మురికివాడల ప్రజలకు ఇచ్చాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు.
బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment