సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తనకు 41మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యవాదాన్ని తప్పనిసరిగా గెలిపించుకుంటారన్న విశ్వాసం ఉందన్నారు. ఇప్పటికే అనేక మంది తనకు ఫోన్ల ద్వారా మద్దతు తెలిపారని వివరించారు. కాగా, తెలంగాణ ప్రాంత అభ్యర్థులను ఓడించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎంఏ ఖాన్ 37 ఓట్లతో విజయం సాధించే అవకాశముందని, తక్కిన ఓట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన మంగళవారం లేఖ రాశారు. కాగా, సీఎల్పీ కార్యాలయం వద్ద శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో భవిష్యత్ పొత్తులకు ఈ చర్య నాంది కావాలన్నారు.