టీ-టీడీపీ ఎన్నికల కమిటీలో చర్చ
పోటీకే సై అంటున్న తిరుగుబాటు నేతలు
పార్టీ స్థానాల్లో బుజ్జగింపులకు యత్నాలు
బీజేపీ సీట్లలో వేచి చూసే ధోరణి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థుల్లో ఎక్కువ మంది పోటీలో నిలి చేందుకే మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీ ముఖ్యులు దీనిపై దృష్టిపెట్టారు. సొంతంగా పోటీ చేస్తున్న స్థానాల్లోని రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మిత్ర పక్షం బీజేపీ పోటీ చేస్తున్న సీట్లలో నామినేషన్ వేసిన టీడీపీ నేతల విషయంలో మాత్రం వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు టీ-టీడీపీ ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య, మండ వ వెంకటేశ్వర్‌రావు తదితరులు ఇందులో పాల్గొని తాజా సమస్యలపై చర్చించారు.
ప్రత్యేకించి మిత్రపక్షం బరిలో ఉన్న ఖైరతాబాద్, మల్కాజిగిరి, మలక్‌పేట, గద్వాల, నల్గొండ, నకిరేక ల్, వికారాబాద్, పరిగి, షాద్‌నగర్, నిర్మల్, మంచి ర్యాల, చెన్నూరు, నిజామాబాద్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీ రెబెల్స్ జాబితాను పరిశీలించింది. టీడీపీ స్థానాల్లో నామినేషన్ వేసిన బీజేపీ నేతలపైనా టీడీపీ దృష్టి సారించింది. ఆయా స్థానాల్లో బీజేపీ తమ వారిని విరమింపజేస్తే ఒక రకంగా, లేదంటే మరో రకంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులో టీడీపీకి దక్కిన సూర్యాపేట, పటాన్‌చెరు, నారాయణపేట, మక్తల్ వంటి చోట్ల బీజేపీ నుంచి బలమైన నాయకులు రెబెల్స్‌గా నిలిచారు. తాము కచ్చితంగా పోటీ చేస్తామని వారు చెబుతున్నారు. అలాంటి వారిని అనధికారికంగా ప్రోత్సహించాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న ఖైరతాబాద్‌లో రెబెల్‌గా రంగంలో దిగిన తెలుగు యువత నాయకుడు దీపక్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. తాను పోటీలో ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
టీడీపీ సీట్లలో రెబెల్స్‌కు బుజ్జగింపులు
ఇక టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేసిన సొంత పార్టీ వారి విషయంలో మాత్రం పార్టీ ముఖ్యులు వెంటనే స్పందించారు. వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సీట్లలో వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు వదిలేసి, సొంత స్థానాల్లోని తిరుగుబాటు నేతలను బరి నుంచి తప్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఎల్‌బీనగర్‌లో ఆర్. కృష్ణయ్యపై పోటీకి దిగిన పార్టీ నేత ఎస్.వి. కృష్ణప్రసాద్ మొండికేస్తుండగా, మక్తల్, నారాయణపేటల్లోనూ కొండయ్య, రతంగ్ పాండురెడ్డి రెబెల్స్‌గా పోటీలో నిలవాలనే యోచనతో ఉన్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డిలలో కూడా ఇదే పరిస్థితి. దేవరకద్రలో సీతా దయాకర్‌రెడ్డిపై పోటీలో ఉన్న ఎగ్గె మల్లేశంను బుజ్జగించడానికి ఆర్.కృష్ణయ్య ప్రయత్నించినట్లు సమాచారం.
శేరిలింగంపల్లి నుంచి బరిలో నిలిచిన రెబల్ మొవ్వ సత్యనారాయణ, సికింద్రాబాద్‌లో పి.ఎల్. శ్రీనివాస్, మల్కాజిగిరిలో వీకే మహేశ్‌లతో పాటు మేడ్చల్‌లోని ముగ్గురు రెబెల్స్‌లో ఒకరు పోటీ చేసి తీరతామని భీష్మించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎలాగైనా వారిని ఒప్పించేందుకు టీడీపీ ముఖ్యులు యత్నిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబుతోనూ మాట్లాడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
రెబెల్స్‌ను ఏం చేద్దాం?
Published Fri, Apr 11 2014 2:48 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM
Advertisement
Advertisement