న్యూఢిల్లీ : ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఉత్తరప్రదేశ్(11), గుజరాత్(4) రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానం అమేథీ నుంచి పోటీ చేస్తుండగా... యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయబరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ సోదరి, ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.(అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ)
గత నాలుగు పర్యాయాలుగా తల్లి, సోదరుని నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోనియా గాంధీ రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతారని, తన స్థానంలో కుమార్తెను రంగంలోకి దింపుతారని అంతా భావించారు. కానీ నిన్న వెలువడిన జాబితాను గమనిస్తే ప్రియాంక ఈసారి కూడా పోటీ చేయరని స్పష్టమైంది. ఎందుకంటే యూపీలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాము చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన అఖిలేశ్, మాయావతి.. కాంగ్రెస్‌కు మొండిచేయి చూపించారు. ఎస్పీ, బీఎస్పీలకు రాష్ట్రంలో మంచి పట్టు ఉండటంతో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది. దీంతో అక్కడ కూటమి, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రస్తుత జాబితాలో పలువురు సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ స్థానం కల్పించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు, అప్నాదళ్ రెండు చోట్ల గెలిచిన సంగతి తెలిసిందే. ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కగా బీఎస్పీ ఒక్కటీ కూడా గెలవలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, యోగి ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఉపయోగించుకుని ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి తీరతామని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment