సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ మినహా పోటీ చేసే అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిత్ర పక్షమైన టీడీపీ కూడా సీట్ల సర్దుబాటులో దక్కిన స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసి బీ–ఫారాలు సైతం అందజేసింది. టీజేఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ప్రకటించి భీ–ఫారం ఇవ్వగా, అంబర్‌పేట స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లు వేసేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరోపక్క ప్రజాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని ఆశావహుల్లో కొందరు ఇప్పటికే నామినేషన్లు వేయగా.. మరికొందరు సోమవారం నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇంకొందరు తమకు అన్యాయం చేశా రని ఏకంగా అగ్ర నాయకులపై ధ్వజమెత్తి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరికొందరు స్థానికంగా పార్టీ ఫ్లెక్సీలు తొలగించి జెండా దిమ్మెలను ధ్వంసం చేసి పార్టీపై తమ ఆవేశాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు తమకు మొండిచేయి చూపడాన్ని తట్టుకోలేక ఇతర పార్టీల తీర్థం పుచ్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
కొనసాగుతున్న బుజ్జగింపులు
కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి వాదులతో చర్చించి దారికి తెచ్చేందుకు ఏఐసీసీ పాండిచేరి సీఎం నారాయణస్వామి, మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి శివకుమార్ సభ్యులుగా సంప్రదింపుల కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో అసంతృప్తుల నేతలతో కమిటీ భేటీ అయింది. రెబల్‌గా బరిలోకి దిగిన వారితో కమిటీ సమాలోచనలు చేస్తోంది. పీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల, వీహెచ్ తదితరులు కలిసి అసంతృప్తి వాదులను హోటల్‌కు రప్పించి సంప్రదింపుల కమిటీతో సమవేశ పరుస్తున్నారు. మహాకూటమి గెలుపునకు పనిచేయాలని.. భవిష్యత్‌లో సరైన న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. రెబల్‌గా పోటీకి దిగితే మహాకూటమి లక్ష్యం నెరవేరదని వారికి నచ్చజెబుతున్నారు.
ఉత్తమ్ ఇంటికి ఆశావహుల క్యూ..
అభ్యర్థుల చివరి జాబితా రానున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం ఆశావహుల తాకిడి పెరిగింది. కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారితో పాటు ఆశిస్తున్న నేతలూ ఉత్తమ్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బండ్ల గణేష్, ఉత్తమ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, ఉత్తమ్ అందుబాటులో లేకపోవడంతో కొందరు నేతలు నిరీక్షించగా.. మరికొందరు అక్కడి నుంచి వెనుదిరిగారు.
తిరుగుబాటు బావుటా
పార్టీకి చెందిన పలువురు ఆశాహులు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన భిక్షపతి యాదవ్ పార్టీపై తిరుగుబాటు చేసి నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మొవ్వ సత్యనారాయణ సైతం నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ నుంచి టికెట్ ఆశించిన కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్ సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థిగా పొరుగు నియోజకవర్గానికి చెందిన సామ రంగారెడ్డిని పోటీకి దింపడం స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటికే మల్లేశ్ తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ బీఎల్‌ఎఫ్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment