
ఎమ్మెల్సీ కవిత విమర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లోనే సీఎం రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీతో రేవంత్ కలిసి పనిచేస్తున్నారని, ఇటీవల సీఎం, మోదీ నడుమ జరిగిన భేటీతో వారి దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి అంటగడుతున్నారని ఆమె మండిపడ్డారు.
‘న్యాయవాది సంజీవరెడ్డి మరణం, భూపాలపల్లిలో భూతగాదాలతో వ్యక్తి హత్య, దుబాయిలో ఓ వ్యక్తి మరణం వంటి ఘటనలను బీఆర్‌ఎస్‌కు సీఎం అంటగడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేయడం మినహా సీఎంకు ఇంకో ఆలోచన లేదు’అని కవిత మండిపడ్డారు.
ప్రభుత్వ అప్పులపై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎస్‌ఎల్‌బీసీ విపత్తును పక్కన పెట్టి సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, సీఎంకు తెలంగాణ ప్రజలు ముఖ్యమా.. కాంట్రాక్టర్లు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment