సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టికెట్ల కేటాయింపులో నెలకొన్న ప్రతిష్టంభనకు దసరా లోపే ముగింపు పలుకుతామని కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టం చేసినా ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు టీజేఎస్, సీపీఐలు డెడ్‌లైన్ విధిస్తుండడం ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను రంగారెడ్డి జిల్లాలోనే కోరుకుంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గినందున అందులో కనీసం సగం సీట్లయినా కావాలని పట్టుబడుతోంది. మరోవైపు టీజేఎస్ కూడా జిల్లాలో రెండు స్థానాలను కేటాయించాలని ప్రతిపాదిస్తోంది.
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల కోసం గాంధీభవన్, ఢిల్లీలోని టెన్ జన్‌పథ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులను సముదాయించలేక తలపట్టుకుంటున్న పీసీసీ నాయకత్వానికి తాజా పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి. మహాకూటమిగా అవతరించిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు రాష్ట్రస్థాయిలో సీట్ల పంపకంపై చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ కొలిక్కి రాకపోగా.. కాంగ్రెస్ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని టీజేఎస్, సీపీఐ ప్రకటించింది. కనీసం పార్టీ ముఖ్యులు పోటీ చేసే స్థానాలు ఇవ్వడంపై పట్టువిడుపులు ప్రదర్శించడం లేదని కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఇరు పార్టీలు ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేశాయి.
దీంతో అంకురదశలోనే మహాకూటమిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకోని ‘హస్తం’ నాయకత్వం మాత్రం సీట్ల కేటాయింపు ప్రక్రియను ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని గడువుగా నిర్ణయించుకుంది.సంఖ్య తేలితే.. ఆయా పార్టీల మధ్య సీట్ల సంఖ్యపై అంగీకారం కుదిరిన తర్వాతే.. ఏయే స్థానాల్లో పోటీచేస్తారనే అంశంపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా పార్టీ ఖాతాలో పడే సెగ్మెంట్లలో అభ్యర్థుల కూర్పు మొదలవనుం దని అంచనా వేస్తోంది. అయితే, మిత్రపక్షాల కోరుతున్న సీట్లను ఆశిస్తున్న ఆశావహుల్లో మాత్రం తీ వ్ర కలవరం మొదలైంది.
కష్టకాలంలో పార్టీకి వె న్నంటి నిలిచిన తమకు మహాకూటమి ఆశనిపాతంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీడీపీ కోరుతున్న ఉప్పల్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియో జకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. అలాగే టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరి, తాండూరు సెగ్మెంట్ల విషయాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది. దీంతో ఈ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ రేసుగుర్రాలు పొత్తుల పురోగతిని తెలుసుకునేందుకు అటు ఢిల్లీ.. ఇటు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ పెద్దలను కలిసి పొత్తులో ఇతర పార్టీలకు సీటు కేటాయిస్తే నష్టమే తప్ప లాభం లేదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment