మాయావతి
లక్నో/సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు ముందు జాతీయస్థాయిలోని మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న కనీస ప్రతిఘటన కూడా కాంగ్రెస్‌లో కనిపించడం లేదని ఆమె ఆరోపించారు. బీఎస్పీని, పార్టీ ఆలోచనలను ధ్వంసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సర్ సోనియాగాంధీలు కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు కాంగ్రెస్–బీఎస్పీ కూటమిని కోరుకోవడం లేదన్నారు. ‘బీజేపీ ఏజెంట్ అయిన ఓ స్వార్థపరుడైన కాంగ్రెస్ నేత కారణంగానే ఇదంతా జరుగుతోంది. నేను ఈడీ, సీబీఐ కేసుల ఒత్తిడిలో ఉన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మేం కాంగ్రెస్‌తో కూటమికి సిద్ధంగా లేము’ అని ఆమె మండిపడ్డారు. ‘బీజేపీ వ్యూహాలతో పోటీపడతామనే భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే.. బీజేపీ చాలా సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయం.
మోదీని ఎదుర్కొ నేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతర పార్టీలను కలుపుకుని నిజాయితీగా కూటమిని ఏర్పాటుచేసేందుకు సన్నద్ధంగా లేదు’ అని ఆమె లక్నోలో విమర్శించారు. బీఎస్పీపై కాంగ్రెస్ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌లో ప్రాంతీ య పార్టీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. కూటమితో తమ పార్టీకి ఒరిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల, మతతత్వ పార్టీ అని విమర్శించిన మాయావతి.. ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ భయపడుతోందన్నారు. కాగా, మాయావతి అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment