
ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాజ్యసభ బరిలో తాను ఉన్నట్లు ఎమ్మెల్య్ఏ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తాను రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. తాను, జేసీ దివాకర్ రెడ్డి, చైతన్య రాజులలో రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో ఉన్నామని, అయితే చివరకు బరిలో మాత్రం నిలిచేది ఇద్దరమే అని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమకు ఓటు వేయాలనేది తమ నినాదం అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీకి చెందిన సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజనపై కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకించేలా తమ చర్యలు ఉండాలని ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులోభాగంగా సమైక్యానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ఎవరు రాజ్యసభ అభ్యర్థులుగా పోటీ చేసిన తమ ఓటు వారికే వేస్తామని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. అయితే ఎం.టి.ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావులు తమ రాజ్యసభ సభ్యులగా మరోసారి రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.