Saffron flag
-
కాషాయ జెండా ఎగరేసినందుకు.. బంగ్లాదేశ్‌లో 18 మందిపై దేశ ద్రోహం కేసు
ఢాకా: మైనారిటీ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్ యంత్రాంగం వ్యవహరిస్తున్నదనేందుకు తాజా ఉదాహరణ. మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవాలంటూ ఇటీవల చత్తోగ్రామ్‌లో హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాషాయ జెండా ఎగురవేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 18 మందిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. మరో 20 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులపైనా అక్టోబర్ 25న కేసు నమోదు చేశారు. తమ 8 డిమాండ్ల అజెండాకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్, భారత ప్రభుత్వం సాయంగా నిలిచాయని పుండరీక్ ధామ్ ప్రెసిడెంట్, కేసు బాధితుడు అయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తెలిపారు. తమ నిరసన బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాద న్నారు. కాగా, ఈ చర్యను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారంలో ఖండించడం గమనార్హం. ఇలా ఉండగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే తప్ప, పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి దేశ ద్రోహం కేసును తనంత తానే నమోదు చేయలేరని పరిశీలకులు అంటున్నారు. నేరం రుజువైతే జీవిత కాల జైలు శిక్ష పడవచ్చు. -
KS Eshwarappa Issue: అనని మాటలకు రాద్ధాంతం చేస్తున్నారు
Karnataka Assembly showdown: బీజేపీ నేత అత్సుత్సాహ ప్రకటన.. కర్ణాటక నాట రాజకీయ చిచ్చును రగిల్చింది. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని బీజేపీ నేత, ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు ఈశ్వరప్ప అలాంటి వ్యాఖ్యలే చేయలేదని వెనకేసుకొచ్చారు కర్ణాటక సీఎం. ‘ఈశ్వరప్ప.. ఎర్రకోట జెండాపైనా కాషాయపు జెండా ఎగురుతుందని ఏనాడూ అనలేదు. అదంతా అబద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన అర్థం పర్థం.. ఓ విలువంటూ లేనిది. కేవలం ఇగో, రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి పరిణామాలెన్నడూ జరగలేదు. ఇది కనీసం ప్రజా సమస్య కూడా కాదు. గతంలో ప్రజల కోసం రాజకీయ పోరాటాలు సాగేవి. ఇప్పుడు వీళ్లు చేస్తోంది అర్థం పర్థం లేనిది. ప్రతిపక్షాలు వాళ్లు ఏం చేయాలో మరిచిపోయినట్లు ఉన్నారు’’ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈశ్వరప్ప తప్పుకోవాల్సిందే! సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ‘కాషాయపు జెండా వ్యాఖ్యలపై ఈశ్వరప్ప రాజీమానా చేయాల్సిందే. ఆయన్ని తొలగించేంత వరకు రాత్రింబవలు మా నిరసన కొనసాగుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోకపోతే.. కోర్టుకు వెళ్తాం. అసెంబ్లీని స్తంభింపజేస్తాం. జాతీయ జెండాను అవమానపర్చడమే బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకుంది. రాజ్యాంగం గురించి.. జాతీయ జెండా గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాను, స్వాతంత్ర్యాన్ని దేశానికి అందించింది. వాళ్లేమో(బీజేపీ) ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు’ అంటూ శివకుమార్ స్పందించారు. Karnataka Minister KS Eshwarappa must resign (over his saffron flag remark). We'll continue overnight protests at Karnataka Assembly till he gets sacked from the Cabinet, otherwise, we'll go to the court & not allow the Assembly to function: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/IhvLaT9g6g — ANI (@ANI) February 18, 2022 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను అవమానించేలా మాట్లాడిన ఈశ్వరప్ప.. దేశద్రోహం నేరానికి పాల్పడ్డారని, ఆయన్ని తక్షణమే కేబినెట్ నుంచి తప్పించి, దేశద్రోహం కేసు నమోదు చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్ ఎమ్మెల్యేలు విధానసభలో ధర్నా చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు విఘాతం కలుగుతోంది. అంతేకాదు.. ఈశ్వరప్పకు వ్యతిరేకంగా రాత్రంతా విధానసభలోనే ధర్నా చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు సూచించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ వసతి, భోజన ఏర్పాట్లను సిద్ధం చేయగా.. ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో ఉంటున్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా విధానపరిషత్‌లోనూ గందరగోళం నెలకొనటంతో సమావేశం వాయిదాపడుతోంది. దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ స్పీకర్, మాజీ సీఎం బి.ఎస్.యడ్యూరప్ప సహా పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగి కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా.. లాభం లేకుండా పోతోంది. నేను దేశభక్తుడిని..: ఈశ్వరప్ప నేనే తప్పు చేయలేదు. నేను దేశభక్తున్ని, నేనెందుకు రాజీనామా చేయాలి? అని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప అంటున్నారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జాతీయ జెండాకు అవమానం చేసింది కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ అని, ఆయనే రాజీనామా చేయాలన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండాను రాబోయే 300–500 సంవత్సరాల్లో ఎగురవేయవచ్చని చెప్పాను అంతే. జాతీయ జెండాను అవమానించలేదు. నా మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ వారికి పని లేక అనవసరంగా వివాదాలు సృష్టించే పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
పోలీస్ స్టేషన్‌కూ పులిమారు
సాక్షి, లక్నో : యోగి ఆదిత్యానాథ్ యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ర్టం క్రమంగా కాషాయరంగు పులుముకుంటున్నది. ఇటీవల హజ్ హౌస్‌ను కాషాయంతో అలంకరించిన పాలకులు తాజాగా రాష్ర్ట రాజధాని లక్నో పోలీస్ స్టేషన్‌కూ కాషాయ రంగు పులిమారు. బుక్లెట్లు, స్కూల్ బ్యాగులు, టవల్స్, కుర్చీలకు కాషాయం రంగు పూసిన సర్కార్ తాజాగా ఈ లిస్ట్‌లో స్ధానిక ఖైసర్ బాగ్ పోలీస్ స్టేషన్నూ చేర్చింది. 1939లో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకూ సంప్రదాయ పసుపు, ఎరుపు రంగుల్లోనే ఉండేది. అయితే ఇటీవల భవనంలోని పిల్లర్లు, కొంత భాగానికి కాషాయ రంగు వేశారు. పోలీస్ స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఈ రంగులు వేశామని, తీవ్ర చలి కారణంగా వర్కర్లు రాకపోవడంతో ఈ పనులు ఇంకా పూర్తికాలేదని ఇన్స్పెక్టర్ డీకే ఉపాధ్యాయ చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో సీఎం కార్యాలయం ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయ రంగు వేశారు. యోగి ఆదిత్యానాథ్ సీఎం అయ్యాక రాష్ర్ట సచివాలయ ప్రాంగణానికీ కాషాయం కలర్ ఇచ్చారు. తన కార్యాలయంలోని తన సీటులో కాషాయ టవల్‌ను యోగి ఇష్టపడతారు. ఇటీవలే ఆయన 50 కాషాయ రంగులతో కూడిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. -
స్కూల్లో కాషాయ జెండా ఎగరేశారు..!
అరారియా(బిహార్): ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అత్యధిక స్థానాలలో విజయం సాధించడంతో బీహార్‌లోని అరారియా జిల్లా ఫోర్బ్స్గంజ్ పాఠశాలలో మార్చి 18వ తేదీన కొందరు బీజేపీ నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిందన్న ఆనందంలో సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రధానోపాధ్యాయుడు జగ్దీష్ మెహతా తెలిపారు. పాఠశాల వేళలు ముగిసిన అనంతరం తామంతా ఇళ్లకు వెళ్లితుండగా కొందరు అక్కడికి చేరుకున్నారని, అడ్డుకున్నప్పటికీ వినకుండా పాఠశాలలో కాషాయ జెండా ఎగురవేశారని హెచ్ఎం తెలిపారని, డీఈవో ఫైజుల్ రహ్మాన్ తెలిపారు. ఈ ఘటనపై తాము బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(బీఈవో)ను విచారణ చేపట్టాలని ఆదేశించామని, నివేదిక అందాక బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. ఈ అంశం విద్యాశాఖకు సంబంధించినది కాబట్టి తాము జోక్యం చేసుకోలేదని.. ఫిర్యాదు అందితే విచారణ చేపడతామని సబ్‌డివిజినల్ పోలీస్ ఆఫీసర్ అజిత్ సింగ్ చెప్పారు. -
కాషాయ జెండా కూడా జాతీయ పతాకమే!
ముంబై: 'భారత్ మాతా కీ జై' నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే ఆర్ఎస్ఎస్ కు చెందిన మరో నేత సరికొత్త వివాదానికి తెరలేపారు. హిందూత్వకు ప్రతీక అయిన కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవించాలన్నారు. ముంబైలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవిచడంలో తప్పులేదని, రెండు జెండాలకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు జోషి. మూడు రంగుల జెండా రూపొందించకముందు బ్రీటిష్ పాలనకు వ్యతిరేకంగా కాషాయ జెండాను ఎగురవేసేవారని గుర్తుచేసిన ఆయన జాతీయ గేయమైన 'వందేమాతరం'ను కూడా జాతీయ గీతంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. 'రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతం అయిన 'జన గణ మన'కు మనం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అదే విధంగా సంపూర్ణ అర్థాన్ని బట్టి చూస్తే వందేమాతరం జాతీయగీతమే' అని జోషి అన్నారు. కాగా, జోషి వ్యాఖ్యలపై జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) మండిపడింది. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పెద్దగా తేడాలేదని, కశ్మీర్ వేర్పాటువాదులలాగే ఆర్ఎస్ఎస్ కూడా మూడురంగుల జెండాకు గౌరవం ఇవ్వదని, జోషీ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉన్నాయని జేడీయూ నేతలు మండిపడ్డారు.