BSP alliance
-
ప్రధానుల కర్మభూమి ఫూల్పూర్
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన యూపీలో ఫూల్పూర్ లోక్‌సభ స్థానంలో గెలుపుని ఇటు బీజేపీ, అటు ఎస్పీబీఎస్పీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకసారి విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ స్థానాన్ని తిరిగి రాబట్టుకోవాలనుకుంటోంది. బీజేపీని తిరిగి అడుగుపెట్టనివ్వరాదన్న దృఢసంకల్పంతో మహాకూటమి పనిచేస్తోంది. మే 12న పోలింగ్ జరిగే ఫూల్పూర్కి జవహర్ లాల్ నెహ్రూ, వీపీ సింగ్, విజయలక్ష్మి పండిత్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1971లో వీపీ సింగ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున విజయాన్ని కైవసం చేసుకున్నారు. సోషలిస్టు పార్టీ నుంచి రామ్ మనోహర్ లోహియా 1962లో నెహ్రూపై పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. ప్రముఖులను గెలుపుతీరాలకు చేర్చిన స్థానం... 1952లో జరిగిన తొలి ఎన్నికలు మొదలుకొని 1957, 1962ల్లో మూడు సార్లు వరుసగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. జవహర్ లాల్ నెహ్రూ మరణించేవరకూ ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ ఇక్కడి నుంచి గెలుపుబావుటా ఎగురవేశారు. 2009లో బీఎస్పీ అభ్యర్థి కపిల్ మున్వీ కర్వారియా గెలుపొందారు. వచ్చినట్టే వచ్చి చేజారిన బీజేపీ సీటు... ఈ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్కసారి ఈ సీటుని గెలుచుకోగలిగింది. 2014లో తొలిసారి బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈస్థానాన్ని కైవసం చేసుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ కలిసికట్టుగా పోటీ చేసి బీజేపీని ఓడించాయి. 2014లో బీజేపీ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కి 60 వేల ఓట్ల మెజారిటీ రావడంతో బీజేపీ కంగుతినాల్సి వచ్చింది. 2019 ఎవరికి కలిసొస్తుంది? 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేసరి దేవి పటేల్ పోటీ చేస్తోంటే, ఎస్పీ పంధారీ యాదవ్‌ని బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున పంకజ్ నిరంజన్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా జాతీయవాదం, తీవ్రవాద వ్యతిరేక దాడులు బీజేపీ గెలుపునకు దోహదం చేస్తాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కులం ప్రధానమే... 2018 ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో సైతం ఎస్పీ, బీఎస్పీ వ్యూహాత్మక కుల సమీకరణలు ఈసారి కూడా పనిచేస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఫూల్పూర్ నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామస్తుడు రామ్‌సింగ్ పటేల్ ‘‘ఇటీవల తీవ్రవాద స్థావరాలపై దాడులు తప్ప, నాకు ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయాల గురించి ఏమీ తెలియదు. కానీ నేను బీజేపీకే ఓటు వేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ మా కులం నాయకుడిని పోటీకి దింపింది’’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ స్థానంలో కులం ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ పటేల్ మామ కూర్మి నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అలాగే పంకజ్ పటేల్ అత్తయ్య కృష్ణ పటేల్ గోండా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫూల్పూర్లో ఏ పార్టీ ముస్లింని బరిలోకి దింపకపోవడంతో ముస్లింల ఓట్లన్నీ ఎస్పీ అభ్యర్థికేనని కూడా స్థానిక ముస్లిం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫూల్పూర్లో 3 లక్షల మంది కుర్మీలు, ఒక లక్ష మంది జాటవ్ దళితులు, 1.5 లక్షల మంది జాటవేతరులు, దాదాపు 2 లక్షల మంది యాదవులు, 2 లక్షల మంది బ్రాహ్మణులు, మరో 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. -
క్లీన్‌బౌల్డ్ అయ్యాక అంపైర్‌పై నిందలు
బస్తి, ప్రతాప్‌గఢ్ (యూపీ)/వాల్మీకినగర్ (బిహార్): క్లీన్‌బౌల్డ్ అయ్యాక అంపైర్‌ను నిందించే బ్యాట్స్‌మన్‌లా, పరీక్షల్లో ఫెయిలై కుంటిసాకులు చెప్పే విద్యార్థిలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు విలువలకు తిలోదకాలిస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తి, ప్రతాప్‌గఢ్, బిహార్‌లోని వాల్మీకినగర్‌లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్‌తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌పై దాడి చేయడం గమనార్హమన్నారు. రఫేల్ విషయంలో తనను అపఖ్యాతి పాలుచేసేందుకు రాహుల్ ప్రయత్నించారంటూ.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై మోదీ విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ చివరకు అవినీతి నంబర్ వన్ గా ముగిసిందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీల అవినీతిపై మోదీ ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌హెచ్ కుంభకోణం, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత కొన్ని వస్తువులు మాయం కావడం వంటివి ఆయన ప్రస్తావించారు. మహా కల్తీ కూటమితో పోల్చుకుంటే ఎన్డీయే పనితీరు విభిన్నమైనదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాక్ చర్యలపై గగ్గోలు పెడుతుండేవని, శత్రు దేశం కంటే తమ ఓటు బ్యాంకే ప్రధానంగా భావించేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు తమ మాతృ రాష్ట్రాలతో ఎంతోబాగా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందంటూ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు. -
సొంత సామాజికవర్గాన్ని ముంచిన పవన్
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో మరెవరికో కొమ్ముకాయడానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనను నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నట్టేట ముంచేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ సామాజికవర్గం వారు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో బీజేపీ 2014 సెప్టెంబరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తమ పార్టీతో కలిసిపోవాలని కోరిందని వీర్రాజు చెప్పారు. అప్పుడే గనుక పవన్‌కల్యాణ్ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా సీఎం పదవి రేసులో ఉండేదని చెప్పారు. రాజకీయాల్లో దార్శనికత గురించి చెప్పే పవన్‌కల్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. 2014లో పవన్క ల్యాణ్‌ను తానే నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లానని, అప్పటి ఎన్నికల్లో బీజేపీ– జనసేన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తే.. పవన్‌కల్యాణ్ టీడీపీతో కలిసి మూడు పార్టీలు పోటీ చేయాలని సూచించారన్నారు. ఏడాది క్రితం జనసేన అవిర్భావ సభలోనూ తనను అభిమానించే సామాజికవర్గం చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని గ్రహించి టీడీపీపై పవన్‌కల్యాణ్ విమర్శలు చేశారని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి కలిగించేలా.. ఓట్లను చీల్చడానికే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి రూ. 6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులన్నీ మింగేశారని.. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా రూ. 17,500 కోట్ల ప్యాకేజిగా చంద్రబాబే విలువ కట్టారని.. కేంద్రం ఆరు లక్షల కోట్లు ఇచ్చిన తరువాత ప్రత్యేకహోదా డిమాండ్‌లో అర్ధం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును కేంద్రం లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ఓటుకు నోటు కేసునే ఉపయోగించుకునేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
లోక్‌సభ ఎన్నికలకు అజిత్ జోగి దూరం!
సాక్షి, రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి కింగ్ మేకర్‌గా భావిస్తున్న ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం అజిత్ జోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని.. ఆయా స్థానాలను బీఎస్పీకి వదిలేస్తున్నట్టు అజిత్ జోగి మీడియాకు తెలిపారు. సరైన వనరులు, సంసిద్ధత లేనందున తన పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో పాల్గొనడం లేదని అజిత్ జోగి పేర్కొన్నారు. ‘నన్ను పోటీ చేయమని చాలా మంది చెప్తున్నారు. కానీ దీని గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పార్టీని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. బీఎస్పీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద’ని జోగి వివరించారు. 11 లోక్‌సభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 8న, రెండో దశ ఏప్రిల్ 18న, మూడో విడత పోలింగ్ 23న జరుగనుంది. జోగి బరిలో లేని తొలి ఎన్నికలు అజిత్ జోగి 1986లో ఐపీఎస్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికతో ఛత్తీస్‌గఢ్ జనాభాలో 54 శాతంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ మరింత దగ్గరైంది. తుపాకీ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వీపీ సింగ్ ప్రభుత్వంపై రాజ్యసభలో దుమారం రేగినప్పుడు అజిత్ జోగి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలా తెగువ చూపారు. అజిత్ రాజకీయ చరిత్ర చూస్తే ఆయన 2015లో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. 2000లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అజిత్ జోగి పోటీలో చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన బరిలో నిలవని తొలి ఎన్నికలుగా ఈ లోక్‌సభ ఎన్నికలను చెప్పొచ్చు. అజిత్ జోగి అనూహ్య నిర్ణయంతో ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్.. ఆయన మద్దతిస్తున్న బీఎస్పీ మధ్య జరగనుంది. జోగి కుటుంబానికి లోక్‌సభ ఎన్నికలు పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. 2009లో అజిత్ జోగి భార్య రేణు జోగి బిలాస్పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి, 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వయంగా ఆయన పోటీపడ్డ 2014 ఎన్నికల్లో కూడా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందూ లాల్ సాహూ చేతిలో 1,217 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌లకు తాను ప్రత్యామ్నాయమని చెప్పుకున్న జోగి, మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-సీజేసీ కూటమి 15 సీట్లు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పి కూటమి 5 సీట్లకే పరిమితమవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో మొత్తం 90 సీట్లలో 68 చోట్ల గెలుపు ఢంకా మోగించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ 15 స్థానాలను గెలవగలిగింది. బీఎస్పీ-సీజేసీ కూటమి నెగ్గిన ఐదు స్థానాల్లో మార్వాయి నియోజకవర్గంలో అజిత్ జోగి విజయం సాధించగా, కోట నుంచి ఆయన భార్య రేణు జోగి గెలుపు రుచి చూశారు. ఆ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీజేపీని బయటివాళ్ల పార్టీగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాయావతి-జోగి కూటమి దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రజలు తన కన్నా భూపేశ్ భగేల్‌ను ఎక్కువగా నమ్మారని ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జోగి విచారం వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అశోక్ తోమర్ విశ్లేషణ ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికలతో అజిత్ జోగి ప్రభ తగ్గింది. ఆయన సీఎంగా ఉన్న మూడు సంవత్సరాల కాలంలో పాలన గాడి తప్పడాన్ని ప్రజలింకా మరచిపోలేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి జోగి మళ్లీ పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. -
దళిత ఓట్లకు ప్రియాంక గాలం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్‌ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి. ప్రియాంక పోటీలో లేనట్టే! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్‌సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
యూపీని స్వీప్ చేస్తాం : రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఘోరపరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీని స్వీప్ చేస్తామని, ఆ రాష్ట్రంలో గతంలో లభించిన 72 స్ధానాలను అవలీలగా తిరిగి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు ఘనవిజయం కట్టబెట్టారని గుర్తుచేశారు. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా యూపీలో 80 లోక్‌సభ స్ధానాలకు గాను 72 స్ధానాలు తగ్గకుండా బీజేపీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా యూపీలో బీజేపీకి చెక్‌పెట్టేందుకు దశాబ్ధాల తరబడి తమ మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ ఏకమైన సంగతి తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చెరో 38 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. మిగిలిన నాలుగు స్ధానాల్లో అమేథి, రాయ్‌బరేలి స్ధానాలను కాంగ్రెస్‌కు విడిచిపెట్టగా మరో రెండు స్దానాలను ఆర్ఎల్డీ వంటి పార్టీలకు అప్పగించనున్నాయి. మరోవైపు యూపీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్ సంసిద్ధమవుతోంది. -
యూపీలో ఎస్పీ–బీఎస్పీ జట్టు!
లక్నో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ రెండింటితోపాటు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) వంటి చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో ఉండనున్నాయి. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఎస్పీ–బీఎస్పీల కూటమితో కలిసే సాగుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కూటమితో కాంగ్రెస్ కలిస్తే, ఆ పార్టీకి అతి తక్కువ స్థానాల్లోనే టికెట్లు దక్కనున్నాయి. ఎస్పీ–బీఎస్పీల కూటమిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో పోటీ చేయం.. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఇప్పటికే పలుమార్లు సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చించారనీ, తాజాగా శుక్రవారం వారు ఢిల్లీలో భేటీ అయ్యి మాట్లాడారని రాజేంద్ర చెప్పారు. కూటమి ఏర్పాటుకు వీరిరువురూ సూత్రప్రాయ అంగీకారం తెలిపారన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఉండాలా లేదా అన్న అంశాన్ని అఖిలేశ్, మాయావతిలు తర్వాత నిర్ణయిస్తారనీ, అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీల నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో మాత్రం తమ కూటమి అభ్యర్థులను పోటీలో నిలపకుండా ఆ సీట్లను కాంగ్రెస్‌కే విడిచిపెట్టాలని నిర్ణయించామన్నారు. యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ అఖిలేశ్–మాయావతిల భేటీపై అధికారిక ప్రకటనేదీ లేదనీ, దీనిపై తాను మాట్లాడేదీ లేదంటూ ఆయన స్పందించేందుకు నిరాకరించారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో 71 సీట్లు బీజేపీ, మరో రెండు సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ గెలిచాయి. ఎస్పీ ఐదు, కాంగ్రెస్ రెండు సీట్లు గెలవగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. -
త్వరలోనే కూటమి సాకారం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ– బహుజన్ సమాజ్ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న వార్తలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. పొత్తుపై చర్చలు ప్రారంభమవుతాయని త్వరలోనే కూటమి ప్రజల ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ –బీఎస్పీలు కలసి పనిచేయడంతో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి త్వరలోనే చర్చలుంటాయని అఖిలేశ్ తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అఖిలేశ్ మెచ్చుకున్నారు. అందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలు ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు బదిలీలు తప్పించుకునేందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలను అనుసరిస్తున్నారని అఖిలేశ్ అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు రెట్టింపయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా లేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రోత్సాహంతోనే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల అంశంలో లబ్ది పొందుతున్నారన్నారు. వచ్చే ఏడాది దేశం మరో కొత్త ప్రధానిని చూస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీకాదని, ఆరెస్సెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అఖిలేశ్ విమర్శించారు. -
మహాకూటమిపై ‘మాయ’ మబ్బులు
లక్నో/సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు ముందు జాతీయస్థాయిలోని మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న కనీస ప్రతిఘటన కూడా కాంగ్రెస్‌లో కనిపించడం లేదని ఆమె ఆరోపించారు. బీఎస్పీని, పార్టీ ఆలోచనలను ధ్వంసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సర్ సోనియాగాంధీలు కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు కాంగ్రెస్–బీఎస్పీ కూటమిని కోరుకోవడం లేదన్నారు. ‘బీజేపీ ఏజెంట్ అయిన ఓ స్వార్థపరుడైన కాంగ్రెస్ నేత కారణంగానే ఇదంతా జరుగుతోంది. నేను ఈడీ, సీబీఐ కేసుల ఒత్తిడిలో ఉన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మేం కాంగ్రెస్‌తో కూటమికి సిద్ధంగా లేము’ అని ఆమె మండిపడ్డారు. ‘బీజేపీ వ్యూహాలతో పోటీపడతామనే భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే.. బీజేపీ చాలా సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయం. మోదీని ఎదుర్కొ నేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతర పార్టీలను కలుపుకుని నిజాయితీగా కూటమిని ఏర్పాటుచేసేందుకు సన్నద్ధంగా లేదు’ అని ఆమె లక్నోలో విమర్శించారు. బీఎస్పీపై కాంగ్రెస్ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌లో ప్రాంతీ య పార్టీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. కూటమితో తమ పార్టీకి ఒరిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల, మతతత్వ పార్టీ అని విమర్శించిన మాయావతి.. ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ భయపడుతోందన్నారు. కాగా, మాయావతి అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
ఎస్పీ–బీఎస్పీ పొత్తు మాకు సవాలే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తు కుదిరితే 2019 ఎన్నికల్లో బీజేపీకి సవాలే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంగీకరించారు. అయితే అమేథీ, రాయ్‌బరేలీలో ఏదో ఒక సీటులో కాంగ్రెస్‌ను కచ్చితంగా బీజేపీ ఓడిస్తుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమిత్‌షా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో ఎన్డీఏను ఓడించలేమని అర్థమయ్యే ప్రతిపక్షాలు అన్నీ ఏకమై లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలోని 80 సీట్లను వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సాధిస్తుందన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో సీఎంలను మార్చబోమన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా 22 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అమిత్‌షా చెప్పారు. ప్రభుత్వ విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ‘సరైన ఉద్దేశాలు, సరైన అభివృద్ధి(సాఫ్ నియత్, సాహీ వికాస్) అనే సరికొత్త నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం విఫలమైందనే ఆలోచనలు ప్రజల మదిలోకి వస్తున్న సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు కొత్త ఆశను కలిగించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఆచరణయోగ్యమైన, స్పష్టమైన చర్యలు తీసుకుందని, దీని ద్వారా తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అదే సమయంలో పరిశ్రమలకు సహాయకారిగా ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు. -
మా ఐకమత్యం మరింత బలపడింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓ సీటు ఎక్కువ గెలిచిందిగానీ ఆ గెలుపు బీజేపీనే దెబ్బతీస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక వైఖరి బహిర్గతమైందన్నారు. ఎస్పీ–బీఎస్పీల ఐకమత్యం బలపడిందన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్ చేతిలో బీఎస్పీ అభ్యర్థి భీమ్రావ్ అంబేడ్కర్ త్రుటిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. పేదలకు వ్యతిరేకంగా ధనాన్ని, అధికార వినియోగానికి పాల్పడిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని అఖిలేశ్ ఆరోపించారు. తన భార్య, కన్నౌజ్ ఎంపీ డింపుల్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని స్పష్టం చేశారు. -
ఎస్పీ, బీఎస్పీ కూటమిపై అఖిలేశ్ స్పష్టత
లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్‌లో తన సొంత సీటును కూడా కాపాడుకోలేకపోయారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమిపై బీజేపీ చేస్తున్న కామెంట్స్‌పై అఖిలేశ్ ఆదివారం స్పందించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఎక్కువకాలం ఉండదని, కేవలం బీజేపీని ఓడించడం కోసమే వారు పొత్తు పెట్టకున్నారన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను అఖిలేష్ తిప్పికొట్టారు. బీజేపీ ధనబలంతో, అధికార బలంతో తమ ఎమ్యెల్యేలను ప్రలోభపెట్టి ఒక దళిత అభ్యర్థి గెలుపును అడ్డుకుందని విమర్శించారు. ఈ ఓటమి తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని, రానున్న ఎన్నికలలోపు తమ కూటమి మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తక్కువ ఓటింగ్ నమోదుకావడమే బీజేపీ ఓటమికి కారణం అన్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఓటింగ్ శాతం పెరిగితే మా గెలుపు మరింత సులువయ్యేదన్నారు. గోరఖ్‌పూర్, పూల్పుర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమి కొనసాగుతుందని అఖిలేశ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాల్లో స్వయంగా ప్రచారంలో పాల్గొన్నా ఓటమి పాలవ్వక తప్పలేదన్నారు. వారి ఓటమి 2019 ఎన్నికల్లో బీజేపీ దేశావ్యాప్తంగా ఓటమి పాలవుతుందనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కానోజ్ ఎంపీగా ఉన్న తన భార్య డింపుల్ యాదవ్ 2019 ఎన్నికల్లో తిరిగి పోటి చేయదని అఖిలేశ్ వెల్లడించారు. రాజ్‌నాథ్‌సింగ్, కళ్యాణ్ సింగ్, శివరాజ్‌సింగ్‌లు కుటుంబసభ్యులు రాజకీయలకు దూరంగా ఉన్నారని, తాను కూడా అదే విధానం పాటిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అని, ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నాయని, పొత్తు భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్నది రాజకీయ ఎన్‌కౌంటర్లని, ప్రజల మధ్య మతఘర్షణలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. -
యూపీలో బీజేపీకి షాక్
గోరఖ్‌పూర్/ఫుల్పూర్/పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో రిహార్సల్‌గా భావించిన ఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. 20 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం బీజేపీని దారుణంగా ఓడించింది. గోరఖ్‌పూర్.. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట కావటం గమనార్హం. కాగా, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో లక్నోలో ‘భువా (అత్త), భతీజా (అల్లుడు) జిందాబాద్’ నినాదాలు మార్మోగాయి. అటు బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21వేల ఓట్లతో ఓడించారు. అటు ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ తొలి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి కుశలేంద్రసింగ్పై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 59,613 ఓట్ల తేడాతో నాగేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. మఠానికి ఎదురుదెబ్బ! లోక్‌సభ ఎన్నికల అనంతరం.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి యూపీ ప్రజలు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావించినా.. అది బెడిసి కొట్టింది. 1989 నుంచి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారులే ఈ ఎంపీ స్థానాన్ని గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది.. ఈ మఠం ప్రధాన పూజారిగా ఉన్న యోగి.. ప్రస్తుతం సీఎంగా ఉండగానే రికార్డు బద్దలై ఓటమిపాలవటం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని యోగి అంతా తానై నడిపించారు. కేంద్రం నుంచి స్టార్ క్యాంపేనర్లు రాకుండానే బీజేపీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులెవరూ ఈ రెండు స్థానాల్లో ప్రచారానికి వెళ్లలేదు. అటు, ఫుల్పూర్ స్థానం మొదటినుంచీ బీజేపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గమే. గతేడాది కేశవ్ ప్రసాద్ మౌర్య గెలిచినప్పటికీ.. మొదట్నుంచీ ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలే గెలుస్తూ వస్తున్నాయి. కౌంటింగ్‌పై ఆందోళన కౌంటింగ్ ప్రారంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠతోపాటు గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ప్రాంతానికి 15 అడుగుల దూరంలోనే మీడియాను ఆపేశారు. అంతటితో ఆగకుండా పరదాలు వేసి కౌంటింగ్ మీడియాకు కనబడకుండా చేశారు. అయితే ఈ విషయంపై పార్లమెంటుతోపాటు యూపీ అసెంబ్లీలో విపక్షాలు నిరసన చేపట్టడంతో ప్రభుత్వం, అధికారులు దిగొచ్చి మీడియాను లోపలకు అనుమతించారు. షాక్‌కు గురయ్యాం: బీజేపీ నేతలు తాజా ఫలితాలపై యూపీ బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోరఖ్‌పూర్ మొదట్నుంచీ మా కంచుకోట. యోగి ఆదిత్యనాథ్ వరుసగా నాలుగుసార్లు ఇక్కడినుంచి విజయం సాధించారు. ఎస్పీ ఓడిపోయేదే.. కానీ బీఎస్పీతో దోస్తీ వారికి కలిసొచ్చింది. మేం ఎక్కడ విఫలమయ్యామో సమీక్షించుకుంటాం. మేం సంతృప్తి చెందాల్సిన ఫలితాలు కావివి. మేం కొత్త వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముంది’ అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీ, బీజేపీ విజయం: బిహార్‌లోని జెహనాబాద్, భబువా అసెంబ్లీ స్థానాలకు, అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. జెహనాబాద్‌లో ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ యాదవ్.. జేడీయూ అభ్యర్థిపై 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. భబువాలో బీజేపీ అభ్యర్థి రింకీరాణి పాండే గెలిచారు. ఇటీవలే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సర్ఫరాజ్ ఆలం.. బీజేపీ అభ్యర్థిపై 61,988 ఓట్ల తేడాతో గెలిచారు. తప్పుగా అంచనావేశాం: యోగి ఎస్పీ–బీఎస్పీ కూటమిని తక్కువగా అంచనా వేయటం వల్లే ఓటమిపాలయ్యామని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ఓటమి బీజేపీకి ఓ గుణపాఠమన్నారు. ‘గోరఖ్‌పూర్, ఫుల్పూర్ల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. మితిమీరిన విశ్వాసం, ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రభావాన్ని అంచనావేయలేకపోవటమే మా ఓటమికి కారణం. విజేతలకు శుభాకాంక్షలు. బీఎస్పీ ఓటు.. ఎస్పీకి బదిలీ అవుతుందని అసలు ఊహించలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ–కాంగ్రెస్ కూటములు కలిసి పోటీచేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్నీ సమీక్షించుకుంటాం.2019లో మళ్లీ మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటాం’ అని యోగి వెల్లడించారు. బీజేపీ అహంకార ఫలితమిది: అఖిలేశ్ యూపీలోని రెండు పెద్ద లోక్‌సభ సీట్లను గెలుచుకోవటంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారపూరిత ప్రవర్తన, పరిపాలనపై అలక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనే ప్రజాగ్రహం ఇలా ఉందంటే.. రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. సంపూర్ణంగా మద్దతిచ్చిన మాయావతి ఆంటీకి కృతజ్ఞతలు అని చెప్పారు. ఎస్పీ–బీఎస్పీ అనూహ్య నిర్ణయంతో.. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఎస్పీ, బీఎస్పీలకు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వీటిలో గెలవని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ ప్రభావం పెద్దగా ఉండబోదనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. బీఎస్పీ పార్టీ తరపున అభ్యర్థులెవరూ బరిలో దిగకుండా.. ఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. దీనికి ప్రతిగా వచ్చేనెల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఎస్పీ మద్దతివ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఇరుపార్టీలో క్షేత్రస్థాయిలో కలిసి ముందుకెళ్లి ఘన విజయం సాధించాయి. ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్ ఎస్పీ, బీఎస్పీల దోస్తీని పాము, ముంగీస బంధంతో పోల్చారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని.. అయినా కలసి పోటీ చేయటం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లోనూ ‘పొత్తు’ పొడుస్తుందా? యూపీ ఉప ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కొత్త పొత్తులకు తెరలేవనుంది. బీజేపీని ఓడించేందుకు.. 20 ఏళ్లుగా బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు ఏకమవటం 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయ ఎన్నికల ముఖచిత్రంలో మార్పులను సూచిస్తోంది. మొదట ఈ ఎన్నికల వరకే సహకరించుకోవాలని అఖిలేశ్, మాయావతిలు నిర్ణయించుకున్నారు. అయితే తాజా ఫలితాలు, ఇలాంటి కూటమి అవసరంపై దేశవ్యాప్త చర్చ నేపథ్యంలో ఇరువురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. రెండు బలమైన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం ఒకే ఒరలో కొనసాగగలవనేదే ప్రశ్నార్థకం. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పొత్తులు కొనసాగటం సాధ్యం కాకపోవచ్చు.. కానీ బీజేపీ జోరును అడ్డుకునేందుకు లోక్‌సభ ఎన్నికల వరకైనా కలిసే ముందుకెళ్లే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి మాయావతిని ఆమె నివాసంలో కలిసి అభినందించిన అఖిలేశ్.. దాదాపు 20 నిమిషాలసేపు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. కూటమి కొనసాగింపుపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీ ఇచ్చిన విందుకూ ఇరుపార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును బలపరిచే దిశగా ముందడుగేనని భావన వ్యక్తమవుతోంది. ‘వెయిట్ అండ్ సీ’ అయితే, కూటమిపై బయట చర్చ జరుగుతుండగానే అఖిలేశ్ సన్నిహితుడు, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ‘పొత్తుపై వేచి చూడండి’ అని చెప్పటం 2019లో కలిసి పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫలితాలు విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి చిక్కులు తప్పవనే సంకేతాలను ఇస్తున్నాయి. కమలంలో అంతర్మథనం సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీ ఉప ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అధిష్టానం జీర్ణించుకోలేపోతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోనే ఎక్కువ స్థానాలను గెలుపొంది కేంద్రంలో సొంతంగా మెజారిటీని సాధించిన బీజేపీ.. ఇప్పుడు ఆ యూపీలోనే ఓడిపోవటంతో ఆత్మరక్షణలో పడింది. యూపీలో ఎంపీ స్థానాలు, తర్వాత అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఏకపక్షంగా దూసుకుపోయింది. అలాంటిది.. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో ఇప్పుడు ఓడిపోవటం ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. ఈ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రభావం చూపించవచ్చని, దీంతోపాటుగా మోదీ, అమిత్‌షాల నాయకత్వానికి సవాల్ విసిరే అవకాశముందన్న రాజకీయ విశ్లేషణలూ బీజేపీలో అంతర్మథనానికి కారణమయ్యాయి. ‘ఫలితాలను ఊహించలేదు. ఆత్మపరిశీలన చేసుకుంటాం’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. జిల్లా నేతల్లో విభేదాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ఫలితాలు రాగానే అమిత్ షా హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు ఓపీ మాథుర్‌ను యూపీ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. యూపీలోని చాలా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. వారంతా ఈ ఫలితాలపై సంతృప్తితో ఉన్నట్లు ఢిల్లీకి సమాచారం వచ్చింది. ఇది బీజేపీ అధిష్టానానికి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణ వ్యూహాన్ని మార్చి.. జాటవేతరులు, యాదవేతర ఓబీసీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీ జతకట్టడం.. కాంగ్రెస్ కూడా లోపాయికారిగా వీరికి సహకరించటం ద్వారా బీజేపీ ఓడిందనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడిన ప్రతిసారీ బీజేపీ ఓడిపోయిన విషయాన్ని మరవొద్దని.. విపక్షాలు చీలినప్పుడే బీజేపీ గెలిచిందని ఎస్పీ ఎంపీ ఒకరు తెలిపారు. అసలేం జరిగుంటుందనే దానిపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మేధోమథనం జరుగుతోంది. యూపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా కుల సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది.. ఈ ఎన్నికల్లో బీజేపీ కుల సమీకరణాలను సరిగ్గా పట్టించుకోకపోవటమూ ఓటమికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, రాష్ట్ర నాయకత్వం మితిమీరిన విశ్వాసం కారణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహకారం లోపించిందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు పునరావృతమైతే.. ఒకవేళ యూపీలో గతంలోలాగా ఎక్కువసీట్లు గెలవలేని పక్షంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావటం కష్టమే. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు. తెరపైకి మూడోఫ్రంట్ రావొచ్చనే చర్చా జరుగుతోంది. ఇదంతా ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చు. గుజరాత్ ఎన్నికల తర్వాత విపక్షాలను ఒక్కటొక్కటిగా కూడగడుతున్న కాంగ్రెస్.. తాజా ఫలితాలతో మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కలసి కాంగ్రెస్ కూటమిగా ముందుకెళ్లాలని భావిస్తోంది. గోరఖ్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్, ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ -
బీఎస్పీతో కలిసే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని పేర్కొన్నారు. వ్యూహంలో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని అన్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రజలు స్వాగతించారని చెప్పారు. సర్జికల్ దాడులను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే బీజేపీ, బీఎస్పీ చేతులు కలపాలని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్ పీఐ) నేత రాందాస్ అథవాలే సూచించిన సంగతి తెలిసిందే.