కాషాయ జెండా కూడా జాతీయ పతాకమే!
ముంబై:
'భారత్ మాతా కీ జై' నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే ఆర్ఎస్ఎస్ కు చెందిన మరో నేత సరికొత్త వివాదానికి తెరలేపారు. హిందూత్వకు ప్రతీక అయిన కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవించాలన్నారు.
ముంబైలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవిచడంలో తప్పులేదని, రెండు జెండాలకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు జోషి. మూడు రంగుల జెండా రూపొందించకముందు బ్రీటిష్ పాలనకు వ్యతిరేకంగా కాషాయ జెండాను ఎగురవేసేవారని గుర్తుచేసిన ఆయన జాతీయ గేయమైన 'వందేమాతరం'ను కూడా జాతీయ గీతంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.
'రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతం అయిన 'జన గణ మన'కు మనం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అదే విధంగా సంపూర్ణ అర్థాన్ని బట్టి చూస్తే వందేమాతరం జాతీయగీతమే' అని జోషి అన్నారు. కాగా, జోషి వ్యాఖ్యలపై జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) మండిపడింది. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పెద్దగా తేడాలేదని, కశ్మీర్ వేర్పాటువాదులలాగే ఆర్ఎస్ఎస్ కూడా మూడురంగుల జెండాకు గౌరవం ఇవ్వదని, జోషీ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉన్నాయని జేడీయూ నేతలు మండిపడ్డారు.