![BJP comeback in Delhi after 27 years predict exit polls](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/bjp.jpg.webp?itok=Nbv50rhQ)
27 ఏళ్ల తర్వాత అధికారం
ఆప్ హ్యాట్రిక్ కలలు కల్లలే
ఎగ్జిట్ పోల్స్ జోస్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా సున్నా చుడుతుందని స్పష్టం చేశాయి. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని రెండు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే మొగ్గు మాత్రం బీజేపీవైపేనని తెలిపాయి.
ఆప్ గెలుస్తుందని మరో రెండు చెప్పుకొచ్చాయి. బీజేపీకి 51 నుంచి 60 దాకా రావచ్చని, ఆప్ 10 నుంచి 19కి పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. కాంగ్రెస్ సున్నా చుడుతుందని చెప్పింది. బీజేపీకి 40–44, ఆప్‌కు 25–29, కాంగ్రెస్‌కు 2 సీట్లొస్తాయని పీపుల్స్ ఇన్‌సైట్ చెప్పింది.
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈసారి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. అందరి కళ్లూ 8వ తేదీన వెలువడబోయే ఫలితాలపైనే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. విజయానికి 36 సీట్లు కావాలి. ప్రస్తుత అసెంబ్లీలో ఆప్‌కు ఏకంగా 62 సీట్లున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చగా బీజేపీ నేతలు విజయంపై ధీమా వెలిబుచ్చారు. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘనవిజయం సాధించింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_51.png)
Comments
Please login to add a commentAdd a comment