Adala Prabhakar reddy
-
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
నేను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం: ఎంపీ ఆదాల
-
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: పార్టీ మార్పుపై ఉత్త ప్రచారాలపై నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా..నాపై వస్తున్న రూమర్స్ నమ్మొద్దు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా.. అసెంబ్లీయా.. పార్లమెంట్ బరిలోనా అనేది అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పారు. అలాగే.. పార్టీలో నెలకొన్న అసంతృప్త పరిణామాలపైనా అదాల స్పందించారు. అసంతృప్త నేతలను తాను స్వయంగా కలిసి నచ్చజెప్పే యత్నం చేసినా.. చర్చలు ఫలించలేదని చెప్పారాయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను కలిసి నచ్చజెప్పే యత్నం చేశా. వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాగుంట మాత్రం కాస్త సానుకూలంగానే స్పందించారని ఎంపీ ఆదాల తెలిపారు. ఇదీ చదవండి: కొత్త గ్రూపులకు ‘సారథి’! -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్సార్సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
సాక్షి, నెల్లూరు: తాను వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఖండించారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, అది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఎంపీ తెలిపారు. ‘పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. ప్రజాప్రతినిధులపై విమర్శలు చెయ్యడం కాదు.రాజకీయాల్లో లోకేష్ పిల్లోడు.. టీడీపీకి సరైన అభ్యర్ధి కూడా లేరు. అభ్యర్దులు లేక వైసీపీ లో ఉండే స్క్రాప్ ను టీడీపీలోకి తీసుకుంటున్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వడం కుదరని లోకేష్ చెప్పాడని సోమిరెడ్డి నా దగ్గర ఫీల్ అయ్యాడు. వరుస ఓటములతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రికార్డ్ సృష్టించాడు.నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. రూరల్ నుంచే బరిలో దిగుతాను. మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడు. నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. సీఎం వైఎస్ జగన్‌ను నేను కలిసిన తర్వాతే రూరల్‌కి నిధులు మంజూరు అయ్యాయి’ అని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’
సాక్షి, నెల్లూరు జిల్లా: జిల్లాలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, టీడీపీకి సరైన నేతలు లేకపోవడంతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో నియోజకవర్గంలో పర్యటిస్తే తెలుస్తుంది. నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు. అందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం -
‘జాగ్రత్త నీ జాతకం మొత్తం ఉంది’.. కోటంరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి చెప్పింది అబద్దమని శివారెడ్డి చెబుతున్నారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్ ఆరోపణలు నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. తనకు అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశాడు. అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాపును చూసి బలమనుకుని భ్రమపడుతున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారు’ అని కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీరోజు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు వరకు నేను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఈ మూడున్నర ఏళ్లలో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీకు పార్టీ, కార్యకర్తలు అవసరం లేదు. డబ్బు మీదు నీకు ప్రేమ ఎక్కువ అందుకే ఎలాంటి పనిచేయడానికైనా నువ్వు వెనుకాడలేదు. శ్రీధర్ రెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుంది. కొన్ని రోజుల్లోనే ప్రజలకు నీ గురించి అన్ని విషయాలను చెబుతున్నారు. నువ్వు ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను ఎలా బెదిరించావో అందరకీ తెలుసు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు’ అని వార్నింగ్ ఇచ్చారు -
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
వరద సాయం తక్షణమే విడుదల చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అకాల వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా, పోలవరం డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే అమరావతి ఉద్యమం సాగుతోందని ప్రజలందరికీ తెలుసన్నారు. అమరావతి రైతులకు ఎవరూ వ్యతిరేకం కాదని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎన్.రెడ్డెప్ప, వంగా గీతావిశ్వనాథ్లు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన వర్షాలు, వరదలు నాలుగు జిల్లాల్లోని రెండు లక్షలమంది ప్రజలపై ప్రభావం చూపాయని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి కోరారని చెప్పారు. రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కమిటీ నివేదిక రాగానే సాయంచేస్తామని చెప్పారని తెలిపారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు వాటిని ప్రజలకు అందనీయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడు తూ కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మభ్యపెడుతూనే పాండిచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం దారుణమని విమర్శించారు. 20 ఏళ్లలో ఎన్డీయే, యూపీఏ సంయుక్తంగా కలిసి చేసిన పని రాష్ట్ర విభజన ఒక్కటేనన్నారు. హోదా మరుగునపడిన అంశం కాదని, నిరంతరం పోరాడతామని చెప్పారు. ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ రెవె న్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, ఇతరత్రా పెండింగ్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి చూపిన చొరవకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి ఉద్యమం జరుగుతోందని పేర్కొన్నారు. ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొక్కను సరిగా నాటకపోవడం వల్లనే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వృక్షంగా మార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రజలతో ఉండి సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ, ఉపాధి నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ జోన్, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్లుగా పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేదల గౌరవాన్ని పెంచారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ అజెండాలో కూడా ఉందని గుర్తుచేశారు. అమరావతి రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందన్నారు. జమ్మూకశ్మీర్, అయోధ్య రామాలయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేసినట్లే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. -
చంద్రబాబు కేవలం కమీషన్ల కోసమే కాంట్రాక్టులు ఇచ్చారు
-
చంద్రబాబు అభివృది నిరోధకడు: ఆదాల
-
తలసేమియా, హీమోఫిలియా వ్యాధుల చికిత్సకు ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్ ఎనీమియా తదితర వ్యాధుల చికిత్సకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఔషధాలకు, రక్త సంబంధిత అవసరాలకు వీలుగా కేంద్రం సాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ తదితర చికిత్స అవసరమైనప్పుడు రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్), ఆరోగ్య మంత్రి విచక్షణా నిధి, ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.15 లక్షల వరకు సాయం అందుతుందని వివరించారు. మరో ఉప ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ మంగళగిరి ఎయిమ్స్ పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టే దశలో ఈ వ్యాధులకు సంబంధించి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2022 నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఆరోగ్య ఉప కేంద్రాలను 2022 డిసెంబర్ నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అసంక్రమిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, ఈఎన్టీ, కంటి వైద్యం, దంత వైద్యం, ట్రామాకేర్ వంటి చికిత్సలన్నీ ఉచితంగా అందరికీ అందించనున్నట్టు తెలిపారు. అయితే ఆయుష్మాన్ భారత్ అమలులో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య తక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఏపీలో 1,197 పీహెచ్‌సీలు అవసరం కాగా 1,147 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీహెచ్‌సీలు 299 అవసరం కాగా 193 మాత్రమే ఉన్నాయని వివరించారు. ఏపీలో పీహెచ్సీ స్థాయిలో 222 వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీహెచ్‌సీ స్థాయిలో 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంధత్వం, వినికిడి లోపం నివారణ పథకం కింద రూ.39 కోట్లు అంధత్వం, వినికిడి లోపం నివారణ జాతీయ పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.39 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎంఎంవీవై కింద 3.25 లక్షల మందికి ప్రయోజనం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింద ఆంధ్రప్రదేశ్‌లో 2018–19లో 3.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటగిరి శ్రీధర్, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ సగటు పని దినాలు 58.32 ఉపాధి హామీ పథకంలో ఏపీలో 2016–17లో ఒక్కో కుటుంబానికి సగటు పని దినాలు 51.49, 2018–19లో 58.32 లభించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. -
జనసంద్రమైన కలిగిరి
కలిగిరి: వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిగిరిలో శుక్రవారం నిర్వహించిన రోడ్డుషో జనసంద్రాన్ని తలపించింది. కలిగిరి మండలంలోని అన్నిగ్రామాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలిగిరమ్మతల్లి ఆలయం వరకు నిర్వహించిన రోడ్డుషో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానుల మధ్య నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కలిగిరిలో ఇంతవరకు ఇంతపెద్ద భారీ ర్యాలీ జరగలేదని చర్చించుకోవడం విశేషం. ఎంపీ అభ్యర్థి ఆదాల, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి మాట్లాడుతూ ఇదే ఉత్సహంతో మరో ఐదు రోజులు కష్టపడి పనిచేస్తే భారీ మెజారిటీలు సాధించుకోవచన్నారు. కలిగిరి ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, కలిగిరి బిట్ 1 ఎంపీటీసీ సభ్యుడు కంచెంరెడ్డి మాల్యాద్రిరెడ్డి తమ అనుచరులతో కలసి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి, పాలూరు మాల్యాద్రిరెడ్డి, కాటం రవీంద్రారెడ్డి, నోటి శ్రీనివాసులురెడ్డి, మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఎం.భాస్కర్ రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డి, ఎం. కేశవులురెడ్డి, లక్ష్మీనారాయణ, మోహన్, ప్రసాద్, రియాజ్‌రెడ్డి, హజరత్‌రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి
-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ స్థానం నుంచి టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నిరోజులు ఎందుకు పార్టీలో చేరలేదా అని అనిపించింది. నన్ను నెల్లూరు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయమన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. ఇక పార్టీ మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటిని నేను రేపు (ఆదివారం) నెల్లూరులోనే మాట్లాడతా.’ అని అన్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని వంగా గీత ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీలో చేరిన వాళ్లు 1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక 2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3. ఆదాల ప్రభాకర్ రెడ్డి 4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్ 5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత 6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్ 7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి 8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు 9. డాక్టర్ రాంచంద్రారెడ్డి అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. -
ఆదాలకు కోపమొచ్చింది!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మళ్లీ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీరుపై మరో మంత్రి నారాయణ వద్ద మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన తనకుతెలియకుండా నెల్లూరు రూరల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని, అంత హడావుడిగా సమావేశం జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం రాత్రి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో మంతనాలు జరిపారు. ఈ నెల 9న నెల్లూరు నగరంలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించుకుంటున్నామని నేతలు చెబుతున్నప్పటికీ జిల్లాలో అధికారపార్టీ అభ్యర్థులు, టిక్కెట్ల వ్యవహారంపై మంతనాలు సాగిస్తుండడం గమనార్హం. మరోవైపు గతంలో తాను నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లిలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం బలంగా సాగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సృష్టత లేదు. దీంతో మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు వరుసగా సోమ, మంగళవారాల్లో జరిగిన భేటీలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపైనే చర్చ సాగినట్లు సమాచారం. సోమిరెడ్డికి రూరల్‌లో ఏం పని? వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. దీనికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేత తాళ్లపాక అనురాధ హాజరయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కసరత్తు చేస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో ఏం పని ఉందంటూ మాజీ మంత్రి ఆదాల జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా రూరల్ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆయన సమావేశాలు నిర్వహించడం, హడావుడి చేయడం ఏంటని నిలదీశారు. వీటన్నింటిపై సీఎంతో మాట్లాడి ఆయన వద్దే తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. జిల్లాలో టిక్కెట్లు కూడా మంత్రి సోమిరెడ్డి, మరికొంత మంది ఇచ్చేట్లు మాట్లాడుతూ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, రోజుకో నేత నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని వారే ప్రచారం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సీఎం పర్యటన సమయంలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించాలని కోరి అప్పుడే అన్నీ తేల్చుకుంటానని ఆదాల సృష్టం చేసినట్లు సమాచారం. -
పిలిచి అవమానిస్తారా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హర్ట్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి రమ్మని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వచ్చేశారు. వెంట నే మంత్రి నారాయణ ఆదాల ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. ఈ ఘటన అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం నగరంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇరుగాళమ్మ గుడి వద్ద నిర్వహించారు. నుడా నిధులతో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణతోపాటు పార్టీ నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, పార్టీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకంలో ఇన్చార్జి హోదాలో ఉన్న ఆదాల పేరు లేకపోవడం.. ఆనంతరం నిర్వహించిన సభలో వేదిక పైకి ఆదాలను ఆలస్యంగా పిలవడంపై ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఆదాల వేదికపైకి వెళ్లకుండానే తిరిగి ఇంటికి వచ్చేశారు. పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో మంత్రి నారాయణ సమావేశం పూర్తికాగానే నేరుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. ఇద్దరు ఏకాంతంగా గంటకు పైగా సమావేశమయ్యారు. కాసేపటికి కురుగొండ్ల రామకృష్ణ వచ్చి ఆదాలతో మంతనాలు నిర్వహించారు. మొత్తం మీద ఆదాల ఆగ్రహించిన వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి తీరుపై ఆదాల మంత్రి నారాయణ వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు మంత్రి ఎదుట వాపోయారు. నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం నెల్లూరు రూరల్ వావిలేటిపాడు, మాధరాజుగూడురు వద్ద నేలూటూరు పునరావసా కాలనీ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 12న జరిగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాజీ మంత్రి ఆదాల నివాసానికి వచ్చి ఇరువురు మాట్లాడుకొని మరీ వెళ్లి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నేలటూరు పునరావాస కాలనీ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వేయలేదు. అది నెల్లూరు రూరల్ పరిధిలో జరగటం మాజీ మంత్రి ఆదాల తన పేరు వేయించలేదనే భావనతో నుడా చైర్మన్ ఆదాల పేరును శిలాఫలకంలో వేయకుండా, వేదికపైకి ఆలస్యం పిలిచేలా చేశారని ఇదంతా నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం అని ప్రచారం సాగుతోంది. -
సోమిరెడ్డి, ఆదాల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా?
జిల్లాలో ఎన్నికల ‘రాజీ’కీయం మొదలైంది. ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో అధికార పార్టీలో పరస్పరం కలహించుకునే ఇద్దరు నేతలు భేటీ కావటం, తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాహ్యంగా ఎడముఖం.. పెడముఖంగా ఉన్న మాజీ మంత్రి ఆదాల, మంత్రి సోమిరెడ్డి అంతర్గతంగా ఉప్పు..నిప్పులా ఉండే వీరు ఒక్కసారిగా ఏకమై ఏకాంతంగా చర్చలు జరపడం ఆ పార్టీ నేతలే ఇంకా తేరుకోలేకున్నారు. సోమిరెడ్డి, ఆదాల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా? లేక ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మంత్రి సోమిరెడ్డికి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య కొనేళ్లుగా వార్ నడుస్తుంది. జిల్లాలో ఇద్దరి మధ్య మొదలైన పంచాయితీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. తాజాగా కూడా గత నెలలో మంత్రి సోమిరెడ్డిపై ఆదాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సర్వేపల్లి నుంచి మళ్లీ మంత్రి పోటీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీలో మాత్రం అంతర్గంతగా సోమిరెడ్డి నియోజకవర్గం మారతారనే ప్రచారం సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని నేలటూరులో శుక్రవారం పునరావాస కాలనీకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం సోమిరెడ్డి నగరంలోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఇద్దరు కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నాక మంత్రితో కలిసి ఆదాల కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి ఇద్దరు నేతలు ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండా భేటీ కావడంతో ఏం జరుగుతుందనే చర్చ సర్వతా సాగుతుంది. గత నెలలో కూడా మాజీ మంత్రి ఆదాల మంత్రి సోమిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు.. మూడు సార్లు నేరుగా సీఎంకు మంత్రి సోమిరెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డి వర్గంలోని కొందరు నేతలు ఆదాల పార్టీ మారతారనే ప్రచారం బలంగా చేశారు. దీంతో ఇద్దరి మధ్య గతం నుంచే ఉన్న విభేదాలు మరింత తారా స్థాయికి చేరటంతో ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. పార్టీలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలైంది. దీంతో మొదటి జాబితాలోనే స్థానం సంపాదించటానికి అధికార పార్టీ నేతలు కష్టాలు పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సర్వేపల్లిలో ఆదాలకు కొంత వర్గం ఉంది. సహజంగానే ఆదాల మంత్రి సోమిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలో ఆయన వర్గం కూడా పార్టీలో ఉన్నప్పటికి సోమిరెడ్డికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో గొడవలు ఎందుకనే ధోరణిలో నేతలు అడుగులు వేస్తున్నారు. అయితే అరగంట సేపు భేటీ అయినా పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని సమాచారం. మళ్లీ కొద్ది రోజుల్లో భేటీ కావాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. -
మైనార్టీ సదస్సు పట్టని నేతలు
అధికార పార్టీ నేతలు జనసమీకరణను తుస్ మనిపించారు. ‘నారా హమారా. టీడీపీ హమారా’ పేరుతో తెలుగుదేశం పార్టీ గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభకు జిల్లా నుంచి జనసమీకరణ చేయటంలో ముఖ్య నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పర్యావసానంగా వందల బస్సులు అని చెప్పి చివరకు పదుల సంఖ్యలో బస్సులు వెళ్లటం, దానిలో కూడా మైనార్టీలతో పాటు పార్టీ కార్యకర్తలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైనార్టీ సదస్సుకు జిల్లా నుంచి జనసమీకరణ, ఇతర బాధ్యతలు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో, మైనార్టీ ఓటింగ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించి అక్కడ సభ పోస్టర్ ఆవిష్కరణలు, సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వారం నుంచి సభకు తరలిరావాలని పిలుపునివ్వటంతో పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అయితే మంగళవారం మాత్రం ఆ మేరకు ఎక్కడా జనం కనిపించని పరిస్థితి. జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ జనసమీకరణను పూర్తిగా గాలికొదిలేశారు. నెల్లూరు నగరం నుంచి మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోవటం గమనార్హం. ఇక జిల్లాలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాత్రం అట్టహసంగా నగరం నుంచే వందకు పైగా బస్సులు, జిల్లా నుంచి 235 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. తీరా జనాలు లేకపోవటంతో 50 బస్సులు కూడా పూర్తిగా వెళ్లని పరిస్థితి. జిల్లాలో మైనార్టీల ఓటింగ్ గణనీయంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌లో అధికంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాలోనూ అధికంగా ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీల ఓటింగ్ ఉంది. ఈ క్రమంలో జిల్లా నుంచి కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా సభకు తరలించాలని పార్టీ రాష్ట్ర నేతల ఆదేశం. అయితే ఈ మేరకు నేతలు ప్రకటనలు చేసి హడావుడి చేశారు కానీ మైనార్టీలను పూర్తిస్థాయిలో రప్పించలేకపోయారు. మంగళవారం ఉదయం నగరంలో వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో బస్సులను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో సగం బస్సులు కూడా నిండని పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో బస్సులను డిపోలకు వెనక్కి పంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొన్ని బస్సులు కదలిని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ మైనార్టీ సదస్సుకు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం గమనార్హం. -
టీడీపీని వీడని నేతల కయ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసి 24 గంటలు గడవక ముందే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి, టీడీపీ సీనియర్ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బూత్ కమిటీల విషయంలో ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరింది. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం గురువారం జరిగిన టీడీపీ సమావేశం ఇందుకు వేదికైంది. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు కొంతకాలంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. రెండు వారాలుగా ఈ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆత్మకూరు ఇన్చార్జి విషయంలో ఆదాల, సోమిరెడ్డి మధ్య మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నాడంటూ ఆదాల పరోక్ష విమర్శలు చేశారు. బుధవారం నెల్లూరు రూరల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రిపై మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. సోమిరెడ్డి వైఖరిపై అధిష్టానం వద్దేతేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇక కోవూరు నియోజకవర్గంలో ఆది నుంచి ఎమ్మెల్యే పోలంరెడ్డి వైఖరిని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో పాత బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించి తన అనుచరులను నియమించుకున్నారని చేజర్ల వర్గం ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి పార్టీ సమావేశం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు మండలాలకు సంబంధించి బూత్ కమిటీలకు తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. దీనిని చేజర్ల వ్యతిరేకించారు. పాత సభ్యులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చేజర్ల మాటలు లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే పోలంరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని కోవూరు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాలకు సంబంధించి బూత్ కమిటీ సభ్యుల నియామకంలో గందరగోళం నెలకొంది. చేజర్ల వర్గం వారిని పూర్తిగా తొలగించి ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్న వారిని నియమించారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా జిల్లా పరిధిలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కోవూరు నియోజకవర్గ వివాదాన్ని పరిష్కరించేందుకు పరిశీలకులుగా ఎరిక్సన్బాబును అప్పట్లో నియమించారు. వివాదానికి తెరదించాలని జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు ఎరిక్సన్ బాబు సూచించారు. బీద ఇరువర్గాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. గురువారం ఎమ్మెల్యే బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించడంతో నేతల మధ్య పోరు మళ్లీ మొదటికొచ్చింది. తాను సీఎం వద్దే తేల్చుకుంటానని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేస్తున్నారు. -
బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బస్సులో ఏం జరిగింది.. బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు.. ఏం మాట్లాడారు.. సభా ప్రాంగణానికి వచ్చిన సీఎం బస్సు దిగకుండా బస్సులోనే 15 నిమిషాలు ఎందుకు గడిపారనేది ప్రస్తుతం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేతలు ఊహించి నట్లే సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతల వద్ద ఆరా తీశారు. జిల్లాలో ఏం జరుగుతుందని మొదలుపెట్టి అన్ని అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కొందరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు సాగుతున్న క్రమంలో మళ్లీ సీఎం పర్యటన జరగటం అది కూడా సీఎం కొందరితో మాట్లాడటం రకరకాల చర్చకు దారి తీసింది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో సీఎం సభాస్థలికి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎంతో పాటు కడప నుంచి మంత్రి సోమిరెడ్డి వచ్చారు. బస్సులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ఈ క్రమంలో బస్సులో జిల్లా అధికార పార్టీ రాజకీయాలపై చర్చ సాగింది. ప్రధానంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా ముస్తాబు చేసిన రోడ్డను చూసి బాగా అభివృద్ధి చేశారని కితాబు ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని పార్టీ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటిస్తే అందరు పనిచేసుకుంటారని, లేదంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఆత్మకూరు రాజకీయాలపైనా చర్చ సాగింది. పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడకముందే ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డి కన్నబాబుతో హడావుడి చేయిస్తున్నారని, ఇది పార్టీకి కొంత ఇబ్బంది అని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కన్నబాబు హడావుడిగా సమావేశాలు పెట్టి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరం మొదలుకొని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎంకు వివరించినట్లు సమాచారం. మరో వైపు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం బస్సులోనే 15 నిమిషాలు ఉన్నారు. తొలుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎంతో మాట్లాడి వేదిక పైకి వచ్చిన వెంటనే మరో మంత్రి నారాయణ బస్సులోకి వెళ్లి బాబుతో మంతనాలు నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలో పార్టీ పరిస్థితిపై చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లా రాజకీయాల విశ్లేషణ బస్సులోనే సాగటం గమనార్హం. -
దోస్త్ మేరా దోస్త్
ఆదాలతో అజీజ్ స్నేహం తమ వర్గం పట్టు పెంచుకోవడానికి పార్టీ నేతలతో సమావేశం కార్పొరేటర్లతో పాటు ఓడిన వారికీ పనులు ఇస్తామని హామీ నెల్లూరు సిటీలో అజీజ్‌కు ఆదాల సహకారానికి ఒప్పందం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు తెలుగుదేశం పార్టీలో కొత్త స్నేహానికి తెర లేచింది. మంత్రి నారాయణతో విభేదిస్తున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో మేయర్ అబ్దుల్ అజీజ్ జత కట్టారు. రాజకీయంగా ఒకరికొకరు సహరించుకుంటూ పార్టీ లోని తమ శత్రువులకు చెక్ పెట్టే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గురువారం ఆదాల ఇంట్లో రూరల్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యులతో ఇద్దరూ సమావేశమై మనం మనం ఒకటి అనుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ తన గురువు, మంత్రి నారాయణ ఆహ్వానంతో టీడీపీలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆనం కుటుంబం టీడీపీలో చేరడంతో అజీజ్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. మంత్రి అండతో రాజకీయ చక్రం తిప్పాలనుకున్న అజీజ్ వ్యూహం ఫలించలేదు. ఆనం కుటుంబానికి మంత్రి ప్రాధాన్యం ఇస్తూ రావడంతో కార్పొరేషన్ వ్యవహారాల్లో కూడా వారు పరోక్షంగా జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో అజీజ్ ఒక అడుగు ముందుకేసి శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆదాలతో జత కలిశారు. ఆదాల సహకారం ఉంటే కార్పొరేషన్ వ్యవహారాల్లో తన మాట నెగ్గించుకోవడం కోక పోయినా ఆనం చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేశారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో మంత్రి నారాయణ మీద ఆదాల నేరుగా ధ్వజమెత్తడం వీరిద్దరి స్నేహాన్ని మరింత బలపడేలా చేసింది. అప్పటి నుంచి ఒకరి కొకరు అన్నట్లుగా ఉన్న వీరిద్దరూ రూరల్నియోజక వర్గంలో కలసి పనిచేసుకుని తమ వర్గం బలపరచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల చేతిలో ఓడిన అభ్యర్థులను ఒక్కటి చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రూరల్ నియోజక వర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఓడిన అభ్యర్థులతో ఆదాల ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రాంరభమైన సమావేశం రాత్రి 9 గంటల దాకా జరిగింది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌కు ఆదాల, సిటీకి అజీజ్ టికెట్లు దక్కించుకునే ఎత్తుగడలోనే ఈ రాజకీయం ప్రారంభించారని టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా రూరల్ నియోజకవర్గంలో గెలిచిన, ఓడిన కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య సమన్వయం కుదర్చడం కోసం నిర్వహించే పేరుతో జరిపిన ఈ సమావేశానికి ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డిని ఆజీజ్ మనుషులు ఆహ్వానించారు. నామ మాత్రపు ఆహ్వానం అందినందువల్ల తాను రాలేదని, ఆయన తన మద్దతు దారులకు చెప్పారు. ఈయనతో పాటు వెంకన్న యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, నెల్లూరు సునీత, బొల్లినేని శ్రీవిద్య సమావేశానికి రాలేదు. వీరిలో కొందరు మంత్రి నారాయణతో సన్నిహితంగా ఉండటం వల్ల రాలేదు. కొందరు మాత్రం వ్యక్తిగత పనుల వల్ల రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆదాల, అజీజ్ ఇద్దరూ కార్పొరేటర్లు, ఓడిన అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడారు. కార్పొరేషన్ పరి«ధిలో మంజూరైన పనులు కార్పొరేటర్లతో పాటు ఓడిన∙వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రూరల్ నియోజక వర్గంలోని డివిజన్లలో ఇక మీదట జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల్లో ఆదాల పేరు కూడా వేయాలని కొందరు కార్పొరేటర్లు చేసిన డిమాండ్‌కు అజీజ్ అంగీకరించినట్లు తెలిసింది. -
ఆయనేమన్నా మంత్రా.?. ఎమ్మెల్యేనా.?
►ఆదాల కార్యక్రమానికి హాజరైన కమిషనర్ ► ఆయనపై మేయర్ మద్దతుదారుల చిందులు ► టీడీపీ గ్రూపుల గొడవల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారుల ఆందోళన ‘‘ఆయనేమన్నా (ఆదాల ప్రభాకర్‌రెడ్డి ) మంత్రా.?. ఎమ్మెల్యేనా.? ఆయన కేమైనా ప్రొటోకాల్ ఉందా?. అభివృద్ధి పనుల పరిశీలన కోసం ఆయన పిలిస్తే మీరెలా వెళతారు.. ఉండాలనుందా? లేదా’’ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లుపై మేయర్ అబ్దుల్ అజీజ్ సమక్షంలోనే ఆయన మద్దతుదారులు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నెల్లూరు రూరల్‌నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకుని పనుల పరిశీలనకు వెళుతున్నారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు కూడా ఆయన పిలిచిన వెంటనే పర్యటనకు హాజరవుతున్నారు. ఇటీవల కాలంలో మేయర్ అబ్దుల్ అజీజ్‌ను టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గాలు చుట్టుముట్టాయి. అవకాశం దొరికితే రాజకీయంగా దెబ్బతీయడానికి కత్తులు నూరుతున్నాయి. ఇదే సమయంలో అజీజ్ కూడా ప్రత్యర్థులతో సై అంటే సై అనేలాగా వ్యవహరిస్తున్నారు. మేయర్‌గా కార్పొరేషన్ పరిధిలో తాను చెప్పిన పనులే జరగాలని అధికారుల మీద ఒత్తిడి పెంచారు. కొన్ని వ్యవహారాల్లో మంత్రి నారాయణ ఒక విధంగా చెబితే అధికారులకు మేయర్మరో రకమైన ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీలోని ఈ గ్రూపుల గోలతో కమిషనర్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆదాల పిలిస్తే ఎలా పోతారు? రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రూరల్ నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి మూడు రోజుల నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తన వెంట రావాలంటూ కమిషనర్ వెంకటేశ్వర్లుకు సమాచారం పంపారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదాల వెంట పర్యటనకు వెళ్లారు. ఈ విషయం తెలియడంతో మేయర్ అజీజ్ తీవ్రంగా రగిలిపోయారు. కార్పొరేషన్ అధికారులను కూడా మాజీ మంత్రులు, నాయకులు శాసిస్తే ఇక తాను ఉండేది ఎందుకంటూ ఆగ్రహించారు. తమ నాయకుడి ఆగ్రహం చూసిన మద్దతుదారులు మేయర్ ఎదుటే కమిషనర్‌పై తమ ఆవేశం వెళ్లగక్కారు. ఆదాల ఏమైనా మంత్రా, ఎమ్మెల్యేనా, కనీసం కార్పొరేటరా? ఆయనకు ఏం ప్రొటోకాల్ ఉందని మీరు వెళ్లారు? ఇంకో సారి వెళితే మీరు ఇక్కడ ఉండరు అని తీవ్రంగా హెచ్చరించారు. తాను అధికారిననీ, అభివృద్ధి పనుల విషయం గురించి అధికార పార్టీ నాయకుడు పిలిస్తే వెళ్లాననీ, వెళ్లొద్దనడానికి మీరెవరనీ కమిషనర్ అన్నారు. తనను నియంత్రించే ప్రయత్నం చేయొద్దని ఆయన గట్టిగా చెప్పడంతో మేయర్ వ ర్గీయులు సర్దుకున్నారు. ఈ విషయం గురించి తెలియడంతో కార్పొరేషన్‌లోని అధికారులు, సిబ్బంది తెలుగుదేశం పార్టీ గ్రూపుల గొడవల్లో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కమిషనర్ వెంకటేశ్వర్లును సాక్షి ప్రతినిధి వివరణ కోరగా, తాను అధికారిననీ అభివృద్ధి పనుల విషయంలో అందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. పనులన్నీ వారే నిర్ణయిస్తే ఎలా ? కార్పొరేషన్ పరిధిలో వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులతో చేపట్టే పనులను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లు చెప్పిన విధంగానే ఖరారు చేయాలని ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు ఇదే విషయాన్ని మేయర్ అజీజ్‌కు గట్టిగా చెప్పారు. అన్నీ వారు చెప్పినట్లు చేస్తే ఇంక నేనెందుకు? వాళ్లు ప్రతిపాదనలు పంపితే నేను సంతకాలు చేయాలా? అని అజీజ్ ఆ సమావేశం అనంతరం బహిరంగంగానే తన నిరసన వెల్లడించారు. అభివృద్ధి పనులు మంజూరు చేయించుకునేది వారే, వాటిని పర్యవేక్షించేదీ వారే, మేం రాజకీయం చేయాల్సిన అవసరం లేదా? అని ఆయన మండి పడ్డారు. ఈ రకంగా అయితే నగరంలో తన పరపతి పూర్తిగా పోతుందని భావించి అధికారులను కట్టడి చేసే వ్యూహం అమలు చేస్తున్నారు. -
రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు
నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల వేడి ఊపందుకుంది. రేపో, మాపో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుండటంతో పెద్దల సభలో అడుగుపెట్టాలనుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ సారి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదని ముఖ్య నేతలకు చెబుతున్నారు. అప్పటి హామీ గుర్తు చేస్తున్న ఆదాల రెండేళ్ల కిందట శాసనభసభ, లోక్‌సభకు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఆదాలను చంద్రబాబు రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనా రాజ్యసభకు అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఆదాల ఓడిపోవడం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో ఆ తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదాలను కోరారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల నేపథ్యంలో చంద్రబాబు జిల్లా నుంచి పొంగూరు నారాయణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అవకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఇచ్చారు. రాజ్యసభ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న ఆదాల అప్పట్లో మిన్నకుండి పోయారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుకు తన మనసులోని కోరికను, 2014 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వస్తున్నారు. మంత్రి నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఈ కోణంలో కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునే రాజకీయం నడుపుతూ వచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీద అదృష్ట పరీక్ష గడచిన ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బీద మస్తాన్‌రావు సైతం రాజ్యసభ రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. పార్టీ అధికారంలో లేని సమయంలో తాను చేసిన సేవలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరుతున్నారు. నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలంటే తనకు పదవి అనివార్యమని ఆయన చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే రెండు, మూడుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకు పోయిన మస్తాన్‌రావు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడ్డారు. అయితే తాజా రాజకీయ సమీకరణల్లో ఈ సారి జిల్లా నుంచి పార్టీ నేతలెవరికీ అవకాశం ఇవ్వలేనని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చెప్పినట్లు సమాచారం. -
నిన్న కత్తులు.. నేడు కౌగిలింతలు
సాక్షి, నెల్లూరు: నిన్నమొన్నటి వరకు కత్తులు దూసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారు. నాకు నువ్వు..నీకు నేను అంటూ ఆలింగనాలు, కౌగిలింతల్లో మునిగితేలుతున్నారు. వీరి మధ్య సాగిన శతృత్వం తెలిసిన వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి విస్తుపోతున్నారు. జనంతో పాటు వారి అనుచరులు, కార్యకర్తలు సైతం ఔరా..! రాజకీయం అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరకముందే ఆయన సోమిరెడ్డితో పాటు మిగిలిన నేతలతో సభలు, సమావేశాల్లో, చర్చలు, విందుల్లో మునిగితేలుతూ అందరినీ ఆశ్చర్చపరుస్తున్నారు. కయ్యమిలా.. క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సోమిరెడ్డే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మొదట ఆదాల 1999లో అప్పటి అల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచే ఆయన అవకాశవాద రాజకీయాలను బాగా వంట బట్టించుకున్నట్టు పేరుపొందారు. రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ అధిష్టానం వద్ద చక్రం తిప్పి మంత్రి పదవి పొందారు. ఆ పదవి కోసం ఆయన ధనబలం బాగా ఉపయోగపడిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అనంతరం ఆదాల, సోమిరెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆదాల ధన రాజకీయంతోనే తనకు మంత్రి పదవి రాకుండా పోయిందనే అక్కసు సోమిరెడ్డిలో మొదలైంది. అప్పటి నుంచి ఆదాలను మంత్రి పదవిని తప్పించేందుకు దొరికిన అన్ని అవకాశాలను సోమిరెడ్డి ఉపయోగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత ఆదాలను చంద్రబాబు మంత్రిపదవి నుంచి తొల గించి సోమిరెడ్డికి కట్టబెట్టారు. దీంతో వీరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమాని అల్లూరు నియోజకవర్గం కనుమరుగైంది. సోమిరెడ్డిపై అక్కసుతో ఉన్న ఆదాల కాంగ్రెస్‌లో చేరి 2004లో జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లిలో ఆయనేపైనే పోటీ చేసి విజయంతో ప్రతీకారం తీర్చుకున్నారు. అంతటితో వదలని ఆదాల 2009లోనూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని సోమిరెడ్డిపై మరోసారి విజయం సాధించారు. వరుస ఓటములతో కుంగిపోయిన సోమిరెడ్డి కోవూరు ఉపఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలతో బరిలోకి దిగి ముచ్చటగా మూడోసారి ఓడిపోయారు. నేడు కౌగిలింతలు: రాష్ట్ర విభజన పుణ్యమాని మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేతలు మాటల కత్తులు పక్కన పెట్టి కండువాలు, చొక్కాలు మా ర్చుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే అధికారిక పదవులు లభించవని భా వించిన ఆదాల అవకాశవాద రాజకీయంతో మరోమారు టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమిరెడ్డితో దోస్తీ తప్పనిసరయిం ది. అందులో భాగంగా శుక్రవారం సోమిరెడ్డి ఇంటికి ఆదాల వెళ్లగా, ఆది వారం సోమిరెడ్డితో పాటు పలువురు నేతలు ఆదాల ఇంటికి వెళ్లి విందు రాజకీయాలు చేశారు. ఈ కొత్తరాకపోకలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక బలం కలిగిన ఆదాలతో తాత్కాలికంగా అయినా స్నేహంగా మెలిగేందుకు సోమిరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే గతంలో జరిగిన నష్టం మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆయన వ్యూహాలు రచించినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నుంచి లేదా సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఆదాల నుంచి ఆర్థిక సాయం పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వారు ఊహిస్తున్నట్లు టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా ఆదాల తనకు అడ్డం కాకుండా, ఆయనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సోమిరెడ్డి వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆదాల సైతం అంగీకరించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు ఉండరని తెలుగు తమ్ముళ్లు తేటతెల్లం చేస్తున్నారు.