంధిత అధికారులు నగరవ్యాప్తంగా మొత్తం 11,763 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసిన సంగతి విదితమే.
ఏ ఓటరు మదిలో ఏముందో?
Published Sat, Feb 7 2015 10:04 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement