Great Alliance
-
ఈవీఎంల మొరాయింపు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల వేళ ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు కొన్నిచోట్ల వెంటనే రీప్లేస్ చేసినప్పటికీ.. మరికొన్ని చోట్ల రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7గంటలకే మహిళలు, వృద్ధులు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ... తీరా ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి క్యూలైన్లో నిలబడే ఓపిక లేక చాలామంది నిరాశతో వెనుదిరిగారు. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం లైటింగ్ కూడా లేకపోవడంతో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు, గుర్తులు సరిగా కనిపించక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పినప్పటికీ... పాతబస్తీ సహా ఏ ఒక్క కేంద్రంలోనూ వీల్చైర్లు కనిపించలేదు. దీంతో వారిని వలంటీర్లు కుర్చీలపై లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడెక్కడ అంటే... ♦ కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఓటు ఉన్న రామ్‌నగర్‌లోని జేవీ హైస్కూల్లోని బూత్ నెంబర్.229లోని ఈవీఎం మొరాయించింది. ♦ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1,2లోని బూత్ నెంబర్ 245లో సుమారు 1200 ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్‌కు మారాయి. దీంతో వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అధికారుల నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ ఎల్లారెడ్డిలోని పీజేఆర్ కమ్యూనిటీ హాల్ పోలింగ్ బూత్ సహా న్యూటౌన్ స్కూల్లోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యమైంది. ♦ రామంతాపూర్‌లోని బూత్ నెంబర్ 259లో ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో మెషిన్ మొరాయించింది. ఓటింగ్ మొదలై రెండు గంటలు దాటినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ హెచ్‌బీ కాలనీలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లు సైతం ప్రస్తుత ఎన్నికల్లో లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. చర్లపల్లిలోని శాంతినికేతన్ స్కూల్లో ఈవీఎం మొరాయించింది. మల్లాపూర్ జాన్సీ స్కూల్లోని 143 పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నాచారం ఎర్రకుంటలోని 187 పోలింగ్ బూత్‌లోని ఈవీఎం మొరాయించడంతో అధికారులు కొంతసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. ♦ కూకట్పల్లి బూత్ నెంబర్.12లోని ఈవీఎం మొరాయించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఈవీఎంను రీప్లేస్ చేసి సమస్యను పరిష్కరించారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని బూత్‌నెంబర్ 203లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. అదే విధంగా ఫతేనగర్‌లోని బూత్‌నెంబర్ 135లో ఈవీఎం పనిచేయలేదు. మూసాపేట మున్సిపల్ కార్యాలయంలోని 193 పోలింగ్ బూత్‌లో లైటింగ్ లేకపోవడంతో ఐవీ ప్యాడ్‌పై అభ్యర్థుల ఫొటో, పార్టీ గుర్తు కన్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ♦ కంటోన్మెంట్‌లోని బూత్ నెంబర్ 78లో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ♦ రాంగోపాల్‌పేట కుర్మబస్తీలో సెయింట్ ఆంథోనిస్ స్కూల్లోని పోలింగ్ బూత్ 11లో 11మంది తమ ఓట్లు వేసిన తర్వాత మెషిన్ మొరాయించింది. ఓల్డ్బోయిగూడలోని బూత్ నెంబర్.46లో కూడా మెషిన్ మొరాయించింది. ♦ మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని బూత్ నెంబర్ 185, 58లతోని ఈవీఎంలు మొరాయించాయి. ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లో ఎదురుచూడాల్సి వచ్చింది. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ మల్కజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లోని గుడ్‌షప్పర్డ్ స్కూల్లో పని చేయలేదు. బాలుర ఉన్నత పాఠశాలలో ఈవీఎం మొరాయించింది. ♦ చాంద్రాయణగుట్ట రాజన్నబావి సెయింట్ మేరీస్ స్కూల్లో ఈవీఎం మొరాయించింది. యాకుత్‌పురా నియోజకవర్గం కుర్మగూడలోని బూత్ నెంబర్78లో ఈవీఎం మొరాయించడం తో ఓటర్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ♦ జాంబాగ్ డివిజన్లో భారీగా ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. ♦ శేరిలింగంపల్లి బూత్ నెంబర్ 69, విట్టల్రావునగర్ ఇమేజ్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం, చందానగర్‌లోని సరస్వతి విద్యామందిలోని బూత్ నెంబర్ 87 సహా భవానీపురం బూత్ నెంబర్ 141, ఆల్వీన్‌కాలనీ మాంటిస్సోరీ స్కూల్లోని బూత్‌నెంబర్ 462లోని ఈవీఎంలు సైతం మొరాయించాయి. -
ముమ్మర తనిఖీలు
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు, మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఎన్నికల బందోబస్తుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలను వినియోగిస్తున్నారు. పాతబస్తీ,నేరెడ్మెట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. సాక్షి, సిటీబ్యూరో ,చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ నగరంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. పురానీహవేళీలోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 4587 లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేసుకున్నామన్నారు. ఆధారాలు చూపని రూ.27 కోట్ల నగదు, రూ.2.5 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎస్సై స్థాయి అధికారి ఘటనా స్థలంలోనే ఇ–పెట్టి కేసు నమోదు చేసేలా ఎలక్ట్రానిక్ ప్యాడ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4275 మందిని బైండోవర్ చేశామన్నారు. 165 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, అందులో 146 ఎఫ్ఐఆర్లు చేసినట్లు ఆయన వివరిచారు. రౌడీలు బెదిరింపులకు పాల్పడడం, తుపాకుల వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు భయం లేకుండా, ప్రశాంతంగా తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు. బందోబస్తు సిబ్బందికి అన్ని సౌకర్యాలు గచ్చిబౌలి: ఎన్నికల పోలింగ్ బందోబస్తును క్రమశిక్షణతో నిర్వహించాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందోబస్తుకు వెళ్లే సిబ్బందిని స్వయంగా కలిసి కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... బందోబస్తులో సౌకర్యాల కోసం రాజకీయ పార్టీల సహకారం తీసుకోరాదని, ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు పాల్గొన్నారు. రూ.40 లక్షల నగదు పట్టివేత గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఐడీబీఐ బ్యాంకు ఆవరణలో కేబీ వేణుగోపాల్‌రాజు, ఎం.అశోక్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తులు రూ. 40 లక్షల నగదు తీసుకెళుతుండగా ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరు కొండాపూర్‌లోని జయశ్రీదేవి హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాని వెంకటేశ్వర్రావు వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. నగదుకు సంబందించి ఆధారాలు చూపక పోవడంతో ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ పార్టీ నేతకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలగూడలో రూ. 4 లక్షలు స్వాధీనం చిలకలగూడ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొంగుళూరు గేట్‌కు చెందిన కర్నాటి సునీల్ బుధవారం అర్ధరాత్రి ఇన్నోవాలో వెళుతుండగా చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పాలిథిన్ బ్యాగులో రూ. 4 లక్షల నగదును గుర్తించారు. నగదు సంబందించి ఆధారాలు లేకపోవడంతో కారు డ్రైవర్ సునీల్‌ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. సదరు వాహనం చంపాపేటకు చెందిన ప్రకాశ్ముదిరాజ్దిగా గుర్తించారు. కోర్టు అనుమతితో సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చైతన్యపురి: కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సరూర్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రంగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో 144 క్వార్టర్ బాటిళ్లు గుర్తించారు.మద్యాన్ని తరలిస్తున్న బైరామల్‌గూడకు చెందిన రాఘవేందర్‌గౌడ్, సరూర్‌నగర్‌కు చెందిన మాచగోని కృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం బాటిళ్లతో పాటు కారును సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో... ఘట్కేసర్: ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు మండలంలోని కేపాల్ చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం రూ.3,04,000 స్వాధీనం చేసుకున్నారు. కేపాల్ జాతీయ రహదారిపై తనిఖీ చేస్తుండగా భువనగిరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో దత్తాద్రి అనే వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్టీ బృందానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు. -
అభివృద్ధి అంటే.. ఏంటో చూపిస్తా
సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో నాయకులు విఫలమవుతున్నారు. వారికి భిన్నంగా పాలన సాగిస్తా. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దమే నా లక్ష్యం’ అని ప్రజాకూటమి అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అంటున్నారు. ఎన్నికల ప్రచారం.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.. ఎలా ఉంది? రాజకీయాలు నాకు కొత్తేమి కాదు. పరోక్షంగా 30ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అందువల్ల పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజల నుంచి స్పందన చూసి అశ్చర్యపోయాను. మేయర్ నరేందర్ పాలనపై వారికి ఉన్న అసంతృప్తితోనే నేను గెలుస్తానన్న ధీమా వచ్చింది. అభ్యర్థి ఎవరు అన్న విషయం కాకుండా ఎలాంటి వాడు అన్న అంశాన్నే చూస్తారు. మీరు గెలిచిన తర్వాత కలవాలంటే ఖమ్మం వెళ్లాలనే ప్రచారం జరుగుతోంది కదా? ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కావాలనే ఈఅసత్యపు ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టింది వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో.. చదువు సైతం వరంగల్ నగరంలోనే సాగింది. దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో చదువుతుండగా చదువును మధ్యలో ఆపివేశాను. నేను వ్యాపారపరంగా ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటాను. వ్యాపార సౌలభ్యం కోసం ఖమ్మంలో స్థిరపడ్డాను. వరంగల్, హన్మకొండలో ముగ్గురు సోదరులు, కుటుంబ సభ్యులంతా ఉంటున్నారు. రాజకీయాల్లోకి ఎందుకు రావాలకున్నారు.. ఏం చేస్తారు? గ్రానైట్ వ్యాపారంలో ఉంటూనే సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. లాభాపేక్షతో కాకుండా వచ్చి న దానిలో కొంత సామాజిక, దైవ కార్యాలకు వినియోగించాలని అనుకున్నా. అందువల్లే ఆదివాసీ ల ఆరాధ్యదైవమైన సమ్మక్క–సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణంలో గ్రానైట్‌ను వేయించాను. ఢిల్లీ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న స్మారక స్థూపం కోసం అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు 230 టన్నుల గ్రానైట్ ఏకరాయిని సరఫరా చేశా. అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టంగా ఉందా..? అదేం లేదు. గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దీంతో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట పెద్దగా స్పందన వస్తోంది. అధికార పార్టీ కావడంతో కొంత మంది భయపడి ప్రత్యక్షంగా ప్రచారంలోకి రావడం లేదు. అంతర్గతంగా ప్రచారంభారీగా సాగుతోం ది. టికెట్ ఖరారు కావడంలో జరిగిన జాప్యం వల్ల ప్రచారం ఎక్కువ రోజులు చేయలేక పోయా ను. కొండా దంపతుల అండదండలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాబలం తనకు ఉంటే చాలు. అయినప్పటికీ ప్రభుత్వంతో పాటు మేయర్‌పై ఉన్న అసంతృప్తితో తప్పక గెలుస్తానన్న నమ్మకం ఉంది. నగర అభివృద్ధిపై మీ కామెంట్? గ్రేటర్ వరంగల్ మేయర్‌గా నరేందర్ పూర్తిగా వైఫల్యం చెందినట్లు భావిస్తున్నా. గెలిచి మూడేళ్లు కావొస్తున్నా అనుకున్న విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడలో ఆయన ఫెయిలయ్యారు. కేంద్రం నుంచి అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీల కింద, రాష్ట్రం నుంచి బడ్జెట్లో కేటాయించిన రూ.900కోట్లకు పైగా నిధులు వచ్చినా అందులో 10శాతం ఖర్చు చేయలేకపోవడమే ఆయన పనితనానికి నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో పదేళ్లు నియోజకవర్గ అభివద్ధి వెనక్కి పోయినట్లే. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద నేతలున్నారు. మేయర్ పదవి ఉండగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం ఆయన అత్యాశకు నిదర్శనం. -
ఇప్పుడే బాగుంది! సంక్షేమం నచ్చింది.. బాబుతో పొత్తేంది?
సాక్షి నెట్వర్క్ : ముంబయి – విజయవాడ హైవేలో 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట ఎన్నికలపై జనం పల్స్ తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఇందులో భాగంగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 304 కిలోమీటర్ల మేర సాక్షి ప్రతినిధులు పర్యటించారు. ఈ పర్యటనలో వారు మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు రహదారి పక్కన ఉన్న విభిన్న వర్గాల ప్రజలను...ప్రయాణికులను కలిశారు. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం 10 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం దాదాపు 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో కనీసం 15 నుంచి 20 మందిని..ఎన్నికలపై అభిప్రాయాన్ని కోరింది. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత, రైతులు, కూలీలు, దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ పలకరించి వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మెట్రోనగరం హైదరాబాద్‌తోపాటు జహీరాబాద్, పటాన్చెరు, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి చిన్నపట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు ఈ రూట్లో అధికంగా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ప్రజలు కూడా భిన్నంగా స్పందించడం ఇక్కడ విశేషం. తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్ పొత్తా? సంక్షేమ పథకాలు, వాటి అమలు, లోటుపాట్ల గురించి మాట్లాడుతూనే జనం రాజకీయాలపైనా అభిప్రాయాలు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. అవసరం కోసమే చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేస్తుండని విమర్శలు గుప్పించారు. తాము కాంగ్రెస్‌ను అభిమానించే వాళ్లమయినా..బాబు పొత్తు కారణంగా ఈసారి టీఆర్ఎస్ వైపు చూస్తున్నామని కొందరు నిర్మొహమాటంగా చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఏమవసరమని ప్రశ్నించారు. ఇక పల్లెల్లో పథకాలు బావున్నాయని, కొందరు అమలు తీరు మెరుగుపడాలని మరికొందరు చెçప్పుకొచ్చారు. పథకాలకు ప్రశంసలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఈ షోలో పలుచోట్ల ప్రశంసలు వచ్చాయి. కొందరు పథకాల్లోని లోపాలనూ ఎత్తిచూపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారు. ఆయనే మళ్లీ రావాలి’ అని జహీరాబాద్ రూట్లోని హుస్నాబాద్ మండలం రాయికోడ్‌కు చెందిన ఏసయ్య చెప్పారు. పింఛన్లు ఎంతో మేలు చేస్తున్నాయని, ఇంత పద్ధతిగా గతంలో ఎవరూ పింఛన్లు ఇవ్వలేదని ఎల్గోయి గ్రామానికి చెందిన మణయ్య పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ వంటి పథకాలు తమను కాంగ్రెస్ వైపునకు దృష్టి మళ్లిస్తున్నాయని గోపన్‌పల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరిందని, ఆయనే మళ్లీ సీఎంగా రావాలని పటాన్ చెరు పరిధిలోని బీరంగూడకు చెందిన ఎండీ ఖాన్ చెప్పుకొచ్చారు. పథకాలకు ప్రచారమే మిగిలింది తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ మల్లేశ్వర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలన బాగుందని, ఆయనొచ్చాక రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని కూకట్‌పల్లికి చెందిన ఉద్యోగి నవీన్ చెప్పారు. ‘సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం మారితే గందరగోళం ఏర్పడుతుంది. పథకాల లక్ష్యం నెరవేరాలంటే మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలి’ అని లక్డీకాపూల్‌లోని పండ్ల వ్యాపారి అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు. ఎవరికి ఓటేస్తానో చెప్పలేను కానీ సిటీలో రోడ్లు బాగాలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా నగర రోడ్లను పట్టించుకోలేదు అని తన ఆవేదన వ్యక్తం చేశారు పంజగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ శర్వన్సింగ్. ‘గర్భిణిలకు కేసీఆర్ కిట్లు, పిల్ల పెండ్లికి షాదీ ముబారక్ ఎంతో బాగుంది. అందుకే ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలి’ అని ఎర్రగడ్డకు చెందిన బ్యాటరీ మెకానిక్ రఫీక్ వెల్లడించారు. సర్కారు పథకాలు కింది స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎల్బీనగర్లో చెప్పుల బడ్డీ నడుపుకుంటున్న శకుంతల ప్రశ్నించింది. ‘ఎన్నికలు డబ్బుమయంగా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు కొంతమేరకు పర్లేదు. కానీ ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోలేదు’ అని చెప్పారు గుండ్రాంపల్లికి చెందిన చిట్టిప్రోలు రాములు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన కాసింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘టీఆర్ఎస్ను ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వారు టీడీపీతో జతకట్టడం ఏం బాలేదు. ఇది విఫల యత్నమే అవుతుంది. ఈ కారణంగానే నేను టీఆర్ఎస్కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా’ అని నిర్మొహమాటంగా చెప్పారు ఎల్బీనగర్కు చెందిన శేఖర్‌రెడ్డి. తెలంగాణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టాలని హయత్‌నగర్‌కు చెందిన రవి అనే హోటల్ నిర్వాహకుడు ఆకాంక్షించారు. ‘అవసరం కోసం వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ చురకలంటించారాయన. ‘సంక్షేమ’ పాలనకు కితాబు.. గ్రేటర్ హైదరాబాద్ వరకు ఓటర్లు ఓ విధంగా స్పందించగా...నగరం దాటాక గ్రామీణ, చిన్నచిన్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు భిన్నరీతుల్లో స్పందించారు. ఈ రూట్లో కొందరు పథకాలను మెచ్చుకోగా...కొందరు అవి అసలైన లబ్ధిదారుల వరకు చేరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు కరెంటు 24 గంటలు ఇవ్వడాన్ని కేసీఆర్ క్రెడిట్‌గా చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధించడంతోపాటు బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కే ఈ ఎన్నికల్లో విజయమని కుండబద్ధలు కొట్టారు చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లింగస్వామి. టీఆర్ఎస్ పాలన బాగుందని, అందుకే మరోసారి ఆయనదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు వట్టిమర్తికి చెందిన జాల యాదయ్య. ‘ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలూ అదేదారిలో వెళ్తున్నాయి. ఉన్నంతలో ఏ పార్టీ ఈ విషయంలో ఉత్తమమైనదో ఆలోచించి ఓటేస్తాను’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు చిట్యాలకు చెందిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు. కేసీఆర్ పథకాలు పూర్తి స్థాయిలో, కింది స్థాయి వరకు అర్హులకు ఇంకా చేరాల్సి ఉంది’ అని వెల్లడించారు ఏపీ లింగోటం గ్రామానికి చెందిన ముద్రబోయిన శంకర్. ప్రజలకు పూర్తిస్థాయిలో పథకాలు చేరితేనే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన అనుముల లక్ష్మయ్య కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆయనే మళ్లీ సీఎంగా రావాలని అన్నారు. ‘రైతులకు ఇప్పటి వరకు 24 గంటల కరెంటు ఎవరైనా ఇచ్చిండ్రా...కేవలం కేసీఆర్ ఒక్కరే ఇచ్చిండ్రు’ అని ఆయన గట్టిగా చెప్పారు. ‘పేదలకు ఇళ్లు ఇస్తామన్న హామీ ఒక్కటే నెరవేర్చలేక పోయారు’ అంటూ నిరసన తెలిపింది సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన కూలి పల్లెపు భద్రమ్మ. ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయని చెప్పిన కేతేపల్లి కిరాణా షాపు వ్యాపారి బయ్య సర్వయ్య..‘కేసీఆర్ తప్పక గెలుస్త’డని భరోసాగా చెప్పారు. యువత కోసం టీఆర్ఎస్ సర్కారు ఏమైనా చేసి ఉండాల్సింది’ అని అభిప్రాయపడింది కొత్తపేటకు చెందిన విద్యార్థిని సరిత. ప్రభుత్వ పనితీరు బాగుందని, మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మునగాల మండలం బరాఖత్‌గూడ గ్రామానికి చెందిన ఏటి రామకృష్ణ పేర్కొన్నారు. కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేశారని, అవి కోట్లాది మందికి లబ్ధి చేకూర్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ అధికంగా ఉందని, కేసీఆర్ ప్రభుత్వ పనితీరు పర్వాలేదని మునగాలకు చెందిన తూముల వీరస్వామి పేర్కొన్నారు. మా ఊళ్లో ఎన్నికల సందడి జోరుగున్నదని మునగాల మండలం బరాఖత్‌గూడెంకు చెందిన గండు అజయ్ చెప్పారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన బాగుందని, ఆయన పథకాలు అద్భుతమని కితాబిచ్చారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారం తీరే మారింది. ఏది ఏమైనా టీఆర్ఎస్ పాలనే బాగుంద’ని చివ్వెంల మండలం తిరుమలగిరికి చెందిన కోడి రాములు పేర్కొన్నారు. ఎన్నికలు డబ్బుమయంగా మారాయని, ఈ విషయంలో పార్టీల ధోరణి మారాలని ఈ మార్గంలో ఎదురుపడిన కొందరు యువకుడు అభిప్రాయపడ్డారు. కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన బూరెల కరుణాకర్ ఎన్నికలపై స్పందిస్తూ ‘ప్రతిసారి ప్రభుత్వాలు మారితే బాగుండదు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పథకాలు, ప్రాజెక్టుల పనులు మధ్యలో ఉన్నాయి. అవి పూర్తయ్యే వరకైనా మరోసారి కేసీఆర్‌కే అవకాశం ఇస్తే మంచిది’ అని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ అంశాలపైనే స్పందనలు... ♦ టీడీపీతో కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ♦ ఈ వ్యతిరేకత పట్ణణ ప్రాంతాల్లో ఎక్కువ కన్పించింది. ♦ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహంపై ఎక్కువ మందిస్పందించారు. ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ♦ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు వంటి పథకాలుగ్రామస్థాయికి ఇంకా చేరాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ పథకాలు బాగున్నాయని అత్యధిక మంది కితాబిచ్చారు. ♦ కేసీఆర్, ప్రభుత్వ పనితీరు బాగున్నా.. స్థానిక ఎమ్మెల్యేల వ్యవహారశైలి మారాల్సిన అవసరం ఉందని కొందరు ప్రస్తావించారు. ♦ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలి. కాళేశ్వరం పూర్తయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలు సాగవుతాయి. వలసలు తగ్గుతాయి. ఈ పరిస్థితి రావాలంటే మరోసారి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే వస్తే మేలు. – బాలచందర్,టీస్టాల్, అమీర్‌పేట తొలిసారిఓటేస్త.. ఈసారే ఓటరుగా నమోదయ్యా. అన్ని పార్టీలోళ్లు ఇంటికొస్తున్నారు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. కానీ కేసీఆర్ సర్కారు పథకాలు మంచిగుండె. ఇంట్ల పింఛన్లు వస్తున్నయ్. – అశోక్, చెప్పులు కుట్టే వ్యక్తి, మియాపూర్ ఎవరు గెలిస్తే ఏంది? రోడ్డుకు అడ్డమొచ్చినాదని గుడిసె కూల్చేశారు. ఎవరొచ్చినా అంతే చేస్తారు. ఈ రాజకీయాలు నాకెందుకు. నా యాపారం సక్కగా నడిస్తే బాగుండు. – లక్ష్మమ్మ,కుండల వ్యాపారి, చైతన్యపురి పిల్లలు పుడితే డబ్బులిస్తుండు సీఎం సారు పిల్లలు పుడితే డబ్బులిస్తుండు. ఆ డబ్బులతో ఆసుపత్రి ఖర్చులన్నీ వస్తున్నాయి. టైంకి పింఛè న్ ఇస్తుండు. మళ్లీ సర్కారు మారితే చాలామంది ఆగం అవుతరు. – కె.లక్ష్మి,అల్లం వెల్లుల్లి వ్యాపారి,ఓల్డ్ మలక్‌పేట మరోసారిఅవకాశం ఇవ్వాలి తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లే కదా. అందుకే కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నా. టీఆర్ఎస్కే మా మద్దతు. కూటమితో ఒరిగేదేమీ లేదు. – సతీష్ ఎలక్ట్రీషియన్, మన్సూరాబాద్ -
ఆపరేషన్ ఆకర్ష్
సాక్షి,సిటీబ్యూరో/కూకట్పల్లి: ఐదేళ్ల కాలానికి తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు గంటల గడువే మిగిలింది. మూడు వారాల పాటు హోరెత్తిన ప్రచార జోరు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగియడంతో అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. బూత్‌ల వారిగా మహిళలు, యువకులు, కులాలు, వర్గాల వారిగా జాబితాలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు, వారి అనుయాయులు నగదు, బహుమతులు, గిప్ట్ కూపన్లు పంపిణీకి సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం నుంచే మొదలైన పంపకాల వ్యవహారం పోలింగ్ ముగిసే దాకా కొనసాగే అవకాశం ఉంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లోనూ టెన్షన్ మొదలైంది. ఎలాగైనా సరే గెలవాలని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో విందుల రాజకీయం మొదలెట్టారు. నగరంలో దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎవరికి వారు గెలుపు కోసం పంపకాల వ్యూహాన్ని రచించుకుంటున్నారు. పంపకాలు, ప్రలోభాల ద్వారా కనీసం ఐదు శాతం ఓరట్లనైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ఉన్న ఏ అవకాశాన్నీ ఏ అభ్యర్థీ వదులుకోవడం లేదు. ఈసారి ఎంఐఎం ప్రాబల్యం ఉన్న స్థానాల్లోనూ పోటీ ఉండడంతో పాతబస్తీలోనూ డబ్బు ప్రభావం భారీగానే కనిపిస్తోంది. శివారు నియోజకవర్గాల్లో కులం, ప్రాంతాలతో పాటు మహిళా సంఘాలకు బల్క్‌గా ఆన్లైన్ బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో కరెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం సైతం అంచనాకు వచ్చింది. చివరి క్షణం దాకా ప్రచారమే.. నగరంలో తమ పార్టీ అభ్యర్థుల విజయాల కోసం ప్రధాని నరేంద్రమోఢీ,ఏఐసీసీ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్ మొదలు.. ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్రమంత్రులు పాశ్వాన్, జేపీ నడ్డా, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు ప్రచార సభల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు అన్నీ తామై వ్యవహరించి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలే ప్రచారాస్త్రాలను విసిరారు. 21 రోజుల పాటు సాగిన ప్రచారంలో అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల నాయకులు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల విశ్రాంతే తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రచారం చివరి రోజు నగరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా రోడ్డు షోలు, సభలు, సమావేశాలతో బిజీబీజీగా గడిపారు. తేలికగా నగదు బదిలీ ఇలా.. ప్రచారంలోనే కాదు.. ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు నగదు పంపిణీలోనూ అభ్యర్థులు హైటెక్బాట పట్టారు. తేజ్ యాప్, పేటీఎం, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ విధానాల ద్వారా ఓటర్లకు నగదు బదిలీ చేసేస్తున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు బూత్‌లవారీగా ఇంటింటికీ తిరిగి ఓటర్ల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లను సేకరిస్తున్నారు. ఈ వివరాలను పార్టీ నేతలకు చేరవేయడంతో పాటు నగదు బదిలీకి ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఎన్నికలకు గడువు కొన్ని గంటలు మాత్రమే మిగలడంతో ఈ కార్యకలాపాలు నగరంలో ఊపందుకున్నాయి. బస్తీలు, కాలనీలవాసుల్లో తొంభై శాతానికి పైగా బ్యాంకు ఖాతాలుండడంతో తమ పని సులువైందని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఒక్కో ఓటుకు ప్రాంతాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు ధర నిర్ణయించినట్టు సమాచారం. నగరంలో పోలీసులు, ఎన్నికల సంఘం నిఘా బృందాలు నగదు, మద్యం రవాణాపై డేగకన్ను వేయడంతో అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నాయకగణం హైటెక్ నగదు పంపిణీ బాటపట్టారు. కాలనీలకు తాయిలాలు.. మద్యం, నగదు పంపిణీతో పాటు మహిళలు, వృద్ధులు, యువత ఓట్లను రాబట్టుకునేందుకు అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నాయకగణం కాలనీలు, బస్తీల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల ఓటర్లను కలుస్తూ భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల మిక్సీలు, కుట్టుమిషిన్లు, గృహోపకరణాలతో పాటు యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లు పంపిణీ చేస్తుండడం విశేషం. ఈ పంపిణీ ప్రక్రియ కూడా గుట్టుగానే సాగుతోంది. ఇప్పటికే ఆయా కాలనీలు, బస్తీల్లో కొందరు ముఖ్య నేతలు, కార్యకర్తల ఇళ్లలో నిల్వచేసిన వస్తువులు, మద్యాన్ని మాత్రమే ఓటర్ల ఇంటికే నేరుగా వెళ్లి పంపిణీ చేస్తుండడం గమనార్హం. కూకట్‌పల్లిలో సీమాంధ్ర టీడీపీ నేతల హల్చల్ ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. సీమాంధ్ర నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు అరాచకంగా డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెడుతుండడం సంచలనం సృష్టించింది. పక్షం రోజులుగా కూకట్‌పల్లిలోని వివిధ డివిజన్లలోని హాస్టళ్లు, లాడ్జీలు, రెస్ట్‌రూమ్‌లను అడ్డాగా చేసుకొని ఇప్పటి దాకా ప్రచారం చేశారు. దీనికితోడు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలను డివిజన్లు, బూత్‌ల వారీగా ఇన్చార్జులుగా నియమించి ఇంటింటికీ డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. అనంతపురానికి చెందిన ప్రభాకర్‌చౌదరి ప్రలోభాలతో కులాలు, మతాల వారీగా, మహిళా సంఘాల వారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు తన అనుచరులతో నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం స్థానిక నాయకులకు కూడా సమాచారం లేకుండా పూర్తిస్థాయిలో ఏపీ నుంచి వచ్చిన నేతలు, యువకులతో గుంపులుగా వెళ్లి ఓట్లను గంపగుత్తగా కొనుగోలుచేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నుంచి మాకాంను ఓ కళాశాల ఆవరణలోకి, నిర్మాణంలో భవనంలోకి మార్చి అక్కడి నుంచి డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. బస్తీలు, మురికివాడలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రధానంగా ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, ఫతేనగర్, అల్లాపూర్, మూసాపేట తదితర డివిజన్లలో డబ్బుల పంపిణీ అధికంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోట్లాది రూపయాలతో ఇప్పటికే నియోజకవర్గంలో తిష్టవేసిన టీడీపీ చెందిన ఇతర ప్రాంతాల నాయకులను కట్టడి చేయడంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలానగర్‌లో లక్షల్లో నగదు పట్టివేత బాలానగర్‌లోని ఓ థియేటర్ ఆవరణను అడ్డాగా మార్చుకొని కొందరు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు, కుల సంఘాల ప్రతినిధులకు డబ్బులు పంచేందుకు యత్నించగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు పట్టించారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్ ఎదుటనే ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే థియేటర్ కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పోలీసులు, ఎన్నికల విభాగం ప్లైయింగ్ స్కాడ్ థియేటర్లోకి వెళ్లి తనిఖీ చేశారు. అప్పటికే అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వారిని చూసి అక్కడి నుంచి జారుకున్నారు. గతంలో బాలానగర్ డివిజన్ నుంచి కార్పొటర్గా పోటీచేసిన ఇద్దరు టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇక్కడి థియేటర్ ప్రాంగణంలో ఉండగా వారికి కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల తనిఖీల్లో రూ.8,80,700 పట్టుబడింది. అయితే సదరు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేకపోవడం గమనార్హం. రూ.40 లక్షల నగదు పట్టివేత గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని ఐడీబీఐ బ్యాంక్ సమీపంలో రూ.40 లక్షలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులో తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అనంతరం అదాయ పన్నుశాఖ అధికారులకు సమాచారం అందించారు. పట్టుబడిన వ్యక్తులు మధ్యవర్తులుగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతన్నారు. ఎవరికి నగదు చేరవేసేందుకు ఐడీబీఐ బ్యాంక్ లాకర్ నుంచి తీసుకొచ్చారో తెలియాల్సి ఉంది. -
ప్రచారమస్తు
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ముఖ్య ఘట్టానికి నేటితో తెరపడనుంది. ఇన్నాళ్లు తమ గెలుపు కోసం ప్రజాక్షేత్రంలో తలమునకలైన అభ్యర్థులు.. బుధవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పనున్నారు. చివరిరోజు ప్రధాన పార్టీలన్నీ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, సభలతో ఎన్నికల హీట్‌ను క్లైమాక్స్‌కు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. గడిచిన రెండు వారాలుగా మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో గ్రేటర్‌పై అన్ని రాజకీయ పక్షాలు ప్రధాన దృష్టి సారించి అగ్రనేతలందరినీ ప్రచారపర్వంలోకి దింపాయి. పీఎం నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు, శివరాజ్‌సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్ణవీస్లు ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేశారు. మేడ్చల్‌లో సోనియా, పరేడ్‌గ్రౌండ్స్‌లో కేసీఆర్, ఎల్బీస్టేడియంలో మోదీల సభలు ప్రతిష్టాత్మకంగా జరగ్గా, ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఆయా వేదికలుగా గ్రేటర్ బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఒకే చోట ప్రత్యక్ష్యమయ్యారు. ఆయా నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కేడర్‌ను కూడా తరలించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నఖ్వీ, నడ్డా, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయా నియోజవర్గాల్లో ప్రచారం చేశారు. సినీతారలు ఖుష్బూ, నగ్మా, విజయశాంతి, క్రికెటర్లు అజారుద్దీన్, సిద్ధూలతో పాటు కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, కర్ణాటక మంత్రి శివశంకర్ ప్రజాకూటమి తరఫున ప్రచారం చేశారు. వీరేగాక.. కాంగ్రెస్‌కు చెందిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండు వంటివారు సైతం రంగంలోకి దిగారు. ఇంకా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన పలువురు అక్కడ అవకాశం రాకపోవడంతో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఫామ్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్‌లో బీఎస్పీ బహిరంగసభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాయావతి హాజరైన ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక అధికార టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నీతానై నడిపించారు. గ్రేటర్ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆయనే రోడ్‌షోలు నిర్వహించి, టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కూకట్పల్లి నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని టీడీపీ తరఫున బరిలో ఉండడంతో చంద్రబాబు, బాలకృష్ణలు ఆమె కోసం రోడ్‌షోలు నిర్వహించగా.. ఏపీ టీడీపీ ముఖ్యనేతలంతా ఇక్కడే మకాం వేశారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు, రాహుల్‌గాంధీ, కె.నారాయణ ఒక జట్టుగా పలు నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నుంచి రోడ్డు షోలు, బహిరంగ సభలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిచిపోనుండడంతో పాటు సోషల్ మీడియా మీద కూడా ఎన్నికల సంఘం నియంత్రణ విధించనుంది. బల్క్ ఎస్సెమ్మెస్‌లను సైతం నిషేధించనున్నారు. ఇదిలా ఉంటే ప్రచారం చివరి రోజు నగరంలో భారీ బందోబస్తుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నగరంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ బృందాలను రంగంలోకి దింపి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై గస్తీ, నిఘా కట్టుదిట్టం చేయనున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనులపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. గడువు తర్వాత ఏ విధంగా ప్రచారం చేసినా ఆయా అభ్యర్థులపై కేసులు నమోదు చేయాలని స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. రోజంతా సందడే సందడి ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉండడంతో మంగళవారం నగరంలో పలువురు ముఖ్య నాయకులు రోడ్ షోలు, సభలతో జనంలో వచ్చారు. ఏపీ, మధ్యప్రదేశ్ సీఎంలు చంద్రబాబు కంటోన్మెంట్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్లోను, మరో సీఎం శివరాజ్‌సింగ్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక సినీనటుడు బాలకృష్ణ కూకట్‌పల్లిలో రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లగడపాటి పేరుతో విడుదలైన సర్వే చిలకజోస్యమని విమర్శించారు. ఈనెల 11వ తేదీ తర్వాత మిగిలేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, కేసీఆర్ ఒక్కరే పక్కా లోకల్ అని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సైతం చంద్రబాబు, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
వార్ వన్ సైడ్
హైదరాబాద్ పాత నగరం.. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రాచీన నగరంలో హిందూ ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచారార్భాటాలు ఇక్కడ నడడవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్’గా అందరి నోళ్లలో నానే మజ్లిస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నాయి. పాత నగరం మనోగతం ⇒ నిజాం కాలం నాటి అంతర్గత డ్రైనేజీ, నీటి పైప్లైన్ల ఆధునీకరణ.. వర్షపు నీరు రోడ్లు, బస్తీలను ముంచెత్త్తకుండా నివారణ చర్యలు ⇒ ఇరుకైన రోడ్లు, బ్రిడ్జిల విస్తరణ, అంతర్గతడ్రైనేజీ, ఓపెన్ కాల్వల శుద్ధి.. ⇒ శిథిలావస్థలోని పురాతన కట్టడాల తొలగింపు ⇒ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు ⇒ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల తొలగింపు ⇒ నిరుపేదలకు ఉచితంగా కేజీ టూ పీజీ విద్య, పేదల సౌకర్యార్థం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన ⇒ చిరు వ్యాపారులకు బ్యాంక్ లింకేజీ లేకుండా రుణాలు, ఆర్థిక చేయూత ⇒ వృత్తి నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు ⇒ పాతబస్తీలో రోడ్డు రవాణా సౌకర్యాల మెరుగు.. మెట్రో పొడిగింపు ⇒ హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ కేంద్రం నెలకొల్పాలి ⇒ ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానా విధానాన్ని రద్దు చేయాలి. చార్మినార్: అహ్మద్‌ఖాన్ ఆరోసారి.. చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ అడ్డా. ఇక్కడ ఐదు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉంది. యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు గెలుపొందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఆరోసారి ఇక్కడి నుంచి పోటీకి దిగారు. ఇంకా మహ్మద్ గౌస్ (కాంగ్రెస్), ఉమా మహేందర్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఇక్కడ మజ్లిస్‌కు పోటీ అంతంతే. గత ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి 36 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీపై గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గౌస్ మజ్లిస్ మాజీ కార్పొరేటర్. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాను లబ్ధి పొందవచ్చనేది బీజేపీ అంచనా. అహ్మద్ఖాన్ఉమా మహేందర్మలక్పేట: కొట్టేనా హ్యాట్రిక్! మలక్‌పేట నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అహ్మద్ బీన్ అబ్దుల్ బలాల (మజ్లిస్).. హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో బలాల 23 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్రపై గెలుపొందారు. జితేంద్ర.. దివంగత నేత టైగర్ నరేంద్ర కూమారుడు. గతంలో గౌలిపురా కార్పొరేటర్‌గా పనిచేసిన రాజకీయానుభవం ఉంది. హిందుత్వ ఎజెండాతో ఈయన ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రజాకూటమి పక్షాన పోటీ చేస్తున్న ముజఫర్ (టీడీపీ).. ముస్లిం ఓట్లు చీలి లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సతీష్ కూడా పోటీలో ఉన్నారు.-అబ్దుల్ బలాల, ఆలె జితేంద్ర బహదూర్‌పురా: పోటీ ఎవరు? బహదూర్‌పురా మజ్లిస్‌కు కంచుకోట. గత మూడు దఫాలుగా ఆ పార్టీదే ఇక్కడ ప్రాతినిధ్యం. ఇక్కడి ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ముస్లింలే. తాజా మాజీ ఎమ్మెల్యే మౌజం ఖాన్ (మజ్లిస్) ప్రధాన పోటీదారు కాగా, ఇనాయత్‌అలీ బక్రీ (టీఆర్ఎస్), మహ్మద్ కలీం (కాంగ్రెస్), హనీఫ్ అలీ (బీజేపీ) పోటీలో ఉన్నారు. మజ్లిస్‌కు పోటీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో మౌజంఖాన్ 95 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారీ తిరిగి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.-మౌజం ఖాన్, హనీఫ్ అలీ ‘నాంపల్లి’ సెగ్మెంట్ కాడ.. ఇక్కడ పాత ప్రత్యర్థులే మళ్లీ బరిలో నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ (మజ్లిస్) అప్పటో టీడీపీ నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఫిరోజ్‌ఖాన్ కాంగ్రెస్‌లో చేరి ప్రజాకూటమి పక్షాన కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి తలపడుతున్నారు. రెండుసార్లు ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్‌పై సానుభూతి వ్యక్తమవుతుండటం మజ్లిస్‌ను కొంచెం కలవరపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో నెలకొన్న హోరాహోరీ పోటీపై పాత నగరంలో ఉత్కంఠ నెలకొంది.-జాఫర్ హుస్సేన్, ఫిరోజ్‌ఖాన్ గోషామహల్: కాంగ్రెస్–బీజేపీ హల్చల్ గోషామహల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ), మాజీ ఎమ్మెల్యే ఎం.ముఖేష్‌గౌడ్ (కాంగ్రెస్), ప్రేమ్‌సింగ్ రాథోడ్ (టీఆర్ఎస్) తలపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నడుమ నువ్వానేనా అన్నట్టుంది. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన రాజాసింగ్.. ముఖేష్‌గౌడ్‌పై 46 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. హిందుత్వ ఎజెండాపై రాజాసింగ్, ప్రజాకూటమి బలం, మైనారిటీ ఓట్లు కలిసి వస్తాయని ముఖేష్ ఆశ పెట్టుకున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.- రాజాసింగ్, ఎం.ముఖేష్‌గౌడ్, ప్రేమ్‌సింగ్ రాథోడ్ కార్వాన్.. కేరాఫ్ కౌసర్? కార్వాన్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ (మజ్లిస్) మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన కౌసర్.. బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై 37 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఇంకా ఇక్కడ జీవన్‌సింగ్ (టీఆర్ఎస్), అమర్‌సింగ్ (బీజేపీ) ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ (కాంగ్రెస్) పోటీలో ఉన్నా.. మజ్లిస్‌కు పోటీ అంతంతగానే ఉంది. హిందుత్వ ఎజెండా ఇక్కడ బలంగానే ఉన్నా.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోవడం మజ్లిస్‌కు కలిసివస్తుందని అంచనా.-కౌసర్, అమర్‌సింగ్ ‘గుట్ట’లోన మొనగాడు! చాంద్రాయణగుట్ట తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (మజ్లిస్) ఐదో సారి గెలుపు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గం ఆది నుంచీ మజ్లిస్‌కు కంచుకోట. బీజేపీ ఇక్కడి నుంచి ముస్లిం మహిళ సయ్యద్ షాహజాది (బీజేపీ)ని రంగంలోకి దింపింది. అయితే, గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ ఇసాబిన్ ఉబేర్ మిస్రీ (కాంగ్రెస్), సీతారాంరెడ్డి (టీఆర్ఎస్) పోటీలో ఉన్నారు. గత నాలుగు పర్యాయాలుగా మజ్లిస్‌తో ఎంబీటీ తలపడినా ఫలితం లేకపోతోంది. గత ఎన్నికల్లో ఎంబీటీకి చెందిన ఖయ్యూంఖాన్పై 59 వేల పైచిలుకు ఓట్లతో అక్బరుద్దీన్ విజయం సాధించారు. రెండేళ్ల క్రితం ఖయ్యూంఖాన్ చనిపోవడంతో పాటు కేడర్ కాస్తా ఎంఐఎంలో చేరడంతో ఎంబీటీకి పట్టు సడలింది. నియోజకవర్గంలోని హిందూ ఓట్లు అధికంగా గల ప్రాంతం పునర్విభజనలో మూడు ముక్కలైంది. దీంతో మజ్లిస్‌కు ఇక్కడ నల్లేరుపై నడకే.- అక్బరుద్దీన్, షాహజాది యాకుత్‌పురా: మజ్లిస్–ఎంబీటీ ఢీ యాకుత్‌పురా నియోజకవర్గంలో మజ్లిస్‌తో ఎంబీటీ తీవ్రంగా తలపడుతున్నా పోటీ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఇక్కడ మజ్లిస్‌కు గట్టి పట్టుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్టపై దృష్టి పెట్టిన ఎంబీటీ ఈసారి ఇక్కడ గట్టెక్కేందుకు శతవిధాల ప్రయత్నిసోంది. మజ్లిస్‌తో పోటీపడి పాదయాత్రలు, కార్నర్ మీటింగ్‌లు, బహిరంగసభలు, మహిళ గ్రూప్ మీటింగ్‌లు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి అహ్మద్ పాషాఖాద్రీ (మజ్లిస్), రాజేంద్రరాజు (కాంగ్రెస్), రూప్‌రాజ్ (బీజేపీ) తలపడుతున్నారు. ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండటంతో మజ్లిస్ ఆయనను చార్మినార్‌కు పంపించింది. అయితే, పాత ఎమ్మెల్యేపై గల వ్యతిరేకత కలిసి వస్తుందని ఎంబీటీ భావిస్తోంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. గత పర్యాయం రూప్‌రాజ్ 32 వేల ఓట్లు సాధించారు. ఎంఐఎం–ఎంబీటీ మధ్య ముస్లిం ఓట్లు చీలి, తాను లాభపడతానని బీజేపీ ఆశ.- అహ్మద్ పాషాఖాద్రీ, రూప్‌రాజ్ ఆ రెండు స్థానాల్లోనే ‘పోటీ’ పాతబస్తీలోని నియోజకవర్గాలన్నీ మజ్లిస్‌కు కంచుకోటలే. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాతనగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను బద్ధలు కొట్టి పాగా వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎంబీటీ కూడా మజ్లిస్‌తో ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే, ఇవి ఆయా ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికలప్పుడు స్నేహ పూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్‌కు కలిసివస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్, తాజాగా టీఆర్ఎస్తో మజ్లిస్ దోస్తీ చేస్తోంది. కాంగ్రెస్ .. నాంపల్లి మినహా మిగతా చోట్ల «ధీటైన అభ్యర్థులను నిలపలేదు. ఇది మజ్లిస్‌కు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్, బహుదూర్‌పురా స్థానాల్లో మజ్లిస్ గెలుపొందింది. గోషామహల్లో పోటీకి దూరంగా ఉంది. ఈసారి చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహుదూర్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్‌గా కనిపిస్తుండగా, నాంపల్లిలో కాంగ్రెస్, యాకుత్‌పురాలో ఎంబీటీ గట్టి పోటీ ఇస్తున్నాయి. గోషామహల్లో మజ్లిస్ పోటీలో లేదు. పేదల గూడు చినబోతోంది.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారడం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో భరోసా ఇస్తారు. ఆపై మరిచిపోతారు. మాకు కష్టపడితే కానీ కడుపు నిండదు. వచ్చిన సొమ్ము కడుపు నింపుకునేందుకు సరిపోతుంది. తలదాచుకోను గూడు లేక అవస్థలు తప్పట్లేదు. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ప్ర«భుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ మహబూబ్, పండ్ల వ్యాపారి, ఫలక్‌నుమా చిరు వ్యాపారులకు రుణాలు చిరు వ్యాపారులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు బ్యాంక్ లింకేజీతో పని లేకుండా రుణాలివ్వాలి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకొంటూ, సంచారం చేస్తూ వ్యాపారాలు చేసే వారికి లైసెన్స్‌లిచ్చి రుణ సహాయం అందించాలి.– రాజేందర్, టిఫిన్ బండి వ్యాపారి, ఫూల్‌బాగ్ -
7న ఎన్నికలు.. అదే రోజు 4 కొత్త సినిమాలు
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 7వ తేదీకి ఎంతో ప్రాధాన్యముంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయ్ కాబట్టి. నగరంలోని ప్రతి ఓటరూ తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు కాబట్టి. మరి ఇదే రోజు 7 తెలుగు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఎన్నికలు జరిగే శుక్రవారం సహా మూడు రోజులపాటు వరుసగా సెలవులే. మరి ఓటర్లు ఎంటర్టైన్మెంటు కోసం సినిమాలకు వెళతారా.. మూడురోజులు సెలవులు వచ్చాయి కాబట్టి సొంతూరి బాట పడతారా. ఈ ప్రభావం పోలింగ్ శాతంపై పడుతుందా.. అనే మీమాంస అటు అభ్యర్థులను ఇటు ఎన్నికల అధికారులను వెంటాడుతోంది. పోలింగ్ శాతం తగ్గితే అది గెలుపోటములను ప్రభావితం చేస్తుందని ఆయా పార్టీలు మథనపడుతున్నాయి. డిసెంబర్ 7న కవచం, నెక్ట్స్ ఏంటీ, శుభలేఖ+లు, సుబ్రహ్మణ్యపురం తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే శుక్రవారం ఎన్నికల సందర్భంగా సెలవు దినం. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా సెలవు దినాలు కావడంతో పలువురు నగరవాసులు సొంత ఊళ్లకు, టూర్లకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా ఒక్క రోజే ఐదు సినిమాలు విడుదల కావడం, వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో నగరంలో పోలింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఇటు కొత్త సినిమాలు, అటు ఎన్నికలు ఒకే రోజు నగరవాసుల ముందుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. వరుస సెలవులు ప్రభావం చూపుతాయా.. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 5 లక్షలకు పైనే ఉంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుండగా, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి మరో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. వరుస సెలవుల్లో మాత్రం ఇటు రైళ్లలో, అటు బస్సుల్లో మరో 50 వేల మంది వరకు అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే వేతన జీవులు ఇలాంటి సెలవులను సద్వినియోగం చేసుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ నెల 7 నుంచి వరుసగా మూడురోజులు సెలవులు రావడంతోనూ ఎక్కువ మంది సొంత ఊళ్లకు, సమీప పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికల సంఘానికీ అగ్ని పరీక్షే.. ప్రచారంతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు మరో నాలుగు రోజుల్లో అగ్ని పరీక్ష ఎదుర్కోనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో కేవలం 53 శాతం ఓట్లు మాత్రమే నగరంలో నమోదు కావడంతో ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకొంటోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, తదితర రూపాల్లో ప్రజల్లో అవగాహనకు శ్రీకారం చుట్టింది. కొత్త సినిమాల విడుదల, వరుస సెలవులు వంటివి పోలింగ్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఇడ్లీ.. వడ.. దోసె’ నాస్టాకి ఏం గావాల్నో సెప్పు..
మల్లేసన్నా.. నాస్టాకి ఏం గావాల్నో సెప్పు.. ఇడ్లీ వడ దోసె’ పక్తు సర్వర్ లెక్క ఎంకటేసులు గట్ల స్టయిల్గ నిల్సుని అడుగుతుంటె నాకు నవ్వాగలె. సేతిలో సిన్న బుక్కు పట్కుని పొద్దుగాల్నే వచ్చి గిట్లడుగుతున్నడేంది అనుకున్న. ‘అరె.. పొద్దున్నే తమాషా సురు జేసినవ్. ఏంది కత’ కోపంగ అడిగిన. ‘నాకేం దెల్సు గా పరమేసన్న నిన్న సెప్పిండు. రేపు మీ గల్లీల అందర్కి నాస్ట దావత్ పెట్టించాలె. గదీ ఎవరికి ఏదిస్టమో దెల్సుకుని ఓటల్నుంచి తీస్కరావాలె.. తేడా వస్తె కస్టం మల్ల’ అన్నడు. అందుకే ఎందుకొచ్చిన పంచాయితీ అని గీ బుక్కుల రాసుకుంటున్న. జల్దీ సెప్పే అందర్వి రాస్కోవాలంటూ తొందరబెట్టిండు. ఆ పారాచూటు పరమేసన్న చివరికి టిపిన్లు బోజనం పెట్టిస్తుండ్రు. జూసిండ్రా గీ ఎలచ్చన్ల జోరు. మా పరమేసన్న తిండి పెట్టించేందుక్కూడా సిద్దమైండు. పరమేసన్న ఏం కర్మ. ఊర్లో అన్ని చోట్ల గిదే జాతర. మందు డబ్బులు సుత ఇస్తుండ్రంట. కానీ ఈసారి ఎలచ్చన్ల గిట్ల దావత్‌లు ఇచ్చుడే కొత్త. నిన్నటి దాన్కా కార్తీకమాసం పేరుతో జనాల్ని పోగేసి వనబోజనాలు పెట్టిండ్రు. గదీ ముగిసిపాయె. కానీ ఓటింగ్‌కి ఇంకా టైమున్నదె, ఏం జేయాల అని ఆలోచించి గీ ప్లాను ఏసినట్టుండ్రు. జనాల్ని పోగేసి పంక్షన్లు పెడ్తే అందర్కి దెల్సిపోతుందని న్యాక్గ వాన్లలో టిపిన్ పాకెట్లు దెచ్చి సీదా ఇండ్లకే ఇస్తుండ్రంట. అంటే పాలపాకెట్టు.. పేపర్లు సప్లయి జేస్తున్నట్లు గీ మూడ్రోజులు టిపిన్ బోజనం పాకెట్లు గూడ సప్లయి జేస్తరేమో మల్ల. ఏమైన సెప్పుండ్రి గీ కాండేట్ల అవస్తలు మామూలుగా లేదులె. ఎందుకన్న నిలుసున్నామా అనుకుటుండ్రేమో. పైసల్ పంచాల్నా.. టిపిన్లు.. దావత్‌లు పెట్టించాల్నా.. మందు పోయించాల్నా. గివన్నీ గా ఎగస్ పార్టీవోల్లకి, పోలీసులకు దెలీకుండ సూస్కోవాల్నా.. గింత జేసి ఆల్లు ఓటేస్తరో లేదో అని చూస్తూ కూసోవాలె. కర్చుకి కర్చు.. టెన్సన్కి టెన్సన్. థూ ఏందిర గీ కర్మ.. గెలుస్తమో లేదో గాని ఈ ఎలచ్చన్లు జల్దీ ముగుస్తె అంతే సాలు.. అంటుండ్రు. గీ జనాలేం తక్కువ గాద్లే. సానా ఉషార్. మొన్న ఓ కాండేటు అపార్టుమెంట్ల ఎల్లి నాకు ఓటేయండ్రి.. ఏం గావాలన్న జేసి పెడ్త అన్నడంట. ఆల్లు గట్లేం లేదన్న నీకే ఓటేస్తం పైసల్ వద్దు గానీ గీ బిల్డింగ్‌కి జరంత రంగేసివ్వరాదె అని అడిగిండ్రంట. అరె దాన్దేముందమ్మ మీరడగాలె గానీ.. అన్న రంగేసేకి ఎంతవుదే అని ఆరా దీస్తే లక్షల్లో దేలింది. ఇంకేం మాట్లాడకుండా కాండేటు సరే చూస్తలె వస్త అంటూ జారుకుండంట. పైసల్ పంచనీకి డబ్బులు కట్లు కట్లు దీస్కొస్తుంటే పోలీసోల్లు పట్టేసుకుంటుండ్రని.. పికర్ గాకుండ్రి మీ బాంకుల ఏస్తం అని కాండేట్లు డబ్బు పంచుడుకు కొత్తదార్లు ఎదుకుతుండ్రు. గట్లనే మందు పోయడానికి ముందుగనే సీసాలు దెచ్చి నిల్వబెట్టిండ్రు. ఏం తెల్వి గీల్లది. గా దిమాకేదో జనాల్కి జరంత మంచి జేసేందుకు వాడ్తే ఎంత మంచిగుండు. అయినా గింత సొమ్ము పెట్టినోల్లు గెల్సినంక యిడుస్తర.. అంతకంత తింటరు. అందుకే ఈల్లు ఎందుకింత కరుసు జేస్తుండ్రో మనం కూడా తెల్సుకోవాలె. పనిజేసేటోల్లనే గెలిపించుకోవాలె!! – రామదుర్గం మధుసూదనరావు -
లేడీస్ స్పెషల్!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి ఎన్నికల్లో నూతన విధానాలు, వివిధ యాప్‌లు, విస్తృత ప్రచారంతో పాటు వివిధ కొత్త అంశాలను అమలు చేస్తోన్న ఎన్నికల సంఘం.. మరో అడుగు ముందుకువేసింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వారికోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతనూ మహిళా అధికారులకే అప్పగించింది. దివ్యాంగుల కోసం భారీ ప్రచారంతో పాటు ఉచిత రవాణా, వారికోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. ఇదే కోణంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీరికోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను సైతం మహిళా అధికారులకే అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకనుగుణంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రం (పీఎస్)లో పోలింగ్ బాధ్యతలు మొత్తం మహిళా అధికారులకే అప్పగించారు. ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి సహా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని జీహెచ్ఎంసీ పేర్కొంది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. -
ప్రధానిగా అవకాశం వచ్చినా వద్దనుకున్నా
మల్లాపూర్: దేశ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాకూటమి రోడ్‌షోలో భాగంగా ఆదివారం మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, ఉప్పల్ ప్రజాకూటమి అభ్యర్థి తూళ్ల వీరేందర్‌గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తన హయాంలోనే హైదరాబాద్, ఔటర్ రింగురోడ్డు, హైటెక్ సిటీ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. మేడ్చల్‌లో కూడా మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ హాయాంలోనే ఉప్పల్ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ, కేసీఆర్ జోడీ అని ఎద్దేవా చేశారు. ఏ టీమ్ నరేంద్రమోదీ అయితే బీ టీమ్ కేసీఆర్‌గా అభివర్ణించారు. డబుల్ బెడ్రూంకు, దళిత ముఖ్యమంత్రి, ప్రాజెక్టులకు తానేనాడు అడ్డుపడలేదని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే తన ఆశయమన్నారు. టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. అందులో భాగంగా వీవీప్యాడ్లు తీసుకువచ్చామన్నారు. తనకు ప్రధానమంత్రిగా రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ వద్దనుకున్నానన్నారు. ప్రజాకూటమి అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డుపడకుంగా ప్రోత్సహించానన్నారు. చంద్రబాబు హాయాంలోనే ఉప్పల్, కాప్రా అభివృద్ధి చేందాయన్నారు. ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నెమలి సురేష్, వీఎస్ బోస్, సూర్ణం రాజేష్, చిన్న దుర్గయ్య, ఎల్లగోని పాండురంగంగౌడ్, అభిషేక్‌గౌడ్, లంబూ శ్రీను, ఆంజనేయులు, రాజు, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేం రెడీ..
పోలింగ్ రోజు బయటకు రావడానికి ఒకరకమైన భయం.. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని.. పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లాలంటే జంకు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్నికలు జరిగే రోజు (ఈనెల 7) గ్రేటర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్లు పకడ్బందీ ఏర్పాటు చేశాయి. అదనపు సిబ్బందిని వినియోగించడంతోపాటు భద్రతాబలగాలను కూడా రంగంలోకి దింపారు. ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్‌లు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సాక్షి, సిటీబ్యూరో : ‘పోలింగ్ రోజున నగర వ్యాప్తంగా ఏ చిన్న ఉదంతం జరిగినా.. జరుగుతుందనే సమాచారం ఉన్నా గరిష్టంగా మూడు నిమిషాల్లో అక్కడకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రెస్పాన్స్ టైమ్ టార్గెట్‌ను పూర్తి చేయడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం’ రెండు నెలలుగా కసరత్తు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోకి 15 నియోజకవర్గాలు పూర్తిగా, మరో నాలుగు పాక్షికంగా వస్తాయి. వీటిలో దాదాపు 3800 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. 19 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. వీటితో సహా మొత్తం 11 వేల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నాం. గతానికి భిన్నంగా ఈసారి ఓ ప్రత్యేక మహిళా బెటాలియన్ సైతం అందుబాటులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల క్రతువు సజావుగా పూర్తి చేయడానికి అవసరమైన కసరత్తును దాదాపు రెండు నెలలుగా చేస్తున్నాం. ఫ్లాగ్ మార్చ్‌లతో పాటు ఆయా పోలింగ్ స్టేషన్లు, కీలక ప్రాంతాలను అనునిత్యం సందర్శిస్తూనే ఉన్నాం. పోలింగ్ కోసమే ప్రత్యేకంగా 10 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నాం. రూ.21 కోట్లు సీజ్ చేశాం అసాంఘికశక్తులతో పాటు రౌడీషీటర్లను బైండోవర్ చేశాం. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల నేపథ్యంలో మొత్తమ్మీద రూ.12 లక్షలు మాత్రమే స్వాధీనమయ్యాయి. ఈసారి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.21 కోట్లు సీజ్ చేశాం. ఈ చర్యలను ఇటీవల నగరాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సైతం ప్రశంసించారు. మొత్తమ్మీద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనలకు సంబంధించి 112 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే నాలుగు కేసుల్లో అభియోగపత్రాల దాఖలు సైతం పూర్తయింది. మిగిలిన కేసుల్లోనూ ఎన్నికల తర్వాత దాఖలు చేస్తాం. పోలింగ్ సజావుగా సాగడానికి, ఓటర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడానికి నేర చరితులంతా అదుపులో ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం పెండింగ్‌లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయమని స్పష్టం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ఇప్పటి వరకు 3800 ఎన్బీడబ్ల్యూలు ఎగ్జిక్యూట్ చేశారు. ఈ చర్యల్ని కొనసాగిస్తున్నారు. డిపాజిట్ చేయని ఆయుధ లైసెన్సులు రద్దు ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉన్న అన్ని లైసెన్సెడ్ ఆయుధాలను డిపాజిట్ చేయాల్సిందిగా స్పష్టం చేశాం. కేవలం బ్యాంకుల భద్రతకు వినియోగించే వాటితో పాటు స్పోర్ట్స్ మెన్స్ వాడే వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చాం. వీటితో పాటు మరికొందరు సైతం ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మినహాయింపు కోరారు. అలా కాకుండా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయుధాలను డిపాజిట్ చేయని వారి లైసెన్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. సెక్టార్ల వారీగా సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం. ఇప్పటి వరకు సిటీలో 38 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. ఈ తరహా ప్రాంతాలను గుర్తించాం. అక్కడ కేంద్ర బలగాలు పహారాలో ఉంటాయి. వీటితో పాటు కీలక ప్రాంతాల్లోనూ వాటినే మొహరిస్తున్నాం. సంక్షేమానికీ పెద్దపీట బందోబస్తు, భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నాం. పోలింగ్ రోజున ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ రూ.250 చొప్పున కేటాయిస్తున్నాం. అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఈ మొత్తం ఆయా ఇన్స్పెక్టర్లు అందిస్తారు. వాహనాల అద్దెకు అవసరమైన నిధుల్ని జోనల్ డీసీపీలకు ఇచ్చాం. మరోపక్క సమస్యాత్మక వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి ప్రత్యేకంగా 100 షాడో పార్టీలు ఏర్పాటుచేశాం. హైదరాబాద్ పోలీస్‌కమిషనర్ అంజనీ కుమార్ :పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా తెలిసిపోతుంది ‘నగర శివారు ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్ ఉన్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న 1,066 పొలింగ్ కేంద్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు క్షణాల్లో సమాచారం అందుతుంది..ఆయా పొలింగ్ కేంద్రాలకు గస్తీ వాహనాలు, డీసీపీ, ఏసీపీలు వస్తున్నారా, లేదా..ఎస్హెచ్ఓలు పర్యవేక్షిస్తున్నారా? అనే విధుల సమాచారాన్ని కూడా తొలిసారిగా కొత్తగా నియమించిన లోకేషన్ లెవల్ పోల్ ఆఫీసర్(ఎల్ఎల్పీవో) తెలియజేయనున్నారు. ఏదైనా గొడవలు జరిగి క్షతగాత్రులైతే వెంటనే ఆస్పత్రులకు తరలించేలా సమీప ఆస్పత్రుల సమాచారం కూడా ఎల్ఎల్పీవోల వద్ద ఉండనుంది. ఇలా ఆయా పొలింగ్ కేంద్రానికి సంబంధించిన సమస్త సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల్లో దాదాపు పదివేల వరకు సీసీటీవీ కెమెరాలు బిగించి సైబరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నాం. బందోబస్తుగా పదివేలమంది సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 1,066 పోలింగ్ కేంద్రాల్లో 150 వరకు సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించాం. సైబరాబాద్‌లో మొత్తం 2727 మంది సివిల్, 1079 మంది రిజర్వ్, 1022 మంది హోంగార్డులు, 102 మంది స్పెషల్ పోలీసుల సేవలు వినియోగించుకోనున్నాం. బయటి జిల్లాల నుంచి రెండు వేల మంది పోలీసులను రప్పిస్తున్నాం. 29 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ బలగాలు కూడా వచ్చాయి. ఇప్పటివరకు రూ.1.83,43,225 నగదు, 300 లీటర్ల మద్యం, 3055 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. పాత కేసుల్లో నిందితులైన 1696 మందిని బైండోవర్ చేశాం. 2389 మందికి నాన్బెయిలెటబుల్ వారంట్లు జారీ చేశాం. మొత్తం 1,356 లైసెన్స్‌లకు 1081 డిపాజిట్ చేశారు. అయితే 105 మందికి మినహాయింపునిచ్చాం. ఐటీ ఉద్యోగుల పొలింగ్ పెంపుపై దృష్టి ఐటీ కారిడార్‌లో ఉన్న దాదాపు నాలుగు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఇప్పటికే అవగాహనకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల సంఘంతో కలిసి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై కూడా అవగాహన కలిగించాం. ఐటీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించడంతో పాటు ఆరోజు ఆయా కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని వివరించాం. -సైబరాబాద్ పోలీసుకమిషనర్ సజ్జనార్ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా - రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నగర శివారు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వరకు ఉన్న రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. 3063 పోలింగ్ కేంద్రాలున్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మకంగా ఉన్న 509 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ఫ్లాగ్ మార్చ్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఫ్లాగ్‌మార్చ్ చేస్తున్నాం. భద్రతా పరంగా ఎలాంటి ఆందోళన లేదనే సంకేతాలను ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. రాచకొండలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు 3,700 మందితో పాటు పది కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సేవలను తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మరో 2,200 మంది హోంగార్డులు పాల్గొంటున్నారు. ‘మహేశ్వరం, ఆలేరు, చౌటుప్పల్, ఘట్కేసర్, కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం మాల్ తదితర ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాల్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాం. 42 తక్షణ స్పందన బృందాలు, 27 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 27 సంచార తనిఖీ బృందాలు, 8 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయి. నియామవళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 31 ఎంసీసీ కేసుల్ని నమోదుచేశాం. రౌడీషీటర్లను బైండోవర్ చేశాం కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు 520 మంది రౌడీ షీటర్లని ఇప్పటికే బైండోవర్ చేశాం. 1205 లైసెన్స్డ్ ఆయుధాల్లో 884 డిపాజిట్ అయ్యాయి. 305 మంది క్రీడాకారులు, ప్రైవేటు కాపలాదారులఆయుధాల కు మినహాయింపునిచ్చాం. దాదాపు 1800 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీచేశాం. -
కోవర్టోల్లు... కుల్లపొడుస్తుండ్రు..!
‘పోటోల్లు...ఎన్నుపోటోల్లు ఉంటరని దెల్సుగానీ... గీ కోవర్టోల్లు ఎవ్రు మల్లేశా...’కాకా అడిగిండు. అరె గంతమాత్రం దెల్వాదె...బరిసో...కత్తో పట్కుని పక్కకెల్లి పొడుస్తుండ్రేమో మల్ల అన్న. కాకాకి నా మాట నచ్చలె. అరే నువ్ సెప్పింది నాకు సమజవుత లేదు. గా ఎంగటేసుల్నే అడుగుత అనెల్లిపోయిండు. కాకా మాటలిన్నంక జర దిమాక్ పెట్టి ఆలోచిస్తూ కూచున్న. గింతలో గా ఎంకటేసులు వచ్చిండు. అరె తమ్మీ కోవర్టోల్లు అంట ఎవ్రె ఆల్లు అనడిగిన. ‘...అరె కత నీదంక వచ్చినాదె. మన పరమేశన్న నిన్ననే మీటింగ్ బెట్టి సెప్పిండు. పక్కపోట్టుగాల్లున్నరు జరంత జాగ్రత్తగ ఉండాలె. ఆల్లు సానా సైలెంటు గుంటరు... మనతానె ఉంటరు. గీల్లనే కోవర్టోల్లు అంటరు. ఎవ్రయిన ఉంటె జెప్పుండ్రి మాంచి గిప్టు ఇస్త అనికూడా సెప్పిండన్న‘ అన్నడు. ఓహో గదన్నమాట. ఎలచ్చన్ల యవ్వారమని దెల్సింది. ♦ అయిన గీరకం పోటుగాల్లు...గదే కోవర్టోల్లు ఎలచ్చన్లలోనే ఏం కర్మ. రోజు మన సుట్టుపక్కల తిరగాడ్తునే ఉంటరు గాదె. మా పక్కనే ఉంటరు. దోస్తులెక్క కనిపిస్తరు. మంచిగ మాటలు సెబ్తుంటరు. మనం గా మాటల్కి అయిసై ...ఆల్లేం సెబ్తే గంతేనని నమ్ముతం. ఇంగ జూస్కో అక్కడ్నుంచి ఆల్ల ఆట సురు అయితది. కల్లకి బట్టకట్టి సీదా దీస్కొని బోయి గుంతల పడేస్తరు. పడినంక ఆల్లే ‘అయ్యో గిట్లయ్యె ఏంది..’ అంటూ ఏడుస్తూ అంజాన్ కొడ్తుంటరు. ఇలాంటి నమ్మక్ హరామ్‌లు అంత త్వరగ బైట పడ్తారె? మా తమ్మి ఆపీసుల గిట్లనే అయిందంట. ఒకాయన ఆల్ల పైవోన్ని ఏందిబై గిట్ల సతాయిస్తుండు అని అంటే పక్కనున్నోడు దాన్ని పోన్ల రికార్డు జేసి గా ఆపీసరు సెవికాడ పెట్టిండంట! ఇంకేముంది...తిట్టినాయన్కి గా ఆపీసరు నరకం జూపిస్తుం డు! గట్ల రికార్డు జేసినోడు దొరకాలె... సంపి బొందల పెడ్త అంటూ పాపం ఆయన గిప్పట్కీ పండ్లు కొరుకుతునే ఉన్నడంట. రికార్డు జేసినడు సూడు ఆల్లనే పక్కపోటోల్లు...కోవర్టోల్లు అంటరు. మన తెలుగు రాజకీయాల్లో ఒక పెద్ద సారు గూడ గిట్లాంటి పనే జేసి కుర్చీ లాక్కుండని గిప్పటికీ అందరూ అంటరు. జరంత ఆలోచించుండ్రి మీకే సమజవుతది గా పెద్దమనిసి ఎవ్రో! ♦ గీ ఎలచ్చన్లలోనూ కోవర్టులోల్లు మస్తుగ ఉన్నరంట. నా పక్కల తమ్మీలున్నరు. గెట్లయిన గెలుస్ల అని అనుచరుల అండ జూస్కొని బరిలో దిగినోల్లు తలపట్కుంటుండ్రు. మనోడే గదా సీక్రెట్లు ...పోలింగు ప్లాన్లు చర్చిస్తే సాలు ...ఆ యవ్వారం ఎదురు పార్టీవోల్లు పక్కపోటుగాల్లకి పైసలిచ్చి లాగేస్తుండ్రంట. ఏదేనా కొత్తగ ప్లానేసి ఓట్లడుగుదామని ఆలోచిస్తె...గది వెంటనే ఎదుటోన్కి చేరిపోతది. ఆడు టక్కున జేసేస్తుండంట. ఒక కాండేటుకైతే పాపం పోలింగ్ ఏజెంటుని గూడ ఉంచకుండా పట్కుపోయిరంటె ఆలోచించుండ్రి. సిటీ పొలిమేర్ల ఓ పెద్దాయన ప్రత్యర్తుల శిబిరంలో ఇసయం కోసం ఏకంగా పదిలచ్చలు కోవర్టుకి ముట్టజెప్పిండంట. గిట్ల సాపకింద నీరులెక్క ముంచేస్తుంటే కాండేట్లు ఎర్రిమొగాలేస్తుండ్రు. నమ్మినోల్లని ముంచడం పక్కపోటుగాల్ల లచ్చనం అయినంక ఇంగ జేసుడేముంది..అద్రుస్టం ఓట్లల్ల వచ్చేదుంటె... గిట్లాంటి పోటుగాల్లు ఏం జేసినా ఏంగాదె!!–రామదుర్గం మదుసూదనరావు -
కూటమి ‘కూన’... విజయ ధీమా
సూరారం: అభ్యర్థులు ప్రచారంలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత జోరు పెంచారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)తో ‘సాక్షి’ జోన్ ప్రతినిధులు శనివారం ఒక రోజు ప్రయాణించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఆయన దినచర్య రాత్రి 10గంటల వరకు కొనసాగింది. సభలు, సమావేశాలు, ప్రజలతో ముఖాముఖి, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపారు. ఆ వివరాలివీ... ♦ ఉదయం 6గంటలకు దినచర్య ప్రారంభించిన కూన శ్రీశైలంగౌడ్ తొలుత బజార్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ♦ ఉదయం 7గంటలకు బాచుపల్లిలోని కేహెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో విల్లాస్ అపార్టుమెంట్వాసులతో సమావేశమయ్యారు. ♦ ఉదయం 9:43గంటలకు టీడీపీ నేత కొలన్ హన్మంతరెడ్డితో కలిసి అల్ఫాహారం తీసుకొని, అక్కడి నుంచి బాచుపల్లిలో బైక్ ర్యాలీకి తరలి వెళ్లారు. ♦ ఉదయం 10:13గంటలకు బాచుపల్లి నుంచి నిజాంపేట, సాయినగర్, రాజీవ్‌గాంధీనగర్, ఇందిరానగర్‌ల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. ♦ మధ్యాహ్నం 12:30గంటలకు వివిధ కాలనీల వాసులతో సమావేశమై పలువురితో ఫోన్లో మాట్లాడి ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు. ♦ మధ్యాహ్నం 1:23గంటలకు జీడిమెట్ల డిపో వద్ద సూపర్‌మ్యాక్స్ కార్మికులను కలుసుకొని ప్రజాకూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ♦ మధ్యాహ్నం 2:27గంటలకు బాలానగర్ పారిశ్రామికవాడ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న ప్రాగా టూల్స్ కార్మికులతో సమావేశమై తనకు మద్దతు తెలపాలని కోరారు. ♦ మధ్యాహ్నం 2:43గంటలకు పక్కనే ఉన్న మల్హోత్ర పరిశ్రమ కార్మికులను కలుసుకొని హస్తం గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ♦ మధ్యాహ్నం 3:23గంటలకు భగత్‌సింగ్‌నగర్‌లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి బం ధువు గృహప్రవేశానికి వెళ్లి అక్కడే భోజనం చేశారు. ♦ సాయంత్రం 4గంటలకు గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వద్ద గెస్ట్‌హౌస్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ఏపీ మాజీ మంత్రి కొండ్రు మురళితో చర్చించారు. అక్కడే కొంపల్లి ప్రాంతానికి చెందిన పలువురితో మాట్లాడారు. ♦ సాయంత్రం 4:30గంటలకు టీడీపీ మహిళా మండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు. ♦ సాయంత్రం 5:50గంటల నుంచి నిజాంపేటలోని వెంకటసాయి హిల్స్, కేటీఆర్ కాలనీ, బాలాజీ హిల్స్, బండారి లేఅవుట్లలో పర్యటిస్తూ రాత్రి 8గంటల వరకు ప్రచారం కొనసాగించారు. -
మళ్లీ అవకాశం వచ్చేనా!
సాక్షి, సిటీబ్యూరో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ ముఖచిత్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. హైదరాబాద్,మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాల నుంచి 35 మంది మాజీ ఎమ్మెల్యేలు మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నారు. ఒకసారి గెలవడమే గగనమైన ప్రస్తుత తరుణంలో కొందరు నాలుగైదుసార్లు విజయదుందుభి మోగించిఅసెంబ్లీలో అడుగుపెట్టారు. మరికొందరు రెండుమూడు దఫాలు గెలిచివారూ ఉన్నారు. వీరంతా ప్రస్తుతంజరగనున్న ఎన్నికల బరిలో నిలిచి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యాకుత్‌పురా నుంచి ఎంఐఎం తరఫున వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఈసారి చార్మినార్ నుంచి బరిలో దిగారు. చార్మినార్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అహ్మద్ పాషా ఖాద్రీ యాకుత్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై ప్రత్యేక కథనం. గోషామహల్ ఇక్కడ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పోటీలో నిలిచారు. పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ముఖేష్‌గౌడ్ విజయబావుటా ఎగరవేశారు. అంతకుముందు ఈ నియోజకవర్గం మహరాజ్‌గంజ్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. ఇక్కడి నుంచి 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముఖేష్‌గౌడ్ రెండుసార్లు గెలవగా, బీజేపీ నుంచి ప్రేమ్‌సింగ్‌రాథోడ్ 1999లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ నుంచి గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన రాజాసింగ్ లోధా ప్రస్తుతం అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ముఖేష్‌గౌడ్, టీఆర్ఎస్ నుంచి ప్రేమ్‌సింగ్ రాథోడ్ పోటీ పడుతున్నారు. మల్కాజిగిరి ఇక్కడినుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట సెగ్మెంట్‌కు 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున హన్మంతరావు పోటీ చేసి గెలిచారు. కొన్నేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఎన్.రామచందర్‌రావు గెలవగా, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ గెలిచారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ను వీడారు. టీఆర్ఎస్ నుంచి మైనపంల్లి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, టీజేఎస్ నుంచి దిలీప్‌కుమార్ బరిలో ఉన్నారు. ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల గోదాలో నిలిచారు. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన దేవిరెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్.కృçష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మిర్యాలగూడ టికెట్‌ను ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నుంచి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. సనత్‌నగర్ ఐదోసారి అసెంబ్లీలో అడుగిడేందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో గెలిచిన తలసాని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004లో ఓటమి పాలైన తలసాని ఇదే నియోజకవర్గానికి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. అంబర్‌పేట ఇక్కడినుంచి హ్యాట్రిక్ కొట్టాలని జి.కిషన్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించిన ఈ నియోజకవర్గానికి ఆయనే తొలి ఎమ్మెల్మే. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఈ నియోజకవర్గం హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. 2004లో జరిగిన ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి గెలిచి కిషన్‌రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్ పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పీజేఆర్ మృతితో విష్ణు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో ఖైరతాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఆవిర్భవించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపినాథ్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాతి కాలంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గోపీనాథ్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి విష్ణు ప్రత్యర్థిగా ఉన్నారు. కంటోన్మెంట్ ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగిడేందుకు సాయన్న సిద్ధమయ్యారు. 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. కంటోన్మెంట్ నుంచి మారు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచిన సర్వే సత్యనారాయణ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇబ్రహీంపట్నం 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బరిలో నిలిచారు. చివరి వరకూ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి ఆ పార్టీ నుంచి అవకాశం రాకపోవడంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన గతంలో మలక్‌పేట నియోజకవర్గం నుంచి 1994లో టీడీపీ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఇదే నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో గెలిచారు. ఈసారి మంచిరెడ్డి, మల్రెడ్డిలలో మూడోసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. కుత్బుల్లాపూర్ 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉన్న కేపీ వివేకానంద్ శ్రీశైలం గౌడ్‌ను ఓడించి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, కాంగ్రెస్ నుంచి శ్రీశైలంగౌడ్ బరిలో ఉన్నారు. మహేశ్వరం కొత్తగా ఆవిర్భవించిన మహేశ్వరం నుంచి 2009లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచారు. పునర్విభజనలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో మహేశ్వరం నియోజకవర్గానికి ఆమె మారాల్సి వచ్చింది. ఇంద్రారెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో చేవెళ్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆమె తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లోనూ ఆమె ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆమె నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆశ 2014 ఎన్నికల్లో నెరవేరింది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డితో తలపడుతున్నారు. చాంద్రాయణగుట్ట ఇక్కడినుంచి అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ఎన్నికల గోదాలో ఉన్నారు. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం తరఫున గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ఆయన 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించారు. ముషీరాబాద్ ఇక్కడి నుంచి మూడోసారి గెలిచేందుకు బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.లక్ష్మణ్ సై అంటున్నారు. 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లోనూ ఆయన బీజీపీ నుంచి గెలిచారు. శేరిలింగంపల్లి టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన ఆరికెపూడి గాంధీ అనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పద్మారావు బరిలో ఉన్నారు. 2004 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. 2014 ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచి కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. చార్మినార్ ఆరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సిద్ధమయ్యారు. గతంలో అహ్మద్‌ఖాన్ వరుసగా ఐదుసార్లు యాకత్పురా నియోజకవర్గం నుంచి గెలిచారు. 1994లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏ ఎన్నికల్లోనూ వెనుదిరిగి చూడలేదు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున గెలిచారు. రాజేంద్రనగర్ హ్యాట్రిక్ విజయంపై ప్రకాష్‌గౌడ్ దృష్టి సారించారు. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి బరిలో నిలిచి రెండోసారి కూడా గెలిచారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసిన బద్దం బాల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడినుంచి పోటీచేస్తున్నారు. ఖైరతాబాద్ ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దానం నాగేందర్ సిద్ధమయ్యారు. ఆసిఫ్‌నగర్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయనకు అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచినా ఎంఐఎం చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన ఆయన ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ చింతల రామచంద్రారెడ్డి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మలక్‌పేట ఈ నియోజకవర్గం నుంచి అహ్మద్ బలాల హ్యాట్రిక్‌పై దృష్టి సారించారు. ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు. మేడ్చల్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నక్కా ప్రభాకర్ గౌడ్ కేఎల్ఆర్కు గట్టిపోటీ ఇచ్చారు. అన్యూహ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన ఆయన మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో నిలిచారు. యాకుత్‌పురా నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేంందుకు అహ్మద్ పాషా ఖాద్రీ సెగ్మెంట్ మారారు. చార్మినార్ నుంచి పాషా ఎంఐఎం తరఫున 2004 నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లోనూ ఆయన చార్మినార్ నుంచి గెలిచారు. పటాన్చెరు పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గూడెం మహిపాల్‌రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగిడారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరఫున మరోసారి తన అదృష్ణాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉప్పల్ టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా ఒంటరిగా తలపడుతున్నారు. కార్వాన్ కౌసర్ మొహినుద్దీన్ రెండోసారి బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ముందస్తు ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. బహదూర్‌పురా పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2009లో ఆవిర్భవించింది. ఇక్కడ ఎంఐఎం నుంచి గెలిచిన మోజంఖాన్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2014లోనూ జరిగిన సాధారణ ఎన్నికల్లో మోజంఖాన్ ఎంఐఎం నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. నాంపల్లి పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించగా, జాఫర్‌ఖాన్ రెండోసారి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నాంపల్లి నుంచి గెలిచిన ఆయన ముందస్తు ఎన్నికల్లోనూ బరిలో ఉన్నారు. కూకట్పల్లి మాధవరం కృష్ణారావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు. -
టిక్..టిక్..టిక్..
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారం గ్రేటర్లో పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల గడియారంలో ముల్లు వేగంగా తిరుగుతోంది. అభ్యర్థుల ప్రచార గడువు ఈనెల 5వతేదీ (బుధవారం) సాయంత్రంతో ముగుస్తున్నందున ప్రచారంలో జోరు పెంచారు. అంటే ప్రచారం ముగిసేందుకు మరో ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ సెగ్మెంట్ పరిధిలో రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. తుది అంకంలోనూ ప్రచార ర్యాలీలు, సభలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీల వర్షంతో పాటు క్యాడర్‌కు, ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. పంపకాల బాధ్యతలను కూడాఎక్కడికక్కడే నేతలకు అప్పజెప్పడం విశేషం. గ్రేటర్ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాల్లో ఇప్పుడు విభిన్న రకాల ప్రచారాలతో అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతుండడం పట్ల సిటీజన్లు చర్చించుకునేందుకు హాట్‌టాపిక్‌గా మారింది. అగ్రనేతలపైనే అభ్యర్థుల ఆశలు తాము పోటీ చేస్తున్న పార్టీల అగ్రనేతల ప్రచార హోరుతో తమ గెలుపు అవకాశాలు ఇక నల్లేరుమీద నడకేనని పలువురు అభ్యర్థులు విశ్వసిస్తున్నారు. కొన్నిరోజులుగా మహానగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జాతీయ పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సిటీ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు నడ్డా, సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ విజయశాంతి, ఖుష్బూ, టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ తదితరుల ప్రచారంతో ఎన్నికల పర్వం రసవత్తరంగా మారింది. వీరి ప్రచారంతో తమకు ఓట్ల వర్షం కురుస్తుందని అభ్యర్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తాజాగా శుక్రవారం మాజీ క్రికెటర్లు అజారుద్దీన్ ఎర్రగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయగా.. మరో క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ చిక్కడపల్లిలో కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం విశేషం. జాతీయ స్థాయి నేతలు సైతం రాష్ట్రం, నగరంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల వైఫల్యాలు, పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, ప్రాజెక్టులను ప్రధానంగా పేర్కొంటున్నారు. ఆయా ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవినీతిని ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే స్థానికంగా చేపట్టనున్న పనులను ప్రస్తావిస్తుండడం గ్రేటర్ ఓటర్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల ముందు ప్రజల కోరికల చిట్టా ‘మా కాలనీకి దొంగల భయం అధికం. కాలనీ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మేమంతా మీకే మద్దతిస్తాం. కానీ పోలింగ్ కంటే ముందే మా కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి’.. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు ప్రధాన అభ్యర్థుల ముందుంచిన చిట్టా ఇది. ‘మా కాలనీలో ఉదయం సాయంత్రం ఆడేందుకు అనువైన స్థలం ఉంది. కానీ వసతులే లేవు.. మట్టిలోనే అడుతున్నాం. ఈ ఎన్నికల వేళ కనీసం మీరు సిమెంట్‌తో షటిల్ కోర్టు వేయిస్తే బాగుంటుంది’.. మల్కాజిగిరి నియోకజవర్గంలో మరో కాలనీ వాసుల సూచన. ఇదంతా ఈ నెల 7వ తేదీన జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు వెళుతోన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ముందు నగర ఓటర్లు ఉంచుతున్న అభ్యర్థనలు. అయితే, అభ్యర్థులు సైతం కింది స్థాయి క్యాడర్‌ను, మధ్యవర్తులను నమ్ముకునే బదులు తమ చేతుల్లో ఉన్న కాంట్రాక్టర్లతో ఇలాంటి పనులన్నీ 24 గంటల్లో చక్కబెడుతున్నారు. మద్యం, నగదు పంపిణీకి బదులు నిర్మాణ పనులు, సీసీ కెమెరాల కొనుగోళ్ల వ్యవహారం సులువు కావడంతో వెంటనే చేసేస్తున్నారు. నగరంలో ఇప్పుడు ప్రచార పర్వంలో అభ్యర్థులతో పాటు సివిల్, మెకానికల్ ఇంజినీర్లు సైతం పాలు పంచుకుంటూ కాలనీ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై తమ అభ్యర్థి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే రికార్డు సమయంలో పనులు పూర్తి చేస్తున్నారు. బస్తీల్లో గుళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఇక బస్తీలకు వెళ్లే అభ్యర్థులకు కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల్లో సౌకర్యాల కోసం వినతులు వస్తున్నాయి. చుట్టూ ప్రహరీ నిర్మాణం, రంగులు వేయడం, హుండీ ఏర్పాట్లు వంటి కోరికలు వస్తుండడంతో వెంటవెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మళ్లీ ఐదేళ్ల వరకు పట్టించుకునే వారుండరు.. మన కాలనీ, బస్తీలకే వచ్చి మీకేం కావాలని అభ్యర్థులు అడుగుతున్నారు. అందుకే మా సమస్యలను చెప్పి, పరిష్కారాలు చూసుకుంటున్నామని మల్కాజిగిరి నేరెడ్‌మెడ్ వాసి నాయుడు చెప్పారు. ఇక అభ్యర్థుల ప్రచారంలో రహదారులు, డ్రైనేజీ సమస్యలు కూడా భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంచినీటి పైప్లైన్ల కోసం 450 కి.మీ మేర తవ్విన గుంతలు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడూ ఉప్పొంగే డ్రైనేజీ సమస్య ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక వన భోజనాలు, సమూహ యాత్రకు వెళ్లే గ్రూపులకు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులు ఆర్థిక సహాయం చేయక తప్పని స్థితి నగరంలో నెలకొంది. -
హన్మకొండ: నేను లోకల్.. 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా..
సాక్షి, హన్మకొండ: నేను పక్కా లోకల్...45 ఏళ్ల నుంచి హన్మకొండలోనే ఉంటున్నా...నగరం నడిబొడ్డున భవానినగర్‌లో నా ఇళ్లు... కుటుంబంతో సహా ఈ ఇంటిలో ఉంటున్నా...బాల్యంలో చదువుకున్నది కూడా ఇక్కడే...తాను స్థానికేతరుడిని ఎలా అవుతానని ప్రజా కూటమి అభ్యర్థి రైవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శకులకు సవాల్ విసిరారు. శుక్రవారం హన్మకొండలోని వడ్డెపల్లి, ముదిరాజ్ వాడ, ఎస్సీ వాడ, బాలయ్య హోటల్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్‌లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనకు ఓట వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, నుదిటిపై తిలకం దిద్దారు. ఈ ప్రచారంలో రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిని నేనేనని... తెలంగాణ ద్రోహిని ఎలా అవుతానని ప్రశ్నిం చారు. చిదంబరంతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని కేసీఆర్‌ను అడిగి తెసుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్‌కు సూచించారు. కారుకు ఓటేస్తే ప్రజల బతుకులు బుగ్గిపాలు అవుతాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడతూ మచ్చలేని వ్యక్తి రేవూరి ప్రకాష్‌రెడ్డి అని, కబ్జాలకై లాలూచీ పడే వ్యక్తి కాదని, నిస్వార్థ సేవకుడని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, ప్రజా కూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, నాగరాజు, తాళ్లపల్లి జయపాల్, పల్లె రాజిరెడ్డి, రవీందర్, దొంగరి సతీష్ పాల్గొన్నారు. -
గట్ల జేసింది నేనే.. గిట్ల జేసింది నేనే
కొందరంతే సెప్పుడు ఎక్కువ... జేసుడు తక్కువ. ఎప్పుడు గప్పాల్ కొడ్తనే ఉంటరు. అరే గిట్ల వాగితె ఎదుటోల్లు నవ్వుతరని కూడా సూడ్రు. అయినా గట్ల జెప్పకుంటె ఆల్లకి పొద్దు గడ్వదు. ఆల్లు సరె... మల్ల ఇన్కునేటోల్ల గతేంది? అరే చుప్..గేందిర నీ లొల్లి పరేసాన్ చేస్తున్నవ్ ...అని అనాలనున్నా...ఎందుకొచ్చిన తంట ఈల్లతో అనుకునేటోల్లే ఎక్కువ. మా దూరం బందువు కాకా ఉన్నడు. ఏదైన కార్యంల కలిస్తె ఇంగ అంతే...నల్గురున్న కాడు పోవుడు...కతల్ సురు జేసుడు. గవేమన్న జల్దీ ముగుస్తాయె. పాత సైనిమా సంపూర్ణ రామాయనంల సెబ్తునే ఉంటడు. పాపం ఇనేటోల్లు గాడ గీడ బిత్తరి సూపులు జూస్కుంట సందు దొరికితే సాలు ‘కాకా...ఆడు పిలుస్తుండు ఇప్పుడే వస్త మల్ల’...అంటూ ఉరుకుడే. ఆల్లు ఎల్లినా మన కాకాకు ఏం పికర్ లేదు. ఇంగో గుంపు జూస్కుని మల్లీ సురు జేసుడే. ♦ ఎలచ్చన్ల పున్యమా అని గీ మధ్య ఏ మీటింగ్‌ల జూసిన మా కాకా లాంటి కాండేట్లే కనిపిస్తున్నరు. ఆల్ల ముచ్చట్లు పిట్టల్దొర కబుర్లు లెక్కనుంటయ్. ‘జూసిండ్ర... గీ రోడ్డు నేనే ఏయించిన..గా బిల్డింగ్ నేనే కట్టించిన...మీ కొల్వులు నేనే ఇప్పించిన. గింత జేస్తున్న... ఓట్లేసి గెలిపించాలె మల్ల’ అంటుంటే గీ జనాలు ‘అరె పటేలా నువ్వేం జేసినవో మాకు దెల్సు...ఇంగేం జేస్తవో సెప్పు సాలు’ అని మనసుల అనుకుంటుండ్రు. పైకి మాత్రం సీటీలు కొడ్తుండ్రు. గిది జూస్కొని గా కాండేట్లు...ఆల్లు దెచ్చుకున్న బడా లీడర్లు రెచ్చిపోయి ఇంగ రీల్లు తిప్పుడే తిప్పుడు! గా ఎగస్ పార్టీ లీడరు ఎందుకూర్కుంటడు గెట్ల జేసినవ్ సెప్పుమల్ల? అని ఎదురు బానాలేస్తుండు. ♦ గిప్పుడు ప్రచారం టాప్ గేర్ల నడుస్తున్నాది. కూటమోల్ల మీటింగ్‌ల రాహుల్ సారు కేసీఆర్‌ని ఇంగ జేసింది సాల్లే గానీ...గా పార్మవుసుల పండుకో రాదె...అనిండు. సైకిల్ సారు గిదేం పట్టించుకోకుండ ...సైబరాబాదు నేనే గట్టిన...శంషాబాదు నేనే గట్టిన.. అని సెప్పిందే సెప్పి సావగొట్టిండు. హైద్రాబాద్‌ని పటంల పైన పెట్టిన అంటే... గులాబీ బాసు ‘మరి కరెంటు యాడ పెట్టినవ్’ అని కొచ్చెన్ ఇడిసిండు. తెలంగాణ వస్తే కరెంటు లేక జనాలు చీకట్ల ఉండాల్సిందె అన్నోల్లు గిప్పుడేమంటరు అని రంకెలేసిండు. గీయన గే మీటింగ్‌ల అయినా కరెంటు కత వదల్త లేడు.మేం లేకపోతె కాలేశ్వరం కట్టేవోల్ల...అంటుండు. కొంతల కొంత గీ సైకిలాయన నేను గట్టింది హైద్రాబాద్ కాదు...సైబరాబాద్ అని మెట్టు దిగి ఒప్పుకునిండు...గదే సాలు. కేసీఆర్ కూటమోల్లని గోల్మాలోల్లని ఉతికితే...రాహులు సారు గీయన్కి ఖావో కమీషన్ రావు అని కొత్త పేరు తగిలించిండు. ఇంగ ఆ కమలమోల్లు మోదీ..అమిత్ సార్లని పిలించి మేం గదిజేసినం గిది జేసినం అని జెప్పిస్తుండ్రు. ఆయుస్మాన్ పథకంల మీరు రాలేద్గద అంటే...గదో దిక్కుమాలిన పథకమని కేసీఆర్ ఏకిబారేసిండు. ♦ ఈల్లెంత గత్తరి బిత్తరి జేసినా...పల్టీలు గొట్టినా నాల్గు దినాలె. గా సంగతి జనాల్కి బాగా దెల్సు. ఎన్ని ఎలచ్చన్లు సూడలె...ఓట్లు వేయలే! మాకు యాస్టికొచ్చింది...ఇంగ సాల్గాని సీటు ఖాళీ సేయండి సారూ అంటూ లాగేస్తరు. ఆల్ల దిమాక్‌ని మాత్రం దక్కువ జేయకండ్రి... గుంతల తోస్తరు! – రామదుర్గం మధుసూదనరావు -
ఎన్నికల ప్రచారంలో అడ్డా కూలీలు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరం ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల కార్యకర్తలు నేతల వెంట జోరుగా తిరుగుతున్నారు. అన్ని పార్టీలు బూత్, వార్డు కార్యాలయాలు ప్రారంభించడంతో కింది స్థాయి క్యాడర్ బిజీ అయిపోయింది. ఇక రోజువారీ పనుల కోసం అడ్డా మీదకు వచ్చే కూలీలు సైతం ఇప్పుడు ప్రచారంలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే ఇప్పుడు ఉపాధిగా మారింది. మహిళా సంఘాల సభ్యులు కూడా నేతలతో సమానంగా బిజీగా మారిపోయారు. దీంతో నగరంలో ప్రధాన అడ్డాల్లో కూలీలు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. రోజు కూలీలు, వివిధ సంఘాల మహిళలు పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా.. పిలుపు రాగానే వెళ్లి ఆ రోజుకు ‘జై’ కొడుతున్నారు. కూలీలు కావాలని అడ్డాల్లోకి వెళితే.. ‘ఇప్పుడు మేమంతా బిజీ.. ఏదైనా ఎన్నికల తర్వాతే’ అంటూ బైబై చెబుతున్న ఘటనలు ఉంటున్నాయి. నిత్యం కూలీలతో రద్దీగా ఉండే హరిబౌలి, పత్తర్‌ఘట్టీ, డబీర్‌పురా, ఫిల్మ్‌నగర్ అడ్డాలను గురువారం పరిశీలిస్తే పని కోసం వచ్చిన కూలీలు చాలా తక్కువగా కనిపించారు. వచ్చిన వారు సైతం తాము ఇప్పుడు మట్టి పనులకు రాలేమని, ఎన్నికల ప్రచారానికి మాత్రమే వస్తామని చెప్పడం విశేషం. ప్రచారంలో కొత్త వాళ్లేతే పార్టీ, అభ్యర్థి, నినాదాల విషయంలో పది నిమిషాల పాటు శిక్షణ సైతం ఇస్తున్నారు. ఇందులో చాలా మంది గడిచిన వారం రోజులకే ఒకే పార్టీకి ప్రచారం చేస్తుండగా, భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలకు జనం కావాల్సిన సమయాల్లో మాత్రం ఇతర పార్టీల్లోనూ ప్రత్యక్షమవుతున్నారు. ‘షో’ను బట్టి ప్యాకేజీలు.. ప్రచారంలో పాల్గొనే జనానికి ‘షో’ వారిగా ప్యాకేజీలు అమలవుతున్నాయి. జెండా, టోపీలతో రోజంతా ప్రచారం చేయాల్సి వస్తే ఉదయం టిఫిన్ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు భోజనంతో ముగుస్తుంది. ప్రచారం మార్గ మధ్యలో లంచ్ సైతం వడ్డిస్తున్నారు. ఇలా వస్తున్న మహిళలకు రూ.300, పురుషులైతే రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. పురుషులు నినాదాలివ్వటండం, సందడి సృష్టించే బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక వాహనంతో వస్తే రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే, ప్రచారంలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు, ప్రతి పది మంది మహిళలకు ఒక గ్రూప్ లీడర్ చొప్పున బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏ రోజుకారోజే నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఇక బూత్‌ల వారిగా వేసిన కమిటీలకు ప్రధాన పార్టీలు రూ.5000 చొప్పున రోజూ పంపిణీ చేస్తుండడంతో అన్ని ప్రాంతాల్లో రాజకీయ పండగే కనిపిస్తోంది. -
ముగ్గురూ..ముచ్చట
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్లో ప్రజాఫ్రంట్ అగ్రనేతల ప్రచారం జోరందుకుంది. గురువారం కూటమి అభ్యర్థుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జమ్ము అండ్ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ తదితరులు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా చేసిన ప్రచారంతో శ్రేణుల్లో నూతనోత్తేజం ఉరకలేస్తోంది. గెలుపుపై అభ్యర్థుల్లో సైతం ధీమా వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పక్షాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు ప్రత్యేక వ్యూహంతో విభిన్న కార్యక్రమాలతోముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిæకే రాహుల్ గాంధీ, చంద్రబాబులు సనత్‌నగర్, నాంపల్లి బహిరంగ సభల్లో ప్రసంగించగా, అంతకుముందు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నేతల భేటీలు.. రోడ్‌షోలు రాహుల్ గాంధీ గురువారం నగర శివారు శంషాబాద్‌లోని ఓ హోటల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు, కేజీ టు పీజీ జేఏసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. విద్యా రంగ సమస్యలపై వారితో చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో ప్రసంగించారు. ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్‌కు సృష్టికర్త తానే నంటూ చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఘనత తనదేనంటూ ప్రసంగించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శనస్త్రాలు సంధించారు. బీజేపీపై మండి పడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ర్యాలీ, బహిరంగ సభల్లో గులాం నబీ అజాద్ ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. -
దోస్తెవరు.. దుష్మనెవరు?
మల్లేసన్నా గీ దునియా మొత్తం కరాబయ్యిందే.. అంతా నమ్మక్ హరామ్లే..’ ఎంకటేసులు పొద్దుగాల్నే ఏందో మాట్లాడుతుండు. వాని ముచ్చట్లు నాకు కొత్తేం కాదుగాని.. ఉన్నట్లుండి ఎందుకంటుండె. ‘ఏందిరా పొద్దున్నే కతల్ చెబుతున్నవని.. అనడిగిన. ‘ఏం జెప్పాలె.. మొన్నటి దాంక మన పరమేసన్న ఎన్కాల తోకలెక్క తిర్గిండు గదా గా రమేసు. ఏమైందో దెల్వద్ గానీ.. నిన్న మరో కాండేటు కాడ దేలిండు. ఆన్ని జూసినంక నాకైతే బుర్ర గిరగిరా తిర్గిందన్కో..’ ఎంకటేసులు గిట్లంటుంటే నాకు నవ్వాగలె. పాపం గీడింక దునియా సూడలే. గీసారి ఎలచ్చన్ల కొత్తగ తిరుగుతుండు. ♦ గీ నాయకుల కతలే గిట్లుంటాయి. మా ఇంటికాడ ఓ పెద్దమనిసుండు. మంచిగ కద్దరు అంగీ పంచెతో కనిపించేటోడు. ఏడాది కింద ఓ పెద్ద పార్టీల చేరుకునిండు. రోజూ పేపర్ల టీవీల ఎదురు పార్టీ లీడర్లని తిట్టుడే తిట్టుడు. ఆ పార్టీవోల్లని గల్లీల కూడా రానియ్యలె. అనుచరులు గిదే దార్ల నడిసిండ్రు. ఎలచ్చన్ల పార్టీల టికెట్ రాలె. గంతె.. ఎవ్రికి సెప్పా పెట్టకుండ గప్చుప్గ ఎగస్ పార్టీల చేరిండు. బుజంపై గా పార్టీ కండువ పడిందో లెదో...ఎంటనే గా పార్టీ పెద్దతొ అలయ్ బలయ్ల హత్తుకునిండు. ఇంగ జూస్కొండి నిన్నదంక ఉండొచ్చిన పార్టీవోల్లపై ఎగిరెగిరి తిట్టిండు. గల్లీల మాకందరికీ ఆచ్చర్యమైంది. అరె గిదేందిర బై గీ పెద్దమనిసి నిన్నటి దాన్క ఆడుండె.. ఇప్పుడీడ దేలిండనుకున్నం. ఆ తిట్లు ఇని ‘...రాజకీయమంటె గిట్లుంటదా’ అనుకున్నం. ♦ మీకింకో ముచ్చట జెప్పాలె. గుంపుల్గట్టి ఎలచ్చన్ల పోటీ చేసేటోల్ల కత మరీ కతర్నాక్. నిన్నటి దాన్క దుష్మన్లని కొట్టుకున్నోల్లంత కల్సిపోతరు.. ఒకర్నొకరు ఆకాసానికెత్తుకుంటరు. అరె జనాలేమనుకుంటుండ్రన్నదే పట్టదు వాల్లకి. కత ఇంతట్తో ఆగదు. అడ్డొచ్చినోల్లని.. పరేశాన్ చేసేటోల్లని కలిపేసి.. ఆల్లు గుట్టు దోస్తానాలు.. దెల్సుకుండ్రు అంటూ మైకుల్లో అరుసుడే అరుసుడు. మరి పడ్డోడు ఊర్కుంటడ ఏంది? ఆయనా గిదే కత అందుకుంటడు. వీల్లు వాల్లని... వాల్లు వీల్లని.. గుట్టుగ జట్టుకట్టి గూడుపుటాని జేస్తుండ్రని అనుకుంటుండ్రు. ఏది సచ్.. ఏది జూట్ దెల్వక జనాలు తలపట్టుకుండ్రు. ♦ పోయిన్సారి ఎలచ్చన్ల కాంగ్రెస్‌ని తిట్టిపోసిన గా సైకిల్ సారు గీ ఎలచ్చన్ల.. దర్జాగా వాల్లతోనే జట్టు కట్టేసిండు. గిదేంది ఆల్లని దుష్మన్ అంటివి గాదె అనడిగితె.. అరె గట్ల గల్వకపోతె ఎట్ల? మనకి హోదా ఇవ్వలె మరి గుస్సా రాదె? గా కమలమోల్లతో కారాయన గుట్టుగ జట్టు కట్లేదా ఏంది? అని ఎదురు తిరిగిండు. గా గులాబీ బాసు ఈల్లందర్ని ఏకిబారేస్తుండు. మన సైకిల్ సారు కూటమోల్ల మీటింగ్‌ల జనసేన అని నోరు జారేసిండు. కొందరేమో లేద్లేదు.. గది నిజమే.. ఆయన మనసులో ఉన్నదె నోట్లో వచ్చినాది అంటుండ్రు. సివారకరికి గా కూటమోల్ల మీటింగ్‌ల గద్దరన్న కూసున్నడు. గంతే కాదు మీటింగ్ అయినంక తలదీస్కొని బోయి గా బాబు పొట్టల తల పెట్కుని.. మేరా దోస్తు అన్నడు. నిన్నటిదంక జాన్ దుష్మన్ గిప్పుడు దోస్తాన్నెట్లయిండో మల్ల. చూస్తిరా.. ఎవరు ఎవరి ఎన్కాల తిరుగుతుండ్రో.. ఎట్ల లింకులు గలుపుతుండ్రో. మనం మాత్రం ఆగం కావొద్దు.. దిమాక్ పెట్టాలె.. సరైనోల్లని గెలిపించాలె!! – రామదుర్గం మదుసూదనరావు -
అగ్రనేతల ప్రసంగాలతో గ్రేటర్ హీట్
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నగరంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ప్రచారానికి మాత్రం వారం రోజులే మిగిలి ఉంది. దీంతో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు సుడిగాలి షెడ్యూల్‌తో హోరెత్తిస్తున్నారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సభలతో నగరం బిజీ అయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అంబర్‌పేట, ముషీరాబాద్ అభ్యర్థులు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌ల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌షో నిర్వహించడంతో పాటు నగరంలో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై సీఎం కేసీఆర్, కాంగ్రెస్ కూటమిపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేసి ప్రచార అంకంలో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మేడ్చల్ నియోకజవర్గంలో జరిగిన మహిళా సదస్సులో పాల్గొని బీజేపీ ఆధ్వర్యంలోనే తెలంగాణ వికాసం సాధ్యమని తెలియజెప్పారు. ప్రజాఫ్రంట్ సైతం దూకుడు గ్రేటర్లో కాంగ్రెస్ ఆధర్వ్యంలోని టీజేఎస్, టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సనత్‌నగర్, నాంపల్లి నియోకజవర్గాల్లో సభలు నిర్వహించారు. ఈ సభల్లో రాహుల్.. నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సనత్‌నగర్ సభలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి, సికింద్రాబాద్, సనత్‌నగర్, ముషీరాబాద్ అభ్యర్థులు కె.దిలీప్‌కుమార్, కాసాని జ్ఞానేశ్వర్, కూన వెంకటేశ్‌గౌడ్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ తన ప్రసంగంలో హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్, టీడీపీ చలువేనంటూ టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఎల్బీనగర్లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్న రోడ్డు షోకు సైతం భారీగా జనం హాజరయ్యారు. చివరి వారం చాలా కీలకం ప్రచారానికి కేవలం వారం రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు బూత్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా ప్రచారాన్ని హోరెత్తించే ప్రణాళికను రూపొందించాయి. ఒక వైపు అగ్రనేతలతో పాటు మరో వైపు ఇంటింటి ప్రచారానికి వ్యూహం రూపొందించాయి. తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకున్న బూత్‌స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే నగరంలో రాత్రి వేళల్లో ప్రచారం, అనుమతి లేకుండా సభలు నిర్వహించినందుకు మూడు కమిషనరేట్లలో ఇప్పటికే 200కు పైగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ చివరి వారంలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌కు సీఎం మద్దతు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనిల్ అంబాని కుటుంబానికి రూ.వేలాదికోట్లు పంచిపెట్టింది. గబ్బర్‌సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ)కు సీఎం కేసీఆర్ మద్దతునిచ్చారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.– రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు (అమీర్‌పేట్ సభలో) టీఆర్ఎస్ను ఓడించండి కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేస్తున్న టీఆర్ఎస్ను ఓడించండి. బలహీనపడుతున్న కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుని వంద సీట్లలో కూడా పోటీ పడలేని స్థితికి దిగజారింది. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన కోదండరాం వారితో జతకట్టడం విచారకరం. – సుష్మాస్వరాజ్ (కీసర సభలో) దేశ భవిష్యత్ కోసమే.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేనెప్పుడూ దూషించలేదు. తెలంగాణలో అభివృద్ధికి ఎప్పుడూ అడ్డు పడలేదు. నగర అభివృద్ధికి రూపకల్పన చేశానన్నానేగాని.. నిర్మించానని ఎప్పుడూ చెప్పలేదు. అయినా హేళన చేసి మాట్లాడుతున్నారు. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌తో కలిశాం. తెలంగాణ భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి.– చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం పాము,ముంగీస ఒకటయ్యాయి చంద్రబాబు ఢిల్లీకి పోయి రాహుల్‌కు వీణ ఇస్తే, చంద్రబాబుకు ఆయన ఫిడేల్ ఇచ్చారు. డిసెంబర్ 11 తరువాత ఒకరు వీణ, మరొకరు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చోవాల్సిందే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు పెంచుకొని సన్యాసం తీసుకునే రోజు వస్తుంది. పాము, ముంగీసలాంటి కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయి. – కేటీఆర్ (మొయినాబాద్ రోడ్‌షోలో) విజ్ఞతతో ఓటేయండి కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను అద్దంలాగా చేస్తామన్నారు. తండ్రీకొడుకులను మూసీలో ముంచితే అసలు సంగతి తేలుతుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల పక్షాన నాలుగు పార్టీలు కలిసి ప్రజాఫ్రంట్‌గా నిలబడ్డాయి. నలుగురు కుటుంబ సభ్యుల పక్షాన కేసీఆర్ ఎన్నికల్లోకి వస్తున్నాడు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓటెయ్యాలి. – రేవంత్‌రెడ్డి (ఎల్బీనగర్ రోడ్‌షోలో) ఎన్‌కౌంటర్‌పై నోరు మెదపరేం? సీఎం కేసీఆర్ ఆలేరు ఎన్‌కౌంటర్‌పై నోరు ఎందుకు మెదపడం లేదు. ముస్లింల పక్షపాతిగా చెప్పుకునే కేసీఆర్ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తొక్కి పెట్టాడు. బడ్జెట్లో సైతం ముస్లిం జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. వాటినీ విడుదల చేయలేదు. 12 శాతం రిజర్వేషన్ పేరిట మభ్యపెట్టి మోసం చేశాడు. ముస్లింలు మేల్కోవాలి.– ఉత్తమ్‌కుమార్ రెడ్డి (అసీఫ్‌నగర్ సభలో) కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేడీ కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేడీ.. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలకు గోరీ కట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతి సభలోనూ చంద్రబాబు గురించి మాట్లాడడం మానుకోవాలి.– విజయశాంతి, (కుత్బుల్లాపూర్ సభలో) పాలన భ్రష్టు పట్టించాడు కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నేరవేర్చుతాడని అధికారం కట్టబెడితే సచివాలయానికి రాకుండా పాలనను భ్రష్టు పట్టించాడు. రూ.300 కోట్లతో భవనం కట్టుకొని దానికే పరిమితమయ్యాడు. బూటకపు హమీలతో నాలుగున్నరేళ్లకే కాడెత్తేశాడు. – ప్రొఫెసర్ కోదండరాం,(అమీర్‌పేట సభలో) ప్రజల పక్షాన నిలబడుతున్నా.. దేశంలో ఎక్కడ ముస్లిం మైనార్టీలు, దళితులపై దాడులు జరిగినా నేనే వెళ్లి బాధితులను ఓదారుస్తున్నా. అక్కడి పాలకులను ప్రశ్నిస్తున్నా. ఇది మతతత్వ పార్టీ కాదు.. హిందూ ముస్లిం భాయీ భాయి నినాదంతో ముందుకెళ్తోంది.– అసదుద్దీన్ ఓవైసీ (మొహదీపట్నం సభలో) -
ఏపీ టు కేపీ!
కూకట్పల్లి: కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్ నియోజకవర్గాలతో పాటు సెటిలర్స్ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కార్యకర్తలు భారీగా వచ్చారు. కూకట్పల్లి కేంద్రంగా చేసుకొని ఇక్కడ తిష్టవేశారు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని టీడీపీ తరపున బరిలో ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఓ కళాశాల హాస్టల్లో వీరికి వసతులు ఏర్పాటు చేసినట్లు ప్రచారమవుతోంది. స్థానికంగా ఉన్న కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంధ్రా నుంచి వచ్చిన కార్యకర్తలే ప్రచారాన్ని తన చేతుల్లోకి తీసుకొని అపార్ట్మెంట్ల వద్దకు వెళ్ళి ఏకంగా బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. కూకట్పల్లి ఆల్విన్‌కాలనీలో టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమ్యూనిటీహాల్‌లోనే వంటలు చేసి సమావేశం ఏర్పాటు చేస్తుండగా దీనిని టీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రశ్నించినందుకు పలువురు నాయకులు ఆయనపై చేయిచేసుకొన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులకు ఇక్కడ ఓట్లు లేకపోయినప్పటికీ అన్నీ తానై ప్రచారం చేయడంతో స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండటం గమనార్హం. కూకట్పల్లి ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి చెడగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
టీఆర్ఎస్కే సీమాంధ్రుల మద్దతు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రకు చెందిన బలిజ, కాపు, వంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపుల మద్దతు టీఆర్ఎస్ సర్కార్కే ఉంటుందని శ్రీకృష్ణదేవరాయ యూత్ అసోషియేషన్ అధ్యక్షుడు మిర్యాల రాఘవరావు పేర్కొన్నారు. శ్రీకృష్ణ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 30న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లోని మెజిస్టిక్ పంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొంటారన్నారు. కేసీఆర్ పాలనలో ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణను వదలి వెళ్లి ఇప్పుడు ఎన్నికలకు వచ్చి తొలుత కూకట్పల్లి టీడీపీ సీటు కాపులకే అని చివరిలో మాటమార్చి, తన బంధువు సుహాసినికి ఇచ్చి కాపులకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. సమైఖ్యంగా జీవనం సాగిస్తున్న సీమాంధ్రుల మధ్య కుల, మతాల చిచ్చుపెట్టాలని చూస్తున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మోసాలను, కుట్రలను సీమాంధ్రులు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణలో ఉన్న సీమాంధ్ర కాపులు 30న కేటీఆర్‌తో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అరవ రామకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు, చాగంటి రమేశ్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
మా జెండా ఈ ఎజెండాకే..
సాక్షి నెట్వర్క్: ఎన్నికలు వచ్చాయంటే నేతల మాటలు కోటలు దాటుతాయి. ప్రజల ముందుకు వచ్చి అడక్కుండానే వాగ్దానాలు చేసేస్తుంటారు.. హామీల వర్షం కురిపిస్తారు. ‘సారూ.. వర్షం వచ్చిందంటే మా వీధి మొత్తం నీట మునిగిపోతుంది.. నాలా విస్తరణ చేయించండి’ అంటే ‘అదెంత పని.. చేసేద్దాం’ అంటారు. గెలిచాక అటువైపు చూడనే చూడరు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రచారానికి వచ్చే అభ్యర్థులకు ప్రజల విన్నపాలు మామూలే. గెలిచిన నేతల నిర్లక్ష్యం కూడా అంతే. కానీ ఈసారి గ్రేటర్ ఓటర్లు నాయకుల ముందుకు కొన్ని డిమాండ్లు తెస్తున్నారు. అవి పరిష్కరించే వారికే తమ ఓటంటున్నారు. ఎల్బీనగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించే రావాలంటున్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు రోడ్లు విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆధునికీకరణకు నోచుకోని బేగంబజార్ మచ్చి మార్కెట్‌ను సరిచేయమంటున్నారు. శేరిలింగంపల్లిలోని ఐటీ కారిడార్‌లో వాహన విస్పోటం.. ఫలితంగా ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించాలంటున్నారు. కంటోన్మెంట్లో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేసి ప్రజలకు ఊరట కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నారు. పాతబస్తీలోని చారిత్రక ప్రదేశాల్లో సందర్శకులకు పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా నగరంలోని పలు నియోజకవర్గాల్లోని సమస్యలపై ‘ప్రజల మేనిఫెస్టో’ఎలా ఉందో తెలియాలంటే చార్మినార్:పార్కింగ్ పరేషాన్.. చార్మినార్, మక్కామసీదు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌లను సందర్శించడానికి వచ్చే పర్యాటకులతో పాటు చిరు వ్యాపారాల నుంచి హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. చార్మినార్ సమీపంలో జీహెచ్ఎంసీ మల్టీలెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. ఆటస్థలాలను అందుబాటులోకి తేవాలి. మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి.. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన చార్మినార్‌లో జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. వ్యాపారస్తుల వాహనాలతో పాటు వినియోగదారుల వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవల్ పార్కింగ్ ఎంతో అవసరం. – షేక్ ముస్తాక్, శాలిబండ ఆట స్థలాలు కావాలి.. పాతబస్తీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆట స్థలాలు అందుబాటులో లేవు. క్రీడా మైదానాలు లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ సైతం చేయలేక పోతున్నాం. – షేక్ నహీం, సయ్యద్ అలీ ఛబుత్రా కంటోన్మెంట్: ఇళ్లను క్రమబద్ధీకరించాలి కంటోన్మెంట్లో కఠినమైన భవన నిర్మాణ నిబంధనల సాకుతో 90శాతం ఇళ్లు అక్రమ నిర్మాణాల జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించాలని కొన్నేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో వెలసిన బస్తీలు, నివాసాల్లోని వారికి బోర్డు ఎన్నికల్లో ఓటుహక్కు తొలగించారు. ఈ మేరకు ఓటుహక్కు కోల్పోయిన 28,123 మంది భూ బదలాయింపు ద్వారా తమ నివాస స్థలాలకు పట్టాల కోసం నేతల్ని అభ్యర్థిస్తున్నారు. పరిమితిని పెంచాలి.. భవన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతమున్న 1.5 ఎఫ్ఎస్ఐ పరిమితిని పెంచడంతో పాటు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలి. తద్వారా 90 శాతం కంటోన్మెంట్ వాసులకు ఉపశమనం కలుగుతుంది.– సతీష్ గుప్తా, వాసవీ కాలనీ అధ్యక్షుడు భూ బదలాయింపు చేపట్టాలి.. కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నామన్న నెపంతో పలు బస్తీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్‌లో నేటికీ విద్యుత్ సదుపాయం లేదు. భూబదలాయింపు చేపడితేనే మాలాంటి వారికి పట్టాలు దక్కుతాయి.– అశోక్, అంబేడ్కర్ హట్స్ వాసి ఎల్బీనగర్: ముంపు ముప్పు ఎల్బీనగర్ పరిధిలోని పలు డివిజన్లలో లోతట్టు వాసులు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ముంపు సమస్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధా ఎజండా ముంపు సమస్యే. గత ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతల్లాగానే మిగిలాయి. ఇప్పటికీ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోవడంలేదు. వరద కాల్వల ఆక్రమణలతోనే.. వర్షం నీరు చెరువులోకి తెచ్చే కాల్వలన్నీ ఆక్రమణలకు గురి కావడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. దీంతో సాహెబ్‌నగర్‌లోని, కప్పల చెరువు, బతుకమ్మ కుంటల నుంచి వచ్చే వర్షం నీరు ఆంధ్రకేసరి నగర్, శారదానగర్, కమలానగర్, రాఘవేంద్ర కాలనీ, పద్మావతి కాలనీల్లోని ఇళ్లలోకి, బస్‌డిపో, కోర్టు ఆవరణలోకి వస్తోంది. – దాసరమోని శ్రీనివాస్, హయత్‌నగర్ కూకట్పల్లి: ట్రాఫిక్ కష్టాలు.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్లైఓవర్లు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జేఎన్టీయూ నుంచి మలేసియాటౌన్‌షిప్ వరకు నిర్మించే ప్లైఓవర్ తుది దశలో ఉంది. బాలానగర్ ప్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభ దశలో ఉంది. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్వరకు రోడ్డు పూర్తిస్థాయిలో విస్తరణ కాలేదు. కొన్నేళ్లుగా దీని పనులు కొనసాగుతునే ఉన్నాయి. హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందుల పాలవుతున్నారు. ఏళ్ల తరబడిగా ఇబ్బందులు.. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్‌కాలనీ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతునే ఉన్నాయి. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఉండటంతో హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు మూసాపేట చౌరస్తా నుంచి వెళ్తుంటారు. సంవత్సరాల తరబడి పనులు కొనసాగుతునే ఉన్నాయి. – సంతోష్, భరత్‌నగర్‌కాలనీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి.. బోరబండ నుంచి పర్వత్‌నగర్ చౌరస్తా వరకూ ఇరుకు రోడ్డుతో తరచూ ట్రాఫిక్ సమస్యతో పాటు నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కు పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. రహదారి విస్తరణ పనులకు మోక్షం కలగడంలేదు. – సీహెచ్. వంశీప్రసాద్, పర్వత్‌నగర్ చాంద్రాయణగుట్ట:పూర్తికాని ఆర్యూబీ ఉప్పుగూడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బార్కాస్‌లో నిర్మిస్తున్న ఈ– లైబ్రరీ నిర్మాణం కూడా ఏడేళ్లుగా సాగుతూనే ఉంది. రాజన్నబావి, ఛత్రినాక ప్రాంతాల్లో వరదముంపు తీవ్ర స్థాయిలో ఉంది. శేరిలింగంపల్లి: ఐటీకారిడార్‌లో నిత్య నరకం.. ఐటీ కారిడార్‌ను ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రధాన రహదారులు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వాహనదారులు కిలో మీటరు ప్రయాణం చేయాలన్నా విసిగివేసారుతున్నారు. పరిష్కారం చూపించాలి.. ఐటీ కారిడార్‌లో కిలో మీటర్ ప్రయాణించాలంటే పది నిమిషాల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. – కె. శ్రీనివాస్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్కాజిగిరి: కొలిక్కిరాని ఆర్యూబీ ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆర్యూబీ నిర్మాణం కొలిక్కి రావడంలేదు. ఇది ఇప్పటికీ పూర్తికాలేదు. రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండచెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సఫిల్‌గూడ చెరువు వద్ద ఉన్న ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచాలి. మల్కాజిగిరిలో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేసినా అందులో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. గోషామహల్: శిలాఫలకానికే పరిమితం బేగంబజార్ మచ్చి మార్కెట్ ఆధునికీకరణకు నోచుకోవడంలేదు. 9 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. రామ్మనోహర్ లోహియా కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ ముఖేశ్సింగ్లు శిలాఫలకం వేసి ఏడాది గడిచినా దీని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మహేశ్వరం: తాగునీటి కటకట.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రహదారులు ♦ మీర్పేట్, జిల్లెలగూడలలో కాలుష్య కాసారాలుగా చెరువులు ♦ డ్రైనేజీ వ్యవస్థ కొరవడి రోడ్లపై పారుతున్న మురుగునీరు ♦ మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, మహేశ్వరం, కందుకూరులలో తాగునీటి సమస్యలు ♦ చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న కాలనీలు మలక్‌పేట్: మురుగుతో సతమతం.. ♦ ట్రాఫిక్‌జాంతో వాహనదారుల సతమతం ♦ డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థానికుల ఎదురుచూపులు ♦ కాలనీలలో రోడ్లపై మురుగు ప్రవాహం.. ♦ విస్తరణకు నోచుకోని ప్రధాన రహదారులు.. -
కూటమి..ఖుషీ
సాక్షి,మేడ్చల్ జిల్లా: సోనియా సభ గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6.40కు మేడ్చల్‌లోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అరగంటకు పైగా సాగిన సోనియా ఉత్కంఠ భరిత ఉపన్యాసం ప్రజాకూటమి నేతలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సోనియా రాక సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా జనం వచ్చారు. బహిరంగ సభ ముగుస్తున్నప్పటికీ 2కి.మీ దూరంలో ఉన్న కిష్టాపూర్ పరిధిలో ఉన్న వాహనాల పార్కింగ్ ప్రాంతం నుంచి జనం కదలిరావడం కనిపించింది. సోనియా వచ్చిన అరగంట తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభాస్థలికి చేరుకున్నారు. వేదికపై ప్రజాకూటమి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసీనులయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, అభ్యర్థులు కేఎల్ఆర్, కూన శ్రీశైలంగౌడ్‌తో పాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోనియాను ఘనంగా స్వాగతించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ తన పాటతో సభికులను ఉత్తేజపరిచారు. సోనియా ప్రసంగంతో కాంగ్రెస్‌లో ఆశలు మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ చేసిన ప్రసంగం కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని కల్పించింది. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల ఉద్యమ ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని సోనియా తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కు ఇబ్బంది ఎదురైన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు సోనియా ప్రకటించడంపై సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఒక తల్లి తన బిడ్డల అభివృద్ధిని ఎలా కోరుకుంటుందో రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ అలాగే కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించడంతో పాటు ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని తీవ్రంగా విమర్శించారు. యువతలో రాహుల్ ‘జోష్’ రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగం యువతలో జోష్ నింపింది. 20 నిమిషాలకు పైగా సాగిన ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ ప్రస్తావించారు. కేసీఆర్ ఒక్కరే రాష్ట్రాన్ని నిరంకుశ«ంగా పాలించిన తీరును ఎండగట్టారు. కేసీఆర్ పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్, టీటీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజా కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోనియాకు ఘన సత్కారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా తొలిసారిగా మేడ్చల్‌కు విచ్చేయడంతో పార్టీలు, ప్రజా సంఘాలు ఆమె శాలువాతో ఘనంగా సత్కరించాయి. ఈ సత్కారంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమ కుమారి, విద్యార్థి సంఘాల నుంచి అరుంధతిరాయ్, రాజారాం, లంబాడి, గిరిజన సంఘాల నుంచి రవింద్రనాయక్, దళిత, ఎమ్మార్పీఎస్ సంఘాల నుంచి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి దామోదర్‌రెడ్డి, మైనార్టీ సంఘాల నుంచి షబ్బీర్ అలీ, టీజేఎస్ నుంచి కోదండరామ్, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి ఉన్నారు. -
కాంగ్రెస్‌తో కష్టాలే..
ఎల్బీనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ కల్తీ పార్టీగా మారిందని, ప్రజాకూటమి పేరుతో ప్రజలను మాయ చేసేందుకు వస్తున్న ఆ కూటమికి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలుత సరూర్‌నగర్ చెరువుకట్ట, మన్సురాబాద్, వనస్థలిపురం రైతుబజార్ ప్రాంతాల్లో స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్గౌడ్తో కలసి రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువై నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో మత కలహాలు, భూకబ్జాలతో పరిపాలన సాగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక నాలుగు పార్టీలు కలసి కూటమి కట్టి అసాధ్యంగాని హమీలతో అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. కూటమి కుయుక్తులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌ను గెలిపిస్తే కారులో అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్‌కు సైనికుడిగా ఉండి స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడన్నారు. నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కుంట్లూర్ వెంకటేష్‌గౌడ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మరో అవకాశం ఇవ్వండి పహాడీషరీఫ్: తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం మరోసారి టీఆర్ఎస్ను గెలిపించాలని కేటీఆర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహిన్‌నగర్, జిల్లెలగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, టీడీపీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక టీఆర్ఎస్ సర్కార్ విద్యకు పెద్ద పీట వేసిందన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం 200కు పైగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి 7 వేల మంది విద్యార్థుల చదువుకు బాటలు వేసినట్టు చెప్పారు. ఇందులో ఒక్కో విద్యార్థిపై రూ.1.2 లక్షలు వెచ్చిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, టీడీపీలు ముస్లిం ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వినియోగించుకున్నాయని, టీఆర్ఎస్ మాత్రం అన్ని కుల, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు బతుకమ్మ చీరలు, క్రిస్టియన్లకు కానుకలు అందించామన్నారు. షాదీ ముబారక్ పేదలకు వరంగా మారిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో నగరంలో తరచూ కర్ఫ్యూలు విధించారని, తమ హయాంలో అలాంటి వాటికి తావులేదన్నారు. మంచి మనసున్న తీగల కృష్ణారెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింల కోసం చేసిందేమి లేదని, కేసీఆర్ మాత్రం వారికోసం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారన్నారు. పహాడీషరీఫ్ దర్గా ర్యాంప్ కోసం రూ.8.5 కోట్లు విడుదల చేశామన్నారు. బీజేపీతో టీఆర్ఎస్ ఎప్పుడూ దోస్తీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ అంధకారం తప్పదని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సలీం, మజ్లిస్ నాయకులు అహ్మద్ సాధి, ఉమర్ బామ్, హమేద్ అజీజ్, అహ్మద్ కసాది, అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ నాయకులు కప్పాటి పాండురంగారెడ్డి, అబ్దుల్ బిన్ అవద్, ఎక్బాల్ బిన్ ఖలీఫా, మజ్హర్ అలీ, దూడల సుధాకర్ గౌడ్, మక్దూం పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడే ఇలాఖా ..!
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నివసించే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానాల్లో పోటీ చేస్తుండడం విశేషం.వీరందరూ ప్రధాన పార్టీల అభ్యర్థులే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 78 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ కూడా ఇదే నియోజకవర్గంలోని సోమాజిగూడలో ఉంది. ఇక మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్లోనివసిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తుండగా,కేటీఆర్ సిరిసిల్ల నుంచి బరిలో ఉన్నారు. ♦ కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులైన దామోదర రాజనర్సింహ జూబ్లీహిల్స్ రోడ్ నెం.92లో, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) శ్రీనగర్ కాలనీలో, పొన్నాల లక్ష్మయ్య (జనగామ) జూబ్లీహిల్స్ రోడ్ నెం.92లో, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ) లోటస్‌పాండ్‌లో, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు) ఫిలింనగర్లో, రేవంత్‌రెడ్డి (కొడంగల్) జూబ్లీహిల్స్‌లో, డీకే అరుణ (గద్వాల్) జూబ్లీహిల్స్‌లో, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), ఆయన సతీమణి పద్మావతి (కోదాడ) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, జానారెడ్డి (నాగార్జునసాగర్) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివాసం ఉంటున్నారు. ♦ మరోవైపు పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యే కాలనీలో, గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌గౌడ్ ఎమ్మెల్యే కాలనీలో, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని మిథిలానగర్‌లో ఉంటున్నారు. ♦ ఇక టీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మారెడ్డి (జడ్చర్ల) నందగిరిహిల్స్‌లో, మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) జూబ్లీహిల్స్ రోడ్ నెం.62లో, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లో, పట్నం మహేందర్‌రెడ్డి ( తాండూరు) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్) శ్రీనగర్ కాలనీలో, బాల్క సుమన్ (చెన్నూరు) బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. ♦ చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, ఆందోలు బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ ఫిలింనగర్లో నివసిస్తున్నారు. -
ఇళ్లు కూల్చేవాళ్లం కాదు..
రసూల్‌పురా: తాము ఇళ్లు కట్టించే వాళ్లమే కానీ కూల్చే వాళ్లం కాదని, సచివాలయం నిర్మిస్తే పేదల ఇళ్లకు ఏలాంటి నష్టం కలగదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో గురువారం మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సాయన్న తరఫున మంత్రి కేటీఆర్ రసూల్‌పురా, బోయిన్పల్లి, మారేడుపల్లి ప్రాంతాల్లో రోడ్‌షో సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. రసూల్‌పురాలో గురువారం రాత్రి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదప్రజలకు ఇళ్ల పట్టాలు అంద జేస్తామని, భూమార్పిళ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్లో ప్రజలపై భారం పడుతున్న నీటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బోర్డు సభ్యులు సాద కేశవరెడ్డి, అనితాప్రభాకర్ చేసిన కృషి మరవలేనిదని ప్రశంసించారు. సింహం సింగిల్‌గా వస్తుందని, కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు నాలుగు పార్టీలు కూటమిగా ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సాయన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి రెండుగంటలు ఆలస్యంగా వచ్చినా వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి రాక కోసం ఎదురు చూశారు. కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు ప్రభాకర్, అశోక్, ధన్‌రాజ్, అజ్జు, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. -
రెబెల్స్: ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే..
సాక్షినెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారుతోంది. ఈ రణరంగంలో మిగేలేదెవరో.. పోటీ నుంచి వైదొలగేదెవరో గురువారం తేలిపోనుంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కని ఆశావహులు రె‘బెల్స్’ మోగించారు. కొందరు జాతీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీల నుంచి నామినేషన్లు వేయగా, మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో మొత్తంగా 648 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో బుజ్జ గింపుల పర్వం ఊపందుకుంది. సనత్‌నగర్‌లో ఏ పార్టీకీ రెబల్స్ బెడద లేనప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘దండే విఠల్’కు కేటీఆర్ ఫోన్ చేశారు. పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు సహకరించాలని కోరారు. మజ్లిస్‌కు పట్టున్న అసెంబ్లీసెగ్మెంట్లలో ప్రధాన పార్టీలకు పెద్దగా రెబల్స్ బెడద లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఆజామ్ ఖాన్, కావూరి వెంకటేష్ టీఆర్ఎస్ రెబెల్స్‌గా కార్వాన్లో నామినేషన్లు వేశారు. నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే.. ఉప్పల్: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు మేకల శివారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. సింగిరెడ్డిని కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలి, డీకే.శివకుమార్‌లు పిలిపించి బుజ్జగించి సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నందికొండ శ్రీనివాస్‌రెడ్డి వేసిన నామినేషన్ అనూహ్య పరిణామాల మధ్య తిరస్కరించడంతో ఉప్పల్ అభ్యర్థులకు రెబల్ బెడద లేనట్టయింది. ఖైరతాబాద్: కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన చేసిన డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి, బి.రాజుయాదవ్, టీడీపీ రెబల్ అభ్యర్థి బీఎన్ రెడ్డిల నామినేషన్లు తిరస్కరణతో ప్రజాకూటమికి లైన్ క్లియర్ అయింది. ఇక టీఆర్ఎస్లో రెబల్‌గా నామినేషన్ వేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. మల్కాజిగిరి: పొత్తులో భాగంగా టీజేఎస్‌కు ఈ సీటు వెళ్లగా, కాంగెస్ ఓబీసీ సెల్ జాతీయ కో–ఆర్డినేటర్ బి.సురేష్‌యాదవ్, సీనియర్ నేత రామకృష్ణ నాయుడు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గోపు రమణారెడ్డి నామినేషన్ వేశారు. టీఆఎర్ఎస్కు ఇక్కడ రెబల్స్ బెడద లేదు. అంబర్‌పేట: అంబర్‌పేట మహాకూటమి చర్చల సీన్ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసానికి చేరింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న లక్షణ్యాదవ్, టీజేఎస్ అభ్యర్థి నిజ్జన రమేష్ ఇద్దరూ బుధవారం వీహెచ్‌ను కలిశారు. అక్కడే ఉన్న మీడియా ‘అంబర్‌పేట మహాకూటమి అభ్యర్థిపై స్పష్టత ఇస్తారా?’ అని ప్రశ్నించడంతో ‘‘ఇద్దరూ ఉంటార’’ని ఆయన చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఇద్దరిలో ఎవరు ఉపసంహరించుకుంటారో చూడాలి. టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలైన బీవీ రమణ, సునీల్ బిడ్లల నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరు బరిలో ఉంటారా.. లేదా అన్నది గురువారం తేలిపోనుంది. అంబర్‌పేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వనం రమేష్ స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బరిలో కొనసాగే అవకాశాలున్నాయి. బుధవారం ఆయన తన మద్ధతుదారులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ఓడించాలని తీర్మానించారు. ఎంఐఎం ఎవరినీ పోటీలో నిలపకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేసన్ వేసిన కొలన్ హన్మంత్‌రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతిస్తున్న ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ పోటీలో ఉంటారా.. లేదా.. అనేది గురువారం తేలనుంది. సికింద్రాబాద్: కాంగ్రెస్ నుంచి రెబల్‌గా నామినేషన్ వేసిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి ఇంకా అలక వీడలేదు. మరో రెబల్ ఆదం ఉమాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు పలికారు. ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు దాసరి శ్రీనివాస్, ఎస్.యాదగిరిలను కూడా ఆపద్ధర్మ మంత్రి పద్మారావు బుజ్జగిస్తున్నారు. కంటోన్మెంట్: ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన గజ్జెల నాగేశ్‌తో పాటు తెలంగాణ ఉద్యమకారిణి గంధం దయామణి ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. అయితే, వీరిద్దరూ పోటీలో ఉంటామని చెబుతుండగా, బుధవారం రాత్రి కేటీఆర్ ఇద్దరికీ ఫోన్ చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన శ్రీగణేష్ ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. మేడ్చల్: టీఆర్ఎస్ టికెట్ ఆశించిన నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు అవకాశం దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్) కూడా బరిలో ఉన్నారు. అయితే, మేడ్చల్‌లో శుక్రవారం సోనియాగాంధీ బహిరంగసభ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఇది మింగుడుపడని అంశంగా మారింది. కూకట్పల్లి: ప్రజాకూటమి అభ్యర్థికి రెబల్‌గా కాంగ్రెస్ నేత గొట్టముక్కల వెంగళరావు నామినేషన్ వేయగా, టీఆర్ఎస్ టికెట్ ఆశించిన హరీష్ చంద్రారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ప్రచారం కూడా వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో కేడర్ రెండుమూడు వర్గాలుగా చీలిపోయింది. మహేశ్వరం: గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కొత్త మనోహరెడ్డికి టికెట్ రాకపోవడంతో ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన్ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సిందే. రాజేంద్రనగర్: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ సభ్యుడు వేణుగౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చర్చించారు. శంషాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆయన.. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి లేదా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా శాంతింపజేశారు. ఇబ్రహీంపట్నం: ఇక్కడ మాత్రం మల్రెడ్డి బ్రదర్స్ ఇంకా కుదటపడలేదు. కాంగ్రెస్ తరఫున నుంచి పోటీ చేయాలని భావించిన మల్రెడ్డి రంగారెడ్డికి టీడీపీ రూపేణా దురదృష్టం వెంటాడింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ‘దేశం’కు కేటా యించారు. అయితే, టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీపై డైలామాలో ఉండడంతో తమకు అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీఎస్పీ, ఎన్సీపీల తరుఫున నామినేషన్లు కూడా వేసిన ఈ ఇరువురు తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా కలిసి.. ఇబ్రహీంపట్నం సీటు మార్పిడిపై చంద్రబాబుతో చర్చించాలని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షుల భేటీ అనంతరం వీరి పోటీపై స్పష్టత రానుంది. ఒకవేళ టీడీపీ తప్పుకోకపోతే.. వీరిని పోటీ నుంచి తప్పించేందుకు అధిష్టానం రంగంలోకి దిగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. శేరిలింగంపల్లి: టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్న మొవ్వా సత్యనారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఆయన్ను అమరావతికి పిలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. టీఆర్ఎస్ అసమ్మతి నేత శంకర్‌గౌడ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించి పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. స్వతంత్రుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆయన్ను కలిశారు. అయితే, మరోవైపు భిక్షపతి యాదవ్‌కు టీఆర్ఎస్కు పిలుపు వచ్చినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏకంగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి హుటాహుటిన ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్‌లు బుధవారం రాత్రి భిక్షపతియాదవ్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అన్యాయం జరిగిన విషయం వాస్తవమే అని తగిన న్యాయం చేస్తామని అహ్మద్‌పటేల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకొని మహా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. అయితే కార్యకర్తల సమావేశంలో వారి మనోభావాలు తెలుసుకున్నాక భిక్షపతియాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని పార్టీలో.. అంతమంది అభ్యర్థులు నామినేషన్లు అర్హత పొందిన అభ్యర్థుల్లో ఎన్నెన్నో పార్టీల వారున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనవాహిని పార్టీ, యువ పార్టీ, న్యూ ఇండియా పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), తెలంగాణ యువశక్తి, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బీఎల్ఎఫ్, ఇండియన్ ప్రజాబంధు పార్టీ, దళిత బహుజన్ పార్టీ, బీఎస్పీ, హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ, జైభారత్ జనసేన పార్టీ, జేడీ(ఎస్), లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నవ సమాజ్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మజ్లిస్ మర్కజ్–ఇ–సియాజీ, తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
ఆశ..నిరాశ
సాక్షి,సిటీబ్యూరో: రాజకీయ చదరంగంలో పావులు ఎలా కదులుతాయో.. అధిష్టానం ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో తెలియదు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఇదే నిజమైంది. ముఖ్యనేతలకు టికెట్లు దక్కుతాయనుకుంటే వారు తలచిందొకటి.. జరిగిందొకటన్న చందంగా పరిస్థితి మారింది. దశాబ్దాలుగా నమ్ముకున్న పార్టీకి సేవలు అందిస్తున్నవారిని టికెట్ల విషయంలో పక్కనబెట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లోనూ ముఖ్య నేతలకు ఈ పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. పార్టీల వారీగా పరిశీలిస్తే ప్రధాన, సీనియర్ నేతలు ఈ జాబితాలోఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలకు టికెట్ల విషయంలో నిరాశ తప్పలేదు. ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ముషీరాబాద్ టికెట్ కోసం చివరి దాకా ప్రయత్నించారు. ఆయనకు కాకపోతే తనకైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ అధినేత వద్ద ఏకరువు పెట్టినా వివిధ సమీకరణల నేపథ్యంలో ఈ టికెట్‌ను ముఠా గోపాల్‌కు కేటాయించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డిని పక్కనబెట్టి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చారు. ఇక మేడ్చల్‌లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని పార్టీ బరిలోకి దించింది. వీరికి రిక్త‘హస్తం’ సికింద్రాబాద్ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి తన నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఆమెకు టికెట్ దక్కలేదు. అనూహ్యంగా కాసాని జ్ఙానేశ్వర్‌కు పార్టీ బీ–ఫారం ఇచ్చింది. కాంగ్రెస్‌లో మరో సీనియర్ నేత, ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాలపై న్యాయ పోరాటం చేసిన మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి సనత్‌నగర్ టికెట్ దక్కలేదు. ఆయన్ను హైకమాండ్ పెద్దలు బుజ్జగించి మరో బాధ్యత అప్పగించారు. ఇక రాజేంద్రనగర్‌లో మాజీ హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి టికెట్ ఆశించినా ఆయనకూ నిరాశ తప్పలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. శేరిలింగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ టికెట్ ఆశించి భంగపడ్డారు. టీడీపీలోనూ అదే తీరు.. ఈ పార్టీలోని ముఖ్య నేతలదీ ఇదే పరిస్థితి. కూకట్పల్లి టికెట్ ఆశించిన ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డికి నిరాశే ఎదురైంది. నందమూరి సుహాసిని అనూహ్యంగా తెరమీదకు రావడంతో ఆయనకు పోటీచేసే అవకాశం దక్కలేదు. ముషీరాబాద్‌లో పార్టీ నేత ఎంఎన్ శ్రీనివాస్ టికెట్ కోసం ప్రయత్నించినా.. పొత్తులో కాంగ్రెస్‌కు వెళ్లింది. -
కోదండరామ్‌కు కనీసం సీటు కూడా ఇవ్వలేదు..
అంబర్‌పేట: మహాకూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకునే తెలివి కూడా లేదని, వాళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కూటమిలో ప్రొఫెసర్ కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారని, కనీసం సీటు కూడా ఇవ్వకుండా అవమానించారన్నారు. ఇది కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. బుధవారం అంబర్‌పేట చేనంబర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌కు మద్దతు తెలుపుతూ ‘అడ్వొకేట్స్ ఫర్ టీఆర్ఎస్’ పేరుతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చారిత్రాత్మకమని అన్నారు. న్యాయవాదులతో టీఆర్ఎస్కు ఉద్వేగభరితమైన అనుబంధం ఉందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి, రూ.100 కోట్ల నిధులు కేటాయించామని గుర్తు చేశారు. అడ్వొకేట్ల మరిన్ని న్యాయమైన డిమాండ్లను మళ్లీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని, టీఆర్ఎస్ను ధైర్యంగా ఎదుర్కోలేక తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలతో జట్టు కట్టిందని విమర్శించారు. చంద్రబాబునాయుడు రాసిన లేఖతోనే హైకోర్టు విభజనలో జాప్యం జరిగిందన్నారు. ఇది న్యాయవాదులు గమనించాలన్నారు. మహాకూటమి సీట్లు అమరావతిలో నిర్ణయించారని, ఇక కూటమి అధికారంలోకి వస్తే పరిపాలన కూడా అక్కడి నుంచే సాగుతుందని ఎద్దేవా చేశారు. అంబర్‌పేట బీజేపీకి కంచుకోట అంటున్న ఆ పార్టీ నేతలకు... కాలేరును గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు. కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మస్తు నరుకుతడని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ను ఎందుకు గెలిపించుకోలేదనిప్రశ్నించారు. బీజేపీతో టీఆర్ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంబర్‌పేట టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ప్రజాసేవలోకి వచ్చారని, ఆయనను ప్రోత్సహించేందుకు పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. అడ్వొకేట్ జేఏసీ కో–కన్వీనర్ శ్రీరంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణయాదవ్, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి, గండ్రమోహన్‌రావు, సుధాకర్‌రెడ్డి, సత్యంరెడ్డి, మధుసూధన్‌రావు, జయ్కర్, ముకీత్, భార్గవ్, జితేందర్‌రెడ్డి, రవి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి కోసం బీజేపీ అభ్యర్థి త్యాగం?
జగద్గిరిగుట్ట: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న బాబాయ్ కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చేందుకు కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ ముదిరాజ్ ఏకంగా పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరికీ అనూహ్య పరిణామాల మధ్య ప్రధాన పార్టీల నుంచి టికెట్లు లభించాయి. బీజేపీ నుంచి అబ్బాయి వీరేశ్‌కు మొదట కుత్బుల్లాపూర్ టికెట్ ఖరారు కాగా, అదే రోజు రాత్రి 9 గంటలకు బాబాయ్ జ్ఞానేశ్వర్‌కు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ టికెట్ ఖరారు చేసింది. దీంతో ఇరువురూ సోమవారం ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. బాబాయ్ ప్రచార బాధ్యతలు చూసుకోవాల్సిన వీరేశ్‌కు బీజేపీ టికెట్ రావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. దీంతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాబాయ్‌కి మద్దతుగా నిలిచేందుకే వీరేశ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా కుత్బుల్లాపూర్ నుంచి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు కాసాని వీరేశ్, చెరుకుపల్లి భరతసింహారెడ్డి, శ్రీనివాస్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భరతసింహారెడ్డి, శ్రీనివాస్‌ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పార్టీ బీ ఫారం లభించిన వీరేశ్ నామినేషన్ మాత్రమే ఓకే అయింది. దీంతో వీరేశ్ ఒకవేళ తన బాబాయ్‌కు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకుంటే స్థానికంగా బీజేపీ పోటీలో లేనట్లే అవుతుంది. -
నేటి నుంచి ప్రచార జోరు
ఓ ఘట్టంముగిసింది. నామినేషన్ల పర్వ పూర్తయింది. ఇక ప్రచారం జోరందుకోనుంది. అయితే అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ మోగుతున్నాయి. మహాకూటమి, టీఆర్ఎస్ల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు స్వతంత్రులుగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయడం ఆయా పార్టీలను కలవర పెడుతోంది. మహాకూటమిలో బండ కార్తీకరెడ్డి, ఉమాదేవి, కార్తీక్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, మొవ్వ సత్యనారాయణ, నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్... టీఆర్ఎస్లో శ్రీనివాస్‌రెడ్డి,శంకర్‌గౌడ్, ప్రఫుల్ రాంరెడ్డి తిరుగుబావుటా ఎగరేశారు. ఈ నేపథ్యంలో రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీలిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: నామినేషన్లకు చివరి రోజైన సోమవారం గ్రేటర్లో వందలాదిగా నామపత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా మల్కాజ్గిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో 65చొప్పున...అత్యల్పంగా బహదూర్‌పురాలో 11నామినేషన్లు వేశారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 475మంది నామినేషన్లు వేయగా... రంగారెడ్డి జిల్లాలో 305మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కార్తీకమాసం, సోమవారం సెంటిమెంట్ కలిసి రావడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం పార్టీల నుంచి బరిలోకి దిగిన వారిలో ఒక్కో అభ్యర్థి రెండు నుంచి నాలుగు సెట్ల మేర నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో సంఖ్యా పరంగా నామినేషన్లు పెరిగినట్లు కనిపించినా... అదే స్థాయిలో అభ్యర్థులు పెరగకపోవడం విశేషం. కొన్నిచోట్ల ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని రెబల్స్ నామినేషన్లు దాఖలు చేయడంతో బీ–ఫారాలు దక్కిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేటి నుంచి ప్రచారహోరుకు తెరలేవనుంది. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్(టీఆర్ఎస్), సనత్‌నగర్ నుంచి కూన వెంకటేశ్‌గౌడ్(టీడీపీ), తలసాని శ్రీనివాస్ యాదవ్(టీఆర్ఎస్), భవర్‌లాల్‌వర్మ(బీజేపీ), గోషామహల్ నుంచి రాజాసింగ్(బీజేపీ), ప్రేమ్‌సింగ్‌రాథోడ్(టీఆర్ఎస్) తదితరులున్నారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేశ్ అలియాస్ చంద్రముఖి నామినేషన్ దాఖలు చేశారు. అంబర్పేట్ నియోజకవర్గం నుంచి మహాకూటమిలోని కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్‌యాదవ్, టీజేఎస్ నుంచి రమేశ్ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచార జోరు... ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రేటర్లో నేటి నుంచి ప్రచారపర్వం జోరుగా సాగనుంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేయనున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు భారీగా తాయిలాలు ప్రకటించనున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ముఖ్యనేతల ప్రచారపర్వాలతో గ్రేటర్లో ప్రతి వీధీ హోరెత్తనుంది. రాజకీయ నాయకుల హామీల వర్షంలో ఓటర్లు తడిసిముద్దకానున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లు, యువత, కులసంఘాలను తమవైపునకు తిప్పుకునేందుకు వారికి అవసరమైన వినియోగ, గృహోపయోగ, విలాస వస్తువులను ఇస్తామంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఆయా వర్గాలతో బస్తీ, కాలనీల్లో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వారు కోరిన ఆఫర్లకు సై అంటుండడం గ్రేటర్ ఎన్నికల వైచిత్రి. ప్రధాన పార్టీల నుంచి స్టార్క్యాంపెయినర్లతో మినీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రేటర్లో నామినేషన్ల వివరాలివీ.... ♦ ఖైరతాబాద్ 55: ఖైరతాబాద్‌లో మొత్తంగా 55 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం 14 నామినేషన్లు వేశారు. ♦ గోషామహల్ 43: ఈ నియోజకవర్గంలో మొత్తంగా 43 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం 21 నామినేషన్లు నమోదయ్యాయి. ♦ నాంపల్లి 26: నాంపల్లిలో మొత్తంగా 26 నామినేషన్లు, సోమవారం 17 నామినేషన్లు వేశారు. ♦ కార్వాన్ 21: ఇక్కడ మొత్తం 21 నామినేషన్లు , సోమవారం 7 నామినేషన్లు నమోదయ్యాయి. ♦ జూబ్లీహిల్స్ 51: ఈ నియోజకవర్గంలో మొత్తం 51 నామినేషన్లు రాగా... సోమవారం 23 నామినేషన్లు వచ్చాయి. ♦ అంబర్పేట్ 45: ఇక్కడ మొత్తం 45 నామినేషన్లు రాగా... సోమవారం 26నామినేషన్లు నమోదయ్యాయి. ♦ ముషీరాబాద్ 29: ఈ నియోజకవర్గంలో మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం 17 వేశారు. ♦ మలక్‌పేట్ 25: ఇక్కడ మొత్తంగా 25 నామినేషన్ పత్రాలు నమోదు కాగా.. సోమవారం 16 దాఖలయ్యాయి. ♦ సికింద్రాబాద్ 37: సికింద్రాబాద్‌లో మొత్తం 37 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం 19 నామినేషన్లు నమోదయ్యాయి. ♦ కంటోన్మెంట్ 25: ఇక్కడ మొత్తం 25 నామినేషన్లు నమోదు కాగా.. సోమవారం 15 నామినేషన్ పత్రాలు వచ్చాయి. ♦ యాకుత్‌పురా 37: ఈ నియోజకవర్గంలో మొత్తంగా 37 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ♦ బహదూర్‌పురాలో మొత్తంగా 11 నామినేషన్లు, చార్మినార్‌లో 25, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో 25 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రాజేంద్రనగర్ 50: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం 50 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం ఒక్కరోజే 23నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి గణేష్‌గుప్తాకు టికెట్ ఖరారు కాగా... ఆ పార్టీ రెబెల్‌గా మ్యాడం రాజేశ్వర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ టికెట్ ప్రయత్నించి విఫలమైన కార్తీక్‌రెడ్డి, చక్కల మల్లయ్య, రణధీర్రెడ్డిలు రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. కూకట్పల్లి 48: కూకట్పల్లి నియోజకవర్గంలో మొత్తం 48 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒక్కరోజే 18 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి కాంతారావు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. మేడ్చల్ 35: మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం ఏకంగా 20నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడా ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కాగా కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా తోటకూర జంగయ్య యాదవ్ నామినేషన్ వేశారు. ఎల్బీనగర్ 64: ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 64 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలవడం విశేషం. ఇక్కడ మొత్తం 44 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరిలో కొందరు రెండు మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం విశేషం. మహేశ్వరం 35: మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 20 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. శేరిలింగంపల్లి 41: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తంగా 41 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా శంకర్‌గౌడ్ నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి మొవ్వా సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నామినేషన్లు వేశారు. కుత్బుల్లాపూర్ 52: ఈ నియోజకవర్గంలో మొత్తం 52 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒకేరోజు అత్యధికంగా 38 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ రెబల్ అభ్యర్థిగా చెరుకుపల్లి భరత్‌సింహారెడ్డి నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి 65: మల్కాజ్గిరి నియోజకవర్గంలో మొత్తం 65 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, నందికంటి శ్రీధర్, సురేష్‌యాదవ్, రామకృష్ణనాయుడు నామినేషన్లు వేశారు. ఉప్పల్ 65: ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం 65 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఏకంగా 28 మంది నామినేషన్లు వేశారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ రెబల్అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేశారు. రెఢీబెల్స్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. చివరి వరకు టికెట్ వస్తుందనుకున్న ఆశావహులకు ఆయా పార్టీల నుంచి రాకపోవడంతో తిరుగబావుటా ఎగరేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి నిలిచారు. నామినేషన్లూ వేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారడంతో... కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ నేతలు కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. కూటమిలో భాగంగా గ్రేటర్‌లోని 24 స్థానాల్లో కాంగ్రెస్‌కు 16, టీడీపీకి 6, టీజేఎస్‌కు 2 సర్దుబాటు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ అదనంగా అంబర్‌పేట్‌లో పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ యాదవ్‌కు బీ–ఫామ్ అందజేసింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్, టీజేఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది. నామినేషన్ల దాఖలు... మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, మహేశ్వరం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పురా, నాంపల్లి, చార్మినార్ స్థానాలు... టీడీపీకి మలక్‌పేట, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్ దక్కగా... టీజేఎస్‌కు మల్కాజిగిరి, అంబర్‌పేట కేటాయించారు. అయితే ఆయా పార్టీల నుంచి సంబంధిత నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు రెబల్స్‌గా బరిలోకి దిగారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆదం ఉమాదేవి, నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్‌గౌడ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించిన భిక్షపతి యాదవ్, ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మొవ్వ సత్యనారాయణ, రాజేంద్రనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన కార్తీక్‌రెడ్డి, మల్కాజిగిరి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్లు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. బుజ్జగింపులు... అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయాపార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు రెండు రోజులుగా నగరంలోని ఓ హోటల్లో ఉంటూ రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తులను అమరావతికి పిలిపించి హామీలిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్ టికెట్ టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తాకు దక్కింది. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్ ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించిన అధిష్టానం టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీలో ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేని బండ్ల గణేశ్‌కు ఏకంగా టీపీసీసీ అధికార ప్రతినిధి హోదా లభించింది. టీఆర్ఎస్కూ తప్పని తిప్పలు... టీఆర్ఎస్కూ రెబల్స్ బెడద తప్పలేదు. మిగతా పార్టీలతో పోలిస్తే రెబల్స్ బెడద టీఆర్ఎస్కు ఇబ్బందులు సృష్టించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ... అక్కడక్కడా ఆ పార్టీ అసంతృప్తులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేలోగా వీరిలో చాలామంది... అధినేత కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకు ఉపసంహరించుకుంటారా? లేక పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. నామినేషన్ల ఘట్టం ముగిసే సరికి టీఆర్ఎస్ రెబల్స్‌గా ఉప్పల్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి శంకర్‌గౌడ్, ముషీరాబాద్ నుంచి తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నామినేషన్లు వేశారు. -
ఇదీ సెక్షన్ తప్పదు యాక్షన్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలే ప్రధాన భూమిక వహిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపు తప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘సర్కార్’ సినిమా చూసిన తర్వాత ప్రజల్లో ఎన్నికల చట్టాలు గురించి తెలుసుకోవాలన్నా ఆసక్తి ఎక్కువైంది. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు – నిబంధనలు గురించి సెర్చ్ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం. 49పి: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే, పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటర్ 49–పి సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటర్‌కు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు3 నెలల జైలుశిక్ష లేదాజరిమానా. ఇవీ సెక్షన్లు.. 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోనుచేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష లేదా జరిమానా. రెండింటినీ విధించేఅవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేల జరిమానావిధించవచ్చు. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా.. ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. రెండూ అమలు చేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానావిధిస్తారు. 134(ఆ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ. 500 జరిమానా విధిస్తారు. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష. అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష. రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారు. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. -
గార్డెన్ దావత్‌కు నువ్వు రావలె
’అన్నా.. గీ ఆదివారం గార్డెన్ దావత్ అంట నువ్వు రావలె’ అని ఎంకటేసు అంటే నాకు సమజ్ గాలె. ఈ బిత్తిరోడు ఏదీ సక్కగ జెప్పడు గదా అనుకుని’ గార్డెన్ దావత్ ఏందిర బై.. ఇనేందుకే కొత్తగుంది’ అనడిగిన. ‘గదేనే.. కార్తీకంలో దావత్ పెడ్తరు.. అందరు కలుస్తరు గద’ అనంగనే నా బుర్ర గిర్రమంది. ‘అరె బేవకూఫ్ దాన్ని వనబోజనం అంటరు.’ అన్న. ‘గదేలేవె.. నాకేం దెల్సు ఇక్కడందరు గట్లనె అంటుండ్రు. గద్సరె గాని ఇంటోల్లందర్ని పిల్సుకు రా మల్ల’ అనెల్లిండు. కార్తీక మాసం ఒచ్చిందంటే వనబోజనాలు ఉంటయ్ గద. గీసారి ఏంది స్పెసల్ అని ఆలోచిస్తె టక్కున బల్బు ఎలిగింది. ఆ గీసారి ఎలచ్చన్లున్నయ్గ.. గదీ సంగతి. అరె ఈ ఎలచ్చన్లు.. వనబోజనాలు బలె కల్సి వచ్చినయ్! ⇔ వానకాలం ఎళ్లి చలికాలం సురువయ్యే టైంల వచ్చే గీ కార్తీకం అంటె ఇస్టం లేందెవర్కి. దివిల పండగ మొదలు ఇంటి ముందు మట్టి ప్రమిదల్ల దీపాలెల్గుతుంటె.. గవి మన కండ్లల్ల వెలుగుతున్నట్లె ఉంటయ్. ఇండ్లల్ల.. వీదుల్ల.. గుళ్లోన.. వెయ్యిదీపాలు.. లచ్చ దీపాలు.. కోటి దీపాలు అంటూ పోటీ పడ్తుంటె.. ఊరు ఊరంతా గా దీపాల్లెక్కన మెరిసిపోతుంటది. గింతేగాదు కార్తీకం అనగానె టక్కున గుర్తొచ్చేది వనబోజనాలె. ఊర్లో.. సిటీల అన్ని చోట్ల గీ వనబోజనాల సందడే సందడి. మొదట్లో గల్లీలో ఉన్నోళ్లు.. ఊరి చివర్న తోటల్కాడికెల్లి బోజనాల్జేసి కొంతసేపు కుశాల్గ కబుర్లు చెప్పుకొని ఆడిపాడి వచ్చేటోల్లు. ఊరేదైనా.. పేరేదైనా జనాలు కల్సిమెల్సి ఉండే మంచి కాలం అది. గిప్పుడు గట్ల కాదు. ఎవరికి వాల్లు సామాజిక వర్గాలుగ గుంపులు కట్టిండ్రు. వాట్సప్ల్ల కూడా గివి జోర్దార్గ నడుస్తున్నయ్ అంటె సూడుండ్రి. గీల్ల దిమాక్ గింతెందుకు కరాబ్ అవుతాందో గెంత బుర్ర పెట్టినా అందుత లేదు. ⇔ గిప్పుడు మా గల్లీల వనజోజనం ప్రచారం బలె జోరందుకుంది. కార్తీక మాసం.. శివనామ స్మరణం! వనబోజన ఉత్సవం.. అందరూ తరలి రావాలె! అంటూ బ్యానర్లు.. ప్లెక్సీçలు మస్తుగ కట్టిండ్రు. క్యాండేటు.. లేదా లీడర్లెంట.. పార్టీలెంట తిరిగే గల్లీ లీడరు దండాలు పెడ్తున్న పొటోలు పెట్టిండ్రు. గింతే కాదు సామాజికవర్గం పేర్లు కూడా రాసుకుండ్రు. ఏందైతే నేం మంచిగ దావత్ పెడ్తుండ్రు పున్నేనికి పున్నెం.. తినటాన్కి అన్నం అనుకుంటుండ్రు జనాలు. ఆదివారం అయితే సాలు గల్లీ ముందు బండ్లు పెడ్తుండ్రు. మల్ల జనాల్ని తీసుకెల్లాలి గాదె. అప్పట్లో తోటలుంటె.. గిప్పుడంత స్వేతా గార్డెన్.. పూజా గార్డెన్.. సువర్ణ గార్డెన్.. ఆ రిసార్టు గీ రిసార్టులు కనిపిస్తున్నయ్! ⇔ మొన్న ఓ వనబోజనం పంక్షన్‌కు కాండేటు వచ్చిండంట. బోజనాలైనంక.. ‘మెల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్ ఏసిండె’ పాట పెట్టంగనె పిల్లలు స్టేజిపై మస్తుగ డాన్సు చేసిండ్రంట. ఏం మిస్టేకో తెలీదు గానీ గీ లైను రాంగానె పాట బంద్. మల్లీ ‘మెల్ల మెల్లగ వచ్చిండే’ అంటూ సురు! గిట్ల నాల్గుసార్లు అయ్యేసరికి గా కాండేటు గుస్సా అయిండంట! ఏం మజాక్ జేస్తుండ్రు? నాకు దెల్వదనుకుండ్రా! గా పాటేంది? గా డాన్సేందిర బై ? నేనేం మెల్లగ రాలె బాగానె వచ్చిన. గదేదో క్రీము బిస్కట్ ఏసిండంటె ఏందర్థం? గింత జేసింది గాకుండ పెట్టిందే పెట్టి నా ఇజ్జత్ దీస్తరా చల్.. అని లేసిండంట. పాపం నిర్వాహకులు అన్నా గుస్సా జెయ్యకే.. గది ‘పిదా’ సిన్మా పాట అన్నా ఇనకుండా.. పిదా లేద్ గిదా లేద్ పదా.. అని ఎంటొచ్చినోల్లని లేప్కొని ఎల్లిపోయిండంట! నిజమే మల్ల ఎప్పుడు జనాల వద్ద రానోల్లకి గిట్ల బోజనాల కాడికొచ్చి ఓటు అడిగితె గట్లనే ఉంటది. ఇంతకీ గీ వనబోజనాల్కి పైసల్ ఎవరిస్తుండ్రని గా ఎంకటేసుల్ని అడిగిన. ఇంకెవ్రు గా కాండేట్లే! నీకు దెల్వదా? అన్నడు. అంటె గివన్నీ ఓట్లు రాబట్కునేకి కొట్టే పల్టీలన్నమాట! గీ గార్డెన్.. కాదు కాదు వనబోజనాలంటూ జనాల్ని కూడేసేది గిందుకోసమెనా? – రామదుర్గంమధుసూదనరావు -
నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..
ముందస్తు ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల కాగా.. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. ప్రధానపార్టీలు అన్ని స్థానాలకు టికెట్లు ఖరారు చేయని కారణంగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు ఆశించిన మేరకు దాఖలు కాలేదు. శనివారం వరకు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు 55 మంది 68 సెట్లలో నామినేషన్లు వేశారు. సెప్టెంబర్ 6న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితాలో 107 మందిని ప్రకటించగా.. అందులో చొప్పదండి మినహా మూడు నియోజకవర్గాలకు సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ఖరారు చేశారు. రెండురోజుల కిందటే చొప్పదండికి అభ్యర్థిని ఖరారు చేశారు. అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. 12 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురు వేశారు. అయినప్పటికీ ఆఖరిరోజు నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు పోటెత్తనున్నాయి. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, కరీంనగర్ : తొలి జాబితాలో మంత్రి ఈటల రాజేందర్ (హుజూరాబాద్), గంగుల కమలాకర్ (కరీంనగర్), రసమయి బాలకిషన్ (మానకొండూరు) ఉండగా.. నాలుగు రోజుల క్రితం చొప్పదండికి సుంకె రవిశంకర్‌ను ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రారంభం రోజే హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ తరఫున ఆయన సతీమణి ఈటల జమునారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్‌ను వేసిన పాడి కౌశిక్‌రెడ్డి తరఫున శనివారం ఆయన సతీమణి శాలినీరెడ్డి మరోసెట్ దాఖలు చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ (టీఆర్ఎస్), పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) నామినేషన్లు వేశారు. చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), సుంకె రవిశంకర్ ఒక్కో సెట్ దాఖలు చేశారు. మంచిరోజు, చివరి రోజు కావడంతో మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి బీ ఫారంతో కలిపి ఇప్పటివరకు నామినేషన్ వేయని, వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మరో సెట్లో వేసేందుకు నామినేషన్ వేసేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్, మానకొండూరులో రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), ఆరెపెల్లి మోహన్ (కాంగ్రెస్) భారీ జనంతో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగ శోభ (బీజేపీ) కూడా సోమవారం నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, స్వతంత్రులు కూడా నామినేషన్లు వేయనుండగా.. పోలీసులు భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన... 22న ఉప సంహరణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు నేటితో తెరపడనుండగా.. శనివారం నాటికి 55 మంది వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 68 సెట్లలో దాఖలు చేశారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 23 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుండగా.. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. డిసెంబర్ 7న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. అదేనెల 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు ఢిల్లీ, హైదరాబాద్‌లో టికెట్ల కోసం క్యూకట్టిన కొందరు నేతలు.. సోమవారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేసేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో బారులు తీరనున్నారు. ముందస్తుపోరులో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపుగా సోమవారమే నామినేషన్లు వేయనుండటంతో నామినేషన్ కేంద్రాల్లో సందడి నెలకొననుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహసీల్దారు/ఆర్డీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. నామినేషన్ పత్రాలపై ఆదివారం రాత్రే కసరత్తుపూర్తి చేశారు. ముహూర్తం కోసం ఎదురుచూసిన అభ్యర్థులు చివరిరోజు నామినేషన్లకు సిద్ధం కావడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. -
ప్చ్..నో చాన్స్
సాక్షి,సిటీబూరో: ముషీరాబాద్‌తో నలభై ఏళ్ల అనుబంధం.. ఈ మారు టికెట్ నాకే కావాలంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం గజ్వేల్‌లోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో నాయిని భేటీ అయినా.. ముషీరాబాద్‌లో బీసీ అభ్యర్థి ముఠో గోపాల్‌కే ఇస్తామని స్పష్టం చేశారు. మీ భవిష్యత్‌కు నాది భరోసా అంటూ కేసీఆర్ స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక నాయిని హైదరాబాద్ తిరిగి వచ్చారు. అనంతరం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. సీఎం నిర్ణయమే శిరోధార్యమని, ఆయన పిలుపు మేరకు ముఠా గోపాల్ విజయం కోసం పనిచేస్తానని ప్రకటించారు. మరో వైపు టీడీపీ పొత్తుతో తన స్థానాన్ని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి ఢిల్లీలో సైతం ఆశించిన ఫలితం దక్కలేదు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఆదివారం తిరిగి నగరానికి చేరుకున్నారు. సనత్‌నగర్‌లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం, సికింద్రాబాద్‌లో పోటీ చేయమని శశిధర్‌రెడ్డికి సూచించినా, ఆయన అందుకు సుముఖంగా లేకపోవడంతో, నీ భవిష్యత్‌కు ఏం ఢోకా ఉండదంటూ హైకమాండ్ ఇచ్చిన బరోసాతో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని, కాంగ్రెస్‌ను వీడనని శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. 1989 నుంచి నియోజకవర్గంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శశిధర్‌రెడ్డి పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ప్రకటించారు. -
హౌస్ ఫుల్!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ప్రధాన పార్టీల టికెట్ల పందేరం దాదాపు ముగిసింది. ఆదివారం ముషీరాబాద్‌కు తమ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ను ప్రకటించి టీఆర్ఎస్ టికెట్ల పంపిణీకి తెర దించింది. సికింద్రాబాద్ సీటును కాంగ్రెస్ కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించడంతో ఆ పార్టీ అన్ని సీట్లు భర్తీ చేసినట్టయింది. అంబర్‌పేటకు టీజేఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ బీసీలు, ఓసీలకు సమ ప్రాధాన్యం ఇస్తే, కాంగ్రెస్ ఈ మారు ముస్లిం మైనారిటీలకు అధిక సీట్లు కేటాయించింది. టీఆర్ఎస్ రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, నాంపల్లి స్థానాలను గౌడ సామాజిక వర్గానికి, సనత్‌నగర్, మలక్‌పేట యాదవులకు, మహేశ్వరం, మేడ్చల్, ఉప్పల్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్టలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెడ్ల స్థానాలను తగ్గించారు. కూకట్పల్లి, మల్కాజిగిరిని వెలమ, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి కమ్మ, బహూదూర్‌పురా, చార్మినార్‌ను ముస్లింలకు కేటాయించారు. ఖైరతాబాద్‌ను మున్నూరుకాపు, అంబర్‌పేట వంజరి, ముషీరాబాద్ బెస్త, గోషామహల్, కార్వాన్ను ఉత్తరాదికి చెందిన మార్వాడి, ఠాకూర్లకు కేటాయించారు. కూటమిలో మైనారిటీలకు.. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో ఆరు స్థానాలకు మైనారిటీలకు, ఉప్పల్, కుత్బుల్లాపూర్, గోషామహల్‌ను గౌడ్లకు, ఎల్బీనగర్, మహేశ్వరం, జూబ్లీహిల్స్, మేడ్చల్ స్థానాలకు రెడ్లకు, ముషీరాబాద్ యాదవులకు, ఖైరతాబాద్ కంసాలి, యాకుత్‌పురా మేరు, రాజేంద్రనగర్‌ను వైశ్యులకు, మల్కాజిగిరిని బ్రాహ్మణులకు కేటాయించారు. సికింద్రాబాద్‌లో కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సైతం చంద్రాయణగుట్ట, బహదూర్‌పురాలో మైనార్టీలు, అంబర్‌పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్‌లో రెడ్లు, మలక్‌పేటలో పద్మశాలి, ముషీరాబాద్‌లో మున్నూరు, నాంపల్లిలో యాదవ, శేరిలింగంపల్లిలో వైశ్య, కూకట్‌పల్లిలో వెలమ, మల్కాజిగిరి, ఉప్పల్‌లో బ్రాహ్మణ, చార్మినార్ ఎస్సీలకు కేటాయించి సామాజిక సమతూకం చేసే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో అభ్యర్థులంతా ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. -
తీరని ఆశలు..ఆరని సెగలు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ మినహా పోటీ చేసే అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిత్ర పక్షమైన టీడీపీ కూడా సీట్ల సర్దుబాటులో దక్కిన స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసి బీ–ఫారాలు సైతం అందజేసింది. టీజేఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ప్రకటించి భీ–ఫారం ఇవ్వగా, అంబర్‌పేట స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లు వేసేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరోపక్క ప్రజాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని ఆశావహుల్లో కొందరు ఇప్పటికే నామినేషన్లు వేయగా.. మరికొందరు సోమవారం నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇంకొందరు తమకు అన్యాయం చేశా రని ఏకంగా అగ్ర నాయకులపై ధ్వజమెత్తి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరికొందరు స్థానికంగా పార్టీ ఫ్లెక్సీలు తొలగించి జెండా దిమ్మెలను ధ్వంసం చేసి పార్టీపై తమ ఆవేశాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు తమకు మొండిచేయి చూపడాన్ని తట్టుకోలేక ఇతర పార్టీల తీర్థం పుచ్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొనసాగుతున్న బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి వాదులతో చర్చించి దారికి తెచ్చేందుకు ఏఐసీసీ పాండిచేరి సీఎం నారాయణస్వామి, మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి శివకుమార్ సభ్యులుగా సంప్రదింపుల కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలోని పార్క్ హయత్ హోటల్లో అసంతృప్తుల నేతలతో కమిటీ భేటీ అయింది. రెబల్‌గా బరిలోకి దిగిన వారితో కమిటీ సమాలోచనలు చేస్తోంది. పీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల, వీహెచ్ తదితరులు కలిసి అసంతృప్తి వాదులను హోటల్‌కు రప్పించి సంప్రదింపుల కమిటీతో సమవేశ పరుస్తున్నారు. మహాకూటమి గెలుపునకు పనిచేయాలని.. భవిష్యత్‌లో సరైన న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. రెబల్‌గా పోటీకి దిగితే మహాకూటమి లక్ష్యం నెరవేరదని వారికి నచ్చజెబుతున్నారు. ఉత్తమ్ ఇంటికి ఆశావహుల క్యూ.. అభ్యర్థుల చివరి జాబితా రానున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం ఆశావహుల తాకిడి పెరిగింది. కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారితో పాటు ఆశిస్తున్న నేతలూ ఉత్తమ్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బండ్ల గణేష్, ఉత్తమ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, ఉత్తమ్ అందుబాటులో లేకపోవడంతో కొందరు నేతలు నిరీక్షించగా.. మరికొందరు అక్కడి నుంచి వెనుదిరిగారు. తిరుగుబాటు బావుటా పార్టీకి చెందిన పలువురు ఆశాహులు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన భిక్షపతి యాదవ్ పార్టీపై తిరుగుబాటు చేసి నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మొవ్వ సత్యనారాయణ సైతం నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ నుంచి టికెట్ ఆశించిన కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్ సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థిగా పొరుగు నియోజకవర్గానికి చెందిన సామ రంగారెడ్డిని పోటీకి దింపడం స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటికే మల్లేశ్ తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ బీఎల్ఎఫ్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగ్గురు ‘కూన’లు మూడు పార్టీలు
కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలంగౌడ్, వివేకానంద్ పోటీ వీరిద్దరూ వరుసకు బాబాయ్, అబ్బాయ్‌లు..ఒకరు కాంగ్రెస్ నుంచి.. మరొకరు టీఆర్ఎస్ నుంచిసనత్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్ ముగ్గురు అభ్యర్థులూ కూన వంశానికి చెందినవారే.. ఆ రెండు స్థానాల్లో గెలుపోటములపై ఆసక్తికర చర్చ కుత్బుల్లాపూర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని రెండు స్థానాల్లో విచిత్రమైన పోటీ నెలకొంది. ఒకరు టీడీపీ.. మరొకరు కాంగ్రెస్.. ఇంకొకరు టీఆర్ఎస్.. ఇలా పార్టీలు వేరైనా బ్రాండ్ మాత్రం ఒకటే.. వీరెవరో కాదు సుమా.. కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు ‘కూన’ వంశస్తులు. తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న కూన వివేకానంద్‌కు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అ«ధినేత కేసీఆర్ మొదటి జాబితాలోనే టికెట్ ఖరారు చేయగా, కాంగ్రెస్ జాబితాలో సైతం మహా కూటమి తరపున కూన శ్రీశైలం గౌడ్‌కు టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలోనే సనత్‌నగర్ టికెట్ విషయంలో మహాకూటమి అభ్యర్థి ఎంపిక అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్ పార్టీలకు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు తుది జాబితాలో కూన వెంకటేశ్‌గౌడ్‌ను టికెట్ వరించింది. నగరంలో మొత్తం 23 నియోజకవర్గాలు ఉండగా మూడు పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెంది.. ఒకే ఇంటిపేరున్న ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. గాజులరామారం గ్రామంలో కూన వెంకటేశ్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్‌లు జన్మించగా, కుత్బుల్లాపూర్‌లో కూన వివేకానంద్ జన్మించారు. వీరంతా ఒకే నియోజకవర్గానికి సంబంధించిన వారు కావడం, అందరూ రక్త సంబంధీకులే కావడం యాదృచ్ఛికమే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, కూన వివేకానంద్ (బాబాయ్, అబ్బాయ్)లు పోటీ పడుతుండగా, సనత్‌నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కూన వెంకటేశ్‌గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురి గెలుపోటములపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిలో ఏ ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెడతారన్నదే హాట్ టాపిక్‌గా మారింది. -
హ్యాట్రిక్‌పై గురి
కుత్బుల్లాపూర్: నగరంలోని ఆ ఐదు నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. మూడోసారి విజయానికి ఉవ్విళ్లూరుతున్నారు. 2009లో, 2014, ఎన్నికల్లో విజయతీరాలకు చేరి ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహ రచనలు సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో 23 నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటిలో 5 నియోజకవర్గాల అభ్యర్థులు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్ (టీఆర్ఎస్), అంబర్పేట్ నుంచి జి.కిషన్‌రెడ్డి (బీజేపీ), మలక్‌పేట్ నుంచి మహ్మద్ బీన్ అబ్దుల్ బలాల, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ, బహదూర్‌పురా నుంచి మోజంఖాన్ (ఎంఐఎం)లు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించడానికి సన్నద్ధమవుతున్నారు. గెలుపే కాదు..ఓటు బ్యాంకు కూడా.. ఈ 5 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించడమే కాకుండా ఎక్కువ మొత్తంలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో కన్నా 2014 ఎన్నికల్లో అభ్యర్థులంతా గతంలో సాధించిన దానికంటే గణనీయమైన ఓట్లు తెచ్చుకోవడంగమనార్హం. -
బస్తీలో కుస్తీ
సాక్షి సిటీబ్యూరో: ఎంఐఎం పార్టీకి పాతబస్తీ కంచుకోట. 1962లో పత్తర్‌గట్టి నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున సలావుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. అప్పటి నుంచి పాతబస్తీ మజ్లిస్ కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ విజయ పతాకం ఎగురవేçస్తూనే ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంపై మజ్లిస్ దృష్టిపెట్టేది కాదు. ఎన్నికలకు వారం రోజుల ముందు బూత్ లెవల్, పార్టీ ప్రాథమిక అధ్యక్షుల సమావేశాలు నిర్వహించి ప్రణాళిక అమలు చేసేవారు. ప్రచారం కూడా అంతగా చేసేవారు కాదు. ప్రచార సామగ్రి, పార్టీ జెండాలు, కరపత్రాలు కొద్దిగా ప్రచురించి బస్తీల్లో పంచేవారు. అయితే, ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో కార్వాన్, బహదూర్‌పురా తప్ప మిగతా ఐదు నియోజకవర్గాల్లో మజ్లిస్ గెలుపు ఈ దఫా అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జోరుగా ప్రచారం.. బహదూర్‌పురా, కార్వాన్ తప్ప, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట్, చార్మినార్ నియోజకవర్గాల్లో మహాకూటమి తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. మజ్లిస్ చిరకాల ప్రత్యర్థి ఎంబీటీ యాకుత్‌పురా నుంచి గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. దీంతో మజ్లిస్ ఈ నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెంచింది. నియోజకవర్గ ఇన్చార్జులను నియమించి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, గల్లీలో విస్తృతంగా పాదయాత్రలు చేస్తున్నారు. ప్రచారంలో అత్యాధునిక ఎల్ఈడీ తెరలను వాహనాలకు అమర్చి ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో మజ్లిస్ చేసిన అభివృద్ధి పనులను కూడళ్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆటోలతో పాటుచిన్న చిన్న వాహనాలను సైతం ప్రచార రథాలుగా చేసి, పోస్టర్లు తగిలించి మరీ గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఆన్లైన్లో వాయిస్ మెసేజ్‌లతో సెల్ఫోన్లలో ఊదరగొడుతున్నారు. పోస్టర్లు, కరపత్రాలు, పార్టీ జెండాలు, పార్టీ గుర్తును లైట్లను ఎత్తయిన భవనాలపై అమర్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఈసారి పరిశీలకులను సైతం నియమించడం గమనార్హం. ఆ మూడు నియోజకవర్గాలపై ఫోకస్ 2014 ఎన్నికల్లో బీజేపీ–టీడీపీ కూటమిలో భాగంగా నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్(కాంగ్రెస్) ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈయన గతంలో 2009లో కూడా ఈయన గట్టి పోటీనిచ్చి ఓడిపోయారు. మలక్‌పేట్‌లో ముజాఫర్(టీడీపీ) 2009 ఎన్నికల్లో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ మహాకూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి (ఫిరోజ్‌ఖాన్), మలక్‌పేట్ టీడీపీ అభ్యర్థిగా ముజాఫర్‌ను బరిలోకి దింపారు. దీంతో అన్ని వర్గాలవారు వారికి ఓట్లు వేస్తారని మజ్లిస్ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలతో పాటు తన చిరకాల ప్రత్యర్థి ఎంబీటీ కూడా యాకుత్‌పురాలో తన అభ్యర్థిగా మజీదుల్లాఖాన్ ఫరహత్‌ఖాన్‌ను పోటీకి దింపింది. ఈయన ఇక్కడి నుంచి గతంలో గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో మజ్లిస్ గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎంఐఎం ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రత్యేక దృష్టి పెట్టింది. -
షీ వాంట్..
దశాబ్దాలు గడిచినా హక్కులు, అవకాశాల్లో ‘ఆమె’కు సమానభాగస్వామ్యం దక్కడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రతి ఎన్నికల్లో పార్టీలు హామీల వర్షంకురిపిస్తున్నాయి. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీఅంతంతమాత్రంగానే ఉంది. ఇల్లు, బడి, కార్యాలయం, రోడ్డు, బహిరంగప్రదేశాల్లో ఎక్కడో ఓ చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు,అణచివేతను మహిళలు ఎదుర్కొంటున్నారు. గృహహింస, నిర్భయ చట్టాలు వచ్చినా.. షీటీమ్స్ బృందాలు రంగంలోకి దిగినా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల ఆకాంక్షలు ఏ మేరకు ప్రతిబింబిస్తున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మహిళా, హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ‘ఉమెన్ మేనిఫెస్టో’పై దృష్టిసారించాయి. మహిళల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు ‘ఉమెన్ మేనిఫెస్టో’నుప్రామాణికంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో అమ్మాయిలు నిశ్చింతగా చదువుకునేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేకంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా ‘నిర్భయ సెల్’ను ఏర్పాటు చేయాలి. టాయిలెట్ల ఏర్పాటు, మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. అమ్మాయిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్తవయసు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్యను అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్తవయసులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా నిరంతరం జెండర్ సెన్సిటైజేషన్ వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణనిప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కోసం నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. సమాన అవకాశాలు... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50శాతం అవకాశాలు కల్పించాల్సిందేనని మహిళా సంఘాలు చెబుతున్నాయి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా కారణమే. దీన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వ దృక్పథం మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న వాటిని తొలగించాలి. సామాజిక భద్రత... నగరంలో సుమారు 8లక్షల మంది మహిళలు గృహ కార్మికులుగా పని చేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో ఇతర అనేక అసంఘటిత రంగాల్లో మరో 10లక్షల వరకు మహిళలు ఉన్నారు. వీరి సంక్షేమం, సామాజిక భద్రతకు అంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక వసతి గృహాలను అందుబాటులోకి తీసుకురావాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. గృహ కార్మికులకు రోజుకు 8గంటల పని, నెలకు రూ.10వేల వేతనం అందే విధంగా చూడాలి. అలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే మహిళా కార్మికుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. భద్రత కల్పించాలి. నిరంతర రవాణా... నగరంలో సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజా రవాణా సదుపాయంగా అందుబాటులో ఉన్నప్పటికీ... మహిళలకు అరకొర సదుపాయాలే ఉన్నాయి. మహిళల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను పెంచాలి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 50బస్సులు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పెంచాలి. అలాగే మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలోనూ స్పెషల్ సర్వీసులను నడపాలి. రాత్రి 10గంటలు దాటితే క్యాబ్‌లు, ఆటోరిక్షాలు వంటి వాహనాలపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ వాహనాల్లో మహిళలకు సరైన భద్రత ఉం డడం లేదు. దీంతో 24గంటల పాటు ప్రజా రవా ణా సదుపాయాలు అందుబాటులో ఉండే విధం గా నగర రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలి. ⇔ కులాంతర, మతాంతర వివాహాల్లో పితృస్వామ్య, కుల, మతపరమైన ఆధిపత్య హింసలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి. పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను రూపొందించాలి. ⇔ పెద్దల సంరక్షణ లేని పిల్లలు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర వర్గాలకు, నిరాశ్రయులకు ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా నిలిచి భద్రత కల్పించాలి. అలాంటి పిల్లలను చదివించి వారి భవిష్యత్తుకు భరోసాను కల్పించాలి. ఈసారైనా... కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్ని వర్గాల్లాగే మహిళలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో నిరాశే మిగిలింది. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి ఎన్నికలొచ్చాయి. ఈసారైనా రాజకీయ పార్టీలు మహిళల సంక్షేమంపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాం. – సజయ, సామాజిక కార్యకర్త -
పళ్ళు కొరికిండ్రు.. జెండాలు పడేసిండ్రు
కాకా... నేను ముందె జెప్పలే... గీల్లు లొల్లి చేస్తరని! ‘అరె నువ్ బేఫికర్గుండు... నీకే టికెట్ వస్తద’ని ఆశబెట్టి నిన్న మొన్నటి దాంక పాగల్లెక్క తిప్పుకున్నోల్లు ... గీసారి జర సర్దుకోరాదె! అంటె ఎవుడికైన మెంటల్ లేస్తది. టికెట్ అస్తదని పార్టీల... ఆశావహుడని మీడియాల... జోర్దార్గ ప్రచారం చేసుకున్నోల్లు లిస్ట్‌ల తమ పేరు ఇంగ రాదని తెల్సుకున్నాంక ఊర్కె ఉంటారె. నిప్పుల ఉప్పేసినట్లు చిటచిట అంటరు. అయినా టికెట్ రాకపోతె గప్పుడు వచ్చే గుస్సానే వేరు. గీకతల్లో పాతోల్లు కొత్తోల్ల కతలన్ని ఒకే తీరుగుంటయ్! అసలు గుస్సా వచ్చుడే బేకారనుకుంటే గిట్లాంటోల్లు అయిదురకాలని లెక్క దేల్చిండు మా ఎంకటేసు! మొదటి రకం... గీల్లు గదేం తావీద్ కట్టుకునింటరో ... ఏం జేసిన కోపం రాదు. గానీ కొందరుంటారు... ఆల్లని అరె అన్నా కోపం... అన్నా అన్న కోపం. కొందరు ముకాలు ఎర్రజేస్కొని.. కండ్లెర్రజేస్కొని కర్రలెక్క బిగుసుకుపోయి ఉంటరు. ఈల్లు గా టైంల సచ్చిన నోరెత్తరు. అంతా గప్‌చుప్. ముకాలు చూసే ఇవతలోల్లు గుర్తుపట్టాలె. నాల్గో టైపోల్లుంటరు ఈల్లకి కోపం వస్తే సాలు అగ్గిరాముల్లో... రాములమ్మలో అవుతరు. నోరు తెర్సుడు... బూతులు తిట్టుడే తిట్టుడు. ఇంగ లాస్ట్ అయిదోరకం... ఈల్లు సానా డేంజరు. కోపం వస్తే మెంటల్ వచ్చినట్లు గత్తర్ బిత్తర్ చేస్తరు. చేతిల ఏదుంటే గది ఇసిరి కొడ్తరు. పురానాల్లో రాసిండ్రు గద... ఇంట్లో ఎవరికైన కోపం వస్తె ఓ రూములకెల్లి దర్వాజ బంద్ చేస్కునేటోల్లంట. గది జూసి అరె ఈ శాల్తీకి కోపం అచ్చిందనుకోవాలె. సత్యభామకి కోపం వస్తె గిట్లనే ఓ రూమ్‌ల దూరి ఆగమాగం సేసిందంట! ఆ కిట్టయ్య కాల్లు పట్కుంటే గానీ దార్లోకి రాలెదంట! గీ ఎలచ్చన్లలోనె సూడు. కూటమి అంటూ జత కట్టినోల్ల కస్టాలు అన్నిన్ని గావు. టికెట్ రానోల్లు పండ్లు పటపట కొరికిండ్రు...పార్టీ ఆపీసుల జెండాలు పీకి పడేసిండ్రు... కొంతమంది ఢిల్లీకెల్లి కాంగ్రెస్ ఆపీసు ఎదుట హర్తాల్ చేస్తుండ్రు. సిటీలో అయితే అంతా ఆగమాగం. ఎవ్రు ఎందుకరుస్తుండ్రో..ఎందుకు కరుస్తుండ్రో తెల్వదు. రాజేంద్రనగర్‌ల టికెట్ గీయలేదని సబితమ్మ కొడుకు కార్తీక్ లిస్ట్‌ల మీరు పేరు తీసుడేంది... నేనే పార్టీ నుంచి ఎల్లిపోతున్న... బైట మా కార్యకర్తలుండ్రు. మీ కాండేట్కు పోటీగా నిలుస్తా...గెలుస్తా అంటూ డైలాగులు దంచుతుండ్రు. గప్పట్లో సిటీ మేయర్‌గా మెరిసిన కార్తీకమ్మ టికెట్ కోసం ఢిల్లీలో రాహుల్ ఎదురుంగ బైటాయించింది. గీ బాధ పడ్లేక అభ్యర్థులు గొందరు ఎందుకైన మంచిదని బౌన్సర్లను పెట్టిండ్రంట! గా పబ్లల్ల...బారులల్ల ఉంటరు సూడు ఆల్లే! పొన్నాలన్న టికెట్ గాల్లో కొట్టుకుపోయిందంటె ఇంగ సూడండ్రి. కొంతమంది శానీలు ఢిల్లీకెల్లి లిస్ట్‌ల పేరు వస్తదో లేదో తేల్చుకుని... పక్క గల్లీల ఉన్న మరో పార్టీల దూరుతుండ్రంట. గీ జట్టుకట్టిన పార్టీల్లో జుత్తు పీక్కొనేదొకటే తక్కువ. ఇజ్జత్ తీసింది గాకుండా... బండ్లకు మైకులు గట్టి ... ఆ గట్టునుంటావా ఓ అన్న ఈ గట్టునుంటావా అంటూ పాటలు పెట్టుడొకటి. అరె చల్... టికెటివ్వక మోసం చేసిండ్రు. ఇంగ మేం ఏ గట్టునుంటె మీకెందుకు? ఏ గడ్డి పీకితె మీకెందుకు? అంటూ అరుసుకుంటుండ్రు. మొన్న నిర్మల్ల ఓ పోరగాడు... గాయన ఏం ఆలోచించిండో గాని... పొద్దున్నే బీజేపీల చేరి...మధ్యాహ్నం కారులో దూరి...సాయంత్రం కాంగ్రెస్‌ల దేలిండు. ఇంగా గిట్లాంటివి ఎన్ని సూడాలొ? కాకా గిదింకా మొదలు..ముందున్నాది అసల్ కత!!– రామదుర్గం మధుసూదనరావు -
కుత్బుల్లాపూర్‌లో రాజకీయం రసవత్తరం
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ముచ్చటగా మూడోసారి కూన శ్రీశైలంగౌడ్, కేపీ వివేకానంద్ పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరొకసారి గెలుపొందిన వీరు... మూడోసారి విజయకేతనం ఎగరేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన జీడిమెట్ల ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఇక్కడ కార్మిక, మురికివాడ ప్రాంతాలే అధికం. ఈ నేపథ్యంలో వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయి. 2009స్వతంత్రుడికి పట్టం మేడ్చల్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడింది. దీనికి 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో నిలవగా... 3,13,160 ఓట్లకు గాను 1,57,595 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 17 ఓట్లు రిజెక్ట్ కాగా, 39 ఓట్లు పోస్టల్ ద్వారా వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీశైలంగౌడ్‌కు 53,953 ఓట్లు రాగా... మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్‌కు 30,534 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ద్వారా వచ్చిన 39 ఓట్లలో 21ఓట్లు శ్రీశైలంగౌడ్కే పడడం విశేషం. 2014 భిన్నమైన తీర్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా కూన శ్రీశైలంగౌడ్, టీడీపీ అభ్యర్థిగా కేపీ వివేకానంద్ బరిలోకి దిగగా... వివేకానంద్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 6,01,248 ఓట్లకు గాను 2,91,356 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 43 ఓట్లు రిజెక్ట్ కాగా 553 ఓట్లు పోస్టల్ ద్వారా వచ్చాయి. మొత్తం 23మంది పోటీపడగా వివేకానంద్‌కు 1,14,363 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలంగౌడ్‌కు 40,283 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ప్రభావం ఉన్నప్పటికీ... సీమాంధ్రులు అత్యధికంగా ఉండడంతో ఇక్కడ టీడీపీ గెలుపు సునాయాసమైంది. పోస్టల్ ద్వారా వచ్చిన 182 ఓట్లలో శ్రీశైలంగౌడ్‌కు 90 ఓట్లు వచ్చాయి. 2018ఇప్పుడెవరో! ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా బరిలోకి కూనశ్రీశైలంగౌడ్, కేపీ వివేకానంద్లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీశైలంగౌడ్ ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో నిలవగా... వివేకానంద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన వివేకానంద్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. -
కూటమిలో కుప్పిగంతులు !
సాక్షి , వరంగల్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి.. స్వయం ప్రతిపత్తి సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడడానికి మహా కూటమిగా జట్టు కట్టాం.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజకీయ వైరాన్ని మరిచిపోయి కలిసికట్టుగా పని చేసి టీఆర్ఎస్ను ఓడించాలి..’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి పత్రికా సమావేశాల్లో పిలుపునిస్తున్నారు. అదే.. సొంత నియోజకవర్గం నర్సంపేట, తన ప్రాబల్యం ఉన్న పరకాల నియోజకవర్గాల్లో మాత్రం కూటమి లేదు, గీటమి లేదంటున్నారు. తన ఆధీనంలో ఉన్న టీడీపీ శ్రేణులను కూటమికి దూరం పెడుతున్నారు. పొత్తులపై ఇంకా పూర్తి స్థాయిలో ఏ విషయమై తేలక ముందే కాంగ్రెస్‌కు ఎలా సహకరిస్తామంటూ టీడీపీ కార్యకర్తలను కట్టడి చేస్తుండడం కూటమిలోని పార్టీల శ్రేణులకు అంతుపట్టడం లేదు. రేవూరి ప్రకాష్‌రెడ్డి నర్సంపేట నుంచి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్ ద్వారా చివరి నిమిషం వరకు యత్నించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి ఉండడం.. పైగా ఆయన ‘హస్తం’ గుర్తుతో కాకుండా సొంత శక్తిపై గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో దొంతి మాధవరెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా ఉండలేని అనివార్య పరిస్థితి ఏర్పడింది. రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసమే వరంగల్ పశ్చిమ టికెట్‌ను టీడీపీ తరఫున ఆయనకు కేటాయించారు. కానీ పశ్చిమ నియోజకవర్గంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. 15 ఏళ్లుగా పార్టీలో ఉంటూ తనకంటూ బలమైన పునాదులు వేసుకున్నారు. బలమైన కేడర్‌ను తయారు చేసుకున్నారు. టికెట్‌ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించటంతో ఆగ్రహించిన ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. కూటమి లక్ష్యంపై నీలినీడలు పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన వర్గంగా నాయిని రాజేందర్‌రెడ్డి సహకరించే పరిస్థితి లేకపోవడంతో రేవూరి తనకు ప్రాబల్యం ఉన్న నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్‌ను కాంగ్రెస్‌కు సహకరించొద్దని ఆదేశాలు చేశారు. నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటేనే తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌కు సహకరిస్తారని.. లేకుంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకాష్‌రెడ్డి బాహటంగానే చెబుతుం డడంపై మహాకూటమి లక్ష్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీట్ల సర్దుబాట్లపై నిరసనలు... ఆందోళన సెగలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజాకూటమి కుతకుతలాడుతోంది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో అసమ్మతి సెగలు కక్కుతోంది. తమకే సీట్లు కేటాయిస్తారని ఆశపడ్డవారికి అధిష్టానం మొండిచేయి చూపించడంతో రెబల్స్‌గా తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. కనీస కేడర్ లేని పార్టీకి పలు నియోకజవర్గాలు కట్టబెట్టడం కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. దీంతో ఎవరికి వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ⇔ మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజేంద్రనగర్‌నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. రాజేంద్రనగర్‌లో ఏ మాత్రం బలంలేని టీడీపీకి పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ⇔ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూకాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శేరిలింగంపల్లిలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భిక్షపతి యాదవ్ ప్రకటించారు. ⇔ ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిరెడ్డి లక్ష్మారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 17న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తలపెట్టారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో లక్ష్మారెడ్డికి మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ తోటకూర జంగయ్య యాదవ్ సైతం ‘స్వతంత్ర’ పోటీకి సిద్ధమయ్యారు. ⇔ సికింద్రాబాద్ స్థానాన్ని ఆశించిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఢిల్లీలో గురువారం రాహుల్‌గాంధీ నివాసం ఎదుట బైటాయించి నిరసనకు దిగారు. ఈ నియోజకవర్గం నుంచి ఆదం ఉమాదేవి, పల్లె లక్ష్మణరావుగౌడ్తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ఏఐసీసీ పరిశీలించింది. గురువారం సాయంత్రం ‘వివిధ కారణాలతో మీకు టికెట్ ఇవ్వడం లేదంటూ’ కార్తీకరెడ్డికి ఫోన్ రావడంతో ఢీల్లీలోనే ఉన్న ఆమె రాహుల్‌గాంధీ నివాసం ఎదుట ఆందోళన చేయడంతో ఆమెను తుగ్లక్‌రోడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ⇔ అడ్రస్ లేని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారంటూ ఖైరతాబాద్ నియోజక వర్గం కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ గురువారం వేలాది మంది కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్‌నెం. 12లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద బైఠాయించిన కార్యకర్తలు శ్రవణ్‌ను లిస్టు నుంచి తొలగించి కాంగ్రెస్ అభ్యర్ధిగా సి. రోహిణ్‌రెడ్డిని ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. నేతలు, కార్యకర్తలు పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దిష్టిబొమ్మలు దహనం, నిరాహార దీక్షలతో నిరసన తెలిపారు. ⇔ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మహాకూటమి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఏకంగా టీడీపీ నిర్ణయం ఆయా పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. సీట్ల సర్దుబాటులో ఇబ్రహీంపట్నం టీడీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి ప్రకటించింది. వాస్తవంగా ఇబ్రహీంపట్నం సీటు కోసం కాంగ్రెస్ నాయకులు క్యామ మల్లేశ్, మల్రెడ్డి రంగారెడ్డి హోరాహోరీగా పోటీ పడ్డారు. ఎల్బీనగర్ నుంచి సామ రంగారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చి ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుధీర్‌రెడ్డి కూడా సీటుపై ఆశలు పెంచుకొని ప్రచారానికి దిగారు. దీంతో కలత చెందిన సామ రంగారెడ్డి అనుచరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు పెద్దఎత్తున వచ్చి ఆందోళన సైతం నిర్వహించారు. ఇదిలా ఉండగా అనూహ్యంగా ఇబ్రహీంపట్నం స్థానం టీడీపీకి సర్దుబాటు అయింది. సామ రంగారెడ్డికి అభ్యర్థిత్వం సైతం ఖరారు చేసింది. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తే ఇబ్రహీంపట్నం స్థానానికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం కంగు తినిపించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ⇔ మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ కేఎల్ఆర్కు కేటాయిం చడం పట్ల స్వపక్షంలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆ పార్టీ నేతలు తోటకూర జంగయ్య యాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి తదితరులు విమర్శల వర్షం కురింపించారు. ⇔ ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ కార్పొరేటర్ విజయారెడ్డికి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధినేత హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ విజయారెడ్డితో ఫోన్లో మాట్లాడి హామీ ఇవ్వగా, గురువారం ఉదయం కేటీఆర్ సైతం ప్రగతిభవన్‌లో విజయారెడ్డి, ఆమె అనుచరులకు సైతం భరోసానిచ్చారు. అనంతరం ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి నివాసాలకు వెళ్లి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. -
పాయె.. గీ లిస్టు కూడా పాయె!
మల్లేసన్నా గీసారీ పాయె.. అన్న పేరు లిస్ట్‌ల రాలె.. ‘ఎర్రిముకం ఏస్కొని ఎంకటేసం సెబ్తే నాకర్థం కాలె.. ‘ఈ లిస్టేంది.. పేరేంది? ’ఈడు గింతె! ఏదీ సక్కగ సెప్పి సావడు. అంతా గజిబిజి అనుకుని ‘అరె ఏందిర పొద్దున్నే గీ కొత్త లొల్లి.. ఎవరి పేరు రాలె.. ఏలిస్టుల రాలె’ అడిగిన. ఆడు పైనుంచి కిందాంక చూసి.. గింత మాత్రం తెల్వదా? అన్నట్లు చూసిండు. ‘గిదేందన్న ఊరంత ఎలచ్చన్ల ముచ్చట్లు.. కబుర్ల బాతాకానీ నడుస్తుంటే.. ఏం తెల్వనట్లు అడుగుతున్నవ్.. మన అంజన్న ఉన్నడు గద.. పాపం ఆ అన్నకె అన్యాయం చేసిండ్రు. ఈ లిస్టుల గారెంటీ పేరొస్తదని నిన్న అందరితో చెప్పుకునిండు. పది కేజీల స్వీట్లు పంచిండు. లిస్టు వచ్చింది గానీ అన్న పేరే రాలె’ అని రవంత బాదగ సెప్పిండు.. పాపం గీ ఎంకటేసమే గింత దిగాలు ముకమేస్కొని సెబ్తుంటే.. ఇంక ఆ అంజన్న గతేందో? మీరెన్నయిన సెప్పుండ్రి.. గిట్ల టెన్షన్‌తో ఎదురు చూసుడు...అరె రాలెదె! అంటూ ఏడ్సుడు కన్న బేకార్ పని ఇంకోట్లేదు. మా సిన్నప్పుడు గింతె. పరీక్షలు రాసినంక అట్టలు.. బుక్కులు ఇసిరేసి ఎగిరేటోల్లం. గానీ రిజల్ట్ అంటే సాలు.. కాల్లు సేతులు వనకబట్టేవి. నోటీసు బోర్డుకంటించిన పేపర్ల.. పాసయినోల్ల పేర్లు ఏసేటోల్లు. గప్పుడు సూడాలె మా అవస్థ. పేరుంటదో లేదో అని గాబరా గాబరా అయ్యేటోల్లం. ఆ టైంల.. థూ ఎందిర బై ఈ బతుకు! గింత టెన్సన్ అవసరమా అనిపించేది. పెద్దోలం అవుతున్న కొద్ది ఈ వెతుకులాట పెరిగిందే గానీ తగ్గలె. నౌకరీ సెలెక్టు లిస్టుల పేరుందో లేదో.. ప్రమోషన్ల లిస్టులో పేరుందో లేదో.. రైలు రిజర్వేషన్ లిస్ట్‌ల పేరుందో లేదో.. గిట్ల చూస్కొంటే మనకు లిస్టులూ ఎక్కువే.. పరేషాన్లు ఎక్కువే! గిప్పట్కీ ఆ టెన్సన్ సైతాన్‌లా పట్టుకునే ఉంది. ఈ ముచ్చటెందుగ్గానీ.. ఇప్పుడు ఎలచ్చన్లు గద. టికెట్ల కోసం గుంపుల్ల దూరి అంగీ గుండీలూడేల యుద్ధం చేస్తున్న పోరాటగాల్ల కస్టాలు ఇంతింత గాదులె. లిస్టులు ఇడుస్తుండ్రు అంటె సాలు గుండెదడ సురువయితది అంటుండ్రు. మొదట్లో మూతికి నెయ్యంటించి.. టికెట్ నీకే బిడ్డా అని పార్టీ పెద్దోల్లు అనగానె.. గీల్లు బాండు బాజాలేస్కొని గల్లీల తిరుగుతుండ్రు. గిప్పుడేమో లెక్కల్ ఉల్టాపల్టా అవుతున్నయ్. మొన్న టికెట్ గారంటీ అని ఎగిరినోడు.. ఇయ్యాల గప్చిప్ అయిపోయిండు. కొంతమంది ఇంకా గదే ఆశతో ఎదురు చూస్తుండ్రు! గిప్పుడూ పార్టీలో కొందరు పెద్దోలు.. అరె నువ్ పరేషాన్ కావొద్దు.. రేపు ఇంకో లిస్ట్ వస్తది.. గందులో నీ పేరు పక్కా పో! అంటుంటే పాపం గీ ఆశావహులు అల్లాడిపోతుండ్రు! టీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎల్లిన ఓ సారు గులాబీ పార్టీని ఏకి పారేసి.. అదిస్తానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిండు.. బేఫికర్‌గ టికెట్టు పట్టేసిండంట! ఇంక సనత్‌నగర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తనని సీనియర్ సారు అంటె.. గట్ల గాదుగానీ ఈసారి మాకు గావాలె అంటూ తెలుగు తమ్ముల్లు లొల్లి మీద లొల్లి చేస్తుండ్రంట! ఈల్ల కతలు సరె.. పాపం కాంగ్రెస్‌ల ఓ పేద్ద సారు.. మొన్న మొన్నటి దాంక గీడ పార్టీని తనే ముందుండి నడిపినాయన.. గిప్పుడు టికెట్ వస్తదో రాదో అనుకుంటూ డిల్లీలో చక్కర్లు కొడ్తుండంటే ఇసయం ఎంత కస్టంగ మారింద్ర బై అనిపిస్తది. గాయన గిప్పట్కీ నాకేం పికర్లే టికెట్ వచ్చేది గారంటీ అంటుండు గానీ.. గింత పెద్ద మనిసి కతే గిట్లయితె ఎట్ల అంటూ చాలా మంది లోపల్లోపలె గొనుక్కొంటుండ్రు. ఏ పార్టీల చూసుకున్న గిదే దుకానం. పొద్దున్నే లేసుడు.. పేరు కోసం చూసుడు! ఇంక ఈ మంట ఎప్పుడు ఆరేదెట్లా.. కాండేట్లు జనాల్లోకి పోయేదెట్లా? ఓ..పెద్ద సార్లూ... కనీసం ఓట్లేసే రోజుకైనా మీ లిస్టు తేల్తదా.. తేలదా? –రామదుర్గం మధుసూదనరావు -
కారు సిక్సర్.. కాంగ్రెస్ తీన్మార్.. ‘దేశం’ డబుల్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఒక్క ముషీరాబాద్ మినహా అన్ని స్థానాలకు పోటీ చేసే వారి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. బుధవారం రాత్రి ఆరుగురితో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ప్రజాకూటమిలోనూ అభ్యర్థిత్వాల ఎంపిక చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ఖరారయ్యాయి. ఎల్బీనగర్ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి సుధీర్‌రెడ్డి, టీడీపీ నుంచి సామ రంగారెడ్డి ఆశించగా, సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం సీటు టీడీపీ ఖరారు చేయడంతో సుధీర్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనని కాంగ్రెస్‌వర్గాలు భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా మల్కాజిగిరి, అంబర్‌పేట స్థానాలు టీజేఎస్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే మల్కాజిగిరి నుంచి టీజేఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సనత్‌నగర్, సికింద్రాబాద్ సెగ్మెంట్లపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ ఇంకా పీటముడి వీడలేదు. కూకట్పల్లి టికెట్ దాదాపు టీడీపీకే కేటాయించే అవకాశాలున్నాయి. ఇంకా అక్కడ అభ్యర్థి ఫైనల్ కాలేదు. టీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గానికి దానం నాగేందర్, గోషామహల్‌కు ప్రేమ్‌సింగ్ రాథోడ్, చార్మినార్‌కు మహమ్మద్ సలావుద్దీన్ లోడి, అంబర్‌పేట నియోజకవర్గానికి కాలేరు వెంకటేష్, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్‌కు ఎంపీ సీహెచ్. మల్లారెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ముషీరాబాద్‌కు ముఠా గోపాల్? ఈ నియోజకవర్గానికి అధికారికంగా టీఆర్ఎస్ ఎవరినీ ప్రకటించకున్నా ముఠా గోపాల్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మంత్రి నాయిని నర్సింహారెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్న విషయం విదితమే. తనకు కానీ, తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికి గానీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, నాయినికి సర్దిచెప్పి గోపాల్ అభ్యర్థిత్వం ఖరారు చేయాలన్న యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయంతీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. కూటమిలో ఇలా... నగరంలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. మరో రెండు స్థానాల కోసం కొనసాగుతున్న పేచీలపై కూడికలు, తీసివేతలతో ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తోంది. బుధవారం ప్రకటించిన జాబితాలో మేడ్చల్‌కు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జూబ్లీహిల్స్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌కు దాసోజు శ్రవణ్‌లను ప్రకటించిన ఏఐసీసీ.. సికింద్రాబాద్, సనత్‌నగర్ స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్‌లో టీడీపీ నేత గణేష్‌గుప్తాను అధికారికంగా ప్రకటించడంతో ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఆశలు ఆవిరయ్యాయి. ఇక టీడీపీకి సికింద్రాబాద్–సనత్‌నగర్‌లో ఏదో ఒక స్థానాన్ని కేటాయిస్తే సరిపోతుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి బరిలో ఉండగా, ఈ సీటు తమకు కావాలని టీడీపీ పట్టుపడుతోంది. దీంతో పరిష్కారం జఠిలంగా మారింది. మేడ్చల్‌లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – టీడీపీ నుంచి పార్టీలో చేరిన తోటకూర జంగయ్య యాదవ్ టికెట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే, పలు సమీకరణల అనంతరం జంగయ్యకు మరో ప్రత్యామ్నాయ పదవి ఇవ్వాలని నిర్ణయించి లక్ష్మారెడ్డినే ఫైనల్‌గా బరిలోకి దింపారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని టీడీపీ బలంగా కోరినా అక్కడికి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డినే అధిష్టానం ఖరారు చేసింది. ఇక ఖైరతాబాద్‌కు పలువురు పార్టీ నాయకులు పోటీ పడ్డా అనూహ్యంగా దాసోజు శ్రవణ్‌ను ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రవణ్.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పలు కార్యక్రమాలతో ఏఐసీసీ నేతల మెప్పును సైతం పొందారు. హైదరాబాద్‌లో 30 మంది నామినేషన్లు జిల్లా నుంచి బుధవారం 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు రెండు, మూడు, నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మలక్‌పేట టీఆర్ఎస్ అభ్యర్థి సి.సతీష్‌కుమార్, అంబర్‌పేట నియోజకవర్గంలో టీడీపీ తరఫున వనం రమేశ్, పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా వీకే ఉపేంద్ర, ఇండిపెండెంట్‌గా పొన్నపాటి చిన్నలింగయ్య, ఖైరతాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బీఎన్ రెడ్డి, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్ట్) అభ్యర్థిగా ఈ.హేమలత, ఇండిపెండెంట్లుగా ఆర్.ఎస్. రంజిత్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు, ఇండిపెండెంట్‌గా అబ్దల్లా ఇబ్రహీం, సనత్‌నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తలసారి శ్రీనివాస్‌యాదవ్ నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా సారపు సుమిత్ర, ఎ. శ్రీనివాస్‌లు నామినేషన్లు వేశారు. నాంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ ఆనంద్‌కుమార్‌గౌడ్, కార్వాన్లో టీఆర్ఎస్ అభ్యర్థి టి.జీవన్‌సింగ్, గోషామహల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ముఖేశ్‌గౌడ్, ఇండిపెండెంట్‌గా బీవీ రమేశ్‌బాబు నామినేషన్లు దాఖలు చేశారు. యాకుత్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, టీఆర్ఎస్ నుంచి సామ సుందర్‌రెడ్డి, శివసేన అభ్యర్థిగా జమలాపూర్ మహేశ్‌కుమార్, ఎన్సీపీ తరఫున ఎస్.సుజాత, సికింద్రాబాద్‌లో సీపీఐ(ఎం) నుంచి కుంచల అనిల్‌కుమార్, బహుజన రాజ్యం పార్టీ(పూలే అంబేద్కర్) తరఫున మాడుగుల సునీత, ఇండిపెండెంట్‌గా ఎస్.సాయికిరణ్, కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీగా పేర్కొంటూ ఎం.మన్మోహన్, ఇండిపెండెంట్లుగా జి.దయామణి, గణేశ్ నారాయణన్, గజ్జెల నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు. మేడ్చల్ జిల్లాలో 20.. సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ముహూర్తం బాగా ఉండడంతో భారీగా నామినేషన్లు నమోదు అయినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఏడేసి చొప్పున 14 మంది నామినేషన్లు వేయగా, కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక నామినేషన్ దాఖలైంది. మేడ్చల్ నియోజకవర్గం లో నాలుగు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి రెండేసి సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. ఏ నియోజకవర్గంలో ఎలా.. మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పెద్ది(కొంపెల్లి) మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఇండిపెండెంట్లుగా నీరడి హిమావతి, కొమ్ము సత్య నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో టీజేఎస్ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్, బీజేపీ నుంచి ఎన్.రామచందర్‌రావు, ఇండిపెండెట్లుగా గోపు రమణారెడ్డి, పావనిరెడ్డి, మధుమోహన్, నర్సింహారావు, అనిల్‌కుమార్ నామినేషన్లు వేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కూన శ్రీశైలంగౌడ్, ఇండిపెండెంట్‌గా అశ్విన్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గొట్టిముక్కల వేణుగోపాల్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఉప్పల్‌లో టీఆర్ఎస్ నుంచి బేతి సుభాష్‌రెడ్డి, టీడీపీ నుంచి తూళ్ల వీరేందర్‌గౌడ్, ఆమ్‌అద్మీ పార్టీ నుంచి ప్రియాంక, బీఎస్పీ నుంచి యుగంధర్, శివసేన నుంచి జగదీష్ చౌదరి, ఎఫ్ఐపీ నుంచి అనిల్‌కుమార్, ఇండిపెండెంట్‌గా వెంకోజురావు నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎంవీరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 16 నామినేషన్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూహూర్తం బాగుందని బుధవారం రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు వరుస కట్టారు. 14వ తేదీ ఒక్కరోజే గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో 16 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఖరారుకాని అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసినవారి జాబితాలో ఉండడం గమనార్హం. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 8 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సెగ్మెంట్‌ను మహాకూటమి ఇంకా ఎవరికీ కేటాయించలేదు. అయితే, తనకే అవకాశం ఇస్తారన్న ధీమాతో మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేష¯Œన్ వేశారు. బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్‌రావుతో పాటు ఇప్పటికే ఒకసారి నామినేష¯Œన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహ¯Œన్‌గౌడ్ మరో సెట్ అందజేశారు. ఫ్యూచర్ ఇండియా పార్టీ అభ్యర్థి ఇటికాల వరుణ్‌రెడ్డి, శివ్‌సేన నుంచి ప్రేమ్ గాంధీ, స్వతంత్రులు పిల్లి వెంకటేశ్, కర్ణాటకపు నాగదేవ, ముల్లేటి లక్ష్మీ జగదీశ్వరి నామినేషన్లు వేశారు. మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి నామినేష¯Œన్ పత్రాలు సమర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి నాలుగు సెట్లు ఆర్ఓకు సమర్పించారు. టీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాశ్‌గౌడ్, ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా నామినేషన్లు వేశారు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌కు టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిష¯Œన్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి ముకుంద నామినేషన్Œ పత్రాలను అందజేశారు. ఈ స్థానాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి తరఫున ఆయన కుమారుడు అభిషేక్ రెడ్డి నామినేష¯Œన్ పత్రాలు ఆర్ఓకు అందించారు. బీజేపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు మర్రిపల్లి అంజయ్య యాదవ్, బండారు రణధీర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సపావత్ దేవరామ్ కూడా నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి స్థానానికి స్వతంత్ర అభ్యర్థి గాదె సరిత నామినేషన్ దాఖలు చేశారు. మోగుతున్నరె‘బెల్స్’ అసెంబ్లీ ఎన్నికల పోరులో మూడో రోజు ప్రధాన పార్టీలతో పాటు భారీగా ఇండిపెండెంట్లు, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు నామినేషన్లు వేశారు. బుధవారం ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డి, యాకుత్‌పురాలో సుందర్‌రెడ్డి నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ అభ్యర్థులుగా మూల ముఖేష్‌గౌడ్ (గోషామహల్) విష్ణువర్ధన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), అనిల్‌కుమార్ యాదవ్ (ముషీరాబాద్), కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్)లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్‌లో అధికారికంగా సీటు ఖరారు కానప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా పి.కార్తీక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయటం విశేషం. అదే విధంగా మల్కాజిగిరి, ఎల్బీనగర్, మేడ్చల్‌లలో బీజేపీ అభ్యర్థులు రాంచందర్‌రావు, పేరాల శేఖర్‌రావు, కొంపల్లి మోహన్‌రెడ్డిలు నామినేషన్లు వేశారు. ఉప్పల్‌లో టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్, మల్కాజిగిరిలో టీజేఎస్ అభ్యర్థి దిలీప్‌కుమార్, ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రీ యాకుత్‌పురాలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తిరుగుబాట్లు.. అధికారిక అభ్యర్థులను కాదని ఆయా పార్టీల నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మల్కాజిగిరిలో బీజేపీ నేత గోపు రమణారెడ్డి, కంటోన్మెంట్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన గణేష్, కూకట్‌పల్లిలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వెంగళరావు, టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా కంటోన్మెంట్లో గజ్జెల నగేష్ నామినేషన్లు వేశారు. వీరితోపాటు నగరంలో ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు, ఉప్పల్‌లో కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్‌లో టీఆర్ఎస్ను వీడి మరో రాజకీయ పార్టీ పేరుతో ముఖ్య నాయకులు బరిలోకి నిలిచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
వారెవా.. గదే పేసు.. జర షర్టే మార్చిండు బాసు..
గీయన్ని ఎక్కడో చూసిన...గానీ యాదికి రావట్లె...’ గల్లీల ఎదురైన ఓ సారుని జూసి అనుకున్న. సాయంత్రానికి గాని లెక్కదేల్లె. ఆ సారు గల్లీ ముందరున్న ఇంట్లోనె ఉంటడు. నిన్న మొన్న దాకా తెల్ల జుత్తు పెంచుకుని...లూజు లూజు అంగీలేస్కొని తిరిగేటోడు. ఏమైనదో తెల్వద్ గానీ అంతా మార్చేసిండు. జుత్తుకి నల్లరంగేసిండు... మీసాల్ గడ్డం తీసేసి ముకం నున్నగ చేసుకునిండు..టీషర్టు ఏస్కొనిండు. గిట్ల టిప్టాప్గ మేకప్పేస్తే ఎట్లబై గుర్తుపట్టేది? సరే టీషర్టు సారు కత వదలుండ్రి. ఎవరైనా సరే మారడం మంచి గాదె! వయసుపైన పడుతుంటే...మన మొకం గట్లనే మారుతుంటది. మార్చుడు రెండ్రకాలు. ఒకటి పైకి కనిపించుకునె తీరు! నిన్నటి దాకా సైకిల్‌పై తిరిగేటోడు... ఇయ్యాల బైకుల్లో రయ్మంటు తిరుగుతండు. గట్లనే బైకులల్ల పోయేటోడు పేద్దకారు తోలుతు కనిపిస్తండు. మాసిపోయిన బట్టలేస్కొని గాలిపట్టినోడ్లెక్క తిరిగే మనిసి టక్కున కడక్ల కనిపిస్తండు. ఏందన్న ఆమ్దాన్ గానీ పెరిగిందా...గీ మద్యన బలే ఉషారుగున్నవ్ అంటూ ముచ్చట్లు పెడ్తుంటం. దూస్ర మార్పు...గది మన లోపల్నుంచి వస్తది. దునియాల సంతోసం..దుక్కం...ఎదురయ్యే సవాల్లు...గివన్నీ మనిసిని తేటచేస్తయి...లేద కుదేల్ చేసి గుంతల తోస్తయ్. తేటగుంటే నవ్వుతం... కుదేలైతే కండ్లల్ల నీల్లెట్టుకుంటం...గంతె! ఈ మార్పులు ఎవ్రుకైనా ఉండేవె గాని...రాజకీయాల్లో మార్పులు బలె గమ్మత్తుగుంటయ్. అంగీలు మార్చినంత సులువుగ పార్టీలు మారుస్తుంటరు. ఎలచ్చన్ల కాలంలొ గిదింకా ఎక్కువ. ఎవ్రు యాడుంటుండ్రో ఎవ్రుకీ తెల్వదు. అరె మారాలె అనుకున్న ఆసామీకే తెల్వదేమో! ఏంది సారూ నిన్నటి దాంక గా పార్టీలోనె ఉంటివి గదే... ఇయ్యాల గీ పార్టీ అంటావేంది? అన్నావనుకో... నాకోసం గాదె... అంతా జనాల కోసం! ఆల్లకి ఏది మంచిగుంటదనిపిస్తె గది చేసుడే నా పని! అని న్యాక్గ లెక్క తేలుస్తడు. అయితే గది జనాల కోసమా... కాదా అన్నది రోడ్లల్ల తిరిగే సాదాసీదా మనిసిక్కూడ తెల్సిపోతది. ఇయన్ని సాలవన్నట్లు ‘మా కార్యకర్తల మనోబావాల లెక్కన నే నిర్ణయం తీస్కుంట...’ అంటూ శానీ లెక్క డైలాగ్ కొడ్తరు. ఈ మనోబావమేదో ఆ దేవుడికే తెల్వాలె! ఈసారి ఎలచ్చన్ల ఇలాంటి కతలు మస్తుగ వినిస్తున్నయ్! నిన్నటి దాకా ఓ పార్టీ జెండా పట్కున్నోడు ...ఈసారి ఇంకో పార్టీల తిరుగుతుండు. ఆటోల్లు ఇటు... ఇటోల్లు మారిపోతుండ్రు. మొన్ననే మనమందరం చూసిన విచిత్రం...పొద్దున్నే కాంగ్రెస్‌ల నేనుండ...ఎల్లిపోతున్న అంటూ బీజేపీ గడప తొక్కిన పద్మక్క సాయంత్రానికల్లా అంతా తూచ్... గదేం లేదె నేనీడే కాంగ్రెస్‌ల ఉంటా అనిందంటే... ఈ రాజకీయ సర్కస్ల జైంట్ చక్రం గెట్ల తిరుగుతుందో తెల్సుకుండ్రి మరి! గీసారి ఎలచ్చన్ల కాంగ్రెస్... టీఆరెస్సు పార్టీల్ల కొందరీ లెక్కనే పొటీలు చేస్తుండ్రంట! గమ్మత్ ఏందంటే మల్లీ బరిలోకి దిగి సవాల్లు చేస్కుంటున్నోల్లు వాల్లే! మొన్న తిట్టినోల్లనే ఈసారి పొగడాలంటె కస్టం గాదె! మనం గట్లనుకుంటం గానీ... పొలిటికల్ల తిరిగేటోల్లకి గిదంతా మామూలె! సీట్లోకి కూర్సునుడే ఆల్లకి గావల్సింది. అంగీల్లెక్క పార్టీల్లో మీరెంతగ అదల్ బదల్ అయినా మొకం గదేగాదె! జనాలకు గా మొకం గుర్తుంటద? షర్టు గుర్తుంటద? జరంత ఆలోచించండ్రి మీకె తెలుస్తది!! – రామదుర్గం మధుసూదనరావు -
‘మహా’ కుదుపు కూటమికి
సాక్షి, వరంగల్: జట్టు కట్టక ముందే కూటమిలో మహా కుదుపు మొదలైంది. సీట్ల పంపకాల్లో పొత్తులు పొసగక పోవడంతో ఎవరికి వారుగా వేరు కుంపటికి సిద్ధమవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వాళ్లుగా విడిపోయి పోటీకి రెడీ అవుతున్నారు. పెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఐదు సీట్లను త్యాగం చేయాల్సి వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘పశ్చిమ’లో తిరుగుబాటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు. కూటమి ఒడంబడికను పక్కనపెట్టి ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక టీజేఎస్ 12 సీట్లలో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించింది. అందులో నాలుగు సీట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహా కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, జనగామ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సింగపురం ఇందిరను ప్రకటించిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి దారితీసింది. జనగామ మాదే.. కాదు మాదే.. ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరాం సమీప బంధువులు నియోజకవర్గంలో మకాం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర నాయకులను కలుస్తున్నారు. మరోవైపు జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాల్లో సీటు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొందరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో గందరగోళం.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ సింగపురం ఇందిరకు టికెట్ కేటాయించింది. ఈమేరకు ఆమె నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. తాజాగా తాము ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు వర్ధన్నపేట టికెట్ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్ గాంధీ భవన్లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు బుధవారం ప్రకటించారు. -
కూటమిలో రె‘బెల్స్’.. పొత్తు చిత్తేనా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :మహాకూటమి పొత్తు లెక్కలు మహా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కూటమిలో భాగంగా ఆయా పార్టీలకు కేటాయిస్తున్న లెక్కలు దారితప్పుతున్నాయి. ముఖ్యంగా తొలి జాబితాలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిగా ఎర్ర శేఖర్‌ను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా అదే స్థానానికి తెలంగాణ జన సమితితో పాటు తెలంగాణ ఇంటి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీజేఎస్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.రాజేందర్‌రెడ్డి పేరును ప్రకటించగా.. తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటిస్తూ జాబితా వెల్లడించింది. అంతేకాకుండా తెలంగాణ ఇంటి పార్టీ జడ్చర్ల అభ్యర్థిగా వి.శివకుమార్, నారాయణపేట అభ్యర్థిగా జనగారి నవిత పేర్ల ను ప్రకటించారు. జడ్చర్ల స్థానానికి మహాకూటమి నుంచి కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక దేవరకద్ర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలవాలని భావిస్తుండగా... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మక్తల్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి టికెట్ ఇప్పించేందుకు డీకే.అరుణ ఢిల్లీలో యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మహాకూటమి ఉన్నట్లా, విచ్ఛినమైనట్లేనా అనే చర్చ మొదలైంది. ఎత్తుకు పైఎత్తు! ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహాకూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే విషయంలో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను గద్దె దింపడం కోసం అన్ని రాజకీయపక్షాలు కలిపి మహాకూటమిగా జత కట్టిన విషయం తెలిసిందే. అయితే కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు లెక్కల విషయంలో సయోధ్య కుదరక అన్ని పార్టీలు కూడా సతమతమవుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీజేఎస్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీకి ఇదివరకే రెండు స్థానాలు కేటాయించగా.. దేవరకద్ర నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా మహాకూటమి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించిన మహబూబ్‌నగర్, జడ్చర్లకు తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం. అంతేకాకుండా ఇంకా మహాకూటమి అభ్యర్థి ఖరారు కాని నారాయణపేట నుంచి ఈ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మక్తల్ సీటుపై పీటముడి మక్తల్ అసెంబ్లీ స్థానం విషయంలో మళ్లీ కొత్త అంశం తెరపైకి వచ్చింది. కూటమి భాగస్వామ్యంలో భాగంగా టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించారు. అందుకు అనుగుణంగా టీడీపీ తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా కె.దయాకర్‌రెడ్డి బుధవారం నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ అంత సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మక్తల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీ కోటాలో సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి ఇవ్వాలంటూ మాజీ మంత్రి డీకే.అరుణ ఢిల్లీలో అధిష్టానం వద్ద యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో పాటు శ్రీహరికి మక్తల్‌లో పట్టు ఉందని కొన్ని సర్వేల నివేదికలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాదు గత ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేసిన దయాకర్‌రెడ్డి బీజేపీ మద్దతు ప్రకటించినా మూడో స్థానంలో నిలిచారని కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద సీట్ల పంపిణీ కథ మొదటికి వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీడని ఉత్కంఠ ఓవైపు కూటమి చిచ్చు రగులుతుండగా... మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల అంశం ఆ పార్టీ కేడర్‌కు మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు విడతల్లో భాగంగా విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక రెండు స్థానాలు కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే మరో మూడు స్థానాల విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. దేవరకద్ర, నారాయణపేట, కొల్లా పూర్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు గ్రూపులుగా ఉన్న డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి ఎవరికి వారు తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేయడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో మరింత జాప్యం జరుగుతోంది. -
మా దారి మాదే..
సాక్షి,సిటీబ్యూరో: మహా కూటమిలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించిన మొదటి జాబితాలో అవకాశం దక్కని అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏకంగా కొందరు నిరసనలు, అందోళనలకు దిగుతుండగా, ఇంకొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి ఇవ్వడాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు సర్దుబాటు చేయడం టీడీపీకి మింగుడు పడడంలేదు. ఇదిలాఉండగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకు, టీడీపీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖారారు చేయాల్సి ఉంది. కూటమి సీట్ల సర్దుబాటులో తెలంగాణ జనసమితి కూడా ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. శేరిలింగంపల్లిపై శ్రేణుల లొల్లి ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కేటాయించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి కేటాయించవద్దని ఇప్పటికే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఇందుకోసం కార్యకర్తలు ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు సైతం సిద్ధమయ్యారు. అయినప్పటకీ కూటమి సీట్ల సర్దుబాటులో టీడీపీ కోటా కింద కాంగ్రెస్ వదులుకోక తప్పలేదు. టీడీపీ తన మొదటి జాబితాలో శేరిలింగంపల్లి స్థానానికి తన అభ్యర్థిని ప్రకటించింది. ఇదీ కాంగ్రెస్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచించాలని, తనకు సీటు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని తాజా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో అనుచరులతో సమావేశమై కార్యాచరణపై సమాలోచనలు సైతం చేశారు. ఈ సీటు విషయంలో టీడీపీలో కూడా అసంతృప్తి రగులుతోంది. ఇక్కడ మొదటి నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పొటీపడుతున్నారు. అందులో ఒకరు పారిశ్రామికవేత్త వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ కాగా.. మరొకరు మొవ్వ సత్యనారాయణ. అయితే, ఆ పార్టీ మాత్రం తమ అభ్యర్థిగా వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌ను ఖరారు చేయడం ఇక్కడి టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. స్థానికేతరుడైన ఆనంద్‌కు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అధిష్టానంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎస్టీఆర్ ట్రస్ట్భవన్ వద్ద ధర్నా చేసి స్థానికేతరులకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అధిష్టానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకతప్పదని ‘మొవ్వ’ ప్రకటించారు. ముషీరాబాద్‌లోనూ అదే తీరు.. ఈ అసెంబ్లీ స్థానం విషయంపై ఇరు పార్టీల్లో ముసలం మొదలైంది. కాంగ్రెస్‌లో అసమ్మతి, టీడీపీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ పార్టీలో స్థానికేతరుడైన అభ్యర్థికి ఖరారు చేయడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మరోవైపు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు వదులుకోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అద్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌కు సైతం మొండి చేయి చూపించారు. దీంతో ఇక్కడి కార్యకర్తలు మంగళవారం నగర టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్ ఒత్తిడి మేరకు ఎమ్మెన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్లో అసమ్మతి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో అసమ్మతి చెల రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ బంధువైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సర్వేపై రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో అశావహుడు టీపీసీసీ కార్యదర్శి గణేష్ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘సర్వే’కు టికెట్ ఇవ్వడాన్ని గణేష్ అభిమానులు, పలువురు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పికెట్ చౌరస్తా వద్ద మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను సైతం తగలబెట్టారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు గణేశ్ ప్రకటించారు. టీఆర్ఎస్లోనూ ‘దానం’ కిరికిరి టికెట్ల ప్రకటనకు ముందే ఖైరతాబాద్‌లో ఆందోళన తారస్థాయికి చేరింది. ఈ స్థానాన్ని తనకే కేటాయించాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యాలయం నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో గోవర్ధన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఓ కార్యకర్త తలపై బండరాయితో మోదుకున్నాడు. దీంతో మరింత కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఖైరతాబాద్ సర్కిల్లో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన కొనసాగించారు. మంగళవారం రాత్రి వరకు కూడా గోవర్ధన్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. స్వతంత్రంగా పోటీకి ‘ఎమ్మెన్’ సిద్ధం సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడినప్పటికీ ఈసారి ముషీరాబాద్ టిక్కెట్ తమ పార్టీకే దక్కుతుందనుకున్న స్థానిక టీడీపీ నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననే ఆశతో ఎంతో కాలంగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. పంపకాల్లో ముషీరాబాద్‌ను కాంగ్రెస్‌కు కేటాయించడంతో నియోజకవర్గంలోని డివిజన్ల నేతలు, కార్యకర్తలు, జిల్లా నేతలు పార్టీ కార్యాలయంపై తమ ప్రతాపం చూపాలనే ఆలోచనలు చేసినప్పటికీ ఎమ్మెన్ వారించినట్లు తెలిసింది. నాలుగు రోజులు వేచిచూసి, అప్పటికీ పార్టీ తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే సోమవారం ‘స్వతంత్ర’ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని తన వర్గానికి నచ్చజెప్పారు. అందుకు తగ్గట్టు పార్టీ శ్రేణులు బూత్, డివిజన్ల వారీగా తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నగరంలో ఏపార్టీకి లేనిది తమకు 300 బూత్ కమిటీలు తమకున్నాయని, క్యాడర్ బలంగా ఉన్నా టీడీపీకి టికెట్ రాకపోవడం దారుణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టికెట్ల వేటలో భంగపాటు
సాక్షి, వరంగల్: అసెంబ్లీ టికెట్ల వేటలో వివిధ పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు భంగపాటుకు గురయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అధ్యక్షుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వరంగల్ పశ్చిమ టికెట్ మహాకూటమిలో భాగంగా టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించారు. దీంతో ఇదే స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేష్ నిరాశకు గురయ్యారు. సామాజిక సమీకరణాల్లో బీజేపీ టికెట్ ధర్మారావుకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కూడా టికెట్ దక్కలేదు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యే పదవే లక్ష్యంగా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు, బరువులు మోస్తున్న వీరందరూ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన వీరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరు సమాలోచనల్లో పడిపోయారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వారు సమాలోచనలు చేస్తున్నారు. పొన్నాలతో పాటు ఆయన వర్గీయులకు ‘కూటమి’ పేరుతో పీసీసీలోని ఓ వర్గం ఝలక్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. అప్పుడు దొంతి... ఇప్పుడు నాయిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి పార్టీ టికెట్ దక్కకపోవడం ఇది రెండోసారి. 2004 ఎన్నికల సందర్భంగా అప్పడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి నర్సంపేట టికెట్ దక్కలేదు. కత్తి వెంకటస్వామికి టికెట్ ఇచ్చారు. దీంతో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ ఇస్తామని పీసీసీ నేతలు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. దీంతో నాయిని అనుచరులు మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సముదాయించే ప్రయత్నం చేసినా నిరసనను విరమించలేదు. నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిరాశలో రావు పద్మ.. తెలంగాణలో 2004లో జరిగిన మొదటి ఎన్నికల్లో రావు పద్మారెడ్డి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమె వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా అర్బన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. 2019లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఎవరు వచ్చినా పశ్చిమ అభ్యర్థిగా పద్మారెడ్డికే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఆమె అదే అశతో పార్టీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోయారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో పశిచమను మాజీ ఎమ్మెల్యే ధర్మారావుకు కేటాయించడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు గురయ్యారు. టికెట్ ఇవ్వకుంటే బరిలో ఉంటానని రావు పద్మారెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈగ మల్లేషం, గన్నోజులకు లేనట్లే.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేషం వరంగల్ తూర్పు టికెట్, రూరల్ పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసచారి పరకాల టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి పశ్చిమ టికెట్ కేటాయించడంతో జిల్లా అధ్యక్షులైన ఈగ మల్లేషం, గన్నోజు శ్రీనివాసాచారిలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. -
ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేదు : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా... రేపు టీజేఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎనిమిది లేదా అంత కన్నా ఎక్కువ స్థానాల్లో టీజేఎస్ పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. కామన్ సింబల్ కాకుండా తమ అగ్గిపెట్టె గుర్తుతోనే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. బూత్ కమిటీలతో సింబల్ గురించి విస్తృత ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ.. మహాకూటమిని నిలబెట్టడానికి ఉమ్మడి ఎజెండాను కూడా మంగళవారమే ప్రకటిస్తామని కోదండరాం వ్యాఖ్యానించారు. మహాకూటమి కలిసి కట్టుగానే అందరితో పోటీ చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రజా ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీపీఐని కూడా కలుపుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి కోదండరాం పోటీచేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
మహ ‘కుంపటి’..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అసలే టీఆర్ఎస్ అధికార పార్టీ.. అంతకు మించి అభ్యర్థుల ప్రకటన పూర్తయింది.. దీంతో వారు నియోజకవర్గాన్ని ఒకటి, రెండు సార్లు చుట్టేస్తున్నారు.. అంతేకాకుండా సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. కానీ మహాకూటమి పొత్తుల ఇంకా తేలలేదు! రేపు, మాపంటూ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేస్తుండగా.. ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో అంతు పట్టడం లేదు. దీంతో సీటు ఆశిస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముందస్తు ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వడివడిగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ రద్దు అనంతరం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్... ఎక్కడా ఎన్నికల వేడి తగ్గకుండా ప్రచారంలో నిమగ్నమైంది. మరోవైపు అధికార పక్షాన్ని గద్దెదింపుతామంటూ శపథాలు చేస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి పొత్తులు, అభ్యర్థుల లెక్కలు మాత్రం ఎంతకూ ఓ కొలిక్కి రావడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుండగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమవుతుంది. అయినా ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన వెలువడలేదు. వాయిదాలతోనే కాలం గడుపుతున్నారే తప్ప ఎంపిక ప్రక్రియ తేలడం లేదు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ నేతలు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. నేడో రేపో మిగిలిపోయిన అయిదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీ–పామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. ఈ వారంలోనే కేసీఆర్ సభలు ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ దళపతి, సీఎం కేసీఆర్ నాలుగైదు రోజుల్లో పాలమూరు ప్రాంతంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. సోమవారంఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో.. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చాలని సూచించారు. త్వరలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారై ఫీల్డులోకి వచ్చేలోగా ప్రచారాన్ని ఒక విడత ముగించాలని స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల పర్యటనలు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 17 నుంచి పాలమూరు జిల్లాలో సభలు ప్రారంభిస్తామని చెప్పగా.. మొదటగా దేవరకద్ర నియోజకవర్గంలోనే సభ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17 దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన కేసీఆర్.. తేదీలను కూడా ఖరారు చేసి అభ్యర్థులకు చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులు తేలేదెన్నడో?! ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ధోరణి ఆ పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేస్తోంది. ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆరు నెలల ముందే ప్రకటిస్తామని పేర్కొన్న పీసీసీ చీఫ్.. ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవుతున్నా. ఇప్పటికీ ప్రకటించకపోవడం గమనార్హం.అభ్యర్థుల ప్రకటన విషయంలో పలుమార్లు గడువులు చెప్పడం.. తీరా మళ్లీ వాయిదా వేయడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం వైఖరి అదుగో పులి కథలా మారిందంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలోనైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుందా అనేది సందేహంగా మారింది. ఒక వేళ అభ్యర్థులను ప్రకటిస్తే అన్ని నియోజకవర్గాలకు ప్రకటిస్తారా లేదా ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకు మాత్రమే ప్రకటిస్తారా అనే మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. బీజేపీ మిగిలిన స్థానాలు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొమ్మిది స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన అయిదు స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనైనా ఉమ్మడి పాలమూరు నుంచి రెండు నుంచి మూడు స్థానాల్లో గెలిచి తీరాలని గట్టి కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పెండింగ్‌లో మిగిలిపోయిన వాటిల్లో ఒకటైన మహబూబ్‌నగర్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి పేరు ఖరారు చేసినా ఆఖరి నిముషంలో నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ స్థానం విషయమై పలు కోణాల్లో విశ్లేషిస్తున్న బీజేపీ అధిష్టానం.. ఇక్కడ నుంచి బరిలో ఎవరిని నిలుపుతుందనే ఆసక్తికరంగా మారింది. అదే విధంగా కొడంగల్ నుంచి పార్టీ సీనియర్ నేత నాగూరావు నామాజీని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జడ్చర్ల, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాలకు కూడా స్థానికంగా పట్టు ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. -
నామినేషన్లకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల పోరులో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల ప్రక్రియకు గడువు సమీపిస్తున్నా బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పలు పార్టీలకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల విషయమై టీఆర్ఎస్ మాత్రమే స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ రద్దు అనంతరం... సీఎం కేసీఆర్ ఒకేసారి ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అలాగే బీజేపీ రెండు విడతలుగా వెల్లడించిన జాబితాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థుల విషయంలో మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పలు వాయిదాలతో కాలం గడుపుతున్నారే కానీ అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తుండగా.. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ఆదివారం జరగనున్న సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాంలు అందజేయనున్నారు. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో భాగంగా మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్... మరో మైలు రాయిని చేరనుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారు అనునిత్యం జనంలో మమేకమవుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే పలు చోట్ల కాస్త అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా కల్వకుర్తి వంటి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలవాలని ఆయనపై కేడర్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పార్టీ ముఖ్యుల సూచనతో ఆయన ఆఖరి నిముషంలో వెనక్కి తగ్గారు. అలాగే మరికొన్ని చోట్ల చిన్నచిన్న అసంతృప్తులు వ్యక్తమైనా పార్టీ అధిష్టానం సరిదిద్దగలిగింది. ఈ మేరకు పార్టీ కేడర్ అంతా కూడా ప్రచారంలో నిమగ్నమయ్యేలా చేయడంలో నేతలు విజయవంతమయ్యారు. మధ్య మధ్యలో పార్టీ ముఖ్యనేత మంత్రి కేటీఆర్ సభలతో కేడర్‌లో ఉత్సాహం తీసుకొస్తున్నారు. అలాగే బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లో స్వయంగా అభ్యర్థులతో మరోమారు సమావేశం కానున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడం, అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రచారశైలిపై ఆయన చర్చించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అతి కీలకమైన పార్టీ బీ–ఫాంలు అందజేయనున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు తమ జాతక బలాలను అనుసరించి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రతీ అభ్యర్థి కూడా రెండు సెట్ల నామినేషన్లను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏయే తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాలనే విషయంలో అభ్యర్థులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. ‘మహా’ అయోమయం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలో జట్టు కట్టిన మహాకూటమి తరఫున సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కూటమి లెక్కలు, పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావించింది. మిగతా 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలవాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. వాస్తవానికి ఈనెల1న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ.. పలు వాయిదాల అనంతరం 12వ తేదీకి మారింది. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. తొలి జాబితాలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు లీకులిచ్చారు. తీరా చూస్తే మిత్రపక్షాలతో కలిపి ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని సెలవిచ్చారు. దీంతో మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం తేలక సతమతమవుతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతుండటంతో.. ఎన్నికల ప్రచారానికి కేవలం 23 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. దీంతో ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎప్పుడు ప్రచారం ప్రారంభించాలి... ఎప్పుడు జనంతో మమేకం కావాలనేది అయోమయంగా మారింది. చాప కింద నీరులా బీజేపీ ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా బీజేపీ చాపకింద నీరులా ప్రచారంలో నిమగ్నమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో అయిదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో మహబూబ్‌నగర్, కొడంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ఆఖరి నిముషంలో వాయిదా వేసింది. వాస్తవానికి మహాకూటమి సీట్ల సర్దుబాటు తేలాక మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావించింది. కానీ కూటమి లెక్కలు సస్పెన్స్ థ్రిలర్ సినిమాను తలపిస్తుండటంతో... బీజేపీ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిపోయిన అయిదు స్థానాలు కొల్లాపూర్, అలంపూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కొడంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత... ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్ వంటి నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు పలు సర్వేల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో పార్టీ ముఖ్యనేతలను కూడా ప్రచారబరిలో నిమగ్నం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. -
జనగామ బరిలో కోదండరాం ?
సాక్షి, జనగామ: మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీచేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్, మహాకూటమి నాయకులతో రాహుల్‌గాంధీ జనగామ సీటుపై గురువారం చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. జనగామ జిల్లా సాధనకు జేఏసీ పట్టువదలకుండా చివరివరకూ పోరాడడం, ఉద్యోగులతోపాటు యువతపై ఆశలతో టీజేఎస్ ఈ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిగాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలనే విషయంలో కూటమిలోని పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రకటనే మిగిలింది. గురువారం మహాకూటమి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇందులో జనగామ సీటుపై చర్చ జరిగినట్లుతెలుస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ జనగామ సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. కోదండరామ్ ఎక్కడ సీటు అడిగితే అక్కడ కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనగామ సీటు అడగడం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. టీజేఎస్‌కే జనగామ సీటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పొన్నాల లక్ష్మయ్యతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. టీజేఎస్ నాయకులు మాత్రం సంబురాల్లో మునిగిపోయారు. ఢిల్లీలో ఏం జరుగుతోంది... గత ఎన్నికల తప్పిదాలను పునరావృతం చేయొద్దని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్‌గాంధీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వయసు పైబడిన వారి జాబితాను టీపీసీసీ నుంచి రాహుల్ గాంధీ ఇటీవల తీసుకున్నారు. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముందే గ్రహించిన పొన్నాల లక్ష్మయ్య పది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు సమాచారం. టికెట్‌పై రాహుల్‌తో హామీ తీసుకున్నాకే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తిరుగులేని నేత నుంచి... జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగుసార్లు విజయం సాధించారు. 1994లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. పొన్నాల నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడమేగాక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న పొన్నాల సైతం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం తప్పించింది. ప్రస్తుతం మహాకూటమి ఏర్పాటు పొన్నాలకు తలనొప్పిగా మారింది. ఆ సీటు ఎందుకు కోరుతుంది..? టీజేఎస్ మొదటి నుంచి జనగామ సీటు కోరుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రత్యేక జిల్లా ఉద్యమం జనగామలో భారీ ఎత్తున జరిగింది. హామీ ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో జిల్లా అంతా ఏకతాటిపై నిలిచింది. రోజుకో వినూత్న కార్యక్రమం, నిరసనలతో హోరెత్తింది. దీనికి జేఏసీ నాయకత్వం వహించింది. ఆఖరికి తలొగ్గిన ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు అంగీకరించింది. ఇది జేఏసీ విజయంగా టీజేఎస్ భావిస్తోంది. దీనికి తోడు ఉద్యోగులు, నిరుద్యోగులతో జేఏసీగా కోదండరామ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనగామ సీటుపై కోదండరాం కన్నేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం వరకు ఉత్కంఠకు తెరపడనుంది. -
బిజీ లీడర్స్
సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో సీట్ల పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల నుంచి పలువురు అభ్యర్థులు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ వార్‌రూం ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ అందుకున్న గ్రేటర్‌లోని అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. నగరంలో సికింద్రాబాద్, అంబర్‌పేట తదితర నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఢిల్లీ బాటపట్టారు. వీరితోపాటు పొత్తుల్లో స్థానాలు కోల్పోతున్న నియోజకవర్గాల నేతలు ఢిల్లీలో పీసీసీ, ఏఐసీసీ నాయకులతో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉండడంతో గురువారం మాజీ మేయర్ కార్తీకరెడ్డి, టికెట్ ఆశిస్తున్న పల్లె లక్ష్మణరావుగౌడ్ వార్‌రూం భేటీకి హాజరయ్యారు. మల్కాజిగిరి స్థానం తెలంగాణ జన సమితికి, టీడీపీకి ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, పటాన్చెరు స్థానాలు దాదాపు ఖరారు కావడంతో ఈ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీసీ భేటీ కానుంది. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వలేకపోతున్నామని, భవిష్యత్‌లో న్యాయం చేస్తామన్న హామీ ఇస్తున్నట్లు ఢిల్లీ వెళ్లిన నేతలు చెబుతున్నారు. ప్రచారంలో బిజీబీజీ.. పొత్తుల్లో స్థానాల కేటాయింపుతో పాటు అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చిన అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. గోషామహల్లో ఎం. ముఖేష్‌గౌడ్, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముషీరాబాద్‌లో అనిల్‌కుమార్ యాదవ్, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్ ఇప్పటికే విస్తృత పర్యటనల్లో నిమగ్నమయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, జూబ్లిహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లోశశిధర్‌రెడ్డి, కంటోన్మెంట్లో సర్వే, నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ పేర్లను ఎన్నికల కమిటీ సైతం క్లియర్ చేసిందన్న సమాచారంతో వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇంటి మొహం చూడలే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఏకధాటిగా గురువారం 18వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్ పార్టీ కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ నాయకుల ఇళ్లలోనే చేస్తున్న సుధీర్‌రెడ్డి.. రాత్రి నిద్ర కూడా తమ వెంట ఉన్న వాహనాల్లోనే చేస్తున్నారు. రోజుకు 25 నుంచి 30 కి.మీ మేర యాత్ర చేస్తున్న ఆయన 22 రోజుల్లో 872 కానీల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
హమ్మయ్య.. పోత్తుల లెక్కలు తేలాయ్.!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నెలరోజులుగా ఊరిస్తున్న మహాకూటమి పొత్తులు, కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పలు చర్చల అనంతరం జాబితా ఒక రూపం సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమిలో భాగంగా టీడీపీకి మాత్రమే సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. టీడీపీకి ఒక్క స్థానంతో సరిపెట్టాలని భావించగా... ఆ పార్టీ మాత్రం మరో స్థానం కావాలని పట్టుబట్టింది. దీంతో చివరకు టీడీపీ కోరిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పచ్చ జెండా ఊపింది. పొత్తులో భాగంగా టీడీపీకి మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలను కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. ఈ మేరకు బరిలో నిలిచే అభ్యర్థులకు సైతం అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఉన్న ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించారు. మొత్తం మీద కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేసు గుర్రాలకే టిక్కెట్లు కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు ఎన్నికలను పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఓవైపు నామినేషన్లకు గడువు సమీపిస్తుండగా.. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం గెలుపు గుర్రాలనే బరిలో నిలపాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా చేపట్టిన సర్వేలు, రిపోర్టుల ఆధారంగా వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం స్థానాల్లో ఎవరెవరు బరిలో ఉంటే గెలుపు సాధ్యమవుతుందనే లెక్కలు వేసుకుని సర్దుబాట్లు చేసింది. నియోజకవర్గాల్లో ముందు నుంచి పనిచేసుకుంటున్న వారు ఏ మేరకు ప్రభావితం చూపుతున్నారు... కేడర్ మనోభావాలు ఏమిటనే విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూటమి మిత్రపక్షాలను కూడా సర్దుబాటు చేశారు. ఆశావహులకు బుజ్జగింపులు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిని కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ రెండు రోజులుగా బుజ్జగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఏఐసీసీ నేతలు స్వయంగా ఫోన్లు చేసి ఢిల్లీకి పిలిపించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన నేతలను రప్పించుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, మక్తల్ నియోజకవర్గాలకు చెందిన నేతలకు మాత్రం పొత్తులో భాగంగా సీట్లను టీడీపీకి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మిత్రపక్షాలకు సహకారం అందించాలని, పార్టీ అధికారంలోకి వస్తే త్యాగానికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉన్నా సరే.. మిగతా వారు సహకరించాలని సూచించారు. మహబూబ్‌నగర్ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు ఎం.సురేందర్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, ఎన్.పీ.వెంకటేశ్, సయ్యద్ ఇబ్రహీం, బెక్కరి అనిత మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మాత్రం పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం... ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున ఇతర పక్షాలకు ఈ స్థానాన్ని కేటాయించొద్దని కోరారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేస్తామని విన్నవించారు. కానీ అధిష్టానం మాత్రం టికెట్ విషయంలో మరే ఇతర ఆలోచన చేయవద్దని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. దేవరకద్ర నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న డోకూరు పవన్‌కుమార్, న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, మరోనేత కాటం ప్రదీప్కుమార్గౌడ్ను కాంగ్రెస్ వార్ రూమ్‌లోకి పిలిపించి మాట్లాడారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని, గెలిచే వారికే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ముగ్గురిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందుకు ముగ్గురు నేతలు సమ్మతి తెలిపారు. మక్తల్ నుంచి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి బుజ్జగింపులు చేశారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించాల్సి వస్తోందని చెప్పారు. పార్టీ అదేశాల మేరకు మిత్రపక్షానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఫలితంగా మక్తల్ నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో నిలవడం ఖాయ మైనట్లు తెలుస్తోంది. అలాగే నాగర్‌కర్నూల్‌కు చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు కొండా మణెమ్మను సైతం సముదాయించారు. అక్కడ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డికి టిక్కెట్టు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక కొల్లాపూర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక్కడ నుంచి బరిలో దిగాలని భావిస్తున్న జగదీశ్వర్‌రావు ఇదే విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. వీరి అభ్యర్థిత్వాలకు పచ్చజెండా ఉమ్మడి జిల్లాలో తాజా మాజీలు ఉన్న అయిదు స్థానాలతో పాటు పలు నియోజకవర్గాల అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ ద్వాల నుంచి డీకే.అరుణ, కొడంగల్ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి, నారాయణపేట నుంచి కుం భం శివకుమార్‌రెడ్డి, అలంపూర్ నుంచి ఎస్.ఏ.సంపత్‌కుమార్, వనపర్తి నుంచి జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, అచ్చం పేట నుంచి సీహెచ్.వంశీకృష్ణ, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, షాద్‌నగర్ నుంచి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అభ్యర్థిత్వాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
నిలిచేదెవరు.. వెలిగేదెవరు?
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల బరిలో పెరిగిన పోటీ.. ఎవరికి వారే అందరి కంటే ముందే రాకెట్లా దూసుకుపోవాలన్నట్టు వ్యూహం. తమతమ నియోజకవర్గాల్లో భూచక్రంలా తిరుగుతూ ఎవరికివారే ప్రచార హోరుతో దూకుడు. వెంట చిచ్చుబుడ్డిలా రెచ్చిపోయే అనుచరుల గణం.. నగరంలో నడుస్తున్న రాజకీయంలో ఈ దివాళీ ప్రత్యేకం. ఓట్ల సమరానికి మిగిలింది సరిగ్గా 30 రోజులే. ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికలతో నగరంలో నాయక గణమంతా రకరకాల వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి సైతం దాదాపు ఖరారైన అభ్యర్థులకు అంతర్గతంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఎంఐఎం, బీజేపీ లీడర్లు ఇప్పటికే ప్రచార హోరులో మునిగి తేలుతున్నారు. దీంతోపాటు ధన్తేరస్ రోజున తమ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసి, దీపావళి రోజున నేల నుంచి నింగిలోకి దూసుకెళుతూ వెలుగులు విరజిమ్మే రాకెట్ లాంటి ప్రచార దళాలను, భూ చక్రంలా చివరి లక్ష్యం వరకు విరామం లేకుండా తిరిగే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాలేది కొద్ది సేపైనా అందరి దృష్టిని ఆకర్షించేచిచ్చుబుడ్డి లాంటి కళా, సోషల్ మీడియా బృందాలను లక్ష్య సాధన దిశగా రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే ఆయా బృందాలను సిద్ధం చేసుకున్న నాయకులు వీధి, అపార్ట్మెంట్, వార్డు వారిగా యాక్షన్ ప్లాన్‌తో కదన రంగంలోకి దింపేందుకు సమీప పోలీస్స్టేషన్లలో అనుమతులకు దరఖాస్తులు చేశారు. ‘తారా’జువ్వల సందడే సందడి ఎన్నికల ప్రక్రియంలో నామినేషన్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో స్టార్ సెలబ్రిటీలు, స్టార్ క్యాంపెయినర్లతో నగరం మరింత సందడిగా మారనుంది. నగరంలో 24 నియోకజవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, తెలంగాణ జిల్లాల ఓటర్లు స్థిరపడ్డ Tకాలనీలు, బస్తీల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటి అగ్రశ్రేణి నేతల ప్రచార సభలు, సదస్సులు నగరంలో నిర్వహించేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరికి అదనంగా సోషల్ మీడియాతో పాటు బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక కళాబృందాల ప్రదర్శలను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తంగా దీపావళి రోజు నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్న నేతలంతా విజయమే లక్ష్యంగా కదలుతుండడంతో నిజంగా ఈ దీపావళి ఎవరికి విజయాన్ని అందిస్తుంది.. ఎవరిని దివాళాగా మారుస్తుందన్న విషయం తేలేందుకు ముఫ్పై రోజులు ఆగాల్సిందే. -
తేలిన లెక్క
సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. గ్రేటర్‌లోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. నగరంలో టీడీపీకి కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మరో రెండు నియోజకవర్గాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఇవి కాకుండా అంబర్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో ఒక స్థానం, రాజేంద్రనగర్, పటాన్చెరులో ఒక స్థానం టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేశ్వరం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, గోషామహల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కంటోన్మెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీ చేయనున్నారు. తెలంగాణ జనసమితికి మల్కాజిగిరితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, టీడీపీ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, ఉప్పల్‌తో పాటు సనత్‌నగర్, పటాన్చెరు, అంబర్‌పేట స్థానాల కోసం పట్టుపడుతోంది. ఇందులో సనత్‌నగర్ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనట్లు సమాచారం. నిరాశావహులకు ఢిల్లీ పిలుపు ప్రజా కూటమి పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం కోల్పోతున్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు పీసీసీ నాయకులు నగరంలోని ముఖ్య నేతలను ఢిల్లీ తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధికారంలోకి వస్తే తప్పక న్యాయం చేస్తామన్న హామీని ఇప్పించనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత స్థానికంగా నిరసనలు తలెత్తకుండా చూడడంతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసేలా ఏఐసీసీ చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరంలో లోక్‌సభ నియోజకవర్గాల వారిగా విధులు నిర్వహిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పీసీసీతో పాటు ఏఐసీసీకి నివేదించేలా కార్యాచరణ రూపొందించారు. -
కూటమిలో కుంపటి
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ‘ప్రజా కూటమి’లో సీట్ల సర్దుబాటు జరగకముందే నిరసన సెగలు కక్కుతోంది. గట్టి పట్టు గల నియోజకవర్గాలను పంపకాల్లో వదులుకోవద్దంటూ మిత్రపక్ష నేతలు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు కూటమిలోని అంతర్గత విభేదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. మిత్ర పక్షాల మధ్య సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినా వాటి సర్దుబాటు పక్రియ ఇంకా పూర్తికాలేదు. మరో నాలుగైదు రోజుల్లో కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటించనుండడంతో ఆశావహుల్లో మరింత టెన్షన్ నెలకొంది. కొందరు ఆశావహులకు తమ అగ్రనేతల నుంచి ‘గ్రీన్ సిగ్నల్’ లభించడంతో ఎన్నికల ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. నగరంపైనే కాంగ్రెస్.. టీడీపీ పట్టు నగరంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో పాటు టీడీపీకీ గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో టీడీపీ పదిస్థానాలు గెలుచుకుంది. అప్పట్లో గెలిచినవారిలో ఒక్కరు మినహా తొమ్మిది మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రెండో శ్రేణి నేతలు ఇప్పుడు ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్నారు. కూటమిలో ఆ పార్టీకి సర్దుబాటు చేసే 14 సీట్లలో 8 స్థానాలు నగర పరిధిలోనే ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ స్థానాలు వదులుకోవద్దని కాంగ్రెస్ నేతలు సైతం పట్టుబడుతున్నారు. దీంతో కూటమిలోని మిత్ర పక్షాల మధ్య రాజకీయం గరంగరంగా మారింది. శేరిలింపల్లిపై కాంగ్రెస్ ్ఠ టీడీపీ పంపకాలపై పలు అసెంబ్లీ స్థానాలు ఆందోళనకు కారణమువుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని వదులుకోవద్దంటూ ఆదివారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్త, గోపనపల్లికి చెందిన రంగస్వామి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మసీద్‌బండకు చెందిన బాలరాజు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. సయ్యద్ అనే యువకుడు గాంధీభవన్ పైకెక్కి దూకుతానంటూ బెదిరించాడు. పోలీసులు చాకచక్యంతో అతడిని కిందకు దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఇదే నియోజకవర్గంలో టీడీపీలోని రెండు వర్గాలు బాహాబహీకి దిగాయి. ఎన్నికల ప్రచారానికి దిగిన అనంద్ ప్రసాద్ వర్గాన్ని ‘మువ్వ’ వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరెగింది. గత ఆదివారం మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయించవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని, ఈ స్థానాన్ని పంకాల్లో వదులుకోవద్దని విజ్ఞిప్తి చేశారు. -
ఎవరి ధీమా వారిదే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కూటమిలో కుంపటి మొదలైంది. టికెట్ల వేటలో సీట్ల సర్దుబాటు చిక్కుముడిగా మారింది. మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ల మధ్య సీట్ల పందేరం కొత్త వివాదాలకు తెరలేపుతోంది. ఇరుపార్టీలు పట్టుబడుతున్న నియోజకవర్గాల్లో ఆశావహుల బుజ్జగించడం అధినాయకత్వానికి అగ్నిపరీక్ష కానుంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదిరినప్పటికీ, సీట్ల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో కూటమి పక్షాల్లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలిచింది. వాటిని తమకే కేటాయించాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. పొత్తు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిమిత స్థాయిలోనే సీట్లను ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినా.. ఏయే స్థానాలను ఇరు పార్టీలు పంచుకుంటున్నాయనే అంశంపై స్పష్టత రాలేదు. ఇదే రెండు పార్టీల నేతల మధ్య విభజనకు దారితీస్తోంది. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్లో టీడీపీ నెగ్గింది. అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీ వీడగా స్థానిక ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం సైకిల్ దిగకున్నా పార్టీకి దూరంగానే ఉన్నారు. తాజాగా ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని టీడీపీ ప్రతిపాదిస్తోంది. అయితే, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు కాదు.. జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కోసం ఈ సీటును టీడీపీ కోరుతోంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా కృష్ణయ్య తెరమీదకు రావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి రంగారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి మాత్రం ఎలాగైనా బరిలో దిగాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన కొన్నాళ్ల క్రితమే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. పార్టీకి అంటిముట్టనట్లుగా ఉండడం.. పార్టీలో కొనసాగడంపై కూడా కృష్ణయ్య ఊగిసలాడుతుండడంతో రంగారెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. దీనికితోడు కాంగ్రెస్‌తో సయోధ్య కుదరడం తనకు కలిసివస్తుందని ఆశించారు. సిట్టింగ్ కావడం వల్ల టీడీపీకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్నారు. కూటమిలో త్రిముఖం! సీటుపై భరోసాతో ఎన్నికల ప్రచారానికి సామ రంగారెడ్డి శ్రీకారం చుట్టగా.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ స్థానాన్ని తమకే వదలాలని పట్టుబడుతోంది. రంగారెడ్డి కంటే తమ అభ్యర్థే బలంగా ఉన్నారని వాదిస్తోంది. ఇలా ఇరువురి మధ్య పీటముడి వీడకముందే.. ఆర్.కృష్ణయ్య బాంబులాంటి వార్త పేల్చారు. తాను కూడా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది స్పష్టం చేయలేదు. ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నానని ఒకసారి.. బీసీల కోసం కొత్త పార్టీని స్థాపిస్తున్నానని ఇంకోసారి వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. దీనికితోడు ఇటీవల రాహుల్‌గాంధీని కూడా ఆయన కలుసుకోవడం.. కాంగ్రెస్‌కు అనుకూల వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచా రం జరుగుతోంది. ఇలా ఈ సెగ్మెంట్లో మహాకూటమిలోనే సీటు ఫైట్ జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడా ‘ఒకటే’ పంచాయితీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత ఈసీటు కాంగ్రెస్ కోటాలో వెలుతుందని భావించినా.. కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారుతుందని ప్రచారం జరుగు తోంది. ఈ క్రమంలోనే టికెట్ దక్కించుకోవడానికి ఢిల్లీ సా ్థయిలో తనదైన శైలిలో పావులు కదుపుతున్న కార్తీక్‌కు మహా కూటమి రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన టీడీపీ మళ్లీ తమకే ఈ సీటు కేటాయించాలని పట్టుబడుతోంది. తెలుగుదేశం సమర్పించిన జాబితాలో దీనికి చోటు ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తలొగ్గడంలేదు.మరోవైపు టీడీపీ నుంచిటికెట్ ఆశిస్తున్న సామ భూపాల్‌రెడ్డి,గణేశ్‌గుప్తా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారం సాగిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. తాండూరులో టీజేఎస్ లొల్లి! శివార్లలోని ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో టీడీపీతో కుదుర్చుకున్న పొత్తు తమ సీట్లకు ఎసరు తెస్తుండగా.. తాండూరులో తెలంగాణ జనసమితి(టీజేఎస్) రూపంలో కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది. మొదట్నుంచి ఈ స్థానంపై కన్నేసినా.. కుదరదని పీసీసీ నాయకత్వం తేల్చిచెప్పింది. ఇటీవల స్థానికంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు ఓడిస్తామనే ప్రతిజ్ఞలతో అధిష్టానం పునరాలోచనలో పడింది. దీనికితోడు టికెట్ల వేటలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేదాక వెళ్లడంతో ఈ తలనొప్పికంటే టీజేఎస్‌కు ఇవ్వడమే ఉత్తమమనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును ఆశిస్తున్న మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్య కూడా ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో టీజేఎస్ ఖాతాలో వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
కూటమిలో ‘హుస్నాబాద్’ చిచ్చు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమిలో వివాదానికి కారణమవుతోంది. పొత్తుల్లో భాగంగా హస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. హుస్నాబాద్ సీటుపై తేల్చకుండా కేవలం మూడు స్థానాలనే కేటాయించనున్నట్లు వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌పై ఏమీ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై అసహనంతో రగిలారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఏకంగా మీడియాకెక్కారు. ఆదివారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 4న నిర్వహించే అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చాడ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఈ సందర్భంగా చాడ అభిప్రాయపడటంతో పరిస్థితి అదుపుతప్పే వరకు వచ్చినట్లుగా అవగతమవుతోంది. అత్యధిక సార్లు సీపీఐదే విజయం.. హుస్నాబాద్‌గా మారినా అందుకే పట్టు.. 1957 నుంచి 2004 వరకు మొత్తం 11 పర్యాయాలు ఎన్నికలు జరగగా, ఆరు సార్లు సీపీఐ, ఒకసారి పీడీఎఫ్ అభ్యర్థులు ఇందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మూడుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ (ఐ)లు కైవసం చేసుకున్నాయి. 1957లో పి.చొక్కారావు (పీడీఎఫ్), 1962, 1967లలో వరుసగా బొప్పరాజు లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్), 1972లో బద్దం ఎల్లారెడ్డి (సీపీఐ), 1978లో దేశిని చిన్నమల్లయ్య విజయం సాధించగా, 1983లో మళ్లీ బి.లక్ష్మీకాంతారావే గెలిచారు. 1985, 1989, 1994లలో వరుసగా సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన దేశిని చిన్న మల్లయ్య హ్యాట్రిక్ సాధించారు. 1999లో బొమ్మా వెంకటేశ్వర్ (కాంగ్రెస్), 2004లో గెలుపొందిన చాడ వెంకటరెడ్డి (సీపీఐ) ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా కూడా వ్యవహరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్, ఇందుర్తి, హుస్నాబాద్ కలిపి హుజూరాబాద్, హుస్నాబాద్లుగా మారాయి. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో హుజూరాబాద్, హుస్నాబాద్, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, కోహెడ మండలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీపీఐ అభ్యర్థి వెంకటరెడ్డి మూడు, నాలుగు స్థానాలకు చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు వొడితెల సతీష్‌కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ప్రవీణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్లో పట్టున్న ఏకైక స్థానం.. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాడ వెంకటరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతుండటంతో కూటమిలో ఇప్పుడు ‘హుస్నాబాద్’ చిచ్చు రగులుతోంది. 4న రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీ.. ‘కూటమి’లో భవిష్యత్ కార్యాచరణ కలకలం.. పొత్తుల్లో సీపీఐకి కేటాయించే స్థానాలు తేలకపోగా, మూడంటే మూడంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తోందంటూ శుక్రవారం చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొనడం కూటమిలో కలకలంగా మారింది. సంబంధం లేకుండా అబద్ధాలతో లీకేజీలు ఇస్తున్నారని మండిపడిన వెంకటరెడ్డి, ఈ విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి అజెండా ఉండాలని.. గౌరవప్రదమైన ఒప్పందం జరగాలని భావిస్తే.. కూటమిగా ఏర్పడి దాదాపు 50 రోజులు గడిచాయని, ఉమ్మడి అజెండా ఖరారైనా అడుగు ముందుకు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలతో తమ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన 4న అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం.. ఆ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. కాగా.. ఈ అత్యవసర సమావేశంలో కూటమిలో కొనసాగాలా..? వద్దా? అనే అంశంపై సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుందన్న ప్రచారం ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. -
నేడో, రేపో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో కౌంట్‌డౌన్ మొదలైంది. అభ్యర్థుల ఖరారుకు ఆ పార్టీ ముహూర్తం ఖరారు చేస్తోంది. నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసింది. టికెట్ పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లు.. టీడీపీ, టీజేఏసీ పట్టుబడుతున్న స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లైన్‌క్లియర్‌గా ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించనుంది. గురువారం సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే స్క్రీనింగ్ కమిటీ కీలకభేటీ అనంతరం ఈ జాబితాకు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడమేగాకుండా ప్రచారాన్ని కూడా ఉధృతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న సీట్లను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు దఫాలుగా అభ్యర్థుల కూర్పుపై మల్లగుల్లాలు పడ్డ భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ.. తుది జాబితాను ఏఐసీసీకి నివేదించింది. ఈ జాబితాను బుధవారం పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పరిశీలించి దాదాపుగా ఆమోదముద్ర వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, మొదటి జాబితాలో మహేశ్వరం, కల్వకుర్తి, కొడంగల్, పరిగి, షాద్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ సెగ్మెంట్ల అభ్యర్థులను రెండో జాబితాలో వెల్లడించే వీలుంది. -
వెయిటింగ్ లిస్ట్!
తొలుత నవంబరు తొలివారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ప్రకటించారు. ఆ లోపు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తుందన్నారు. దీనికి అనుగుణంగా దాస్‌తో కూడిన త్రిసభ్య బృందం నియోజకవర్గాల వారీగా ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థులతో కూడిన జాబితాను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందులో మన జిల్లాకు సంబంధించి నాలుగు స్థానాలున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవంబర్ 1న జాబితా ప్రకటిస్తామని మొదట చెప్పినా.. ఆ రోజు కూడా జాబితా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంకోవైపు ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నియోజకవర్గాలను పక్కనపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముందుగానే ప్రకటిస్తే టికెట్ రాని నేతలు ఇతర పార్టీలకు జంప్ చేస్తారని భయపడుతోంది. ఈ నేపథ్యంలో చివరి క్షణం వరకు వేచి చూడడమే బెటరని అనుకుంటోంది. టీడీపీది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ఖాతాలోకి సీట్లు వెళతాయా? టీడీపీకి ఏవీ కేటాయిస్తారో తెలియక తలపట్టుకున్నారు. మహాకూటమి, బీజేపీల వెయిటింగ్ లిస్ట్ ఆయా పార్టీల ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కసరత్తు కొలిక్కివచ్చినట్లు ప్రచారం సాగుతున్నా జాబితా ప్రకటనపై మహాకూటమి, బీజేపీలు సస్పెన్స్ కొనసాగిస్తుండడం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికార పార్టీ గెలుపు గుర్రాలను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల కూర్పును సాగదీస్తోంది. ఇప్పటివరకు తొలి జాబితాను కూడా ప్రకటించకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. మరోవైపు ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులతో మొదటి జాబితాను వెల్లడించిన బీజేపీ.. మలి జాబితా విడుదలకు సమయం తీసుకుంటోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక.. పొత్తు విచ్ఛిన్నమైతే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డవారిని అక్కున చేర్చుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో షాద్‌నగర్, కల్వకుర్తి, తాండూరు, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ఖరారు చేసిన కమల నాయకత్వం మిగతా సెగ్మెంట్ల విషయంలో మాత్రం అచితూచి అడుగేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్–టీడీపీల మధ్య శివారు నియోజకవర్గాలపై పేచీ నెలకొంది. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి సెగ్మెంట్లపై ఇరుపార్టీలు పట్టుబడుతున్నాయి. దీంతో ఒకరికి సీటు కేటాయిస్తే మరొకరు తిరుగుబాటు జెండా ఎగురవేసే వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల ఖరారుపై ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను అంతర్గతంగా విశ్లేషించుకున్న కాంగ్రెస్, టీడీపీ అధినాయకత్వాలు సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించడం లేదు. అంతేగాకుండా మిత్రపక్షమైన టీజేఎస్, సీపీఐలతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కూడా జాబితా ప్రకటన వాయిదా పడుతోంది. -
ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆకలి అయినట్టే ఉంటోంది... తినబోతే కడుపులోకి ముద్ద దిగదు.. నిద్ర పట్టదు.. కాలు ఒక చోట నిల్వదు.. సెల్లో యూట్యూబ్ చూస్తే ఊహాత్మక జాబితాలు ఎన్నెన్నో.. అందులో పేరు గల్లంతై గుండె జారి ఢిల్లీకి ఫోన్ కొడితే ‘ఫికర్ మత్కరోభాయ్’అనే సమాధానం.. ఫోన్ కొట్టిన ప్రతి వాళ్లకూ అదే జవాబు. ఈ నేపధ్యంలో మూడు, నాలుగు రోజులుగా మహా కూటమి ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. నవంబర్ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నాటి నుంచి ఒకటే టెన్షన్. అయితే.. మహాకూటమి అధినేతలు మాత్రం వ్యూహత్మకంగానే లీకులను ఇస్తూ.. జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా రెబల్స్ బెడద తప్పేటట్టు లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పాలకుర్తిలో.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి టికెట్ తనకే అనే భరోసాతో ఉన్నారు. గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు భార్య సుమన, బిళ్ల సుధీర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇటీవల బిళ్ల సుధీర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ.. రౌడీషీటర్ అర్హతగా టికెట్లు కేటాయిస్తే సీనియర్ రౌడీషీటర్నైన తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పార్టీలోనే మరో అశావహ అభ్యర్థి పేరును ప్రస్తావిస్తూ ఆయన కంటే నేనే సీనియర్ రౌడీషీటర్‌ను అంటూ ప్రకటించుకున్నారు. తాను దొమ్మీలు, దొంగతనాలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు నేను పోరాడుతుంటే నా మీద రౌడీషీట్ తెరిచారని చెప్పారు. ములుగులో ముసలం.. ములుగు నియోజకవర్గంలో దనసరి అనసూయ అలియాస్ సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య తీవ్ర పోటీ ఉంది. . టికెట్ కోసం నున్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. పొదెం వీరయ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ టికెట్ నాదే..గెలుపు నాదే అని ప్రకటిస్తున్నారు. మరో వైపు సీతక్క కూడా టికెట్, గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మహాకూటమికి భద్రాచలంలో సరైన అభ్యర్థి« లేకపోవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరినో ఒకరికిని భద్రాచలం నియోజకవర్గానికి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు కూడా ససేమిరా అన్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి పట్టు సీతక్క, వేం నరేందర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి హార్డ్‌కోర్ టీం సభ్యులుగా పేరుంది. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయనతో పాటు వాళ్లు కూడా టికెట్ కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. వేం నరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికలు అని కాకుండా మొదటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఒకరకంగా ఆయన ఇక్కడ పార్టీకి బలమైన పునాదులే వేశారు. ఈనేపథ్యంలో నరేందర్‌రెడ్డికి ఇక్కడి నుంచి టికెట్ అంత ఈజీ కాదని పార్టీ పరిశీలకులు చెబుతున్నారు. మరో వైపు మహాకూటమి పొత్తులో భాగంగా వరంగల్ పశ్చిమను త్యాగం చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ టికెట్ తన అనుచరుడు నరేందర్‌రెడ్డికి ఇవ్వకపోతే, ములుగు టికెట్ సీతక్కకు ఇచ్చి తీరాలని పట్టుపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందిరకా.. విజయరామారావుకా.. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఇందిర, మాదాసి వెంకటేష్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన దొమ్మాలటి సాంబయ్య పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరికి వారు టికెట్ తమదే అంటే తమదేనని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. విజయరామారావు, ఇందిరా మ«ధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. భక్తచరణ్దాసు కమిటీ ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయరామారావుకు గనుక ఇక్కడ టికెట్ కేటాయిస్తే ఇందిర అనుచరులు ఆమెపై రెబల్‌గా పోటీ చేయమని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘దొంతి’ గెట్టెక్కినట్టే.. నర్సంపేట టికెట్ దాదాపు కాంగ్రెస్‌కే అని సంకేతాలు అందుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా వరంగల్ జిల్లాలో ఒక్క సీటు ఇస్తే అది నర్సంపేట ఇవ్వాలని టీడీపీ పట్టుపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నర్సంపేటను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడి నుంచి దొంతికి దాదాపు టికెట్ ఖరారైనట్లే అనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ విజయ్‌కుమార్, పరికి సదానందం టికెట్ ఆశిస్తున్నారు. రేవూరి నిర్ణయమే తరువాయి... పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి కనీసం ఇక్కడి నుంచి ఒక సీటు ఇవ్వాల్సి వస్తోంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం. ఆయనేమా నర్సంపేటే కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ ఆయన్ను బుజ్జగించి పక్క నియోజకవర్గానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పరకాల, వరంగల్ పశ్చిమ ఈ రెండు చోట్ల ఎక్కడ కావాలని అడిగినా రేవూరికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వరంగల్ అర్బన్ జిల్లా రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఇదీ జాబితా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు సిద్ధమైంది. ఇన్నాళ్లు తీవ్ర ఉత్కంఠతకు గురిచేసిన టీపీపీసీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాలకు గాను 11 చోట్ల అభ్యర్థులతో జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ జాబితాను బుధ లేదా గురువారాల్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక మహాకూటమి పొత్తులో భాగంగా మత్రపక్షాలను కేటాయించేందుకు గాను మూడు సీట్లను పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అనం తరం కూటమి మిత్రపక్షాలకు ఆయా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. గెలుపు గుర్రాలే లక్ష్యంగా.. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ను మట్టి కరిపించనున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కావొద్దనే భావనతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా స్వయంగా పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ మేరకు బలం ఉందో సర్వే చేయించింది. ఈ మేరకు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో ముందు నుంచి పని చేసుకుంటున్న వారు బలంగా మారడంతో వారికే అవకాశం కల్పించాలని భావించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం పార్టీలో ఇటీవల చేరిన వారికి కూడా అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక నారాయణపేటలో కూడా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన కుంభం శివకుమార్‌రెడ్డి ఇటీవలి కాలంలోనే కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కూడా కాంగ్రెస్ టికెట్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి కోసం సర్దుబాటు రాజకీయంగా బలమైన టీఆర్ఎస్ను ఒంటరిగా కాకుండా కూటమిగా ఏర్పడి ఎలాగైనా ఢీకొట్టాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ ఈసారి టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమిగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోని మిత్రపక్షాలకు స్థానం కల్పించడం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతానికి మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాలో పేర్లు ప్రకటించడం లేదు. దీంతో ఈ మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సీపీఐ ఏ ఒక్క స్థానాన్ని కూడా కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, టీజేఎస్ పార్టీలు టికెట్ల కేటాయింపు కోసం పట్టుబడుతుండగా.. మూడు స్థానాలను పక్కన పెట్టినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌పై పీటముడి మహాకూటమిలో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలకు సంబంధించి మహబూబ్‌నగర్ నియోజకవర్గం విషయంలోనే చిక్కుముడి నెల కొంది. మహబూబ్‌నగర్ స్థానం కోసం కాంగ్రెస్ తో పాటు టీడీపీ, టీజేఎస్ గట్టిగా పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈ సీటు కోసం నలుగు రు తీవ్రంగా పోటీ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షు డు ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు టీపీసీసీ కార్యద ర్శులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, ఎన్.పీ.వెంకటేశ్, పార్టీలో ఇటీవలి కాలంలో చేరిన సయ్యద్ ఇబ్రహీం ఈ సీటును ఆశిస్తున్నారు. అలాగే మిత్రపక్షాల తరఫున టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఎర్ర శేఖర్ గతంలో జడ్చర్ల నుంచి గెలుపొందినప్పటికీ ... ప్రస్తుతం మాత్రం మహబూబ్‌నగర్ స్థానం ఆశిస్తున్నారు. మరోవైపు తెలంగాణ జన సమితి కూడా మహబూబ్‌నగర్ స్థానం కావాలని కోరుతోంది. ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క మహబూబ్‌నగర్ ఇస్తే సరిపెట్టుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు కేటాయించాలనుకుంటున్న మూడు స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది. -
తేలని పొత్తు
మహాకూటమి పొత్తు లెక్కలు ఇంకా తేలడం లేదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్‌పార్టీ పెద్దలు ఆచూతూచి అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందేమోనని హస్తం ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో కూటమి లెక్క, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి రానుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టికెట్ల ఖరారుపై జరుగుతున్న జాప్యం కాంగ్రెస్‌లో టెన్షన్ పుట్టిస్తోంది. నవంబర్ 1న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ పరిణామం ఆశావహుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసిన కొన్ని గంటల్లోనే టీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కూడా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా హడావుడి చేసిన ఆ పార్టీ.. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తీసుకురాలేకపోయింది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల మడతపేచీతో హస్తం నేతల తలకు బొప్పి కట్టింది. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్టా కొన్ని సీట్లను వదులుకునేందుకు సిద్ధమైనా.. ఆ స్థానాలేమిటో ముందుగానే లీకైతే అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ కూడా ఈ అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకునే అవకాశముందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఖరారుపై తొందరపడకూదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భాగస్వామ్య పక్షాలు కూడా బలహీనపడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధికారపార్టీ వలకు చిక్కకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఓవర్ టు ఢిల్లీ! ఒకవైపు మహాకూటమిలో సీట్ల పంపకంపై తకరారు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ రేసు గుర్రాలు హస్తిన బాట పట్టాయి. అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్‌లో ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ తొలి దశ కసరత్తు పూర్తి చేసి.. షార్ట్ లిస్ట్‌ను తయారు చేసింది. తుది జాబితాలో తమ పేరు ఉండేందుకు సర్వశక్తులొడ్డుతున్న ఆశావహులు ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. నాలుగైదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఔత్సాహికులు గురువారం నుంచి తిరుగుముఖం పట్టారు. భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్‌కు తిరిగి రావడంతో ఆగమేఘాల మీద వెనుదిరిగారు. అ భ్యర్థుల ఎంపికపై చివరిసారిగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ.. తుది జాబితాను రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినాయకత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభ్యర్థుల ఖరారుకు పచ్చజెండా ఊపుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీలో ఇంత తతంగం జరుగుతుండగా.. టీడీపీ, టీజేఎస్ పొత్తు తమ సీట్లకు ఎక్కడ ఎసరు తెస్తుందోననే గుబులు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీడీపీ కోరుతున్న శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్.. టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరి, తాండూరు నియోజకవర్గాల్లోని ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలో టికెట్ల వ్యవహారమంతా ఓ కొలిక్కి రానుంది. -
అన్వేషణ
అన్ని పార్టీల లక్ష్యం గెలుపే. పోటీలో దీటైన అభ్యర్థిని నిలిపేందుకే వ్యూహం. ఆలస్యమైనా ఆచితూచి అడుగులేస్తున్న రాజకీయ పక్షాలు. బరిలో నిలిచేందుకు పోటీపడి దరఖాస్తు చేసుకున్నా.. టికెట్ల విషయంలో సమవుజ్జీ అభ్యర్థులను నిలిపే అన్వేషణలో పడ్డాయి. ప్రధాన పార్టీల టికెట్ల పంపకాలు.. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక ప్రధాన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలు ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి తమ అభ్యర్థులను ప్రకటించింది. రెండు విడతలుగా జాబితాను ప్రకటించిన సీపీఎం, బీఎల్ఎఫ్.. ఉమ్మడి జిల్లాలో జనరల్ స్థానాలుగా ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మినహా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇల్లెందులో మాత్రం తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు మద్దతు తెలిపింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ మిడియం బాబూరావును సీపీఎం, బీఎల్ఎఫ్ తరఫున అభ్యర్థిగా ప్రకటించగా.. ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు స్థానాల నుంచి సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి పోటీ చేయడం ఖాయమే అయినా.. ఆయా నియోజకవర్గాల్లో తమకు గల పట్టును నిరూపించుకుని ప్రధాన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించే స్థాయిలో ఉండాలన్న లక్ష్యంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. అలాగే మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, సీపీఐ సైతం ఇవే స్థానాలు కావాలని పట్టుపట్టడంతో ఈ స్థానాలు ఎవరికి ఖరారవుతాయి.. ఎవరు పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠకు తెరలేపుతోంది. దీంతో పార్టీ టికెట్ ఆశించిన ఆశావహులు తమ కూటమి వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్న సీపీఎం, బీఎల్ఎఫ్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి మధిర టికెట్ ఆశించిన డాక్టర్ కోట రాంబాబుకు పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో మధిర టికెట్‌ను ఆయనకు కేటాయించారు. ఈ ప్రయోగం మధిరలో విజయవంతం కావడంతో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో కూడా ఇదే తరహాలో పలువురు నేతలు బీఎల్ఎఫ్, సీపీఎం కూటమికి చేరువయ్యే అవకాశం ఉందని కూటమి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆరు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టగా.. ఇల్లెందులో గుమ్మడి నర్సయ్యకు మద్దతుగా సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఆశావహులు అనేకం.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పలువురు ప్రచారం సైతం ప్రారంభించారు. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు అవకాశం రాకపోతే.. కోరుకున్న సీటు చేజారితే ఏమి చేయాలనే అంశంపై ఇప్పటినుంచే ఆశావహులు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇటు సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి.. మరోవైపు భారతీయ జనతా పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు జిల్లాలో కేవలం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పినపాక నుంచి బీజేపీ నేత చందా లింగయ్య కుమారుడు సంతోష్, సత్తుపల్లి నుంచి నంబూరి రామలింగేశ్వరరావు, పాలేరు నుంచి కొండపల్లి శ్రీధర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది. రాజకీయంగా అత్యంత కీలకంగా ఉన్న ఖమ్మం, కొత్తగూడెం స్థానాలకు అభ్యర్థులను బీజేపీ సైతం ప్రకటించకపోవడానికి కారణం ప్రధాన రాజకీయ పక్షాల నుంచి అభ్యర్థులు ఖరారు కాకపోవడమేనని, ఆయా పార్టీల జాబితా ఖరారైన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనరల్ స్థానాలపై ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఈసారి ఎక్కువ మంది టికెట్లు ఆశించడం.. ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని ఇస్తోంది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సైతం ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను జాబితాను ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇల్లెందు నుంచి మరోసారి పోటీ చేస్తారని ప్రకటించగా.. జనరల్ స్థానమైన పాలేరు నుంచి పార్టీ సీనియర్ నేత గుర్రం అచ్చయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. ఖమ్మం, కొత్తగూడెంలో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. రాబోయే రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయా పార్టీలు జనరల్ స్థానాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాత తమ అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలు జనరల్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మహాకూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన పూర్తయితే తప్ప జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లభించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. -
వీడని ఉత్కంఠ..!
సాక్షి, యాదాద్రి : మహాకూటమి పొత్తుల తంతు రెండు, మూడు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న సంకేతాలు జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తుల విషయంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలతో ఇప్పటికే నీరసంగా ఉన్న ఆశావహులు మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఒకవైపు పొత్తులు తేలక నిరుత్సాహం చెందుతూ.. మరోవైపు ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చేసుకోలేక.. కేడర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు ప్రకటనల మీద ప్రకటనలతో పొత్తులు, టికెట్ల కేటాయింపు ఎప్పకటిప్పుడు వాయిదాలు పడుతుండటంతో ఆశావహుల్లో ఆందోళన, ఆతృత, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పైకి గంభీరంగా కనిపిస్తున్న మహాకూటమి ఆశావహులను భయం వెంటాడుతూనే ఉంది. ప్రచారం చేస్తూ కొందరు.. పైరవీలు చేస్తూ మరికొందరు టికెట్ల వేటలో అధిష్టానంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే టికెట్ వస్తుందో రాదోనన్న భయంలో స్పష్టంగా కనిపిస్తోంది. పైకి కార్యకర్తలతో సీటు తమపార్టీకే కేటాయిస్తారని కొందరు నేతలు.. తమకే వస్తుందని మరికొందరు అభ్యర్థులు కేడర్‌తో చెబుతున్నా అంతర్గతంగా వారు ఆందోళనలోనే ఉన్నారు. హాట్ టాపిక్‌గా పొత్తుల వ్యవహారం.. మహాకూటమి పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై ఇప్పుడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా చూసినా హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు జిల్లాలోని సీట్లపై కన్నువేశాయి. భువనగిరిపై టీజేఎస్, ఆలేరుపై టీడీపీ, మునుగోడుపై సీపీఐలు పొత్తుల్లో భాగంగా సీట్లు కోరుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో ఏ సీటును ఎవరికి కేటాయిస్తుందోనన్న టెన్షన్ ఇటు ఆశావహులు, అటు ఆయా పార్టీల కేడర్‌లో నెలకొంది. పట్టువీడని కాంగ్రెస్ ? భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి తరఫున పోటీ చేసే విషయంలో పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది. అయితే మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తమకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా మహాకూటమి చర్చల్లో వెల్లడిస్తూ తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని పట్టుబడుతున్నాయి. మరోవైపు సర్వేలపై ఆధారపడ్డ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులతోపాటు మహాకూటమి అభ్యర్థులపై వరుస సర్వేలు చేయిస్తోంది. గెలిచే వారికి టికెట్ ఇస్తామని చర్చల్లో కూటమి పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆలేరు నుంచి కోదండరాం..? అయితే టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా అదే నియోజకవర్గాన్ని టీడీపీ కోరుతోంది. మరోవైపు జిల్లాలోని మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలను తమకే కేటాయించాలని సీపీఐ పట్టుపడుతోంది. భువనగిరి నియోజక వర్గాన్ని టీజేఎస్ ఆశిస్తుండగా.. ఈ నియోజకవర్గాలన్నింటిలోను కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడొకరు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆరా.. భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆపార్టీకి చెందిన ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిపై ఇప్పటికే సర్వేలు నిర్వహించడంతోపాటు రెండు రోజులుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా బూత్ కమిటీ కన్వీనర్లకు ఫోన్లు చేసి ఆశావహుల పేర్లపై వివరాలను సేకరి స్తున్నారు. పార్టీ అభ్యర్థులు విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఫోన్లో ఆయన బూత్ కమిటీ కన్వీనర్లతో మాట్లాడుతూ వారి వద్ద గల ఆశావాహుల పేర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే టీపీసీసీ నుంచి ఏఐసీసీ ముఖ్యనేతల వరకు ఉన్న తమ పలుకుబడి, పరిచయాలను ఉపయోగించి ఆశావహులు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు, మూడు రోజుల్లో టికెట్లు, సీట్ల కేటాయింపు తేలనున్న తరుణంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆశావహులైన టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల ఆశావహులు, పార్టీ నేతలు, కేడర్‌లో ఒకటే టెన్షన్ నెలకొంది. -
కాంగ్రెస్‌లో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆది నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. అదే స్థాయిలో గ్రూప్ తగాదాలు కూడా ఉన్నాయని చెబుతారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు అన్ని యత్నాలు చేస్తున్నామని చెబుతున్న ‘హస్తం’ నేతలు ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పార్టీలోని నేతల్లో ఇప్పటికే ఉన్న అంతర్యుద్ధం... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తారస్థాయికి చేరాయి. జిల్లాలో డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగుతుండడంతో పార్టీ నష్టం జరిగే అవకాశముందని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహాకూటమి పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాలనే సాకుతో డీకే. అరుణ వర్గం నేతలు టికెట్లు ఆశిస్తున్న స్థానాలను ప్రతిపాదిస్తున్నారనే అంశం తాజాగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ రెండు రోజులుగా నేతలు వాదనలు, ప్రతివాదనలతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను అట్టుడికిస్తున్నారు. ప్రధానంగా ఏఐసీసీ ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చిన క్రమంలో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. పొత్తుతో చిచ్చు టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి మహాకూటమిగా జట్టు కట్టినట్లు చెప్పుకుంటున్నాయి. ఈ మేరకు ఎన్నికల బరిలో నిలిచే విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీలకు అవకావం కల్పించాలని సమిష్టిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో కూడా స్థానాల కేటాయింపుపై పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పొత్తులో భాగంగా కేటాయించాల్సిన స్థానాల విషయంలో తఖరారు నెలకొంది. దీంతో జిల్లాలోని రెండు వర్గాలు చెరోవైపు చీలిపోయి ఎదుటి వర్గం వారికి అనుకూలంగా ఉన్న సీట్లను ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ అయిన జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతూ... డీకే.అరుణ వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. కూటమి భాగస్వామ్యంలో భాగంగా దేవరకద్ర, మక్తల్ స్థానాలను టీడీపీకి కేటాయించాలంటూ జైపాల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దీంతో గత కొంత కాలంగా ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న డీకే.అరుణ వర్గానికి చెక్ పెట్టొచ్చన్నది వారి భావనగా తెలుస్తోంది. అంతేకాదు రెండు స్థానాలను టీడీపీ నేతలైన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డికి ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో బీసీలకు అవకాశం ఇవ్వడం కోసం నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సరాఫ్ కృష్ణకు టికెట్ ఇవ్వాలంటూ జైపాల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో అరుణ మనిషిగా పార్టీలో చేరిన కుంభం శివకుమార్‌రెడ్డికి చెక్ పెట్టొచ్చని భావించినట్లు సమాచారం. అలాగే కొల్లాపూర్‌లో కూడా బీరం హర్షవర్ధన్‌రెడ్డికి... జైపాల్ వర్గం ఇబ్బందులు సృష్టిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా మొత్తం మీద.డీకే అరుణకు పట్టు ఉన్న నాలుగు నియోజకవర్గాలలో చెక్ పెట్టేందుకు జైపాల్ వర్గం యత్నిస్తోందన్న చర్చ పార్టీలో సాగుతోంది. రాజధానిలో అరుణ పార్టీలో అంతర్గతంగా జైపాల్‌రెడ్డి వేస్తున్న స్కెచ్‌ను పసిగట్టిన డీకే.అరుణ... ఆగమేఘాలపై హైదరాబాద్ వెళ్లారని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ.. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని బతికించిన వారికి కాకుండా వేరే వారికి సీట్లను ఎలా కేటాయిస్తారంటూ ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. తన వర్గం మనుషులు పనిచేసుకుంటున్న కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత పట్టుందనే అంశంపై చేసిన సర్వేల నివేదికలను పార్టీ పెద్దలకు అందజేసినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో పనిచేసుకుంటున్న వారిని కాదని వేరే వారికి అవకాశం కల్పిస్తే.. పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అరుణ స్పష్టం చేసినట్లు సమాచారం. మళ్లీ 2004 నాటి పరిస్థితులు? పాలమూరులో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల ఆదిపత్య పోరుతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ద్వితీయశ్రేణి నాయకత్వం ఆవేదన చెందుతోంది. పొత్తులో భాగంగా పార్టీకి బలమున్న స్థానాలను కేటాయిస్తే.. 2004 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2004లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కారణంగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారికి సీట్లు దక్కకుండా జైపాల్‌రెడ్డి చక్రం తిప్పినట్లు పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు కూడా మహబూబ్‌నగర్‌లో పులి వీరన్న, గద్వాలలో డీకే.అరుణ, అలంపూర్‌లో చల్లా వెంకట్రాంరెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుకు సీట్లు దక్కకుండా టీఆర్ఎస్కు కేటాయించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయా నేతలందరూ రాజశేఖర్‌రెడ్డి మద్దతుతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుపొంది అనంతరం పార్టీలో చేరారు. ప్రస్తుతం కూడా కూటమి భాగస్వామ్యంలో భాగంగా సీట్ల కేటాయింపు, తదితర కారణాల వల్ల గత చరిత్ర పునరావృతమవుతుందా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. -
‘మహా’ సస్పెన్స్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల సమరంలో మహాకూటమి సీట్ల పంపకాలు తేలడం లేదు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సీట్ల కోసం పెద్దగా పట్టుపట్టడం లేదు. సీపీఐ కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కన్నా, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లపైనే దృష్టి పెడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన సమస్య తెలంగాణ జన సమితి (టీజేఎస్)తోనే ఏర్పడినట్లు మహాకూటమి వర్గాలు చెపుతున్నాయి. బుధ, గురువారాల్లో జరిగిన కూటమి చర్చల్లో ఏయే పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు కనిపిస్తున్నా... కోరుతున్న స్థానాలపైనే ప్రధాన పేచీ నెలకొంది. సీపీఐ, టీజేఎస్ కోరుతున్న సీట్లలో కాంగ్రెస్ కూడా బలంగా ఉండడం, అక్కడ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోవడం ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏయే సీట్లు మిత్రపక్షాలకు పోతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. మూడు కోరి... రెండింటితో సరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు సీట్లలో పోటీ చేసేందుకు టీజేఎస్ ప్రతిపాదనలు ఇచ్చింది. కోదండరామ్ సొంత జిల్లా మంచిర్యాల కావడంతో తొలుత ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ జిల్లాలో చెన్నూరు స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిజమైన తెలంగాణ వాదంతోనే ఓడించాలనే పట్టుదలతో ఈసీటుపై కోదండరామ్ పట్టు పడుతున్నారని సమాచారం. కుమురం భీం జన్మస్థలమైన ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు పశ్చిమ ఆదిలాబాద్‌లోని ముధోల్ స్థానాలలో పోటీ చేయాలని యోచిస్తున్నారు. మూడింటికి కాంగ్రెస్ ఒప్పుకోకపోతే చెన్నూరు, ముథోల్ సీట్లను మాత్రం వదులుకునేది లేదని టీజేఎస్ వర్గాలు చెపుతున్నాయి. బెల్లంపల్లి సీపీఐకి..? సీపీఐకి కోరుతున్న సీట్లలో బెల్లంపల్లి ఉన్నప్పటికీ, ఆ స్థానం కన్నా మంచిర్యాల సీటు కోసం ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి. జిల్లా పార్టీ కార్యదర్శి కలవేన శంకర్ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే బుథవారం జరిగిన చర్చల్లో సీపీఐకి బెల్లంపల్లి సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌కే మరోసారి సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు కూడా చెప్పాయి. పార్టీకి కట్టుబడి ఉండాల్సిన నేపథ్యంలో బెల్లంపల్లి సీపీఐకి ఇచ్చినా అభ్యర్థిని గెలిపిస్తామని శంకర్ ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. మూడు స్థానాలపై కాంగ్రెస్ నేతల ససేమిరా.. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు ఇచ్చినా ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. టీజేఎస్, సీపీఐ కోరుతున్న మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో గ్రూప్1 అధికారిగా రాజీనామా చేసిన బోర్లకుంట వెంకటేష్ నేత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి బోడ జనార్ధన్ సైతం తనకే టికెట్టు అనే భావనతో ఉన్నారు. ఇక్కడ టీజేఎస్‌కు సీటిచ్చినా బరిలో నిలుస్తామనే భావనతో ఉన్నారు. ముథోల్‌లో రామారావు పటేల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ టికెట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాహుల్‌గాంధీ బహిరంగసభను విజయవంతం చేయడంలో వారు తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ఎన్నారై విజయ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్టు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన గతంలో టీఆర్ఎస్లో ఉండి, కాంగ్రెస్‌లో చేరా>రు. బెల్లంపల్లిలో గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పొత్తుల లెక్కల్లో ఒక్క సీటు గల్లంతైనా, పరిస్థితి వేరేగా ఉంటుందని నాయకులు బాహాటంగానే చెపుతున్నారు. -
గెలుపే లక్ష్యంగా పావులు!
ముందస్తు ఎన్నికల ప్రచారం జిల్లాలో వేడెక్కుతోంది. షెడ్యూల్ ప్రకటించినా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకా 15 రోజుల గడువుండగా.. ప్రచార హంగామా ఊపందుకుంది. జిల్లాలోని నాలుగు శాసనసభ స్థానాల పీఠాల్ని దక్కించుకోవాలనే ఉబలాటాన్ని అన్ని పార్టీలు కనబరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో అనుభవాలు, పరాభవాలు, విజయాలను బేరీజు వేసుకుంటూ ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముందస్తు సమరంలో ముందు నిలవాలనే జోరుని ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల తేదీ ఖరారవడంతో ఉన్నఫలంగా ప్రజాక్షేత్రంలో చేసినవి, చేసే అభివృద్ధి పనులను పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను నెలన్నర కిందటే ప్రకటించగా మారో స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్, మహాకూటమి పార్టీల టిక్కెట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉండగా, ఆయా పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. బీజేపీ రెండు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులు ప్రచారం ఉధృతంగా చేస్తుండటంతో జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి జోరందుకుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో జిల్లాలో నాలుగు స్థానాలలో రెం డు జనరల్, రెండు షెడ్యూల్ కులాలకు కేటా యించారు. హుజూరాబాద్, కరీంనగర్, మానకొండూరు(ఎస్సీ) నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇచ్చింది. హుజూరాబాద్ నుంచి మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మానకొండూరులో రసమ యి బాలకిషన్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ రెండు నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చొప్పదండిలో అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ ఓ వైపు తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మరోవైపు సుంకె రవిశంకర్ ప్రచారం చేసుకుంటున్నారు. హుజూ రాబాద్, కరీంనగర్, మానకొండూరులలో టీఆర్ఎస్ సభలు నిర్వహించింది. కుల సంఘాలతో పాటు అన్ని వర్గాలను కలిసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కూటమి స్థానాలు ఇంకా తేలకపోగా కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీలకు చెందిన ఆశావహులు సైతం ప్రచారంలోకి దిగా రు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్, టీజేఎస్ నుంచి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు తమకే టిక్కెటు వస్తుందంటూ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. టీజేఎస్ నుంచి నరహరి జగ్గారెడ్డి ప్రచారంలో ఉన్నారు. మానకొండూరులో కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్ విస్తృతంగా సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా ప్రజలను కలిసి ప్రచారం చేస్తున్నారు. చొప్పదండిలో కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం తీవ్రంగా ప్రయత్నం చేస్తుండగా, వారంతా కూడా ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా.. బీజేపీ నాలుగు స్థానాలకు రెండు స్థానాల్లో అభ్యర్థులను ఇటీవలే ప్రకటించింది. కరీంనగర్‌కు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ను ఖరారు చేయగా, మానకొండూరుకు గడ్డం నాగరాజును అభ్యర్థిగా ప్రకటించారు. బండి సంజయ్ కూడా కరీంనగర్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా.. సీపీఎం, బహుజన లెఫ్ట్ఫ్రంట్ల అభ్యర్థులుగా మర్రి వెంకటస్వామి (మానకొండూరు), వసీం అహ్మద్ (కరీంనగర్), కనకం వంశీ (చొప్పదండి)లను అభ్యర్థులుగా ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కూటమి మంత్రంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని వీలైనన్ని ఎక్కువ ఓట్లను పొందేలా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం అభివృద్ధే మా నినాదమనే తీరుతోపాటు నాలుగున్నరేళ్లలో చేసి చూపిన ప్రగతికి ఓటర్లు పట్టం గడుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ గెలుపే లక్ష్యం అంటూ దూసుకెళ్తున్నారు. గత ఎన్నికలకు మించి మరిన్ని ఓట్లు పొందుతామనే ధీమాను బరిలో నిలిచే అభ్యర్థులు వ్యక్తం చేస్తుండగా, కలిసికట్టుగా ఒకే జట్టుగా ప్రజల మనసును చూరగొనే కూట మికే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఒంటరి పోరుతో ప్రత్యర్థులకు దీటైన పోటీ ఇచ్చేలా పట్టున్న స్థానాల్లో గెలిచేలా పావులు కదుపుతోంది. ఇక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఏర్పడిన కూటమితో పాటే అన్నిచోట్ల స్వతంత్రులు సహా ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రాధాన్యతను చాటేలా ఓట్లను సంపాదించే పనికి సిద్ధమయ్యారు. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి జిల్లాలోని నాలుగు స్థానాల్లో రాజకీయ పార్టీల ప్రచారం మరింత హోరెత్తనుంది. -
పీటముడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టికెట్ల కేటాయింపులో నెలకొన్న ప్రతిష్టంభనకు దసరా లోపే ముగింపు పలుకుతామని కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టం చేసినా ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు టీజేఎస్, సీపీఐలు డెడ్‌లైన్ విధిస్తుండడం ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను రంగారెడ్డి జిల్లాలోనే కోరుకుంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గినందున అందులో కనీసం సగం సీట్లయినా కావాలని పట్టుబడుతోంది. మరోవైపు టీజేఎస్ కూడా జిల్లాలో రెండు స్థానాలను కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల కోసం గాంధీభవన్, ఢిల్లీలోని టెన్ జన్‌పథ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులను సముదాయించలేక తలపట్టుకుంటున్న పీసీసీ నాయకత్వానికి తాజా పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి. మహాకూటమిగా అవతరించిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు రాష్ట్రస్థాయిలో సీట్ల పంపకంపై చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ కొలిక్కి రాకపోగా.. కాంగ్రెస్ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని టీజేఎస్, సీపీఐ ప్రకటించింది. కనీసం పార్టీ ముఖ్యులు పోటీ చేసే స్థానాలు ఇవ్వడంపై పట్టువిడుపులు ప్రదర్శించడం లేదని కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఇరు పార్టీలు ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేశాయి. దీంతో అంకురదశలోనే మహాకూటమిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకోని ‘హస్తం’ నాయకత్వం మాత్రం సీట్ల కేటాయింపు ప్రక్రియను ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని గడువుగా నిర్ణయించుకుంది.సంఖ్య తేలితే.. ఆయా పార్టీల మధ్య సీట్ల సంఖ్యపై అంగీకారం కుదిరిన తర్వాతే.. ఏయే స్థానాల్లో పోటీచేస్తారనే అంశంపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా పార్టీ ఖాతాలో పడే సెగ్మెంట్లలో అభ్యర్థుల కూర్పు మొదలవనుం దని అంచనా వేస్తోంది. అయితే, మిత్రపక్షాల కోరుతున్న సీట్లను ఆశిస్తున్న ఆశావహుల్లో మాత్రం తీ వ్ర కలవరం మొదలైంది. కష్టకాలంలో పార్టీకి వె న్నంటి నిలిచిన తమకు మహాకూటమి ఆశనిపాతంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీడీపీ కోరుతున్న ఉప్పల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియో జకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. అలాగే టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరి, తాండూరు సెగ్మెంట్ల విషయాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది. దీంతో ఈ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ రేసుగుర్రాలు పొత్తుల పురోగతిని తెలుసుకునేందుకు అటు ఢిల్లీ.. ఇటు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ పెద్దలను కలిసి పొత్తులో ఇతర పార్టీలకు సీటు కేటాయిస్తే నష్టమే తప్ప లాభం లేదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. -
విపక్షంలో టెన్షన్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో పదిహేను రోజులే గడువు ఉండడంతో విపక్ష పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. నెలన్నర క్రితం అసెంబ్లీని రద్దు చేసినప్పుడే ఉమ్మడి జిల్లాలోని పది స్థానా లకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా, విపక్షాలు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా టికెట్ల కోసం పోటీలేని నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, బీఎల్ఎఫ్ పలుచోట్ల పోటీ చేసే నాయకుల పేర్లు ప్రకటించింది. అధికార పార్టీకి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న మహాకూటమి నుంచి అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. కనీసం కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు అడిగిన టీజేఎస్ తూర్పు, పడమరల్లో ఒక్కో సీటు అయినా ఇవ్వాలని కోరుతోంది. సీపీఐ రెండు సీట్లు అడిగి, ప్రస్తుతం మంచిర్యాల ఒక్క సీటైనా ఇవ్వాలని, లేదంటే పొత్తుతో సంబంధం లేకుండా పోటీ చేసి తీరుతామని అల్టిమేటం ఇచ్చింది. టీడీపీ నాయకులు అధిష్టానం పైనే భారం వేసి చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో తామే పోటీ చేయబోతున్నట్లు చెపుతున్నారు. దీంతో విపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది. రాహుల్ సభతో కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ పాల్గొన్న తొలి బహిరంగసభ భైంసాలో నాయకులు కూడా ఊహించని రీతిలో సక్సెస్ అయింది. ఈ సభను విజయవంతం చేయడంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రధాన భూమిక పోషించగా, ముథోల్, ఖానాపూర్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు తమ వంతు జనాలను తరలించారు. రాష్ట్రంలో నెలకొన్న పోటాపోటీ వాతావరణంలో సీటు దక్కించుకుంటే ఎమ్మెల్యే కావచ్చన్న ధీమా నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో రెండుచోట్ల మినహా ఎనిమిది చోట్ల పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానాల్లో మాత్రమే పోటీ లేదు. రాహుల్‌గాంధీ సభలో ఆయన దృష్టిలో పడేందుకు నాయకులు పోటీపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూప్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మద్ధతు తెలుపుతున్న నాయకులు, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి వర్గాల నుంచి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మద్దతుదారులు ఎనిమిది స్థానాల్లో పోటీ పడుతుండడం గమనార్హం. మహాకూటమి సీట్ల సర్దుబాటే ఇంకా ఓ కొలిక్కి రాని పరిస్థితుల్లో అభ్యర్థుల తొలి జాబితా కోసం నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. పోటీ లేని సీట్లనే ప్రకటించిన బీజేపీ.. బీజేపీ తొలి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కేవలం నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్, ముథోల్‌లో రమాదేవి, బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీ, బోథ్‌లో మడావి రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఇందులో పాయల్ శంకర్, రమాదేవి గత ఎన్నికల్లో పోటీ చేసినవారే. మిగతా ఆరు చోట్ల ఒకరికన్నా ఎక్కువ సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ సీట్ల ప్రకటన తరువాత ఒకటి రెండు చోట్ల టికెట్టు రాని బలమైన నేతలు బీజేపీలోకి వస్తారేమో అనే ఆశ కూడా ఆ పార్టీలో ఉంది. అయితే కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే ఒప్పుకొనేది లేదని ఇప్పటి రకు పార్టీకి సేవలు చేస్తున్న నాయకులు గొంతు విప్పుతున్నారు. మంచిర్యాలలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముల్కల్ల మల్లారెడ్డికి తొలి జాబితాలో సీటు రాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇక్కడ కొత్త నాయకుడికి టికెట్టు ఇప్పేంచేందుకు ఓ సామాజికవర్గం బలంగా పనిచేస్తోందని మల్లారెడ్డి వర్గం చెపుతోంది. ఆసిఫాబాద్‌లో జెడ్పీటీసీ రాంనాయక్ ఒక్కరే బలమైన అభ్యర్థి. ఆయనకు తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. పార్టీకి సంబంధం లేని వారికి సీటిస్తే ఒప్పుకునేది లేదని రాంనాయక్ వర్గం అల్టిమేటం ఇస్తోంది. సిర్పూర్లో కూడా డాక్టర్ శ్రీనివాస్‌కు పోటీ ప్రస్తుతానికి ఎవరూ లేకపోయినా కాంగ్రెస్‌లో సీటు రానివారు ఎవరైనా వస్తారనే ఆశతో ఆపార్టీ నాయకత్వం ఉంది. నిర్మల్, చెన్నూరు, ఖానాపూర్‌లలో టికెట్టు ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండగా, ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రెండు సీట్లపై టీజేఎస్ పట్టు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి రెండు సీట్లను టీజేఎస్ కోరుతోంది. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల కావడంతో ఇక్కడినుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, స్పష్టత లేదు. కోదండరాం పోటీ చేయకపోతే చెన్నూరు నుంచి దుర్గం నరేష్‌ను మహాకూటమి తరుపున బరిలో దింపాలని యోచిస్తున్నారు. అలాగే పశ్చిమాన ముథోల్ నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇక్కడ ముష్కం రామకృష్ణగౌడ్ టికెట్టు ఆశిస్తున్నారు. ఇటీవల ఈ రెండు చోట్ల పోరుసభ, ధూంధాం కార్యక్రమాలను నిర్వహించడం గమనార్హం. మంచిర్యాలలో పోటీ చేసి తీరుతామంటున్న సీపీఐ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రెండు సీట్లు కోరిన సీపీఐ మంచిర్యాల సీటుపై పట్టుపడుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ కోసం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ మంచిర్యాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తేలడంతో స్థానిక సీపీఐ, దాని అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అల్టిమేటం ఇచ్చారు. మహాకూటమి నుంచి సీపీఐకి మంచిర్యాల కేటాయించాలని కోరుతున్నామని, పొత్తులో సీటివ్వకపోయినా, సీపీఐ అభ్యర్థిని పోటీలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, మహాకూటమిలో సీట్ల కోసం పోటీ హోరాహోరీగా సాగుతోంది. -
పొసగని పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మహాకూటమి సీట్ల వ్యవహారంపై టీడీపీలో అయోమయం నెలకొంది. భాగస్వామ్య పక్షాల మధ్య పంపకాల లెక్క తేలకపోవడం ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. టీడీపీలో మాత్రం స్తబ్దత నెలకొంది. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడి నుంచి కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య బరిలో నిలవడం ఖాయమైంది. ఇక జిల్లాలోని మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న టీడీపీకి మహాకూటమిలోని పొత్తులు పొసగకపోవడంతో కార్యకర్తలకు ఫలానా నియోజకవర్గంలో మేమే పోటీ చేస్తామని స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ ఈ మేరకు మహాకూటమికి జిల్లా నుంచి పోటీ చేసే స్థానాల జాబితాను అందజేసింది. సత్తుపల్లితోపాటు ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించాలని, కొత్తగూడెం లేదా పినపాక నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ కూటమి సమన్వయ కమిటీకి వివరించింది. అయితే సత్తుపల్లి ఇప్పటికే మహాకూటమి తరఫున టీడీపీకి ఖరారైనట్లేనని కూటమిలోని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తాజాగా జనరల్ స్థానమైన పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పట్టుపడుతుండడంతో సత్తుపల్లిలో టీడీపీ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘పేట’ను కోరుతున్న టీడీపీ అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో తాము రెండో స్థానంలో నిలిచామని, గెలుపు అంచుల దాకా వెళ్లిన కారణంగా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతోంది. అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాటిపై టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు స్వల్ప తేడాతో ఓటమి చెందిన కారణంగా ఈసారి విజయం సాధించే అవకాశం ఉందన్న ధీమాతో అశ్వారావుపేట స్థానం కోసం బలంగా పట్టుపడుతోంది. ఇక కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీనియర్ నేతలు ప్రధానంగా దృష్టి సారించిన ఖమ్మం నియోజకవర్గంపై ఏర్పడిన పీటముడి ఇప్పటికిప్పుడు తేలేలా లేదన్నది కూటమి భాగస్వామ్య పక్షాల భావన. సంప్రదాయ ఓటుతోపాటు కాంగ్రెస్ ఖమ్మంలో అనేకసార్లు గెలుపొందడం, గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించడం వంటి కారణాలతో ఈ సీటు నుంచి తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ పట్టుపడుతోంది. ఇందుకోసం జిల్లాకు చెందిన నేతలు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు కాంగ్రెస్ టికెట్ కోసం హోరాహోరీ పోరు సలుపుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గంపై ఈసారి టీడీపీ కన్నేసింది. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. అంతకుముందు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఖమ్మంలో టీడీపీ విజయం సాధించలేదు. అయితే మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో హోరెత్తుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే కదనరంగంలోకి దిగితే.. నామా మాత్రం పోటీపై తన అంతరంగం తెలియనీయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. టీడీపీలో కీలక నేతగా ఉన్న నామాను ఖమ్మం నుంచి పోటీ చేయించేందుకు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి.. జిల్లాలో 2014 శాసనసభ ఎన్నికల తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు అదే ఏడాది సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు పలు మండలాల టీడీపీ ముఖ్య నేతలు గులాబీ గూటికి చేరారు. దీంతో జిల్లాలో టీడీపీ రాజకీయంగా ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులే కాకుండా ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు అనేక మంది దశలవారీగా టీఆర్ఎస్ గూటికి చేరడంతో జిల్లాలో టీడీపీ బలహీనపడినట్లయింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు అయ్యేదని, ఇప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండడంతో టీడీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో పార్టీనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటంటూ ద్వితీయ శ్రేణి నేతలు, గతంలో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తుతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ పినపాక నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అప్పుడు పోటీ చేసిన వారిలో మంత్రి తుమ్మలతో సహా నలుగురు అభ్యర్థులు పార్టీని వీడారు. మిగిలిన ఐదుగురు అభ్యర్థుల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, అశ్వారావుపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావుకు మాత్రమే అవకాశం ఉండే పరిస్థితి ఉండడంతో పార్టీ నేతల్లో తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన మద్దినేని బేబి స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కోనేరు సత్యనారాయణకు ఈసారి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. ఇక భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఫణీశ్వరమ్మ ఈసారి ఏపీ రాష్ట్రంలోని రంపచోడవరం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక దశలో నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారని ప్రచారం జరగ్గా.. టీడీపీకి ఖమ్మం సీటు కేటాయిస్తే ఆయనే బరిలో ఉంటారని టీడీపీ వర్గాలు తాజా ప్రచారానికి తెరలేపాయి. టీడీపీ కోరుతున్న అశ్వారావుపేట సీటును ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. గత ఎన్నికలకు.. ఇప్పటికి రాజకీయంగా చాలా వ్యత్యాసం ఉందని, టీడీపీకి ఓటు బ్యాంకు గతంలోలా బలంగా లేదని, అనేక మంది ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని, కాంగ్రెస్‌కు ఈ సీటు కేటాయిస్తేనే విజయావకాశాలు ఉంటాయని కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు అధిష్టానానికి తమదైన రీతిలో లెక్కలు చెప్పి మరీ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. -
వీడని సస్పెన్స్
శాసనసభ ఎన్నికల షెడ్యూలు వెలువడినా కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. భాగస్వామ్య పక్షాలు టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు ఇచ్చే స్థానాలు తేలక పోవడంతో కాంగ్రెస్ ప్రచార ప్రభావం రెండు, మూడు నియోజకవర్గాల్లోనే కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పక్షం టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వంలో పూర్తి స్థాయిలో మునిగి తేలుతోంది. ఇతర రాజకీయ పక్షాలు బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులను ప్రకటించిన చోట ప్రచారాన్ని ప్రారంభించాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన వెంటనే గత నెల 6న టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తొలి అంకాన్ని పూర్తి చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పటికే అందోలు, సంగారెడ్డి, నర్సాపూర్‌లో అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ప్రారంభమైంది. బీజేపీ కూడా రెండు రోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణం నుంచే బీజేపీ నేత రఘునందన్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. జిల్లాలో ప్రధానరాజకీయ పక్షం కాంగ్రెస్‌లో రెండు, మూడు నియోజకవర్గాలు మినహా ఎక్కడా ఎన్నికల ప్రచార సందడి కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూలు వెలువడినా కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సీపీఐ, టీడీపీ చెరో స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, దుబ్బాకలో కనీసం రెండు స్థానాలు ఇవ్వాలని కోదండరాం నేతృత్వంలోని టీజెఎస్ పట్టుబడుతోంది. ఆ మూడు స్థానాల్లోనే స్పష్టత ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత కనిపిస్తోంది. అందోలు (ఎస్సీ) రిజర్వుడు స్థానం నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ (ఎస్సీ) స్థానం నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దామోదర, సునీత లక్ష్మారెడ్డి మాత్రమే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించగా, గీతారెడ్డి చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా, ఆయన భార్య నిర్మల పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు సంగారెడ్డిని తమకు కేటాయించాల్సిందిగా టీజేఎస్ పట్టుబడుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర భార్య పద్మినికి కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం లేక బీజేపీలో చేరి, గంటల వ్యవధిలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మిని టికెట్ కోసం దామోదర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గజ్వేల్ నుంచి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. చివరి నిమిషంలో విప్లవ గాయకుడు గద్దర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తెరమీదకు వస్తారనే భయం పార్టీ శ్రేణులను పీడిస్తోంది. మిగతా స్థానాల్లో అస్పష్టం దుబ్బాక, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట, పటాన్చెరు నియోజకవర్గాల్లో టికెట్ కోసం కాంగ్రెస్ నేతల బహుముఖ పోటీ నెలకొంది. దీంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న నేతలు పార్టీ తరపున కాకుండా, తమ వ్యక్తిగత పరిచయాలను ఆధారంగా చేసుకుని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నామినేషన్ల నాటికి అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హుస్నాబాద్ స్థానం కోసం సీపీఐ పట్టుబడుతుండడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రచారం పూర్తి స్థాయిలో సాగడం లేదు. పటాన్చెరులో సుమారు డజను మంది నేతలు టికెట్ ఆశిస్తుండడం, టీడీపీ కూడా ఈ స్థానం కోసం పట్టుబడుతుండడంతో ఇప్పట్లో కాంగ్రెస్ ప్రచారం పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అభ్యర్థులపై స్పష్టత ఉన్న చోట ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సోనియా సభ అనుమానమే? ఈ నెల 27న సోనియా లేదా రాహుల్ సభను ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేయాలంటూ కొందరు నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. పటాన్చెరు లేదా సంగారెడ్డిలో సభను ఏర్పాటు చేయాలని భావించినా, సమయాభావంతో వీలు కాదని టీపీసీసీ నేతలు తేల్చినట్లు సమాచారం. సభ నిర్వహణకు ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూలు వెలువడి పక్షం రోజులు గడిచినా పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఎన్నికల ప్రచారం ఆనవాళ్లు కనిపించక పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం, అందోళన కనిపిస్తోంది.