ఎమ్మెల్యేలను తీసుకురావాలని రెబల్స్కు ట్విస్ట్
హైదరాబాద్ : రాజ్యసభ నామినేషన్ల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రెబల్ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ట్విస్ట్ ఇచ్చారు. సభ్యుల నుంచి లిఖితపూర్వక లేఖలు తీసుకు రావాలని రిటర్నింగ్ అధికారి వారికి గంట సమయం ఇచ్చారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే వారికి మద్దతు ప్రకటించిన సభ్యుల్లో కొంతమంది మద్దతు ఉపసంహరించుకున్నారు. చైతన్య రాజుకు ఎనిమిది మంది, ఆదాలకు ఎనిమిది మంది మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఇక మిగిలినవారిలో కొందరు బయటకు వెళ్లటం, మరికొందరు సెల్ఫోన్లు స్విచాఫ్ చేసినట్లు సమాచారం. దాంతో ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాకపోవటంతో ఆదాల, చైతన్య రాజు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు చైతన్య రాజుపై క్రిమనల్ కేసు ఉన్నందున ఆయన నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్... రిటర్నింగ్ అధికారిని కోరింది.
అలాగే ఆరుగురి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిట్నరింగ్ అధికారి తెలిపారు. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి సుబ్బరామిరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతా మహాలక్ష్మి, గరికపాటి మోహనరావు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.