rebals
-
నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న కాంగ్రెస్ రెబల్ రాంరెడ్డి
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి తుది వరకు ఆధిష్టానంతో దండెం కుస్తీ పట్టారు. టికెట్ తనకే దక్కుతుందని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. దీంతో ఆయన గాంధీభవన్‌లో తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అధిష్టానం బుజ్జగింపులకు లొంగని ఆయన కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి రెబల్‌గా దండెం పోటీలో ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన తన నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు. ‘దండెం’ దారెటో..? నామినేషన్ ఉపసంహరించుకున్న ఆయన కారెక్కుతారనే వార్తలు నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కొడుతన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని.. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా ఆయన బీఆర్ఎస్తో జతకట్టేందుకు సిద్దమవుతున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై పూర్తి క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా తెచ్చిన కష్టం: యడ్డీ కుర్చీకి ఎసరు!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. తక్షణమే సీఎంను మార్చి ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి పాలనా పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప తీవ్రంగా విఫలమయ్యారని, వయసు మీదపడటంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. (ప్రధాని మోదీపై అమిత్ షా ప్రశంసలు) కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కేంద్ర అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి.. ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇప్పడు బీజేపీ సర్కార్‌లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ పరిణామం సొంత పార్టీలోని నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటని తమ అసంతృప్తికి వెల్లగక్కుతున్నారు. ఇక ఈ క్రమంలోనే యడియూరప్పను ముఖ్యమంత్రి పదవిలో నుంచి తొలగించి ఆ స్థానంలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎవరికి వారే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ జాబితాలో సీనియర్ నేతైన బసన్నగౌడ పాటిల్ ముందుండగా.. ఆయనకు పోటీగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దూసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తానేమీ తక్కువ కాదంటూ సీనియర్ నేత ఉమేష్ కట్టి కూడా రేసులోకి వచ్చారు. గురువారం రాత్రి 16 మంది తన అనుచర ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ పరిణామాలన్నీ కన్నడలో హాట్ టాపిక్‌గా మారాయి. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం యడియూరప్ప కూడా అప్రమత్తం అయ్యారు. మంత్రి రాములుతో తాజా పరిణామాలతో చర్చించారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంలో కొత్త నేతను చూడొచ్చని సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యడియూరప్పను కాదని మరొకరికి అవకాశం ఇస్తే మరోసారి సర్కార్ కూలిపోక తప్పదనే భయం బీజేపీ నేతలను వెంటాడుతోంది. మరికొన్నాళ్ల పాటు యడ్డీనే సీఎంగా కొనసాగిస్తే మేలనే అభిప్రాయం కాషాయ నాయకత్వంలో వినిపిస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
అధికార పార్టీలో అసంతృప్తి సెగలు!
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నం.43 విద్యానగర్‌లో టీఆర్ఎస్ నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. దాదాపు అన్నివార్డుల్లోనూ ఇదే పరిస్థితి. వార్డు నం.41 టీచర్స్ కాలనీలో బీజేపీ నుంచి పది నామినేషన్లు దాఖలయ్యాయి. పలు వార్డుల్లో ఈ పార్టీది ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి కొన్ని వార్డుల్లో ఇలాగే ఉంది. సాక్షి, ఆదిలాబాద్: నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది. పార్టీల్లో అసంతృప్తి సెగలు ఇప్పటికే మొదలయ్యాయి. వార్డుల నుంచి ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఆయా పార్టీల నుంచి పలువురు నామినేషన్లు వేయడంతో ఇప్పుడు పార్టీలకు ఎవరినైన ఒకరిని ఎంపిక చేయాల్సిన పరిస్థితిలో బీ–ఫామ్ ఎవరికిస్తుందోననేది ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ నుంచి సూచనప్రాయంగా ఒక అభ్యర్థికి బీ–ఫామ్ ఇస్తామనే సంకేతాలు ఉండడం, మిగతా వారు అటు పార్టీ పరంగా ఇటు స్వతంత్రంగా నామినేషన్ వేసి రంగంలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇది పార్టీలకు తలనొప్పిగా మారింది. వారిని పిలిచి బుజ్జగించడం, వారు దిగొస్తే సరే.. లేనిపక్షంలో పార్టీ నుంచి వేటు వేస్తామని హెచ్చరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు సంబంధించి 400లకుపైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. నామినేషన్ల చివరి రోజు శుక్రవారం రాత్రి వరకు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అధికారికంగా ఈ సమాచారం రావాల్సి ఉంది. అనేక వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు పడడం ఆసక్తి కలిగిస్తుంది. ఈనెల 14న ఉపసంహరణ గడువు ఉండగా, ఎంతమంది ఉపసంహరించుకుంటారనేది వేచి చూడాల్సిందే. పార్టీలకు రెబల్స్ బెడద తప్పేటట్టు లేదు. తమకు పార్టీ పరంగా బీ–ఫామ్ వచ్చే పరిస్థితి లేదని తెలిసి పలువురు పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థిగా కూడా మరో నామినేషన్ వేసి ఉండడంతో వారు రంగంలో ఉండేందుకే సంసిద్ధులై ఉన్నారని స్పష్టమవుతోంది. ఇది ఆయా వార్డుల్లో పార్టీలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ మున్సిపల్ తాజామాజీ చైర్పర్సన్ రంగినేని మనీశ వార్డు నం.48లో టీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు నామినేషన్లు వేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారమే పార్టీ పరంగా నామినేషన్ వేసిన మనీశ శుక్రవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమెకు పార్టీ పరంగా బీ–ఫామ్ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పార్టీ నుంచి నామినేషన్ వేసిన శైలేందర్ అనే వ్యక్తికి బీ–ఫామ్ ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు చర్చ సాగుతుంది. ఈ పరిణామం పార్టీలో ఎలాంటి సంఘటనలకు దారి తీస్తుందోననేది ఆసక్తి కలిగిస్తుంది. ఒకవేళ మనీశకు పార్టీ పరంగా బీ–ఫామ్ లభించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం ముందు నుంచి సాగింది. అయితే పాయల శంకర్‌కు తన వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఆయన మరేదైన జనరల్ వార్డు నుంచి బరిలోకి దిగుతారని అనుకున్నా పోటీలో దిగలేదు. అలాగే సుహాసిని రెడ్డికి ఆమె వార్డు నుంచి రిజర్వేషన్ అనుకూలంగా నామినేషన్ వేయలేదు. ప్రధానంగా పార్టీ పరంగా తనను చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తే వార్డు నుంచి బరిలోకి దిగాలని ఆమె ఆలోచనలో ఉండగా, పార్టీ ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతోనే ఆమె మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి 34వ వార్డులో పోటీ చేస్తున్న జోగు ప్రేమేందర్‌కు పోటీగా బీజేపీ, ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు పడినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియరాలేదు. -
గులాబీ పార్టీలో రె‘బెల్స్’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి రెబెల్స్ గుబులు పట్టుకుంది. కలిసొచ్చిన రిజర్వేషన్లు.. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి చెందిన నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఈ సారి కచ్చితంగా పోటీలో నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే 24 జెడ్పీటీసీ స్థానాలకు 93 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 904 మంది టీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అభ్యర్థులందరూ కచ్చితంగా బీ ఫారం తమకే వస్తుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ బీ ఫాం రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత కారెక్కాలనే యోచనతో ఉన్నారు. దీంతో బీ ఫారాలు రాని వారిని బుజ్జగించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు అష్టకష్టాలు పడుతున్నారు. రానున్న రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నారు. అయినా పలు చోట్ల రెబెల్స్ కచ్చితంగా తాము బరిలో ఉంటామనీ.. గెలిచి టీఆర్ఎస్లోనే చేరుతామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాదేశిక పోరు రసవత్తరంగా మారింది. బీ ఫారాలు ఎవరికి వస్తాయి..? ఎవరికి మొండిచెయ్యి లభిస్తుందో అనే చర్చ మండలాలు, గ్రామాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ నెల 28 వరకూ ఈ ఉత్కంఠ ఇలానే ఉండనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాల నుంచి నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 28న తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన నేపథ్యంలో ఆ లోపే రెబెల్స్‌ను సముదాయించే పనిలో అధికార పార్టీ నేతలు పడ్డారు. అయితే.. రెండో, మూడో విడత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఇప్పట్నుంచే ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పలు చోట్ల రెబెల్స్ ముప్పు పొంచి ఉంది. దీంతో గెలిచిన తర్వాత కారెక్కని వారిని గుర్తించి వారికే బీ ఫారాలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ జెడ్పీటీసీ స్థానానికి పార్టీ మండలాధ్యక్షుడు మాచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బాలవర్ధన్‌రెడ్డి, మహిళా బ్యాంకు ఉద్యోగి భూదేవి వంటి ముఖ్యులు బరిలో ఉన్నారు. రాజాపూర్ స్థానానికి సీనియర్ కార్యకర్త మోహన్‌నాయక్‌తో పాటు మరో ఐదుగురు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి బీ ఫాం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలు శ్యామల మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే వీరిద్దరూ అత్తా కోడలు కావడం.. ఇరువురిలో ఎవరూ వెనకడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వీరిలో భువనేశ్వరి జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో పక్క సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యురాలు శ్యామలకు స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయి. అయితే బీ–ఫారం తమకే వస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, ఏకభిప్రాయంతో ఒక్కరే పోటీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధరూర్ ఎంపీపీ అభ్యర్థికి క్లిష్ట పరిస్థితి... ధరూర్ మండలంలో అధికార టీఆర్ఎస్ ఎంపీపీ అభ్యర్థికి క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న నజ్మాభేగం.. ధరూర్‌లో పోటీ చేయడానికి అయిష్టత చూపారు. గెలుపునకు సులువుగా ఉంటుందని పారుచర్ల ఎంపీటీసీ స్థానాన్ని ఎంపిక చేసుకుని అక్కడ నామినేషన్ వేశారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యతిరేకత మొదలైంది. పార్టీలో బలమైన క్యాడర్‌ను కాదని... ఇతర గ్రామాల నాయకులను పిలిపించి ఇక్కడ నుంచి ఎలా పోటీ చేయిస్తారని టీఆర్ఎస్ గ్రామ నాయకులు బహిరంగంగానే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో టీఆర్ఎస్లోనే పోటాపోటీగా నలుగురు నామినేషన్లు వేశారు. వారికి సర్ది చెప్పి నామినేషన్‌ను ఉపసంహరించే దానిపై ఎమ్మెల్యేతో పాటు, ముఖ్య నాయకులు మంతనాలు చేస్తున్నారు. మరోపక్క.. గట్టు మండలంలోని బల్గెర, గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీ స్థానాలకు పోటాపొటిగా టీఆర్ఎస్ నాయకులు నామినేషన్లు వేశారు. ఇక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గట్టు సోదరుల వర్గాలకు విడిపోయిన నాయకులు ప్రాదేశిక పోరులో పోటీపడుతున్నారు. ఎవరికి వారు బీ–పారం తమకే దక్కుతుందని భావిస్తున్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. రేవల్లి స్థానం నుంచి ఐదుగురు బరిలో ఉన్నారు. వీరిలో బీ ఫాం ఎవరికి వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. నారాయణపేట జిల్లా కోస్గి జెడ్పీటీసీ స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి. రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ప్రకాశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ప్రకాశ్‌రెడ్డికే బీ ఫాం వచ్చే అవకాశాలున్నాయి. మల్లారెడ్డితో ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిన టీఆర్ఎస్ నేతలు నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. దీంతో మల్లారెడ్డి నామినేషన్ ఉపసంహరణకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. -
పరిషత్ ఎన్నికల్లో రెబల్స్ గుబులు
మండల, జిల్లా పరిషత్ పోరు వేడెక్కెంది. మొదటి విడత నామినేషన్ల పక్రియ పూర్తికాగా, గురువారం అధికారులు వచ్చిన నామినేషన్లను పరిశీలించారు. కాగా పోటీలో రెబల్స్ దడ పుట్టిస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తొలివిడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల పర్వంలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎవరు బరిలో ఉంటారో.. ఎవరు తప్పుకొంటారో వేచి చూడాలి. సాక్షి, మెదక్ : ప్రాదేశిక ఎన్నికల్లో ప్రాధాన పార్టీలను రెబల్స్ బెడద వెంటాడుతోంది. వరుస విజయాలతో అధికార టీఆర్ఎస్లో ఉత్సాహం తొణికిసలాడుతుండగా.. ఆ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున అత్యల్పంగా ఇద్దరు.. అత్యధికంగా నలుగురు పోటీపడుతున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి సైతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదేక్రమంలో వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌లో సైతం ‘స్థానిక’ ఊపు నెలకొంది. అల్లాదుర్గం నుంచి జెడ్పీటీసీ స్థానానికి ఆ పార్టీ తరఫున అత్యధికంగా ఐదుగురు బరిలో ఉండడం విశేషం. మరోవైపు బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఆశావహులు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు జెడ్పీటీసీ స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మిగతా మూడు మండలాల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం. నేతలు రంగంలోకి.. మొదటి విడత ఆరు మండలాల్లో (హవేలిఘణపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్) 65 ఎంపీటీసీ, 6 జెడ్పీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు జరగనున్నాయి. 65 ఎంపీటీసీ స్థానాలకు 433.. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లుదాఖలయ్యాయి. ఇంత భారీగా నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన ప్రధాన నేతలు రంగంలోకి దిగారు. నేరుగా ఇప్పటివరకు ఎవరినీ సంప్రదించనప్పటికీ.. ఆయా స్థాయిల్లో బుజ్జగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. పలు చోట్ల కొందరు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అంటూ మొండికేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఎలాంటి బుజ్జగింపులు లేవు. స్థానికంగా బేరసారాలు నడిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 28న తేలుతుంది.. బీఫాంలు లేకున్నా నామినేషన్లు వేసిన ఆశావహుల భవితవ్యం ఈ నెల 28న తేలనుంది. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్‌పత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ లోపు అభ్యర్థులు పార్టీ బీ ఫాం సమర్పించాల్సి ఉంటుంది. అది సమర్పిస్తేనే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. -
బాబు బుజ్జగింపుల పర్వం
చిత్తూరు కలెక్టరేట్: అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. అయితే వారు ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగియనుంది. జిల్లాలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. అలా నామినేషన్లను దాఖలు చేసిన వారు బరిలోకి దిగితే ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అలాంటి వారిని గుర్తించి బరిలో నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని మదనపల్లె, కుప్పం, పలమనేరు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు చీలి పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు నష్టం కలిగే అవకాశముంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు బుజ్జగింపులు, ఆఫర్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పలమనేరు నుంచి టీడీపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన సుభాష్‌చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథరెడ్డి పలుమార్లు మంతనాలు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ బోస్ వెనక్కి తగ్గకుండా బరిలోనే ఉంటానని తేల్చి చెప్పినట్లు సమాచారం. జిల్లాలో ఇలా.. జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుడు శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను ఎన్నికల బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన స్వాతి బరిలో నుంచి తప్పుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. కుప్పం నియోజకవర్గంలో సతీష్ అనే స్వతంత్ర అభ్యర్థిని వీసీకే పార్టీకి చెందిన గణేశ్‌లను పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ నేత మనోహర్ ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. టీడీపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులకు అభ్యర్థులు ఒప్పుకోవడం లేదని, బరిలోనే ఉంటామని చెబుతున్నట్లు సమాచారం. -
కౌంట్‌డౌన్ !
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. శుక్రవారం నాటి పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలనూ ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారు... ఏ పార్టీని ఆదరిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. నాలుగేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేపట్టిన టీఆర్ఎస్ అభ్యర్థులు మళ్లీ తమను గెలిపిస్తే రాష్ట్రంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులు పూర్తవుతాయంటూ ప్రజలను ఆకర్శించే ప్రయత్నం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేరలేదంటూ ప్రజాకూటమీ ప్రజల ముందుకు వెళ్లింది. దీనికితోడు ఇరు పార్టీలు ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచాయి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓటర్లు ఎవరికి జై కొడతారూ..? ఏ పార్టీకి పట్టం కడుతారనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు నెలలుగా జరిగిన ప్రచారపోరులో ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. సాక్షి, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు, స్థానిక తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ తాజా మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మధ్య పోటీ ఉంది. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడీ నర్సింగరావు మద్య పోటీ ఉంది. వేములవాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. చొప్పదండి నియోజకవర్గంలో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. అక్కడి తాజామాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థిని బొడిగె శోభ, టీఆర్ఎస్ అభ్యర్ధి సుంకె రవిశంకర్, కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జగిత్యాల జైత్రయాత్ర ఎవరిదో..? 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏకైక ప్రతిపక్షస్థానంగా నిలిచిన జగిత్యాల అసెంబ్లీ సీటును ఈసారి ఎలాగైన కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన.. నిరుత్సాహపడకుండా గడిచిన నాలుగేళ్లలో ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గెలుపొందేలా ప్రజలకు దగ్గరయ్యారు. ఈక్రమంలో మహాకూటమీ పొత్తులు.. సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లాలో పోటీకి దూరమైన టీడీపీ పార్టీ జీవన్‌రెడ్డికి మద్దతు ప్రకటించింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం జీవన్‌రెడ్డిని మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీంతో జగిత్యాల గెలుపుపై రాష్ట్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. హోరెత్తించారు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గత నెల 26న.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అక్టోబర్ 24న మేడిపల్లి, ఈనెల 4న కోరుట్లలో జరిగిన ఆశీర్వాద సభల్లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వీరితోపాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో అనేకమార్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 31న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మెట్పల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రజాగాయకుడు గద్దర్, అంతర్జాతీయకవి ఇమ్రాన్ ప్రతాప్గడీ ప్రచారం నిర్వహించారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ప్రధాన పార్టీల అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం ... పల్లెపల్లెన అభ్యర్థుల ప్రచారానికి స్పందన కనిపించింది. కాగా 28 ఏళ్ల తర్వాత బీజేపీ జగిత్యాల నుంచి పోటీకి దిగింది. ముదుగంటి రవీందర్‌రెడ్డిని బరిలో దింపింది. టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించింది. -
టీఆర్ఎస్ లో కొనసాగుతున్న సస్పెన్షన్లు
సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల సమయంలో రామగుండం టీఆర్ఎస్లో వేటు పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను వరుసగా సస్పెండ్ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అధినేత కేసీఆర్ గోదావరిఖని పర్యటనకు కొన్ని గంటల ముందు పార్టీ ఈ సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న సస్పెన్షన్లు పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రామగుండం టీఆర్ఎస్లో అసమ్మతి వ్యవహారం మరోసారి వెలుగు చూస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ సహా 26 మందిని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం సస్పెండ్ చేశారు. ఇదే కారణంతో టీబీజీకేఎస్ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, జలపతి, అల్లి శంకర్లను సస్పెండ్ చేస్తున్నట్లు టీబీజీకేఎస్ నేత టి.వెంకట్రావు బుధవారం ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖనికి రానున్న కొద్దిగంటల ముందు సస్పెన్షన్ల వ్యవహారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతికి పెట్టింది పేరు. సంవత్సరాలుగా అసమ్మతి కార్యకలాపాలు చోటుచేసుకుంటుండడం, ప్రతిపక్ష పార్టీలకన్నా... సొంత పార్టీ నాయకులే విమర్శించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ వర్గపోరు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. మాజీ మేయర్ వర్గానికి ఎంపీ బాల్క సుమన్ మద్దతుందనే ప్రచారమూ జరిగింది. నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అసమ్మతి ప్రత్యక్షపోరుకు కారణమైంది. టీఆర్ఎస్ నుంచే రెండు వర్గాలు పోటీపడగా, ఎమ్మెల్యే వర్గం పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే అప్పటి మేయర్ లక్ష్మీనారాయణపై సోమారపు వర్గం అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపేయించింది. అవిశ్వాసం సమయంలో పార్టీ అధిష్టానాన్ని సైతం తనతో వచ్చేట్లు చేయడంలో సోమారపు సఫలమయ్యారు. అవిశ్వాసాన్ని నిలిపివేయాలన్న అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఏకంగా ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అధిష్టానం అంగీకరించడంతో లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి తనపంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఉద్యమనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోరుకంటి చందర్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఈ సారికూడా సిట్టింగ్‌లకే టికెట్ దక్కడంతో చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అసమ్మతి నేత పెద్దంపేట శంకర్ బీఎస్పీ నుంచి రంగంలో ఉన్నారు. రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రెబల్‌గా పోటీకి సిద్ధపడ్డా.. చివరకు కోరుకంటి చందర్‌కు మద్దతుగా పోటీనుంచి తప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌లు పోటీపడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా రెండుగా విడిపోయారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా, రెబల్ అభ్యర్థికి మద్దతునిస్తున్న నాయకులపై పార్టీపరంగా చర్యలు ప్రారంభించారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణలతో పాటు 26 మంది నాయకులను సోమారపు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం టీబీజీకేఎస్ నాయకులు ముగ్గురిపై కూడా వేటువేశారు. పార్టీ అభ్యర్థినైన తనకుకాకుండా.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతుగా ఉన్న నాయకులపై పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంవత్సరాలుగా తారాస్థాయిలో ఉన్న అసమ్మతి, కీలక ఎన్నికల వేళ సస్పెన్షన్లకు కారణమవుతుండడంతో, మరోసారి అసమ్మతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నియోజకవర్గ చరిత్ర కోసం మరిన్ని వార్తలు... -
'రెబల్స్' గుబులు...
సాక్షి, ఆదిలాబాద్ : అనుకున్నంతా అయిందని ఆయా పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ పైనే ప్రతీకారం తీర్చుకునేందుకు రెబల్స్‌గా బరిలోకి దిగారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకుంటారని భావించిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పార్టీ టికెట్టు ఇవ్వకపోయినా... బీ–ఫారాలతో సిద్ధంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని మరీ పోటీ చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్న రెబల్స్ చాలా చోట్ల విజయావకాశాలను దెబ్బతీసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పోటీ రసవ్తరంగా మారింది. చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి వినోద్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి సీటు ఆశిం చి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ చివరికి బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించారు. పార్టీ కాదనడంతో కాంగ్రెస్ లేదా మహాకూటమిలోని పార్టీల తరుపున బెల్లంపల్లి సీటు కోసం విఫలయత్నం చేశారు. బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించడంతో మాజీ ఎమ్మె ల్యే గుండ మల్లేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వినోద్ బహుజన సమాజ్ పార్టీ నుం చి అవకాశం రావడంతో ఆ పార్టీ గుర్తుపై పోటీ పడుతున్నారు. తన సోదరుడు, టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జి.వివేక్‌తో కూడా విభేదించి పోటీలో కొనసాగుతున్నారు. వినోద్‌కు టీఆర్ఎస్కు చెందిన బెల్లంపల్లి మున్సిపాలిటీలోని మెజారిటీ పాలకవర్గం మద్దతు తెలుపగా, నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకుల నుంచి మండలాల వారీగా మద్దతు లభిస్తోంది. వినోద్ బీఎస్పీ నుంచి గట్టిపోటీ ఇస్తున్నట్లు తేటతెల్లమైంది. దీంతో టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, గుండ మల్లేష్ కూడా వినోద్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కొయ్యల ఏమాజీ కూడా బరిలో దిగడంతో చతుర్ముఖ పోటీ పరిస్థితి నెలకొంది. వినోద్‌కు లభిస్తున్న ఆదరణతో మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముథోల్‌లో పటేళ్ల పోరు ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు వరుసకు సోదరుడైన రామారావు పటేల్ పోటీపడ్డారు. రామారావు పటేల్ టికెట్టు తెచ్చుకోవడంతో నారాయణరావు పటేల్ రెబల్ అవతారం ఎత్తారు. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బీ–ఫారం తెచ్చి పోటీలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్, బీజేపీ అభ్యర్థి రమాదేవిలకు ధీటుగా నారాయణరావు పటేల్ పోటీ పడుతున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణరావు పటేల్‌కు గ్రామాల్లో ఉన్న సంబంధాలను చూసి మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రామారావు పటేల్‌పై కోపంతోనే పోటీలో నిల్చిన నారాయణరావు పటేల్ ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారోనని అభ్యర్థులు భయపడుతున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు... ఇప్పుడు రెబల్స్‌గా.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ (బోథ్), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్) ఇప్పుడు రెబల్స్‌గా బరిలో నిలిచారు. బోథ్ టికెట్టు సోయం బాపూరావుకు రాగా, ఖానాపూర్ సీటును రమేష్ రాథోడ్ దక్కించుకున్నారు. బోథ్‌లో ఆదివాసీ ఓట్లపై నమ్మకంతో కాంగ్రెస్ సోయం బాపూరావుకు టికెట్టు ఇవ్వగా, ఇక్కడి లంబాడాలతో పాటు గిరిజనేతర ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో అనిల్ జాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ ప్రజల్లో సానుభూతి సంపాదించుకున్నారు. టికెట్టు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు. ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు కూడా మింగుడు పడడం లేదు. ఖానాపూర్‌లో హరినాయక్ పరిస్థితి అదే. చివరి నిమిషంలో పార్టీ మారిన రాథోడ్ రమేష్‌కు సీటివ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా తన సత్తా చూపుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ బ్యాచ్ నుంచి ఇద్దరు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ (చెన్నూరు), రావి శ్రీనివాస్ (సిర్పూరు)లకు నిరాశ ఎదురవడంతో రెబల్ అవతారం ఎత్తి ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు. బోడ జనార్దన్ మాజీ మంత్రిగా, నాలుగుసార్లు వరుస ఎమ్మెల్యేగా ఉన్న పరిచయాలతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను భయపెడుతున్నారు. తనకు చివరి అవకాశంగా గెలిపించాలని చేస్తున్న విజ్ఞప్తి సానుకూల ఫలితాన్నిస్తుందని భావిస్తున్నారు. రావి శ్రీనివాస్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడాయన బీఎస్పీ తరుపున పోటీ చేస్తూ తనకు మామ అయిన టీఆర్ఎస్ అభ్యరిథ కోనేరు కోనప్పను, కాంగ్రెస్‌కు చెందిన హరీష్‌బాబును ఆందోళనకు గురి చేస్తున్నారు. ⇔మంచిర్యాలలో ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన బేర సత్యనారాయణ, ఆరె శ్రీనివాస్ బీఎస్పీ, బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేస్తుండగా, చల్లగుళ్ల విజయశ్రీ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. వీరు ఎవరి ఓట్లను చీలుస్తారో తెలియక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ⇔బోథ్ నుంచి కుమ్రం కోటేష్ పోటీ పడుతున్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన కోటేష్ వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో తెలియని పరిస్థితి. -
బరిలో 6 చోట్ల టీఆర్ఎస్,7 చోట్ల కాంగ్రెస్ రెబల్స్
-
రసవత్తరంగా మారిన రాజకీయం
-
గుస్సా రంగయ్య చాల్లే తగ్గయ్య !
సాక్షి, రంగారెడ్డి: ‘మల్లేశన్నా.. గిదేందే గిట్లయింది.. పాపం గా రమేసన్న నిన్నట్నుంచి శానా పరేశాన్గ ఉన్నడు’ ఎంకటేసు ఏడ్పు ముకం ఏస్కొని అంటుంటే.. నాకర్తం కాలె. ఏందే ఏమైంది పొద్దున పొద్దున్నే గీ ఏడ్సుడేంది.. సక్కగ సెప్పుమల్ల.. జరంత కసిరిన. ‘నువ్ గూడ గుస్సానె. గిట్ల గుస్సా అయ్యే గా రమేసన్న గిప్పుడు తల పట్టుకున్నడు’ అని అన్నడు. ‘సర్లే గా రమేసన్న కోపం ఎందుకయ్యిండో సెప్పు’ అనంగానె ‘గీ రమేసన్నకి పార్టీవోల్లు టికెట్ ఇవ్వలేద్ గదా.. గప్పట్నుంచి అన్న పార్టీ ఆపీసుకాడ అర్తాల్ జేస్తుండు. నాలాంటోళ్లు నల్గురు తమ్ముల్ని పోగేసి.. లొల్లి మీద లొల్లి చేసిండు’ టెన్సన్ పట్లేక అడ్డంపడి ‘గట్లనా.. ఏమైంది.. దెబ్బకి టికెట్ ఇచ్చేసిండ్రా’ అనడిగిన. ‘ఏం ఇచ్చేది.. చేతిలో చిప్ప! నీ ఇస్టం మల్ల గంత గుస్స అయితే నీ దారి నువ్ చూస్కో అనేసిండ్రంట.. పార్టీ పెద్దోల్లు. దీంతో అన్న అరె తమ్మీ నా పని ఖల్లాస్! గీ పెద్దోల్లు నెత్తిపై గుడ్డేసిండ్రని ఏడ్సుడే ఏడ్సుడు.’ ఎంకటేసం అంటుంటె నాకు నవ్వు ఆగలే. అసలు ఎందుకు నారాజ్ ఐతరు.. ‘అడిగేటోల్లుంటుండ్రని. మీకు దెల్వదు ఎవర్నయిన సతాయించాలంటె, గిట్ల కోపం వచ్చిందని మూతి బిగించి కూర్సొంటారు. అంటె ఎవరిపై కోపమైతమో ఆల్లు దగ్గర్కొచ్చి గడ్డం పట్కొని ‘ఏమైంది.. ఎందుకు కోపం’ అని అడగాలె. గప్పుడు గీల్లింక సురు చేస్తరు. నాకది కావాలె.. గిదెందుకు తేలె అని అనేటోల్లు కొందరయితే... గా దినం నన్నట్లంటివి.. అని పాత కతలు దీస్తరు.. సిన్నోల్ల లెక్క వేరు. పాపం ఆల్లు అంతా సూస్కొని గుస్సాలోకి దిగాలె. అందుకె ఇంటికి కొత్త సుట్టాలొచ్చినపుడే గిట్లాంటి పీట్లు చేస్తరు. కొత్తోల్ల ముందు తోకలిప్పిన గీల్లకి ఏం గాదు. గా పెద్దోల్లు గట్టిగ అర్వాలన్నా.. నాల్గు పీకాలన్నా.. యాడ ఇజ్జత్ పోతదోనని బయంతో సేతులు కట్టేస్కుని లోలోపల పండ్లు కొరుకుతూ ‘గీ సుట్టాల్ పోనీ బిడ్డా ! ఉంటాది నీకు ’అనుకోవాలంతె. అయితె అందర్కి గట్లా కల్సిరాదె. ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా ఎవరూ లెక్కజేయరు. అంతెందుకు.. గిప్పుడు ఎలచ్చన్లోనె సూడుండ్రి. పాపం టికెట్ రాలేదని అలిగి రోడ్డెకిండ్రు అందరు. ఇంకొందరయితే ఎన్కాల జనాల్నేసుకుని రచ్చరచ్చ జేసిండ్రు. తొడల్గొట్టి సవాల్లు సేసిండ్రు. గది జూసి పార్టీ వాల్లు రెండ్రెండు టికెట్లు యాడికెల్లి పట్కువచ్చేది. సరె మీరె జర సముదాయించండి కొంతమందిని పంపిండ్రు. గయితె ఆల్లు ఎంత కిందామీద పడినా గుస్సా సార్లు తగ్గలె. గిట్ల గాదని..’ సర్లే ఇగ మీ యిస్టం..’ అని సేతులెత్తేసిండ్రు. గీల్లతో మహా అయితే ఐదారు వేల ఓట్లు పోతయ్.. పోనీ చేసుడేముంది అంటుండ్రంట. అంతేగాదు.. గీ ఓట్లుగూడ గుస్సా సార్లు సెప్పినోల్లకే ఏసేస్తరనేముంది? అని లేచెల్లిపోయిండ్రు. పాపం ఈల్లకింక పరేసాన్. అరె జర కోపం వచ్చిందని సెప్తే అయిదో పదో పైసలిచ్చో.. గెల్సినంక ఏదైనా పదవిస్తం అనకుండా.. గిట్ల జేస్తిరేంది సార్లు అని తలపట్టుకున్నరట. ఊర్కుండ్లేక ఉబ్బసాన్కి మందు తీస్కొనిండంటే గిదే మల్ల!! – రామదుర్గం మధుసూదనరావు -
పార్టీకి వినయ విధేయులెవరు? రెబెల్స్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన రెబల్స్ ఇప్పుడు కొండెక్కి కూర్చున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరితేదీ కావడంతో ససేమిరా బరిలోంచి తప్పుకునేది లేదని పలువురు అసమ్మతి నేతలు తమ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రధాన పార్టీలూ రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డాయి. ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని భరోసా ఇస్తున్నాయి. అగ్ర నేతలు బరిలోకి దిగి బుజ్జగిస్తుండటంతో పలుచోట్ల రెబల్స్ తప్పుకోవడానికి సంసిద్దత వ్యక్తం చేస్తుండగా.. ఇంకొన్ని నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అసమ్మతి నేతలు భీష్మించి కూర్చున్నారు. నియోజకవర్గాల వారీగా రెబల్స్‌గా నామినేషన్స్.. ఉపసంహరణ జంగయ్య యాదవ్(కాంగ్రెస్- మేడ్చల్): రెబెల్స్‌ను బుజ్జగించే చర్యల్లో కాంగ్రెస్ అధిష్టానం సఫలీకృతమవుతోంది. మేడ్చల్ నుంచి కాంగ్రెస్ రెబెల్‌గా నామినేష్ వేసిన జంగయ్య యాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పెద్దలు జంగయ్య యాదవ్‌తో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. నామినేషన్ ఉపసంహరించుకొని, కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని కాంగ్రెస్ పెద్దలకు జంగయ్య యాదవ్ హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు(టీఆర్ఎస్- వరంగల్ తూర్పు): వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నన్నపునేని నరేందర్‌కు ఊరట కలిగించే విషయం. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ రెబెల్‌గా నామినేషన్ వేసిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అధిష్టానం ఆదేశాల మేరకు వెనక్కి తగ్గారు. పోటీ నుంచి తప్పుకుంటున్నానని, అదేవిధంగా నరేందర్ గెలుపు కోసం, పార్టీ కోసం కష్ట పడతానని పేర్కొన్నారు. బండ కార్తీక రెడ్డి(కాంగ్రెస్- సికింద్రాబాద్): పార్టీకి విధేయులరాలిగా పేరొందిన బండ కార్తీక రెడ్డి ఈ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌పై తిరుగుబావుట ఎగురవేశారు. కాంగ్రెస్ రెబెల్‌గా సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగి కార్తీక రెడ్డిని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలిపారు. అంతేకాకుండా కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని ఉత్తమ్‌కు హామీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి( కాంగ్రెస్- వరంగల్ పశ్చిమ): ఎట్టకేలకు ఏఐసీసీ మంతనాలు ఫలించడంతో కాంగ్రెస్ రెబెల్ నేత నాయిని రాజేందర్ రెడ్డి శాంతించారు. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ రెబెల్‌గా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని అధిష్టానానికి తెలియజేశారు. అంతేకాకుండా కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. నరాల రత్నాకర్ (కాంగ్రెస్- నిజామాబాద్ అర్బన్): కొంతకాలంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వచ్చిన తనకు ఉద్దేశ పూర్వకంగానే టికెట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని కాంగ్రెస్ రెబెల్ నేత నరాల రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మాజీ ఎంపీ మధుయాష్కీ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా రత్నాకర్ కంటతడి పెట్టుకున్నారు. జాతీయ నేతలు రత్నాకర్‌తో మాట్లాడి కూటమికి సహకరించాలని కోరినట్టు సమాచారం. కొత్త మనోహర్ రెడ్డి(టీఆర్ఎస్- మహేశ్వరం): టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీగల కృష్టారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్కు రెబల్‌గా నామినేషన్ వేసిన మనోహర్ రెడ్డిని స్వయంగా కేసీఆర్, కేటీఆర్ పిలుపించుకొని.. ఈసారి టీకేఆర్ను గెలిపించాల్సిందిగా కోరడంతో ఆయన మెత్తబడ్డారు. తీగలకు మద్దతుగా ప్రచారం చేస్తానని అధిష్టానానికి, నామినేషన్ ఉపసంహరించుకుంటానని హామీ ఇచ్చారు. సూర్యనారాయణ గుప్త (బీజేపీ- నిజామాబాద్ అర్బన్): బీజేపీలోనూ రెబల్స్ బెడద తప్పటం లేదు. నిజమాబాద్ అర్భన్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక నేత సూర్యనారాయణ గుప్తా అసంతృప్తితో శివసేన అభ్యర్థిగా, బీజేపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. కార్తీక్ రెడ్డి(కాంగ్రెస్- రాజేంద్ర నగర్): మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారసుడిగా ఈ ఎన్నికల్లో రాజకీయల్లోకి రావలనుకున్నారు. అయితే కుంటుంబం నుంచి ఒకరికే టికెట్ అనండంతో ఈ సారి ఆయనకు టికెట్ వరించలేదు. కాంగ్రెస్ రెబల్‌గా రాజేంద్ర నగర్లో నామినేషన్ వేశారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం కార్తీక్ రెడ్డిని బుజ్జగించింది. తల్లి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. భిక్షపతియాదవ్(కాంగ్రెస్- శేరిలింగంపల్లి): కాంగ్రెస్ జాతీయ నేత అహ్మద్ పటేల్ బుధవారం రాత్రి భిక్షపతి యాదవ్‌ను కలిసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం కల్పిస్తామని పటేల్ హామీ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన భిక్షపతి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శశిధర్ రెడ్డి(కాంగ్రెస్- మెదక్): కేసులతో అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టిన శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడం నిజంగా షాకే. అయితే నియోజక వర్గ కార్యకర్తల కోరిక మేరకు రెబల్‌గా నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్ జాతీయ నాయకులు బుజ్జగింపులకు దిగారు. దీంతో మెత్తబడిన ఆయన పోటీ నుంచి ఉపసంహరణకు ఓకే అన్నట్టు సమాచారం. -
నిర్ణయం మార్చుకోని రెబల్స్
సాక్షి,సిటీబ్యూరో/మేడ్చల్ జిల్లా: గ్రేటర్లో ప్రధాన పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమను కాదన్నందుకు రెబల్స్‌గా బరిలోకి దిగిన పలువురు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయా పార్టీల నుంచి అధికారికంగా బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రధాన నాయకులు ఇంటికే వచ్చి అడగడంతో ఆయా పార్టీల్లోని కొందరు రెబల్స్ మెత్తబడ్డా.. మరికొందరు మాత్రం వెనక్కి తగ్గేందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. కూకట్పల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో పన్నాల హరీష్‌రెడ్డి బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆయన భార్య కావ్యారెడ్డి టీఆర్ఎస్ నుంచి బాలాజీ నగర్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక మేడ్చల్ నుంచి నక్కా ప్రభాకర్‌గౌడ్‌కి టీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించి నిరాశకు గురైన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమెతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఆమె బరిలో ఉంటారా..? నామినేషన్ ఉపసంహరించుకుంటారా ? అన్నదిసస్పెన్స్‌గా మారింది. అంబర్పేట్ నుంచి వనం రమేష్, ఖైరతాబాద్ నుంచి బీఎన్‌రెడ్డిలు టీడీపీ తరఫున నామినేషన్ వేసి తామూ బరిలో ఉంటున్నామని సంకేతాలు పంపుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వీరిలో ఎందరు వెనక్కి తగ్గుతారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి ‘రెబల్’ గుదిబండగా మారింది. టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ స్వయంగా మొవ్వ సత్యనారాయణ ఇంటికి వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. బుజ్జగింపులపై కాంగ్రెస్ దృష్టి కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జగింపుపై దృష్టి సారించింది. ఏకంగా ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, సలీం అహ్మద్, శ్రీనివాసన్, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు రంగంలోకి దిగి అసంతృప్తి, అసమ్మతి వాదులతో చర్చిస్తున్నారు. ♦ శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ను పునరాలోచించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం భిక్షపతి యాదవ్‌ను మసీద్‌బండలోని ఆయన నివాసంలో కలిశారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం పంపిస్తే బుజ్జగింపు కోసం తాను రాలేదని, భిక్షపతితో ఉన్న అనుబంధంతోనే వచ్చానని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న భిక్షపతికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జైపాల్‌రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ♦ ఖైరతాబాద్ కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన డాక్టర్ సి. రోహిణ్‌రెడ్డి వెనక్కి తగ్గి ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, సలీం అహ్మద్, శ్రీనివాసన్ తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో రోహిణ్‌రెడ్డిని ఒప్పించగలిగారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిణ్‌రెడ్డి నివాసానికి వెళ్లి తనకు సంపూర్ణ మద్దతు కోరారు. ఇద్దరూ కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ అరగంట పాటు జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ♦ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ కార్తీక్‌రెడ్డి సైతం మెత్తబడ్డారు. టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి ఫలితం దక్కకపోవడంతో నైరాశ్యానికి గురైన కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన రాజీనామా అంశం మహేశ్వరం నుంచి పోటీలో ఉన్న తల్లి సబితారెడ్డిపై ప్రభావం చూపుతుందని, పార్టీకి రెండు విధాలా నష్టమని పార్టీ పెద్దలు బుజ్జగింజడంతో వెనక్కి తగ్గారు. ♦ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గారు. టికెట్ ఆశించి భంగపడి నామినేషన్ వేసిన ఆదం ఉమాదేవి తన నిర్ణయం మార్చుకున్నారు. బరిలో నుంచి తప్పుకొని కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్ధతు ప్రకటించారు. ♦ అంబర్‌పేట సీటు సర్దుబాటు కాక నామినేషన్ వేసిన టీడీపీ నేత, బిల్డర్ ప్రవీణ్ కూడా తన నిర్ణాయాన్ని మార్చుకున్నారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇవ్వడంతో మెత్తబడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మేడ్చల్‌లో పరిస్థితి ఇదీ.. ఈ జిల్లాలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్ బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వారిని ఏదోవిధంగా బుజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉండడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు. ♦ మేడ్చల్ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూరి వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్)కు ఎమ్మెల్సీ లేదా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, రేవంత్‌రెడ్డి అభయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా, అందులో వాస్తవం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. టీడీపీ నుంచి చేరిన సమయంలో రేవంత్ గానీ, కేఎల్ఆర్ గానీ మాట నిలబెట్టుకోలేదన్న విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసిన నక్కా ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ♦ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రెబల్‌గా బి.సురేష్‌యాదవ్ పోటీలో ఉన్నారు. ♦ ఉప్పల్‌లో కాంగ్రెస్ రెబల్స్‌గా మేకల శివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి బరిలోకి దిగారు. ♦ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నేతలు గొట్టిముక్కల వెంగళరావు, టీఆర్ఎస్ నుంచి రెబల్‌గా హరీష్ చంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. -
కాంగ్రెస్.. రె‘బెల్స్’
సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెరపడనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై కొలిక్కి రావడం లేదు. టీజేఎస్ మూడు, టీడీపీ, సీపీఐ చెరో స్థానంలో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నా, అభ్యర్థుల ప్రకటనపై కూటమి భాగస్వామ్య పక్షాల్లో గందరగోళం కనిపిస్తోంది. తాము పోటీ చేసే మూడు స్థానాలకు టీజేఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. హుస్నాబాద్ స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున ఇప్పటికే నామినేషన్ దాఖలైంది. పటాన్చెరు స్థానం టీడీపీకి కేటాయిస్తారనే వార్తపై స్పష్టత లోపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అభ్యర్థులను ప్రకటించని ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పక్షాన పోటా పోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు స్థానాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలకు దక్కేవెన్ని, కాంగ్రెస్ పోటీ చేసే పక్షంలో అభ్యర్థి ఎవరనే అంశంపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను, ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై తొలి జాబితాలోనే స్పష్టత వచ్చింది. సోమవారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లోపించింది. అభ్యర్థులను ప్రకటించని ఆరు స్థానాల్లో కనీసం ఐదు స్థానాలు మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల ఖాతాలోకి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూటమి భాగస్వామ్య పక్షం టీజేఎస్ విడుదల చేసింది. హుస్నాబాద్ స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున ఇప్పటికే నామినేషన్ దాఖలు కాగా, సోమవారం స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. పటాన్చెరు అసెంబ్లీ స్థానం టీడీపీ ఖాతాలోకి వెళ్తుందనే వార్తలు వస్తున్నా, పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ ఇప్పటి వరకు నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేయడంలో ఎలాంటి అనుమానాలు లేకున్నా, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి నడుమ టికెట్ పంచాయతీ తేలడం లేదు. ఆరు నియోజకవర్గాల్లో 21 మంది అభ్యర్థులను ప్రకటించని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడిచిన వారం రోజులుగా 21 మంది అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సిద్దిపేటలో ఏడు, పటాన్చెరులో ఆరు, మెదక్‌లో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు సోమవారం మరికొన్ని నామినేషన్లు కూడా కాంగ్రెస్ పక్షాన దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీపీ సంజీవరెడ్డి తరఫున ఇప్పటికే నామినేషన్ సమర్పించగా, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ సోమవారం పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. సిద్దిపేట టీజేఎస్ పార్టీ అభ్యర్థిగా భవానీ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు కాగా, కాంగ్రెస్ నుంచి తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్ వర్మ, దేవులపల్లి యాదగిరి, దరిపల్లి చంద్రం, మర్కంటి శ్రీనివాస్, పూజల హరికృష్ణ, వహీద్‌ఖాన్ నామినేషన్ వేశారు. వీరిలో కొందరు స్వతంత్రులుగా నామినేషన్ సమర్పించారు. పటాన్చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్‌కుమార్, కాటా శ్రీనివాస్‌గౌడ్, శంకర్ యాదవ్, శశికâ¶ళ, కొలన్ బాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతల జాబితాలో ఉన్నారు. టీజేఎస్‌కు కేటాయించినట్లుగా చెప్తున్న మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ నామినేషన్ వేశారు. హుస్నాబాద్‌లో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తనకు టికెట్ దక్కదనే అభిప్రాయానికి వచ్చిన ముత్యంరెడ్డి ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దుబ్బాక నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్ రెడ్డి నామినేషన్ వేయకున్నా, చివరి నిమిషంలో తనకు అవకాశం దక్కుతుందనే ఆశతో హైదరాబాద్‌లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించిన ప్రవీణ్‌రెడ్డి రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి టికెట్ వేట సాగిస్తున్నారు. -
తీరని ఆశలు..ఆరని సెగలు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ మినహా పోటీ చేసే అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిత్ర పక్షమైన టీడీపీ కూడా సీట్ల సర్దుబాటులో దక్కిన స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసి బీ–ఫారాలు సైతం అందజేసింది. టీజేఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ప్రకటించి భీ–ఫారం ఇవ్వగా, అంబర్‌పేట స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లు వేసేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరోపక్క ప్రజాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని ఆశావహుల్లో కొందరు ఇప్పటికే నామినేషన్లు వేయగా.. మరికొందరు సోమవారం నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇంకొందరు తమకు అన్యాయం చేశా రని ఏకంగా అగ్ర నాయకులపై ధ్వజమెత్తి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరికొందరు స్థానికంగా పార్టీ ఫ్లెక్సీలు తొలగించి జెండా దిమ్మెలను ధ్వంసం చేసి పార్టీపై తమ ఆవేశాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు తమకు మొండిచేయి చూపడాన్ని తట్టుకోలేక ఇతర పార్టీల తీర్థం పుచ్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొనసాగుతున్న బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి వాదులతో చర్చించి దారికి తెచ్చేందుకు ఏఐసీసీ పాండిచేరి సీఎం నారాయణస్వామి, మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి శివకుమార్ సభ్యులుగా సంప్రదింపుల కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలోని పార్క్ హయత్ హోటల్లో అసంతృప్తుల నేతలతో కమిటీ భేటీ అయింది. రెబల్‌గా బరిలోకి దిగిన వారితో కమిటీ సమాలోచనలు చేస్తోంది. పీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల, వీహెచ్ తదితరులు కలిసి అసంతృప్తి వాదులను హోటల్‌కు రప్పించి సంప్రదింపుల కమిటీతో సమవేశ పరుస్తున్నారు. మహాకూటమి గెలుపునకు పనిచేయాలని.. భవిష్యత్‌లో సరైన న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. రెబల్‌గా పోటీకి దిగితే మహాకూటమి లక్ష్యం నెరవేరదని వారికి నచ్చజెబుతున్నారు. ఉత్తమ్ ఇంటికి ఆశావహుల క్యూ.. అభ్యర్థుల చివరి జాబితా రానున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం ఆశావహుల తాకిడి పెరిగింది. కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారితో పాటు ఆశిస్తున్న నేతలూ ఉత్తమ్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బండ్ల గణేష్, ఉత్తమ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, ఉత్తమ్ అందుబాటులో లేకపోవడంతో కొందరు నేతలు నిరీక్షించగా.. మరికొందరు అక్కడి నుంచి వెనుదిరిగారు. తిరుగుబాటు బావుటా పార్టీకి చెందిన పలువురు ఆశాహులు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన భిక్షపతి యాదవ్ పార్టీపై తిరుగుబాటు చేసి నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మొవ్వ సత్యనారాయణ సైతం నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ నుంచి టికెట్ ఆశించిన కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్ సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థిగా పొరుగు నియోజకవర్గానికి చెందిన సామ రంగారెడ్డిని పోటీకి దింపడం స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటికే మల్లేశ్ తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ బీఎల్ఎఫ్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో ప్రధాన పక్షాలకు రెబల్స్ బెడద
-
వరంగల్ తూర్పులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
-
టీఆర్ఎస్ కారులో ‘పొగలు’
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి జోరును పెంచిన టీఆర్ఎస్కు అసమ్మతి సెగ తగులుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో సమావేశమవుతూ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తనకు టికేట్ కేటాయించకపోవడంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యచరణ ఏంటో ప్రకటిస్తానన్నారు. మిర్యాలగూడ టీఆర్ఎస్ ఇంచార్జ్ అమరేందర్ రెడ్డి సోమవారం తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన భాస్కర్ రావుకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. (చదవండి: తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ) నల్గొండ జిల్లాపరిషత్ ఛైర్మన్ బాలునాయక్ సైతం తన అనచరులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున ఛైర్మన్‌గా ఎన్నికై టీఆర్ఎస్లో చేరారు. దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో బాలునాయక్‌కు విభేదాలున్నాయి. ఇద్దరు పలుసందర్భాల్లో పోటాపోటి ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలో ఈ టికెట్ తనకే వస్తదని ఆశించిన బాలునాయక్‌కు నిరాశే ఎదురైంది. ఇక బాలునాయక్ 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో నల్గొండ జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆయన ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని జెడ్పీటీసీగా పోటీచేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో టీఆర్ఎస్ కారు ఎక్కారు. ప్రస్తుతం మళ్లీ సొంతగూటికే చేరే ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తి టికెట్ తమ నేతకే కేటాయించాలని కార్పొరేషన్ ఛైర్మన్ మందుల సామెల్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కు కేటాయించారు. ఇక ఈ టికెట్‌ను తెలంగాణ జాగృతి నేత రాజీవ్‌సాగర్ కూడా పోటీపడుతున్నారు. ఆయన వర్గం కూడా కిశోర్‌కు ప్రతికూలం కానుంది. దీంతో ఇక్కడి వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇక నాగర్జున సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు కాకుండా స్థానికులకు కేటాయించాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ గుడ్‌బై! నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ సీ భూపతి రెడ్డి గుడ్‌బై చెప్పె యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ బహిరంగ లేఖను విడుదల చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ డి శ్రీనివాస్‌తో పాటు ఆయన వర్గానికే చెందిన భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎంపీ కవిత వర్గం, జిల్లానేతలు తీర్మానం పంపిన విషయం తెలిసిందే. దీంతో సొంతగూటికి చేరాలని నిశ్చయించుకున్న డీఎస్‌తో పాటు భూపతి రెడ్డి సైతం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, భూపతి రెడ్డికి నిజామాబాద్ రూరల్ టికెట్ ఖారరు అయినట్లు సమాచారం. చదవండి: ముందుస్తు మచ్చట్లు -
క్రేజీ కప్పు సాసర్!
కుత్బుల్లా పూర్ నియోజక వర్గంలోని పలు డివిజన్లలలో రెబల్స్ గా ఉన్న అభ్యర్థులంతా ఇప్పుడు 'కప్పు సాసర్' గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా కప్పు సాసర్ గుర్తు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ గుర్తు వస్తే ఇక గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ దీని వెనుక కథాకమామీషు ఎంటంటే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో ఆయన గుర్తు కప్పు సాసర్. అప్పటి నుంచి కప్పుసాసర్ గుర్తుకు ఇక్కడ క్రేజ్ ఏర్పడింది. స్వతంత్రులుగా పోటీలో నిలుస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు కూడా కప్పుసాసర్ గుర్తు వస్తే ఇక తమదే విజయం అని భావిస్తున్నారు. మరి ఎవరికి ఈ లక్కు దక్కేనో చూడాలి. - కుత్బల్లాపూర్ -
నేనొక్కడినే..
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ రెడీ అవుతున్నారు. అయితే, సభలో ఆయన ఒక్కడే ప్రధాన ప్రతి పక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం, డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగింపు పర్వమే. చెన్నై : అన్నాడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనడంతో డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చిందని చెప్పవచ్చు. డీఎంకే పతనంతో ప్రధాన ప్రతి పక్షనేతగా అవతరించిన విజయకాంత్ తన స్టంట్‌ను అధికార పక్షం మీద చూపించి చావు దెబ్బ తినాల్సి వచ్చింది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు. కీలక నేత బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో 29గా ఉన్న డీఎండీకే సభ్యుల సంఖ్య బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో 28కి తగ్గింది. ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని అన్నాడీఎంకేకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఇక, రెబల్స్ రూపంలో మరో ఎనిమిది తగ్గాక తప్పలేదు. ఈ రెబల్స్ డీఎండీకే చిహ్నం మీద గెలిచినా, అసెంబ్లీలో మాత్రం అన్నాడీఎంకే సభ్యులతో కలసి కూర్చుంటూ వారితో కలిసి పోయారు. చివరకు తనతో పాటుగా 20 మంది సభ్యుల్ని మాత్రం విజయకాంత్ రక్షించుకోగలిగారు. అలాగే, అధికార అన్నాడీఎంకేతో ఏర్పడ్డ వైర్యం ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కొన్నాళ్లు సభ నుంచి సస్పెండ్ కాక తప్పలేదు. ఏ రోజున సస్పెండ్ అయ్యారో, అప్పటి నుంచి సభలోకి అడుగు పెట్టడం మానేశారు. సభా సమయాల్లో అసెంబ్లీ ఆవరణలోని రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లడంతో సరి. తమ అధినేత అసెంబ్లీకి దూరంగా ఉండటంతో తమ సత్తా ఏమిటో అధికార పక్షానికి రుచి చూపించేందుకు ఆయన సేనలు వచ్చి రాని స్టంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. ఒక్కడే : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ రెబల్స్‌తో ఫైట్ డీఎండీకే సభ్యులకు శిక్ష పడేలా చేశాయి. ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించి స్పీకర్ ధనపాల్ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. ఆ సమావేశాల కాలంతో పాటుగా తదుపరి సమావేశాల కు కూడా సస్పెన్షన్ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. అయితే, ఆ ఘటన జరిగిన రోజు సభలో విజయకాంత్ లేరు. దీంతో సస్పెన్షన్ ఆయనకు వర్తించదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సభలో ప్రధాన ప్రతి పక్షం ఉండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. విజయకాంత్ సభకు రాని పక్షంలో, ఇక వారికి కేటాయించిన సీట్లన్నీ ఖాళీయే అన్న వ్యంగ్యాస్త్రాలు బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో నేనొక్కడ్నే అంటూ సభలో అడుగు పెట్టేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. అసెంబ్లీలో ఒక్కడ్నే ..ఒంటరిగా అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతా..? అంటూ మరో మారు సభ వేదికగా అన్నాడీఎంకేతో ఢీకి రెడీ అవుతున్నారు. తన వెంట ఎమ్మెల్యేలు లేకున్నా, ఒక్కడ్నే చాలు అసెంబ్లీలో అడుగు పెడుతా..! అని విజయకాంత్ స్పష్టం చేస్తున్నారు. దీంతో సభలో మరో మారు అధికార పక్షం వర్సెస్ విజయకాంత్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు వివాదాలు చోటు చేసుకోవడం ఖాయం. అదే సమయంలో విజయకాంత్ దూకుడుకు కళ్లెం వేయడానికి మేమూ రెడీ అని రెబల్స్ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
రెబెల్స్‌ను ఏం చేద్దాం?
టీ-టీడీపీ ఎన్నికల కమిటీలో చర్చ పోటీకే సై అంటున్న తిరుగుబాటు నేతలు పార్టీ స్థానాల్లో బుజ్జగింపులకు యత్నాలు బీజేపీ సీట్లలో వేచి చూసే ధోరణి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థుల్లో ఎక్కువ మంది పోటీలో నిలి చేందుకే మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీ ముఖ్యులు దీనిపై దృష్టిపెట్టారు. సొంతంగా పోటీ చేస్తున్న స్థానాల్లోని రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మిత్ర పక్షం బీజేపీ పోటీ చేస్తున్న సీట్లలో నామినేషన్ వేసిన టీడీపీ నేతల విషయంలో మాత్రం వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు టీ-టీడీపీ ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య, మండ వ వెంకటేశ్వర్రావు తదితరులు ఇందులో పాల్గొని తాజా సమస్యలపై చర్చించారు. ప్రత్యేకించి మిత్రపక్షం బరిలో ఉన్న ఖైరతాబాద్, మల్కాజిగిరి, మలక్‌పేట, గద్వాల, నల్గొండ, నకిరేక ల్, వికారాబాద్, పరిగి, షాద్‌నగర్, నిర్మల్, మంచి ర్యాల, చెన్నూరు, నిజామాబాద్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీ రెబెల్స్ జాబితాను పరిశీలించింది. టీడీపీ స్థానాల్లో నామినేషన్ వేసిన బీజేపీ నేతలపైనా టీడీపీ దృష్టి సారించింది. ఆయా స్థానాల్లో బీజేపీ తమ వారిని విరమింపజేస్తే ఒక రకంగా, లేదంటే మరో రకంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులో టీడీపీకి దక్కిన సూర్యాపేట, పటాన్చెరు, నారాయణపేట, మక్తల్ వంటి చోట్ల బీజేపీ నుంచి బలమైన నాయకులు రెబెల్స్‌గా నిలిచారు. తాము కచ్చితంగా పోటీ చేస్తామని వారు చెబుతున్నారు. అలాంటి వారిని అనధికారికంగా ప్రోత్సహించాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న ఖైరతాబాద్‌లో రెబెల్‌గా రంగంలో దిగిన తెలుగు యువత నాయకుడు దీపక్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. తాను పోటీలో ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీడీపీ సీట్లలో రెబెల్స్‌కు బుజ్జగింపులు ఇక టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేసిన సొంత పార్టీ వారి విషయంలో మాత్రం పార్టీ ముఖ్యులు వెంటనే స్పందించారు. వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సీట్లలో వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు వదిలేసి, సొంత స్థానాల్లోని తిరుగుబాటు నేతలను బరి నుంచి తప్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఎల్బీనగర్లో ఆర్. కృష్ణయ్యపై పోటీకి దిగిన పార్టీ నేత ఎస్.వి. కృష్ణప్రసాద్ మొండికేస్తుండగా, మక్తల్, నారాయణపేటల్లోనూ కొండయ్య, రతంగ్ పాండురెడ్డి రెబెల్స్‌గా పోటీలో నిలవాలనే యోచనతో ఉన్నారు. పటాన్చెరు, సంగారెడ్డిలలో కూడా ఇదే పరిస్థితి. దేవరకద్రలో సీతా దయాకర్‌రెడ్డిపై పోటీలో ఉన్న ఎగ్గె మల్లేశంను బుజ్జగించడానికి ఆర్.కృష్ణయ్య ప్రయత్నించినట్లు సమాచారం. శేరిలింగంపల్లి నుంచి బరిలో నిలిచిన రెబల్ మొవ్వ సత్యనారాయణ, సికింద్రాబాద్‌లో పి.ఎల్. శ్రీనివాస్, మల్కాజిగిరిలో వీకే మహేశ్‌లతో పాటు మేడ్చల్‌లోని ముగ్గురు రెబెల్స్‌లో ఒకరు పోటీ చేసి తీరతామని భీష్మించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎలాగైనా వారిని ఒప్పించేందుకు టీడీపీ ముఖ్యులు యత్నిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబుతోనూ మాట్లాడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. -
'రాజ్యసభ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారు'
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో కొంతమంది బ్యాలెట్ పత్రాలను అందరికీ చూపించి నిబంధనలను ఉల్లంఘించారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి గంగుల కమలాకర్, హన్మంతు షిండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిలు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారి ఓట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. వీరు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా ఆ ఓట్లను లెక్కించకూడదని టీడీపీ ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఎన్నికల కమీషన్ పై తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ పద్దతితో పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తున్నారో....పార్టీ ఏజెంట్లకు చూపించి ఓటు వేయాలి. కేవీపీ రామచంద్రరావు ఏజెంట్‌గా శ్రీపాద శ్రీనివాసరావు, టి.సుబ్బరామిరెడ్డికి ఏజెంట్‌గా రెహమాన్, ఎంఏ ఖాన్‌కు ఏజెంట్‌గా అన్వర్ వ్యవహరించారు. -
41 మంది ఎమ్మెల్యేల మద్దతుంది: ఆదాల
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తనకు 41మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యవాదాన్ని తప్పనిసరిగా గెలిపించుకుంటారన్న విశ్వాసం ఉందన్నారు. ఇప్పటికే అనేక మంది తనకు ఫోన్ల ద్వారా మద్దతు తెలిపారని వివరించారు. కాగా, తెలంగాణ ప్రాంత అభ్యర్థులను ఓడించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంఏ ఖాన్ 37 ఓట్లతో విజయం సాధించే అవకాశముందని, తక్కిన ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన మంగళవారం లేఖ రాశారు. కాగా, సీఎల్పీ కార్యాలయం వద్ద శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్తో భవిష్యత్ పొత్తులకు ఈ చర్య నాంది కావాలన్నారు.