రెబల్స్ ఉన్నారా.. నాకు తెలియదే
రాజ్యసభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసిన విషయం తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఒకవేళ రెబెల్స్ ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చూసుకుంటారని ఆయన అన్నారు. వాస్తవానికి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలం కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే అధిష్ఠానం కేవలం ముగ్గురు అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపిందని టీఎస్సార్ చెప్పారు.
అయితే, గోదావరి జిల్లాల నుంచి చైతన్య రాజు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది బరిలో ఉన్నట్లయింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడనున్నారు.